పుత్రద ఏకాదశి


పూర్వం మహారాజు “సుకేతుడు” ‘భద్రావతి’ రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య ‘చంపక’; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే ‘వార్త’ తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు ‘పుత్రద ఏకాదశి’ గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య ‘చంపక’కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ‘ఏకాదశీ వ్రతాన్ని’ చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.

Advertisements

స్వశక్తిని నమ్మడం ముఖ్యము


స్వశక్తిని నమ్మడం ముఖ్యము. అది అంతర్గతంగా అనుభవలను సూటిగా అందుకోవడం మొదలుపెట్టినప్పటినుండి వచ్చును. నీకు గురువు అవసరము. నీకు మార్గదర్శకత్వము చూపే మనిషి అవసరం- సందేహం లేదు. ఇతరుల వద్దనుండి నీవు నేర్చుకోరాదు. గ్రంథాలు చదవకూడదని నేను చెప్పడం లేదు. కానీ నాకు వేదాలలోను, నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేస్కోవడం లోను ఇబ్బంది వచ్చినప్పుడు, అక్షరజ్ఞానం లేకపోయినా వానికి జవాబులు ఇవ్వగలిగే వారిని నేను కలిసేను.
నేను ఒకసారి ’బ్రహ్మసూత్రాల’ను ఉపదేశిస్తున్నాను. అది వేదాంతగ్రంథాలలో అతిక్లిష్టమయిన గ్రంథాలలో ఒకటి. నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయిన సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని. వారు సంతృప్తిపడినట్లు కనపడేవారు. కానీ నాకు లేదు. అందుచేత సాయం సమయంలో ఒక స్వామివారి వద్దకు వెళ్ళేను. ఆయన వేదాలు చదవలేదు. అసలాయనకు సంతకము చేయడం కూడా సాధ్యము కాదు. కాని విజ్ఞానములో ఆయనకు సరితూగే వ్యక్తి లేరు. “స్వీయ అనుభవము లేకపోతే నువ్వు సంక్షిప్తమయిన ఈ సూత్రాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు” అని ఆయన అన్నారు. స్వయంగా నేర్చుకున్న విద్యకు, ఇతరుల వద్దనుండి పొందే విద్యకు ఉండే భేదాన్ని నేను తెలుసుకోవడానికి ఆయన ఈ కథ చెప్పేరు. ఒక గురువుగారికి, ఎప్పుడూ ఆవుని చూడని శిష్యుడొకరున్నారు. ఆయన పాల రుచి ఎరుగడు. కానీ అతనికి పాలు మంచి పోషకాహారమని తెలుసు. అందుచేత ఒక ఆవుని చూసి పాలు పితికి ఆ పాలను త్రాగాలని కోరిక పెట్టుకున్నాడు.
“మీకు ఆవు గురించి ఏమైనా తెలుసునా?” అని గురువుగారిని కలిసి అడిగాడు.
“తెలుసే!” అని గురువుగారు జవాబిచ్చారు.
“దయచేసి ఆవు ఎలా ఉంటుందో నాకు వర్ణించండి” అని గురువుగారిని శిష్యుడు కోరాడు.
“ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి. అది సాధుజంతువు, మచ్చిక చేసుకోవచ్చును. అది అడవులలో కాకుండా గ్రామాలలో ఉంటుంది. దాని పాలు తెల్లగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది” అంటూ ఆయన ఆవుని వర్ణించారు. అలాగే దాని తోక గురించి, చెవులు మొదలు అన్నింటి గురించి వర్ణించారు. ఈ వర్ణన విన్న తరువాత శిష్యుడు ఆవ్ని వెతుకుతూ వెళ్ళాడు. దారిలో అతనికొక ఆవు విగ్రహము తటస్థ పడింది. అది చూసి “మా గురువుగారు వర్ణించినది తప్పక ఇదే అయి వుంటుంది” అని అనుకున్నాడు. ఆ సమయంలోనే గ్రామస్థులు వాళ్ళ ఇళ్ళకు సున్నం వేసుకుంట్న్నారు. ఆ విగ్రహము దగ్గర సున్నముతో ఒక బాల్చీ ఉంది, శిష్యుడది చూసి “ఆరోగ్యానికి మంచిదనుకొని త్రాగే పాలు అవే అయి వుంటాయి” అని భావించాడు. కొన్ని గ్రుక్కలు సున్నపు నీళ్ళని మ్రింగాడు. చాలా జబ్బుపడిపోయి వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది.
కోలుకున్న తరువాత గురువుగారి వద్దకు వెళ్ళి “మీరు గురువులు కాదు” అని కోపంగా అరిచాడు.
“ఏమైంది? అని గురువుగారు అడిగారు.
“ఆవు గురించి మీ వర్ణన ఏమీ సరికాదు” అని శిష్యుడు జవాబిచ్చాడు.
“ఏమయింది?”
అప్పుడు శిష్యుడు, జరిగిన సంగతి వివరించాడు.
అప్పుడు “పాలు నువ్వు పితికేవా?” అని గురువుగారు అడిగారు.
“లేదు”
“అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు”.
ఈ రోజుల్లో వివేకవంతుల కష్టాలకు కారణం వారికి తెలియక కాదు. వారికి కొంత తెలుసు. కానీ వారికి తెలిసినది వాళ్ళంతట వాళ్ళు గ్రహించినది కాదు. అందుచేతే వాళ్ళు బాధలు పడతారు. అసంపూర్ణ సత్యములాగ, అసంపూర్ణ జ్ఞానము చాలా ప్రమాదకరము. అసంపూర్ణ సత్యము, సత్యమే కాదు. అలాగే అసంపూర్ణ విజ్ఞానము కూడా. విజ్ఞులు పరమార్థమును సాక్షాత్తుగా గ్రహిస్తారు.
ఏ భాషలోనూ అక్షర జ్ఞానంలేని ఆ ఋషి నా సందేహాలను ఎప్పుడూ తీరుస్తూ ఉండేవారు. స్వయంగా గ్రహించినది, అర్హుడైన గురువు వద్ద చదువు, అహాన్ని పవిత్రం చేయడంలో సహాయం చేస్తుంది; లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానము మనకు అహంకారాన్ని వేదాలనుండి విషయాలను మాత్రమే గ్రహిస్తారు. వారికి వారు నిజంగా ఏమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళ బుద్ధికి అటువంటి జ్ఞాన్ము అందించేవారు పోషకాహారము లేని భోజనము చేసేటటువంటి వారు. అలాంటి తిండి ఎల్లప్పుడూ తినేవారు అస్వస్థులుగా ఉండడమే గాక, ఇతరులను కూడా అస్వస్థులుగా చేస్తారు. మనము ఎంతోమంది గురువులని కలుస్తాము, వారెంతో బాగా బోధిస్తారు. కానీ ఇతర బోధనలతో కలుపకుండా, స్వీయ అనుభవంతో బోధించే గురువుల వద్ద నుండి గ్రహించినదే శిష్యులు జీర్ణించుకోగలరు.

తథాస్తు దేవతలు అంటారు. నిజమేనా?


తథా – ఆ ప్రకారంగా; అస్తు – కావలసినదే. అనేవాళ్ళు ఉంటారు. ఎలా అంటారు ఈ మాట మీరు అంటే ముహూర్తం అనేదాన్ని విశ్వసిద్దాం ముందు. ముహూర్తబలం అంటారు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఉప్పు -నిప్పు. ఒకవ్యక్తి మరొక వ్యక్తిని చూస్తాడు. చూసిన వేళావిశేషమేమో గానీ వాళ్ళిద్దరిమధ్య ఏదో జన్మజన్మల బంధం ఉన్నట్లు ప్రేమ ఆప్యాయతలు తవ్వి పోసుకుంటారు. అది ఆధునికపరమైన వివాహసంబంధాలవైపు దారితీయవచ్చును. లేదా మిత్రత్వానికి దారితీయవచ్చును. ఇదంతా ఎలా వచ్చింది? ఆ చూసుకున్న నిమిషం వేళా విశేషం. అలాగే నిత్యమూ జపం చేసేటటువంటి వాళ్ళు పూజావిధానాలలో ఏదో ఒక లక్ష్యంతో నియమశుద్ధితో, సత్ప్రవర్తనతో మెలిగేటటువంటి వాళ్ళు నోరారా ఏదైనా ఒక మాట అంటే తథాస్తు. వాళ్ళు అన్నమాట నిజం అయి తీరుతుంది. దేవతలు అంటే పైన వాహనాలలో తిరుగుతూ ఎవరైనా ఏమైనా అంటాడా, తథాస్తు అందాం లాగా కాదు. సినిమాలు, సీరియళ్ళు చూసి ఇలాంటి భావనలు పెరిగిపోతున్నాయి ఈ మధ్య. మనస్సులోనే ఉంటుంది దేవత. మన మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అదే తథాస్తు. పిల్లలే ఉన్నారు. నిర్లక్ష్యంగా మాట్లాడింది తండ్రితో. ఆ తండ్రి చాలా జపం చేసేవాడు, యోగ్యుడు, నిష్ఠాగరిష్ఠుడు. ఇలాగైతే…అని ఏదైనా అన్నాడనుకోండి, జరిగి తీరుతుంది. తథాస్తు దేవతలు అంటే ఎక్కడో ఉండేవారు కాదు. ఆ వ్యక్తులలో ఉండే సంకల్ప శక్తి, దానికున్న బలం – దానిపేరే తథాస్తు. కాబట్టి ఏది మాట్లాడాలన్నా, ఎలా మాట్లాడాలన్నా అవ్యాచ్యములు మాట్లాడకూడదు. ఎదుటివ్యక్తికి కష్టం కలిగించే మాట్లాడకూడదు. అందరూ కూడా ఎదుటివాడికి కష్టం కలుగకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తథాస్తు దేవతలు ఉన్నారు అన్న భయంతోనైనా సవ్యంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తథాస్తు దేవతలు ఉంటారు. మన మనస్సులోనే ఉంటారు.

శ్రీశైల క్షేత్రము


మధూక కుండము, పాలధార, పంచధారలు, హాటకేశ్వరము, ఆరామ వీరభద్ర స్థానము, బ్రహ్మగిరి, ఘంటాసిద్ధేశ్వరము, బోగేశ్వరము, ఇష్టకామేశ్వరము, సప్తమాతృకలు, కదళీవనము మొదలైనవి. పార్వతీ ప్రాణ వల్లభుడు మదనాంతకుడైన మల్లికార్జున స్వామి విడువక ఈ పర్వతమునందు నివసించి ఉంటాడు. ఈ క్షేత్ర మహిమను ప్రస్తుతించుట బ్రహ్మకైనను వశము కాదు. ఈ కొండయందలి గండశిలలన్నియును శివలింగములు. ఇచ్చటి చెంచులందరును సిద్ధమునులు. చావనిదే యెవ్వరికిని కాశీక్షేత్రము ముక్తులనీయదు. ఈ శ్రీశైలము శిఖరసందర్శన మాత్రముననే ఎల్లరకును ముక్తులనిచ్చును.

[object width=”420″ height=”315″ src=”//www.youtube.com/embed/xXp3uq1s52M” frameborder=”0″ allowfullscreen]

శ్రీశైలాది తీర్థముల వలన ముక్తి కలుగునని పురాణములు చెప్పుచున్నవి. ముక్తి కారణములని చెప్పబడిన సకలతీర్థములయొక్క ప్రశస్తి విషయములో రెండవయూహ లేదు. నిస్సంశయముగా అవియన్నియుని ముక్తి ప్రదములు. ఎట్లనగా వానిని సేవించినందువల్ల కలిగెడు సుకృతఫలమువల్లనే కాశీప్రాప్తి కలుగును. ఇట్లు కాశీప్రాప్తికి కారణములైనందువల్లనే వానిని పురాణములు కైవల్యప్రదములని వర్ణించినవి. అవి కాశీప్రాప్తి ద్వారా పరంపరాసంబంధము చేత ముక్తిప్రదములు. కాశీక్షేత్రము సాక్షాత్తుగా మోక్షకారణము. త్రివేణీ సంగమం, నైమిశారణ్యం, సరస్వతీనది ప్రవహించిన ప్రదేశము (కురుక్షేత్రము), హిమాలయమునుండి గంగానది దిగినచోటు, ఉజ్జయిని, అయోధ్యానగరం, ఉత్తర మధుర, బృందావన ప్రాంతము శ్రీకృష్ణ జన్మస్థానము, దక్షిణ మధుర, పాండ్యుల రాజధాని శ్రీమీనాక్షీ సుందరేశ్వరుల నివాసము (మధుర), ద్వారక(సముద్రములో విలీనమైనది), సరస్వతీనది – అంతః ప్రవాహిని, సహ్యపర్వతము – కృష్ణానది పుట్టిన పర్వతము, గంగాసాగర సంగమము, కామాక్షీ నిలయము, నాసికా త్రయంబకము – గోదావరి పుట్టినచోటు, దాక్షారామము, బదరికాశ్రమము (నరనారాయణులు తపస్సు చేసిన చోటు) హిమాయలములలోనిది, నర్మదాతీరములోని ఓంకారు, పూరీజగన్నాథము, దక్షిణ సముద్రతీరములోని గోకర్ణము, శ్రీశైలము – ఇవి మోక్షహేతువులైన గొప్ప తీర్థములు.

శివానుగ్రహము సమకూరని నాడు మనస్సులో తీర్థయాత్ర చేయవలయుననెడి సంకల్పమే యుదయించదు. తీర్థయాత్రయందు శ్రద్ధలేని నాడు ప్రతిబంధకములైన పాపములు తొలగిపోవు. పాపములు తొలగిపోని నాడు కాశికి పోవలెనన్న యుత్సాహమే పుట్టదు. కాశీ క్షేత్ర నివాసము లేనినాడు విజ్ఞాన దీపము తన కాంతిని విస్తరింపజేయదు. జ్ఞానమువలన గాని కైవల్యము సంభవించదు. జ్ఞానమనగా ఉపనిషద్వాక్యములచేత సంభవించునది. దానినే విజ్ఞానమనీ అందురు

అసలు మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు?


మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం.
-కొత్త మట్టితో వినాయకున్నితయారు చేయడం
-ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం
-నవరావూతుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.
శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణవూపతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మార్తున్నా మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారుంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వవూపాణులు సమానమనే అర్ధం చెబుతోంది. హారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

వినాయక వ్రతం

వినాయక

మట్టి వినాయకుడు-అసలు రహస్యం
వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

పత్రిపూజ-రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం
నవరావూతుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

గీత పదో అధ్యాయ పారాయణ ఏ జీవికైనా బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కలిగిస్తుందని


కాశీపట్టణంలోపరమేశ్వరునియందు అపారభక్తి తత్పరుడైన ధీరబుద్ధి అనే విప్రుడు ఉండేవాడు. సదా పరమేశ్వర భావనలోనే ఈశ్వర భక్తితో పునీతచిత్తుడైన ఆ బ్రాహ్మణుడు ఎక్కడకు వెళ్ళినా అక్కడకు ఈశ్వరుడు కూడా వెళుతూ ఉండేవాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు భృంగి, శివుని వద్దకు వచ్చి “స్వామీ! ఆ బాపనితో పాటే నీవూ తిరిగడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు ఈవిధంగా చెప్పసాగాడు.

“భృంగీ! నేనొక పున్నమి వెన్నెల రాత్రి నాడు ఒక తిన్నెమీద ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను. అంతలో ఆకాశంనుంచి ఒక నల్లని పక్షి వచ్చి నాకొక పద్మాన్ని సమర్పించి ప్రణమిల్లింది. అప్పుడు ’నీవెవరవు? నాకీ పద్మమిచ్చి ఎందుకు ప్రణమిల్లావని’ అడిగాను. అంతట ఆ పక్షి, ’నేను బ్రహ్మదేవుని హంసను. సౌరాష్ట్ర దేశంలో అందమైన తామరకొలను ఉంది. నేనా తామర తూండ్లు కడుపారా తిని ఆకాశానికి ఎగిరాను. కానీ వెంటనే క్రింద పడిపోయాను. నా తెల్లని శరీరం పూర్తిగా నల్లబడిపోయింది. ఇంతవరకు ఎన్నడూ లేనిది ఇలా జరిగిందేమని విస్మయంతో చూస్తూ ఉండిపోయాను”.

అంతలో ఆ సరోవరంనుండి “లెమ్మ”ని వినిపించింది. ఆ ధ్వనిని బట్టి వెళ్ళి చూశాను. అక్కడొక పద్మలతను (పూలతీగ) చూశాను. అప్పుడా పద్మలత నాతో మాట్లాడసాగింది. “హంసా! నువ్వు ఆకాశంలో ఎగురుతూ నన్ను దాటి వెళ్ళావు. అందుకే నువ్వు క్రిందపడిపోయావు. నీ శరీరం నల్లబడిపోయింది. నువ్వు నా సుమగంధాన్ని అఘ్రాణిస్తే ఈ విధంగా జరిగేది కాదు. నా సుమగధాన్ని ఆఘ్రాణించిన ప్రభావంతో ఇప్పుడే ఇరవై వేలతుమ్మెదలు దివ్యరూపాలు పొంది స్వర్గానికి వెళ్ళిపోయాయి. హమ్సా! నా ఈ ప్రభావానికి కారణం చెబుతాను విను.

పూర్వం నేనొక బ్రాహ్మన బాలికను. నా పేరు సరోజవదన. నాకు వివాహం అయిన తరువాత పతిని భక్తితో అనురాగంతో సేవిస్తూ ఉండేదాన్ని. ఒకనాడు ఒక గోరువంక పక్షితో పాఠాలు చెప్పిస్తూ ఉన్నాను. నా భర్త పిలుపు నాకు వినిపించలేదు. ఎంత పిలిచినా పలుకలేదనీ, దానికి కారణం ఆ గోరువంక అనీ కోపగించి, నన్ను కూడా గోరువంకవు కమ్మనమని శపించాడు. వెంటనే నేనొక ముని పుంగవుని ఇంట ఒక గోరువంక పక్షిగా జన్మించాను. ఆ ఇంటి యజమాని అయిన మునిపుంగవుడు ప్రతి నిత్యం భగవద్గీత పదో అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. నేను కూా ఆ గీతను మిక్కిలి శ్రద్ధతో శ్రవణం చేస్తూ ఉండేదాన్ని. ఆ మాహాత్మ్యము వల్ల కొంతకాలానికి నేనా గోరువంక దేహాన్ని విడిచి, స్వర్గంలో అప్సరసగా పద్మావై అనే పేరుతో లక్ష్మీదేవికి చెలికత్తెగా ఉన్నాను.

ఒకప్పుడు ఈ సరోవరంలో విహరిస్తూ ఉండగా అటుగా దూర్వాసమహర్షి వచ్చాడు. ఆ మహర్షిని చూసి భయపడి నేనొక పద్మలత రూపం ధరించాను. అది చూసిన దూర్వాస ముని ’నీవా లతా రూపంలోనే నూరు సంవత్సరాలు ఉండిపొమ్మని శపించాడు. ఇప్పుడు ముని శాపానుసారం నూరు సంవత్సరాలు గడిచాయి. శాపావసాన సమయం ఆసన్నమైంది. నేనిప్పుడు భగవద్గీత పదో అధ్యాయాన్ని పారాయణ చేస్తాను. నువ్వు శ్రవణము చేయి అని పలికి ఆ పద్మలత పదో అధ్యాయాన్ని పఠించి ముక్తిని పొందింది. నేనా లత ఇచ్చిన పద్మాన్ని తెచ్చి పరమేశ్వరా! నీ పాదపద్మాల వద్దే ఉంచినా’నని ఆ హంస పలికినది.

భృంగీశ్వరా! బ్రహ్మదేవుని హంస అయిన ఆ పక్షి పూర్వం పద్మలతతో చెప్పబడిన గీత పదవ అధ్యాయాన్ని శ్రవణం చేసిన ప్రభావంతో ఒక బ్రాహ్మణుడై పుట్టి పూర్వజన్మ సంస్కారంతో నిరంతరం దశమాధ్యాయ పారాయణం చేయడంవల్ల సర్వభూతాత్ముడైన శ్రీ మహావిష్ణువును మనసా దర్శిస్తూ పరమ పవిత్రుడయ్యాడు. తత్త్వజ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది జీవన్ముక్తుడయ్యాడు.

భృంగీ! అమ్దుచేతనే అతని మీది ప్రీతితో సదా అతని వెన్నంటి తిరుగుతూ ఉంటాను” అని శివుడు చెప్పగా గీత దశమాధ్యాయ మహిమను గ్రహించానని భృంగి సంతుష్టుడయ్యాడు. గీత పదో అధ్యాయ పారాయణ ఏ జీవికైనా బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కలిగిస్తుందని ఈ వృత్తాంతాన్ని బట్టి తెలుస్తోంది.

హయగ్రీవ


బ్రహ్మదేవుని దివ్య వరప్రభావంతో బలగర్వితుడైన రాక్షసుడు హయగ్రీవుడు. సాధుసజ్జన హింసతో తన రాక్షస నైజాన్ని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్న సమయంలో దేవతలంతా త్రిశక్తులను, త్రిమూర్తులను శరణువేడారు. ఆ సమయంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అదీ ఓ రాక్షస సంహారానంతరం ఓ వింటిపై తలవాల్చి. దేవతలు నిద్రలేపగా హడావుడిగా లేచిన ఆయన తలకు వింటినారి తగిలి తెగిపడిపోయింది. దేవతలంతా జరిగిన దానికి చింతిస్తుండగా బ్రహ్మదేవుని సలహాపై ఓ అశ్వంతలను విష్ణువు శరీరానికి అతికిస్తారు. అశ్వాన్ని సంస్కృతంలో ’హయం’ అంటారు. అందువల్ల విష్ణుమూర్తి హయగ్రీవునిగా ఖ్యాతిగాంచాడు. ఆయన దేవతలకు అభయం ఇచ్చి హయగ్రీవుని హతమార్చాడు. అయితే ఆయన ఆ సమయంలో ఎంతో ఉగ్రత్వంతో ఉండగా, ఆయనను శాంతింపజేయడానికి పార్వతీదేవి వచ్చింది. ఆమె “హయగ్రీవా! నిన్ను ఆరాధించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకం కాగలవు.” అని ఆయనకు ఓదివ్యశక్తిని ప్రసాదించింది. దాంతో ఆయన ఆగ్రహంనుండి పూర్తిగా ఉపశమనం పొందాడు. పిల్లలు మారాం చేస్తుంటే వారికి ఏదోలా నచ్చజెప్పినట్లే స్వామివారి ఆగ్రహాన్ని ఉపశమింపజేయడానికి సాక్షాత్తూ ఆ ఆదిపరాశక్తి రూపాంశయైన పార్వతీదేవి ఈ విద్యాశక్తి స్వామివారిి అందించిందన్నమాట. అష్టకష్టాలు పెట్టిన రాక్షసుని ఎలా సంహరించాలో తెలియక తల్లడిల్లిన ముక్కోటి దేవతలను ఊరడించి స్వామివారు తనదైన బాణిలో ఆ అసురుని సంహరించడం అత్యంత విజ్ఞానదాయకమైన అంశం. సమస్య పరిష్కారం కావడమంటే అది జ్ఞానానికి ప్రతీకయే కదా! అలా జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ లభిస్తాయన్నమాట.
విద్య ఉన్నచోట అడగకుండానే అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం.
మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే…ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు. హయగ్రీవుని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.

విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
దయానిధిం దేవభృతాం శరణ్యం! దేవం హయగ్రీవమహం ప్రపద్యే!!