శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం


నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే ||

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||

[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]

Advertisements

మధురాష్టకం


geetaఅధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురమ్ |
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౧ ||

వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురమ్ |
చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౨ ||

వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ |
నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౩ ||

గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురమ్ |
రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౪ ||

కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురమ్ |
వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౫ ||

గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచీ మధురా |
సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౬ ||

గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం ముక్తం మధురమ్ |
దృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౭ ||

గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా |
దలితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురమ్ || ౮ ||

భక్తితో గూడిన దానికే విలువ


పూర్వకాలమున ఒకానొక గ్రామమున ఒక భక్తుడు నివసించుచుండెను. అతడు “ఓం నమో నారాయణాయ” అను అష్టాక్షరీ మహా మంత్రమును నిరంతరము జపించుచుండెడివాడు. తన పూజా మందిరములో శ్రీమన్నారాయణుని విగ్రహము నెదుట గూర్చొని భక్తి పూర్వకముగ ప్రతిదినము పై మంత్రమును పునశ్చరణ చేయుచుండెను. ప్రాపంచిక పదార్థములపై అతనికి ఏమాత్రము ఆసక్తి లేకుండెను. వైరాగ్య సంపన్నుడై భోగవస్తుజాలమును లెస్సగా పరిత్యజించి, దృష్టిని బహిర్ముఖముగ ప్రసరింపజేయక, నారాయణుడే తనకు దిక్కని నమ్మినవాడై మనోవాక్యాయములచే ఆయననే హృదయమున సంస్మరించుచు నుండెను.

ఇట్లుండ, ఒకనాడతడు ప్రతిదిన పద్ధతి ప్రకారము ఉదయము ననే స్నానాదులను నిర్వర్తించుకొని శుచిర్భూతుడై తన పూజా మందిరమున శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహము నెదుట గూర్చుండి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి తదేక దృష్టితో నారాయణుని భావించుచు అష్టాక్షరీ మంత్రమును జపించుచుండ, ఆతని భక్తికి, అపరిమిత శ్రద్ధకు మెచ్చి వైకుంఠనాథుడు శంఖ చక్ర గదాధారియై ఆకస్మికముగ ఆ పూజా మందిరమున ప్రత్యక్షమయ్యెను. భగవానుని ప్రత్యక్షముగ దర్శింప గల్గు మహద్భాగ్యము ఉదయించుటచే ఇక ఆ భక్తుని ఆనందమునకు మేరయే లేకుండెను. తదేక దృష్టితో ఆనంద పరవశత్వమ్ముతో, ఉత్కంఠిత హృదయముతో అతడు భగవానుని ప్రత్యక్ష రూపము వీక్షించుచుండెను. ఏమి చేయుటకును తోచకుండెను. అది భగవానుని ఆకస్మిక గమనము అగుటవలనను, దేవుని సత్కరించుటకు ముందుగా ఏవిధమైన ఏర్పాట్లు చేసియుంచు కొనకపోవుట వలనను, కడుబీదవాడగుట చేతను భగవంతునికి నివేదించుటకు తగిన వస్తుసంభారములు లేక యుండుటవలనను, ఇంటికి వచ్చిన ఆ లోకోత్తర అతిథిని ఎట్లు సత్కరించవలేనో తోచక తికమకపడుచు తొట్రుపాటు పడుచుండెను.

భగవద్దివ్య స్వస్వరూప సందర్శన జనిత మహదానంద పరిపూరిత హృదయసహితుడగు ఆ భక్తుడు తత్సమయమున తన పూజా మందిర మంతయు తేరిపాడచూడ ఒకమూల ఒక అరటిపండు అతనికి దృగ్గోచర మయ్యెను. తోడనే పరుగెత్తికొని వెళ్ళి దానిని పట్టుకొనివచ్చి, ఆ స్వల్ప ప్రసాదము నైనను భగవంతునకు నివేదింప దలంచి, ఆనంద పారవశ్యముచే ఒడలు గగుర్పాటు నొందుచుండ మనస్సు నారాయణుని దివ్యపాద పద్మములపై సంలగ్న మొందియుండ, తోందరలో ఆ అరటి పండును ఒలిచి లోని గుజ్జును పారవైచి తొక్కను దేవునకు పెట్టెను. భక్తిరసముచే పరిప్లావితమైన ఆ తొక్కును భగవాను డపుడు ఆనందముతో స్వీకరించి, భుజించి అంతర్ధాన మొందెను.

తదుపరి కొద్దిసేపటికి ఆ భక్తుడు తన పొరపాటును గుర్తెరిగి పశ్చాత్తాపతత్పరుడై, భగవానునకు గొప్ప అపచారము చేసితినని తలంచి అత్యంతఖిన్నుడై, ఏమి చేయుటకును తోచక హృదయము వేదనలో గ్రుంకుచుండ గొప్ప పరితాపమును బొందుచుండెను. “అయ్యో! నేనేల ఇట్లు చేసితిని? సామాన్యమానవుని కైనను అరటితొక్కును ఎవ్వరును ఇవ్వరే? ఇక చతుర్దశ భువనాధిపతి యగు శ్రీమన్నారాయణునికి నేనేల ఇట్టి తుచ్ఛవస్తువు నొసంగితి?” అని పలువిధముల తలపోయుచు తుదకు గుండె నిబ్బరము కలుగజేసికొని ఈ క్రింది ధృఢనిశ్చయమునకు వచ్చెను. ఇక విచారించిన ప్రయోజనము లేదు. మరల భగవానుని త్వరలోనే నేను ప్రత్యక్ష మొనర్చుకొనెదను. అతడు భక్తవత్సలుడు కావున పరిపూర్ణభక్తితో, అకుంఠిత దీక్షతో అష్టాక్షరీ మహామంత్రమును జపించుచు, అతనిని ధ్యాణించినచో తిరిగి యతడు ప్రత్యక్షము కాగలడు.

అయితే ఈసారి పూర్వము చేసిన పొరపాటు మరల జరుగకుండు నిమిత్తము ముందుగనే యతడు చాలా జాగ్రత్తపడెను. ఒకగెల అరటిపండ్లు తెప్పించి దేవుని విగ్రహము ముందు పెట్టి “ఒక వేళ భగవంతుడు అకస్మాత్తుగ ఇచటికి వచ్చినప్పటికిని ఈసారి పండు ఒలిచి గుజ్జుమాత్రమే దేవునకు పెట్టి తొక్కు పారవేసెదను” అని కృతనిశ్చయుడై ఆ గెలలో ఒక్కొక్కపండు త్రుంచి, తొక్కుతీసి గుజ్జును గట్టిగా చేతితో పట్టుకుని దేవున కిచ్చునట్లుగా అభ్యాసము చేయదొడగెను. ఈ ప్రకారము గెలలోని అన్ని పండ్లను ఒక్కొక్కటిగ త్రుంచి గుజ్జును గట్టిగా పట్టుకొను అభ్యాసము చేసి ఆ పనియందు చక్కని ప్రావీణ్యమును బడసెను. “ఇక దేవుడు ఎపుడు వచ్చినను పరవాలేదు. ఈసారి గుజ్జుమాత్రమే నివేదింపబడగలదు గాని తొక్కుకాదు” అని బాగుగ నిశ్చయించుకొని మరల తన పూజా గృహమున ప్రతిదినము పూజచేయదొడెంగెను.

ఇట్లుండ ఒకనాడు ఆతని భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణుడు మరల ప్రత్యక్షమయ్యెను. పూర్వపు అభ్యాసము దృఢపడి యుండుటచే వెంటనే ఆతడు ప్రక్కనున్న అరటిపండును పట్టుకుని జాగ్రత్తగ ఒలిచి గుజ్జును గట్టిగ పట్టుకుని తొక్కును పారవైచి, ఆగుజ్జును భగవానుని నోటిలో పెట్టెను” కాని భగవానుడు దానిని భుజింపక ఊసివేసెను. అపుడాభక్తుడు దుఃఖాక్రాంతుడై విలపించుచు, భగవానుని పాదపద్మములపై పడి, ఏల తాము భుజింపలేదని ప్రార్థింప ఆతడిట్లు నుడివెను; ఓయీ! పూర్వము నీవు నాకు తొక్కను నివేదించినపుడు నీ మనస్సు నా పాదపద్మములపై సంలగ్నమై యుండుటవలన అసారమైన ఆ వస్తువు భక్తిరసముచే తడుపబడి అమృతతుల్యమై యుండుటచే నేను దానిని భుజించితిని, ఈ సారి వచ్చినపుడు నీవు గుజ్జును ఇచ్చి నప్పటికిని నీ మనస్సంతయు అరటిపండుపైననే లగ్నమై యుండుట వలన, వస్తువు మంచిదైనను భక్తిరసహీనమై యుండుట వలన అది విషతుల్యముగ మారినది. అందుచే నే నద్దానిని భుజింపక పారవేసితిని. అని చెప్పి యంతర్ధాన మొందెను.

అప్పటి నుండియు ఆ భక్తుడు తెలివితెచ్చుకొని భగవన్నివేదనాది కార్యములందు వస్తువుకంటే భక్తికే ప్రాధాన్యత నొసంగుచు వచ్చి క్రమముగ భగవదనుగ్రహమునకు పాత్రుడు కాగల్గెను. దేవుడు తనకు “ఏది ఒసంగిరి” అని చూడడు “ఎట్లు ఒసంగిరి” అని చూచును. కాబట్టి జనులు పూజాప్రార్థనాదులందు భక్తికి ప్రాధ్యానత నిచ్చి దానిని బాగుగ అభివృద్ధి నొందించుకొనుచుండవలెను.

అణ్యప్యుపాహృతం భక్త్యా ప్రేమ్ణాభూర్యేన మే భవేత్‌|
భూర్యప్యభక్తోపహృతం న మే తోషాయ కల్పతే ||

కొంచెమైనను భక్తితో, ప్రేమతో ఒసంగబడినది కోండంత కాగలదు. కోండంత ఇచ్చినను భక్తితో కూడియుండనిచో అది నాకు సంతుష్టిని కలుగజేయజాలదు. అను ఈ భగవద్వాక్యమును సర్వులును స్మృతిపథమున నుంచుకొని సర్వేశ్వరుని యెడల అనన్య భక్తిభావమును పెంపొందించు కొనుదురుగాక!

నీతి: భక్తితో గూడినప్పుడే వస్తువునకు విలువ ఏర్పడును.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం


చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి వుండేది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యడమంటే చాలా కష్టంగా వుండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూరజంతువులకు పునికి పట్టుగా వుండేవి.

దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు, అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని, తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వనయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాకా అతిధుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, ” వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా” అని పిలిచేవాడు. అతిధుల కడుపులో మాంసరూపంలొ వున్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిధుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు, ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగే వాడు. అగస్త్యడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు యధాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిధిగా వుండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని, ” మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను” అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!
ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.ఆయన చెయ్యి కడుక్కోడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు ” వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా!” అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ ” ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమై పోయాడు” అన్నాడు. తన ఎదుట వున్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్ధమయింది ఇల్వలుడికి. ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి ” మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచి పెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను” అన్నాడు.తాపసి దయతలచి సరే అన్నాడు.ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలి పెట్టి వెళ్ళిపోయాడు.

“ఇల్వల” అంటే చెడునడత గలిగన మనసు అని అర్ధం.

“వాతాపి” పేరు సర్వప్రాణుల్నీ హరించేవాడు అనే అర్ధాన్నిస్తుంది. అంటే ‘మరణం’ అన్నమాట.

ఇల్వలుడనే చెడు మనసు గల వాని జిత్తులు జ్ఞాని అయిన అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక పోయాయి.

రామ ఆపదుద్ధారక స్తోత్రం


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ ||

నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ |
దండితాఖిలదైత్యాయ రామాయాపన్నివారిణే || ౧ ||

ఆపన్నజనరక్షైకదీక్షాయామితతేజసే |
నమోస్తు విష్ణవేతుభ్యం రామాయాపన్నివారిణే || ౨ ||

పదాంభోజరజస్స్పర్శ పవిత్రమునియోషితే |
నమోస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే || ౩ ||

దానవేంద్ర మహామత్త గజపంచాస్యరూపిణే |
నమోస్తు రఘునాధాయ రామాయాపన్నివారిణే || ౪ ||

మహిజాకుచసంలగ్నకుంకుమారుణవక్షసే |
నమః కల్యాణరూపాయ రామాయాపన్నివారిణే || ౫ ||

పద్మసంభవ భూతేశ మునిసంస్తుతకీర్తయే |
నమో మార్తాండ వంశ్యాయ రామాయాపన్నివారిణే || ౬ ||

హరత్యార్తిం చ లోకానాం యో వా మధునిషూదనః |
నమోస్తు హరయే తుభ్యం రామాయాపన్నివారిణే || ౭ ||

తాపకారణసంసారగజసింహస్వరూపిణే |
నమో వేదాంతవేద్యాయ రామాయాపన్నివారిణే || ౮ ||

రంగత్తరంగజలధి గర్వహచ్ఛరధారిణే |
నమః ప్రతాపరూపాయ రామాయాపన్నివారిణే || ౯ ||

దారోసహిత చంద్రావతంస ధ్యాతస్వమూర్తయే |
నమః సత్యస్వరూపాయ రామాయాపన్నివారిణే || ౧౦ ||

తారానాయక సంకాశవదనాయ మహౌజసే |
నమోస్తు తాటకాహంత్రే రామాయాపన్నివారిణే || ౧౧ ||

రమ్యసాను లసచ్చిత్రకూటాశ్రమ విహారిణే |
నమస్సౌమిత్రిసేవ్యాయ రామాయాపన్నివారిణే || ౧౨ ||

సర్వదేవాహితాసక్త దశాననవినాశినే |
నమోస్తు దుఃఖధ్వంసాయ రామాయాపన్నివారిణే || ౧౩ ||

రత్న సానునివాసైక వంద్యపాదాంబుజాయ చ |
నమస్త్రైలోక్యనాథాయ రామాయాపన్నివారిణే || ౧౪ ||

సంసారబంధమోక్షైకహేతుదామప్రకాశినే |
నమః కలుషసంహర్త్రే రామాయాపన్నివారిణే || ౧౫ ||

పవనాశుగ సంక్షిప్త మారీచాద్యసురారయే |
నమో ముఖపరిత్రాత్రే రామాయాపన్నివారిణే || ౧౬ ||

దాంభికేతరభక్తౌఘమహానందప్రదాయినే |
నమః కమలనేత్రాయ రామాయాపన్నివారిణే || ౧౭ ||

లోకత్రయోద్వేగకర కుంభకర్ణశిరశ్ఛిదే |
నమో నీరదదేహాయ రామాయాపన్నివారిణే || ౧౮ ||

కాకాసురైకనయన హరల్లీలాస్త్రధారిణే |
నమో భక్తైకవేద్యాయ రామాయాపన్నివారిణే || ౧౯ ||

భిక్షురూపసమాక్రాంతబలిసర్వైకసంపదే |
నమో వామనరూపాయ రామాయాపన్నివారిణే || ౨౦ ||

రాజీవ నేత్రసుస్పంద రుచిరాంగసురోచిషే |
నమః కైవల్యనిధయే రామాయాపన్నివారిణే || ౨౧ ||

మందమారుతసంవీత మందారద్రుమవాసినే |
నమః పల్లవపాదాయ రామాయాపన్నివారిణే || ౨౨ ||

శ్రీకంఠచాపదళన ధురీణబలబాహవే |
నమః సీతానుషక్తాయ రామాయాపన్నివారిణే || ౨౩ ||

రాజరాజసుహృద్యోషార్చిత మంగళమూర్తయే |
నమ ఇక్ష్వాకువంశ్యాయ రామాయాపన్నివారిణే || ౨౪ ||

మంజులాదర్శ విప్రేక్షణోత్సుకైకవిలాసినే |
నమః పాలితభక్తాయ రామాయాపన్నివారిణే || ౨౫ ||

భూరిభూధర కోదండమూర్తి ధ్యేయస్వరూపిణే |
నమోస్తు తేజోనిధయే రామాయాపన్నివారిణే || ౨౬ ||

యోగీంద్రహృత్సరోజాతమధుపాయ మహాత్మనే |
నమో రాజాధిరాజాయ రామాయాపన్నివారిణే || ౨౭ ||

భూవరాహస్వరూపాయ నమో భూరిప్రదాయినే |
నమో హిరణ్యగర్భాయ రామాయాపన్నివారిణే || ౨౮ ||

యోషాంజలివినిర్ముక్త లాజాంచితవపుష్మతే |
నమస్సౌందర్యనిధయే రామాయాపన్నివారిణే || ౨౯ ||

నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతివక్షసే |
నమో నృసింహరూపాయ రామాయాపన్నివారిణే || ౩౦ ||

మాయామానుషదేహాయ వేదోద్ధరణ హేతవే |
నమోస్తు మత్స్యరూపాయ రామాయాపన్నివారిణే || ౩౧ ||

మితిశూన్య మహాదివ్యమహిమ్నే మానితాత్మనే |
నమో బ్రహ్మస్వరూపాయ రామాయాపన్నివారిణే || ౩౨ ||

అహంకారీతరజన స్వాంతసౌధవిహారిణే |
నమోస్తు చిత్స్వరూపాయ రామాయాపన్నివారిణే || ౩౩ ||

సీతాలక్ష్మణసంశోభిపార్శ్యాయ పరమాత్మనే |
నమః పట్టాభిషిక్తాయ రామాయాపన్నివారిణే || ౩౪ ||

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయోభూయోనమామ్యహమ్ || ౩౫ ||

ఫలశ్రుతి-
ఇమం స్తవం భగవతః పఠేద్యః ప్రీతమానసః |
ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః || ౧ ||

స తు తీర్త్వా భవాంబోధిమాపదస్సకలానపి |
రామసాయుజ్యమాప్నోతి దేవదేవప్రసాదతః || ౨ ||

కారాగృహాదిబాధాసు సంప్రాప్తే బహుసంకటే |
ఆపన్నివారకస్తోత్రం పఠేద్యస్తు యథావిధిః || ౩ ||

సంయోజ్యానుష్టుభం మంత్రమను శ్లోకం స్మరన్విభుమ్ |
సప్తాహాత్సర్వబాధాభ్యో ముచ్యతే నాత్ర సంశయః || ౪ ||

ద్వాత్రింశద్వారజపతః ప్రత్యహం తు దృఢవ్రతః |
వైశాఖే భానుమాలోక్య ప్రత్యహం శతసంఖ్యయా || ౫ ||

ధనవాన్ ధనదప్రఖ్యస్స భవేన్నాత్ర సంశయః |
బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః || ౬ ||

తం తం కామమవాప్నోతి స్తోత్రేణానేన మానవః |
యంత్రపూజావిధానేన జపహోమాదితర్పణైః || ౭ ||

యస్తు కుర్వీత సహసా సర్వాన్కామానవాప్నుయాత్ |
ఇహలోకే సుఖీ భూత్వా పరే ముక్తో భవిష్యతి || ౮ ||

అంబ -శ్రీ మహాభారతంలో కథలు


శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్న మాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికారదర్పంతో, అహంకారంతో కన్నూ,మిన్నూ గానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బ తిన్నాడు. అనంతరం విచిత్రవీర్యునుకి పట్టం కట్టారు. తమ్మునికి పెళ్ళి చేయాలనుకున్న భిష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్రవీర్యుణ్ణి అక్కడకు తీసుకుపోయాడు.

కాశీరాజుకు ముగ్గురు కూతుళ్ళు .

అంబ,అంబిక,అంబాలిక అని వాళ్ళకు పేర్లు.

వాళ్ళ కోసం అక్కడకు చేరిన రాజులందరూ పోట్లాడుకోవాడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్ళందర్నీ ఓడించి రాజకుమార్తెలు ముగ్గుర్నీ రధమెక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు.

వెంటనే పెళ్ళికి ఏర్పాటు చెయ్యమని మంత్రుల్ని అదేశించాడు. అంబ నీళ్ళు నిండిన కళ్ళతో భీష్ముడి దగ్గరకు వెళ్ళి ” గాంగేయా! నా మనసంతా సాళ్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు. అతనే నా సర్వస్వం. మనసు లేని మనువు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాళ్వుని దగ్గరకు చేర్చు. నా చెల్లెళ్ళిద్దర్నీ నీ తమ్ముడుకిచ్చి పెళ్ళి చెయ్యి” అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాళ్వదేశానికి పంపాడు.

సాళ్వుడు అంబను చూస్తూనే ” నువ్వంటే నాకూ ఇష్టమే. నిన్ను పెళ్ళి చేసుకోవాలని నేనూ అనుకున్నాను. కాని రాజులందరూ చూస్తూవుండగా భీష్ముడు నిన్ను రధమెక్కించుకుని తీసుకుపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకొచ్చావో తెలీదు నాకు. విచిత్రవీర్యుణ్ణి పెళ్ళాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్ళు గడిపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్ళి చేసుకోమంటావు?” అని పరుషంగా అన్నాడు. అంబ ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్ళి జరిగినదంతా చెప్పింది. ” నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్ర్ణయనాధుడు నాకు కాకుండా పోయాడు. నా చిర సంకల్పం భగ్నమైంది. ఇంక చేసేదేంలేదు. వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది. నీ తెమ్ముణ్ణే పెళ్ళి చేసుకుంటా” అంది.

భీష్ముడు ఒప్పుకోలేదు.

” సాళ్వుడే నా ప్రియుడని బాహాటంగా ప్రకటించిన పిల్లవు. నా తమ్ముణ్ణెలా చేసుకుంటావు? మనసొకచోట మనువొకచోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి నీకూ మా తమ్ముడికీ పొసగదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది” అన్నాడు. అంబ మొహంలో నెత్తురుచుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు అమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. నెమ్మదిగా తల పైకెత్తి, “నా కలలన్నీ చిరిగి పీలికలవడానికి నువ్వే కారణం నా బ్రతుకు అల్లరి పాలు కావడానికి నువ్వే మూలం. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు” అని వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్ళి తపస్సు ప్రారంభించింది.

ఒక రోజు హొత్రవాహనుడనే రాజర్షి వచ్చి, అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డ అని తెలుసుకుని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్రపర్వతానికి వెళ్ళి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృతవ్రణుడనేవాడు వచ్చి, హొత్రవాహనుడ్ని చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు.

అంబ ఆగిపోయింది. మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కధంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి “అమ్మా! నీకు రెండువైపులా పరాభవం కలిగింది. సాళ్వుణ్ణి చక్క చెయ్యమంటావా? భీష్ముడికి నచ్చ చెప్పమంటావా?” అని అడిగాడు.

” మహర్షి ! సాళ్వుడెలాగా నన్ను అంగీకరించడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతణ్ణి సాధించడానికే తపస్సు చేస్తున్నాను” అంది.

“అమ్మా!తపస్సు చేసేటంత కష్టమెందుకు నీకు! భీష్ముడు నా మాట వినకపోతేగా?” అని అంబను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు పరశురాముడు.

“గాంగేయా! ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనడం ధర్మంకాదు. ఈ పిల్లను నీ తెమ్ముడికిచ్చి పెళ్ళి చెయ్యి” అన్నాడు.

“పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయ్యడం మాత్రం ధర్మమా మహాత్మా” అన్నాడు భీష్ముడు.

“ఏమో అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చెయ్యడమే నీ కర్తవ్యం. లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్నీ, నీ బంధువుల్నీ కూడా చంపుతాను” అన్నాడు పరుశురాముడు.

“అయ్యా! ఇది అధర్మం” అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ.

“నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడవయ్యావా?” అని మండిపడ్డాడు పరశురాముడు.

“స్వామీ! మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవడం న్యాయం కాదు.” అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చిందాయనకు.

” నేను గురువునని తెలిసినా,నా మాట తిరస్కరిస్తున్నావు? పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు. మాటల వల్ల ప్రయోజనం లేదు. ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్ళిచేస్తే నా కోపం చల్లారుతుంది. లేదా…” అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే ” అధర్మకార్యం మాత్రం నేను చెయ్యను” అన్నాడు భీష్ముడు.

దానితో ఇద్దరూ యుద్ధానికి దిగారు.

పరశురాముడు బాణాలవర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రధాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది.పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు.ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి “నాయనా!భీష్ముణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నారాయణసఖుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముణ్ణి చంపుతాడు. నువ్వూరుకో” అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముణ్ణి కౌగిలించుకుని గౌరవించాడు.

భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

పరశురాముడు అంబను పిలిచి ” అమ్మాయీ! నన్ను భీష్ముడు గెలిచాడు. ఇంక నేనేం చేయ్యలేను. నీ ఇష్టం మరి” అన్నాడు. అంబ మౌనంగా రోదిస్తూ వెళ్లిపోయింది.

ఆ తరువాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకుని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి “ఏమిటింత కఠినంగా తపస్సు చేస్తున్నావు?” అని అడిగేసరికి ” వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపాలి అందుకూ ఈ తపస్సు ” అంది అంబ.

“నువ్వు కుటులసంచారిణివి. కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు. అంతకంటే ఇంకేం చెయ్యలేవు నువ్వు” అంది కోపంగా గంగ.

అంబ తన తపఃప్రభావంలో సగం ధారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై “మరుజన్మలో భీష్ముణ్ణి చంపగలవు” అని సెలవిచ్చాడు.

“స్వామీ! అదెలా సంభవం?” అని అంబ అడిగింది.

“నువ్వీ శరీరం విడిచి ద్రుపదుడికి మొదట కూతురివై పుడతావు. తరువాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు” అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు.

అంబ చితి పేర్చుకొని ‘వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపుదునుగాక’ అంటూ అగ్నిలో ప్రవేశించింది. అదీ అంబ కధ.

భక్తునిపై మాయ ప్రభావం


మాయ దైవీ శక్తి. భగవంతుని నుండే వచ్చింది. ఆయన అధీనంలో ఉంటుంది. మాయను దాటడం చాలా కష్టం. భగవంతుణ్ణి ఆశ్రయించిన వారే దాన్ని దాటగలరు. “ఎవరైతే నన్నే శరణాగతితో వేడుకుంటారో వారిని తరింపజేస్తాను” అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో హితవు పలికారు.

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మాేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే!!

’యా’ ’మా’ ఏదిలేదో అదే మాయ అంటారు శ్రీరామకృష్ణులు. నేనూ, నావారు, భార్య, భర్త, పిల్లలు అనుకోవడం మాయ. అందరూ తనవారే అనుకొని వారికి సహాయం చేయడం దయ అంటారు. వేదాంత పరిభాషలో దీన్ని అనిర్వచనీయం అంటారు.

భగవంతుణ్ణి మరిపింపజేసి ఈప్రపంచమే సర్వస్వం అనుకొనేలా చేసేది మాయ. అరిషడ్వర్గాలైన కామక్రోధలోభమోహమదమాత్సర్యాలకు లోనై ఉండేవాడు మాయలో ఉన్నట్లే. భగవంతుడే సత్యం, మిగతాదంతా అసత్యం అనే భావన వచ్చినప్పుడు మాయను అధిగమించవచ్చు. “ఎవరు మాయను దాటగలరు” అని రెండుసార్లు ప్రశ్నించి, “అవతార పురుషులనూ, మహాత్ములనూ సేవించినవారే మాయను దాటగలరు” అని భక్తి సూత్రాల్లో నారదమహర్షి చెప్పారు.

అవ్యక్తనామ్నీ పరమేశ శక్తి రనాద్యవిద్యా త్రిగుణాత్మికా పరా
కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్సర్వమిదం ప్రసూయతే’ – వివేకచూడామణి శ్లోకం – 110

‘…మహాద్భుతా నిర్వచనీయ రూపా’ – వివేకచూడామణి – 111

దీనిపేరు అవ్యక్తం. త్రిగుణాత్మికమైనది దీని రూపం. అనాది అయిన అవిద్యా స్వరూపం. ఈ జగత్తు అంతా మాయవల్లే పుడుతోంది. వర్ణింప శక్యం కానిది. మహాద్భుతమైనది మాయ.

’శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ్యా సర్పభ్రమో రజ్జు వివేకతో యథా…’ వివేకచూడామణి – 112

మునిమాపు వేళ పాము, త్రాడు అనే జ్ఞానం కలగగానే భ్రమ తొలగినట్లు అద్వితీయ శుద్ధ బ్రహ్మ జ్ఞానం కలగడంతోనే మాయ తొలగుతుంది.

ఒకసారి నారదుడు ’నీ మాయను చూడాలని ఉంది’ అని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. శ్రీకృష్ణుడుఅతణ్ణి తీసుకొని ఎడారి మార్గంలో వెళుతూ దప్పికై, కొంచెం మంచినీళ్ళు కావాలని కోరాడు. నారదుడు అల్లంత దూరాన ఉన్న ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉన్న కన్యను చూసి మోహించాడు. ఆమెను పెళ్ళి చేసుకొని సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకసారి వరద వచ్చింది. భార్యా, పిల్లల్ని రక్షించబోయి అందరినీ వరదలో పోగొట్టుకొన్నాడు. అప్పుడు విలపిస్తున్న నారదుణ్ణి, శ్రీకృష్ణుడు తన చేతితో

స్పృశించి “నారదా! మంచినీళ్ళు ఏవీ?” అని అడిగాడు. అప్పుడు నారదుడికి స్పృహ వచ్చింది. ఇదే మాయ. క్షణంలో అంతా మరిపిస్తుంది.
భగవంతుని కృపతోనే మాయను దాటవచ్చు. మాయను గురించి వివరిస్తూ – ’ఉన్న వస్తువు (బ్రహ్మ) ఒక్కటే. ద్రవ్యమో! చైతన్యమో!! వాటిని రెంటినీ విడదీసి ఆలోచించడం కష్టం. అదే మాయ. అదే అజ్ఞానం’ అన్నారు స్వామి వివేకానంద.