​మానవ జన్మ దుర్లభం


మానవ జన్మ దుర్లభం
సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది లభించడం చాలా కష్టం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఒక్కసారి మానవ జన్మలోకి ప్రవేశించాడు అంటే, ఎంతెంతో పుణ్యం, ఎన్నో జన్మల సుకృతం, భగవంతుని యొక్క దయ చేరితే మానవ జన్మ లభిస్తుంది. ఏమిటి మానవ జన్మ యొక్క గొప్పతనం అంటే మళ్ళీ ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలలోకి రాకుండా నేరుగా ఈ మానవ జన్మ నుండి తరించే అవకాశం ఉంది. మిగతా జన్మలలోకి వెళ్తే అట్లా తరించే అవకాశంలేదు, క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కి వచ్చినట్లు ఒక్కో జన్మ మారుతూ రావల్సిందే. మిగతా జీవులు ఏకాస్తనైనా తరించాలి అంటే అది మానవుడి అనుగ్రహం వల్ల తప్ప వాటంతట అవి తరించలేవు, ఏమో భగవంతుడు నేరుగా తరింపజేస్తే అది వేరే విషయం.
పశుః మనిష్యః పక్షీవా ఏష వైష్ణవ సంశ్రయాః |

తేనైవ తేప్రయాస్యంతి తద్విష్ణోపరమంపదం ||
ఎప్పుడైతే ఒక వైష్ణవుడిని ఆశ్రయించినప్పుడు, వైష్ణవుడి అభిమానాన్ని పొందినప్పుడు పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ విష్ణు లోకమైన పరమపదానికి వెళ్ళగలవు. మానవ జన్మకు ఉత్తమమైన యోగ్యత ఉంది. మననం, ఆ మననానికి తగ్గ కర్మ చేయగలిగేవాడు మానవుడు అంటే. మానవుడు తన స్థితిని, గతిని గురించి మననం చేయగలడు, ఆ చేసినదాన్ని కార్య రూపంలోకి తేగలడు. మిగతా జంతువులు కొంతవరకే ఆలోచన చేయగలుగుతాయి, కేవలం తన శరీరం, శరీర సంరక్షణ వరకు మాత్రమే ఆలోచన సాగుతుంది. శరీరం పెరుగుతూ వస్తుంది, తిరిగి క్షీణిస్తుంది, శరీరం మారుతుంది కానీ మార్పులేని నేను అనేది ఎప్పటికి మార్పుచెందక ఉన్నాను అని గుర్తించగలడు మానవుడు. ఈ పరిణితిని గుర్తించిన వాడిని మరొక్క అడుగు ముందుకు వెళ్ళమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు “తదాదేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర నముహ్యతి” రెండో అధ్యాయంలో. వయసు పెరిగిన కొద్ది శరీరం యొక్క సామర్థ్యం మారుతోంది, ఈ శరీరం పోయి మరొకటి రావడం కూడా ఇట్లానే ఉంటుంది. ఒక చిన్న పిందగా ఉన్నది కాయగా మారుతుంది, ఆకాయ పండుగా అయి రాలి పోతుంది ఒకనాడు. మనం కూడా అట్లానే పక్వంచెంది బయటికి వెళ్ళాలి, ముందే రాలిపోకూడదు. అందుకే పక్వం చెందటానికి ఆలోచించాలి. అది ఆలోచించగలిగితే జరిగే మార్పుల్లో ఏడుపు రాదు. రాలిపోతుంది అంటే కూడా ఏడుపురాదు, వాడిని ధీరః అని అంటారు. ‘నముహ్యతి’ బుద్దిని అట్లా వాడుకో గలిగిన వాడు మోహంచెందాల్సిన పని లేదు. ఏడిచే పని వానికి రాదు. ఇదే భగవంతుడు చెప్పినది. మనం ఇక్కడ ఉండగా హాయిగా బ్రతికేట్టు చేద్దాం అనేది ఆయన సంకల్పం. అందుకే మనకోసం ఆయన ఇన్ని ఉపదేశాలు చేయడం, మనకే ఎందుకు చేయాలి అంటే గుర్తించగలిగే ప్రాణి మనిషి కనుక. మిగతా జంతువులు గుర్తించలేవు.
మానవ జన్మ ఎక్కువ కాలం ఉండదు. ఉన్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. “దుర్లభో మానుషోదేహః” శరీరం లభించడమే చాలా కష్టం, “దేహినాం క్షణ భంగురః” లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. “మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్” అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా దానికోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారే! పోయేదే అయినా ఇది పోయేది అని అనుకోనివ్వటం లేదు. కేవలం శరీరంకోసం బ్రతుకుతున్నాం అంటే ఇది ఎంత ప్రమాదమైనదో గుర్తించాలి. తెలియని శత్రువువంటిది అని చెబుతాడు నమ్మాళ్వార్. మెరుపు పోతుందని తెలుసు మనం వాడుకోం, అందుకే ఆ మెరుపే నయం. ఇట్లాంటి స్థితిలో మనం ఎన్నో జన్మలలో ఒక సారు మనిషి అయినప్పుడు దైవాన్ని గురించి ఆలోచించి, ఆ జ్ఞానాన్ని ఇచ్చే మహానుభావులని విశ్వసించి వారికి తగినట్లు బ్రతికగలిగితే, అట్లాంటి జన్మ కోటికి ఒకటైనా ఉంటుందో లేదో అని చెప్పవచ్చు. “తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం” మానవ జన్మలభించడమే గొప్ప అంటే, అట్లాంటి మానవ జన్మలో దైవాన్ని గుర్తించి బ్రతకడం, వైకుంఠ ప్రియులైన వారి దర్శనం లభించడం, వారి అభిమానం పొందటం ఎంత కష్టమో అనేది ఋషివాక్కు!! పరాశర మహర్షి వంటి వారికే అట్లా అనిపిస్తే ఇక మన గురించి ఆలోచించాలి. ఇవన్నీ మనిషికి చెప్పాల్సొచ్చింది, అది చెప్పడానికే రామావతారం.

ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని…..


ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామి కి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది… మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి.. ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడు ని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం…

జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
తథా పితుర్మే జనకస్య రాజ్ఞా:

దాసోహం కౌసలేంద్రస్య రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి మిషతాం సర్వ రాక్షసాం !!

అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణస్య మహాబల:
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః

హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః
ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్

అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

సుస్వరుడి కథ ( చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష)


మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి.

శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో – “లింగోద్భవ మూర్తి” లేక “జ్యోతిర్లింగరూపం” లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం.

శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కధ – “ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు.

ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు.

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు – “మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”

ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

భారత దేశంలో 12 చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిసాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.

 1. రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
 2. మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
 3. భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
 4. త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
 5. గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
 6. ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
 7. సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
 8. నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
 9. మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
 10. కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
 11. కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
 12. వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్

అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద్యంతరహితమైనది. పరమాత్మ రూపమైనది. అట్టి లింగోద్భవం జరిగిన రోజు శివ రాత్రి.

స్కంద పురాణం ప్రకారం 5 రకాల శివ రాత్రులు.

 1. ప్రతీ రోజు నిత్య శివరాత్రి.
 2. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి,
 3. మాస శివరాత్రి.
 4. మాఘ మాసం లో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి.
 5. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది మహా శివరాత్రి..

ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదు


దోసిళ్లతో దూసుకోమంటూ ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు … ఉసిరికాయలు. స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించేలా ఇవి నోరూరిస్తుంటాయి. ఇవి తినేసి మంచినీళ్లు తాగితే తియ్యగా అనిపిస్తూ వుంటాయి కనుక, అందుకు చిన్నపిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఊళ్లో వాళ్లంతా కలిసినా ఉసిరికాయంత మేలు చేయలేరని అంటూ వుంటారు. అంతగా ఉసిరికాయ అందరి జీవితాల్లోను ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆయుర్వేద వైద్య విధానంలోను ఉసిరికాయను విరివిగా వాడుతుంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉసిరికాయ ప్రముఖమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. ఇక ఉసిరికాయ పచ్చడిని ఇష్టపడని వారంటూ వుండరు. కొత్తగా ఉసిరికాయ పచ్చడి పెట్టిన రోజున తినడానికి ఇష్టపడేవాళ్లు కొందరైతే, పాత ఉసిరికాయ పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్లు మరికొందరు.

అందరూ అంతగా ఇష్టపడే ఉసిరికాయ పచ్చడిని ‘ఆదివారం’ తినకూడదని పెద్దలు చెబుతుంటారు. రాత్రి సమయాల్లో ఆ పేరును కూడా పలకకూడదని అంటూ వుంటారు. అయితే అందుకు గల కారణమేమిటో తెలియక చాలామంది తికమకపడుతుంటారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ఉసిరిచెట్లపై సర్పాలు ఉంటూ వుంటాయి. ఆ సమయంలో ఉసిరికాయలను గురించి మాట్లాడుకుంటే, ఆ సర్పాలకు ఆహ్వానం పలికినట్టుగా అవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి వుంది.

ఇక రాత్రి సమయాల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా వుంటుంది. అలాంటి సమయంలో మరింత చలువచేసే ఉసిరికాయను తినడం వలన అనారోగ్యం కలుగుతుందని అంటారు. ఇక రవికి – శుక్రుడికి గల శత్రుత్వం గురించి తెలిసిందే. ఉసిరికాయలోని ఆమ్లగుణం శుక్రుడికి చెందినది కనుక, రవివారమైన ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదని చెబుతుంటారు.

శయన ఏకాదశి


పురాణ నేపథ్యం…
ఆషాఢ మాసంలో ప్రత్యక్షనారాయణుడు అంటే సూర్యభగవానుడు తన మార్గాన్ని ఉత్తద దిక్కు నుంచి దక్షిణ దిక్కులోకి మార్చుకుంటాడు. ఈ పండుగ దాదాపు దక్షిణాయనం ప్రారంభం అయిన తరువాత మొదటి పండుగ. విష్ణుమూర్తి తన పనులకు కొద్దిగా విశ్రాంతినిస్తూ శయనిస్తాడు. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శేషువు పైన శయనించటానికి ప్రారంభించిన రోజు. అందుకనే ఈ రోజును తొలి ఏకాదశి అని, శయనైకాదశి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆది శేషువుపై యోగనిద్రకు ఉపక్రమించడం వలన శేషశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందువలన దశమి నాటి నుంచి ముక్కోటి దేవతలు ఆయనను అర్చిస్తారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు.
సాంఘిక అంశం…
ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటే… భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.
పురాణం – సాంఘికం
విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది

శ్వేతార్క ఆంజనేయ స్వామి(బాలారిష్ట దోషాల)


బాలారిష్ట దోషాలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి….

జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా చెబుతారు.

పరాశరుల సిద్ధాంతం ప్రకారం మరియు ఇతర గ్రంథకర్తల వ్యాసములు ఆధారంగా 12వ సంవత్సరం వరకు ఈ బాలారిష్టములు ఉంటాయి. అంతేకాకుండా పితృ మాతృ పూర్వ జన్మల ఫలితంగానే ఈ బాలారిష్టములు కూడా అందిస్తాయి. అష్టమాధిపతి దశ అయినను అష్టమంలో వున్న గ్రహం యొక్క దశ అయినను ప్రారంభంలో వస్తే ప్రమాదమే. అలాగే లగ్నంలో షష్ట్ధాపతి, షష్ఠంలో లగ్నాధిపతి, ఇదే రీతిగా లగ్న వ్యయాధిపతుల విషయంలో కూడా చర్చనీయాంశ ప్రమాదకర అంశాలు ఉంటాయి. అందువలన ఆయా బాలారిష్టముల విషయములు మరియు గండ నక్షత్ర విషయములు ముందుగానే శోధింప చేసుకొని తగిన శాంతి మార్గములు వెదికి చేయించుట శ్రేయస్కరము.

తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు. శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, బాలారిష్ట దోషాలను తొలగిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి. ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి. ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు. కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. వారిని ఎంత ఒప్పించినా స్కూలుకు పంపడం సాధ్యపడదు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు. ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా అర్చించాలి అంటే, పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి –
”ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్”
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి.

ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాసన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో ప్రతిష్టించుకున్న పిదప రోజూ చేసే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శ్వేతార్క ఆంజనేయ స్వామిని ధ్యానించాలి.

”ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్” మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.

స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి


విజయవాడలో దుర్గ అమ్మ మొదటి రోజున మనకి అమ్మవారు స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి గా దర్శనం ఇస్తుంది.

….. ఒకోక్క రోజు ఒకొక్క రూపములో మనము అమ్మని పూజిస్తాము..ఒకోక్క స్వరూపములో అమ్మ మనకి దర్శనము ఇస్తుంది…

విజయవాడలో దుర్గమ్మకి మొదటి రోజున స్వర్ణకవచ అలంకృతరూపముగా పూజిస్తాము…ఆ రూపము వెనుక ఉన్న కధ ను తెల్సుకుందాము…ఈ కధ ను నవరాత్రుల ప్రధమ రోజున ఎవరైన చదువుతునప్పుడు విన్నా, లేక చదివినా……..అనంతమైన ఫలితాలు కలుగుతాయి…

దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు…ఆయన గొప్ప తపస్సు చేసాడు బ్రహ్మ గారి కోసము…బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యి…” ఏమి కావాలి నీకు అని అడగగా…”నాకు వేదములు అన్ని కూడా వశము కావాలి ” అని అడిగాడు…”దేవతలను నేను జయించాలి ” అని అన్నాడు…అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు “తధాస్తు” అనగా వేదములు అన్నీ కూడా దుర్గముడు లోకి ప్రవేసించాయి…బ్రాహ్మణులు అందరు వేదాలు మర్చిపొయారు…సంధ్యవందనాలు లేవు…హవ్విసులు లేవు..యగ్నాలు లేవు…యాగాలు లేవు…..దేవతలకి హవిస్సులు లేక ఆకలితో విలవిల లాడి పొయారు….నీటి చుక్క లేదు…తల్లి అనుగ్రహం లోపించి పోయింది…భూమండలం మీద అంతా వాతావరణం క్షీణి ంచిపోయింది…అందరు నాశనము అవుతుంటె ఆ దుర్గముడు చాలా సంతొషించాడు…హవిశ్శులు లేక దేవతలు అందరు వృద్ధులు లాగా మారిపోయి…..నీరస పడిపోతు…డీలా పడిపొయారు..

అప్పుడు…దేవతలు అందరు కలిసి అమ్మని ప్రార్థన చేసారు….అప్పుడు అమ్మ ప్రత్యక్షమైనది..అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపమునకు ” శతాక్షి ” అని పేరు.. అమ్మ దర్శనము ఇచ్చిన తీరు ఎలా ఉంది అంటే….ఒంటి నిండా కన్నులతో దర్శనం ఇచ్చింది…దేవతల ఆవేదన చూసి….అమ్మ అంది ” మిమ్మల్ని చుడటానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకు ఎందుకు భయం” అని అభయం ఇచ్చింది…. బ్రతకాడినికి అన్నము, నీరు లెవూ అని దేవతలుచెప్పగా…అప్పుడు అమ్మ తన ఒంటి మీద ఉన్న నేత్రాలలో నుండి నీరు కరుణ రసముగా మొత్తం బ్రహ్మాండము అంతా నింపేసింది……..అంతే మళ్ళి భూమండలం అంతా…అమ్మ కరుణకటక్షములతో నిండ్పోయింది……..నూతులు, చెరువులు, నదులు అన్ని యధావిధిగా ప్రవహించసాగాయి…

అన్నములేక ఆకలిగా ఉంది అమ్మ , నిన్ను స్తుతి చెయ్యడానికి కుడా మాకు ఒపిక లేక ఉన్నాము అని దేవతలు అమ్మని ప్రాధేయపడగా…..అమ్మ అప్పుడు అందరికి ” శాఖాంబరి దేవిగ ” కనిపించింది..అనంత హస్తాలతో…

అసలు పృథ్వి శాకాంబరి దేవి కాదా….అలా అమ్మ ఆ రూపము దాల్చి అందరికి…పళ్ళు, కాయగూరలు…అన్ని ఇచ్చింది…..మళ్ళి హోమాలు, యగ్నాలు, యాగాలు మొదలు అయ్యాయి….
ఎంటి నీరసపడిపొయిన బ్రహ్మాండం అంతా మళ్ళి చిగురించుకుంది అని దుర్గముడు ఆలోచన చెయ్యగా…..అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది…అప్పుడు అమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చెయ్యలెదు..ముందు అందరికి రక్షణ చక్రం వేసి… .అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి…దుర్గముడి కన్నులు తీసి…అందరిని కాపాడుతు …..వేదములు తన లోనుండి…మళ్ళి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి……దేవతలకు వాటి రక్షణ కార్యము అప్ప చెప్పింది …అందుకే ఆ రక్షణ కవచం తో అమ్మ అందరిని కాపాడింది కనుక …..నవరాత్రుల్లో…అమ్మని మొదటి రోజున…” స్వర్ణకవచ అలంకృత” రూపములో పూజిస్తాము…….