అగ్ని దేవుడు


జీవితంలో ఎదురయ్యే క్లేశాలనూ, వినాశాలనూ, తప్పిదాలనూ, నిర్మూలించి సర్వతోముఖ శ్రేయస్సును అందించే అగ్ని తత్త్వం అపూర్వం.
 పాపమే అంటని అగ్నిదేవుడు సకల వ్యాపియై తన జ్వాలల ద్వారా లోకాన్ని పునీతం చేసి సత్యరూపంగా చిత్రిస్తుంటాడు.

భారతీయ సంస్కృతికీ, సంప్రదాయానికీ ఆలవాలమైన ప్రాకృతిక సౌందర్యం మానవ మనుగడకు ఊతమందిస్తూ రక్షణ కవచమై అలరారుతుంది. మనిషి ప్రకృతిని ఆరాధిస్తే, ప్రకృతి కూడా మనిషిని ఆదరిస్తుంది. ఆలంబనై నిలుస్తుంది. పరస్పర సహకారంతో మనుగడ సాగించడం ప్రకృతి ప్రణాళిక. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశమనే అయిదు తత్త్వాలే సృష్టికి మూలహేతువులై పంచభూతాలుగా ప్రకృతిలో భాగమయ్యాయి. మనిషి ముఖ్య ఆధారాలై భాసిల్లుతుంది.

సర్వాగ్రణీ, సర్వ ప్రథముడూ అయిన అగ్నిదేవుడు ప్రకృతి శక్తులలో ప్రముఖుడూ, ప్రధానుడు. భూమండలంలోని ప్రముఖ తత్త్వాలకు ఆలంబన అగ్నితత్త్వం. సత్యనిష్ఠతో ప్రేరితమైన అగ్నిజ్వాల లోకంలోని సమస్తమునూ పవిత్రీకరిస్తుంది. పావనం చేస్తుంది. అందుకే స్వర్గ ప్రాక్తికి సాధనం అగ్ని ఆరాధన అంటోంది వేదం.
‘ఓం అగ్నిమీళే పురోహితం
యజ్ఞస్య దేవ మృత్విజమ్|
హోతారం రత్నధాతమమ్||”

సృష్టి యజ్ఞానికి ప్రథమ పురోహితుడూ, లోకంలోని అందరి ఆహుతులనూ మోసుకెళ్లి దేవతలకర్పించే ఏకైక యాగపురుషుడూ అగ్నిదేవుడు

అగ్ని దేవునికి రెండు తలలు , ప్రతి తలకి రెండు కొమ్ములు ,ఏడు నాలుకలు , ఏడు చేతులు ,మూడు కాళ్ళు ఉంటాయి. ఈయనకు కుడి వైపు భార్య స్వాదా దేవి, ఎడమవైపు స్వాహా దేవి ఉంటుంది. దైవ కార్యాలలో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాలలో స్వదా దేవి తన పాత్ర పోషిస్తుంది. ఈయన వాహనం మేక. అన్నిటినీ ఈయన ఆరగించ గలడు కావునా ఈయన్ని ” సర్వభక్షకుడు ” అంటారు. ఇంకా ఈయనకు హుతవాహనుడు, దేవముఖుడు, సప్తజిహ్వుడు, వైశ్వానరుడు, జాతవేదుడు అని కూడ పేర్లు.

సృష్టి యజ్ఞపు అంతరార్థాన్ని ఆవిష్కరించే వాడూ, నిత్యనిజసత్య స్వరూపుడూ, అనంత మహిమాన్వితుడూ అయిన అగ్నిదేవుడు దేవతలందరితో భువికి అరుదెంచి ప్రసన్నుడై ఆశీర్వదించేలా వారందరినీ హవిస్సులతో తృప్తిపరచి నిష్పక్షపాతంగా లోకాన్ని సుఖిక్షం చేసే దేవదేవుడు.

Advertisements

మహా భారతము ప్రాముఖ్యము


మహాభారతం పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.

“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్”

– “ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును.

ఈ కావ్యవైభవాన్ని నన్నయ:

“ దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. ”

మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటపుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.
మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.
మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు.మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు , శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణులు. పాండవ పక్షం వహిండి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.

ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.

పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.

మహాభారతంలోని పర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం,సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గాగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధవధ, ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం.

శివ పురాణము


అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.

శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్క) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు.

 1. విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి
 2. రుద్ర సంహిత లో
  1. సృష్టి ఖండము (20 అధ్యాయాలు)
  2. సతీ ఖండము (43అధ్యాయాలు)
  3. పార్వతీ ఖండము (55 అధ్యాయాలు)
  4. కుమార ఖండము (20 అధ్యాయాలు)
  5. యుద్ధ ఖండము (59 అధ్యాయాలు)
 3. శతరుద్ర సంహిత (42 అధ్యాయాలు)
 4. కోటి రుద్ర సంహిత (43 అధ్యాయాలు)
 5. ఉమా సంహిత (51 అధ్యాయాలు)
 6. కైలాస సంహిత (23 అధ్యాయాలు)
 7. వాయివీత సంహిత – ఇది రెండు భాగాలు గా విభజించబడింది 35, 41 అధ్యాయాలు

శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు

 • సృష్టి ప్రశంస అజిత
 • తరణోపాయము
 • శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము, శివుని గర్వ భంగము
 • శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక
 • శివుడు హనుమంతుడగుట, అర్జునుడు మరియు కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము
 • అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము
 • నంది, భృంగుల జన్మ వృత్తాంతము
 • పరశురామోపాఖ్యానము – కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగజని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము మరియు సహగమనము
 • పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధము
 • పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట
 • ముక్తి సాధనములు
 • పిండోత్పత్తి విధానము
 • బృహస్పత్యోపాఖ్యాణము

ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా


ఏ ఇంటిముందు ఉదయాన్నే కళ్లాపిచల్లి ముగ్గుపెట్టి వుంటుందో ఆ ఇంటికి రావడానికే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఉదయాన్నే వాకిలి శుభ్రంగా ఊడ్చి ఆవుపేడతో కళ్లాపిచల్లి బియ్యపు పిండితో ముగ్గు పెడుతుంటారు. ఇక పండుగ రోజుల్లో ఈ ముగ్గు మరింత అందంగా ఉండేలా శ్రద్ధ తీసుకుంటూ వుంటారు. పూర్వకాలం నుంచి కూడా ఇది మన ఆచారవ్యవహారాల్లో ఒక భాగమైపోయింది. 

అయితే ఇంట్లో పితృ కార్యాలు నిర్వహించవలసి వచ్చినప్పుడు, ఇంటిముందు ముగ్గు పెట్టాలా వద్దా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటుంది. శాస్త్రం మాత్రం పితృ కార్యం నిర్వహించే రోజున ఉదయాన్నే వాకిట్లో ముగ్గు పెట్టకూడదని చెబుతోంది. ముగ్గులేని వాకిట్లోకి రాకుండా లక్ష్మీదేవి ఎలా వెనుదిరిగి పోతుందో, ముగ్గువేసిన వాకిట్లోకి రాకుండా పితృదేవతలు కూడా అలానే వెనుదిరిగిపోతారని అంటోంది.

పితృదేవతలు ముగ్గుదాటుకుని రాలేరట. అందువల్లనే పితృకార్యం నిర్వహించాక వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే వాకిట్లో ముగ్గులేని ఇళ్లలోకి ప్రవేశించడానికి దుష్టశక్తులు సిద్ధంగా ఉంటాయని అంటారు. అందువలన పితృకార్యం నిర్వహణ పూర్తి అయిన తరువాత, వెంటనే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గుపెట్టాలని చెబుతుంటారు. దీనిని బట్టి ముగ్గు అనేది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాదు, ఇంటికి రక్షణని కూడా ఇస్తుందని గ్రహించాలి.

భగీరథుడు తన పితృదేవతలకోసం తపస్సు చేశాడు?


భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలకు కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు ” నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగా వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు “. వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

ఎవరి కోసం భగీరథుడు ఇన్నిన్ని సంవత్సరములు, ఇన్ని సార్లు తపస్సు చేస్తున్నాడు. తన కోసం కాదు. తన పితృదేవతలకోసం. మనిషై పుట్టినవాడి కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఉద్దరించడం, వారికి ఉత్తమ గతులు కల్పించడం. అందుకే భగీరథుడు గంగను భుమికి రావాలని వరం అడిగాడు. తాను వివాహం చేసుకుని సంతానం పొంది పితృ ఋణం తీర్చుకోవడం కూడా పుట్టిన ప్రతి మనిషి కర్తవ్యం. అందుకే తనకు సంతానం కలగాలని కోరుకున్నాడు.

మనకు రామాయణం నేర్పుతున్నదేమిటి? కోడుకై పుట్టినవాడు తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నించడం కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నతకాలం వారిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాలి. వారు మరణిచాక వారికి ఉత్తమలోకాలను కల్పించేందుకు పిండప్రధానం చేయాలి, తర్పణలివ్వాలి, వారి మరణతిధి రోజున వారికి పితృకర్మ చేయాలి.

కాని ఈ కాలం వారు చేస్తున్నది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, పసివయసు నుండి ఎంతో ప్రేమగా పెంచినా, ముసలివయసు రాగానే తల్లిదండ్రులను చూసూకోవడం మా వల్ల కాదు, వీరితో మేము సర్దుకుని బ్రతకలేమంటూ వారిని తిట్టిపోస్తూ ఇంటిలోనుండి తోసేయడం. బ్రతికిఉండగానే వారిని చంపేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. ఇక వారు చనిపోయాక తర్పణలివ్వడం వృధా ఖర్చుగా భావిస్తున్నారు. రామాయణం చెప్పినవేవి ఆచరించకుండా శ్రీ రాముడి ఆలయలు చుట్టూ తిరుగుతూ, శ్రీ రాముడి దీవెనలు పొందాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది.

మానవులు చనిపోగానే మరలాజన్మ ఎత్తాలి కదా ! మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండప్రదానాలు చెయ్యాలి


పార్వతీదేవి : ” నాధా ! మానవులు చనిపోగానే మరలాజన్మ ఎత్తాలి కదా ! మరి ఎవరి కొరకు ఈ పితృ కార్యాలు పిండప్రదానాలు చెయ్యాలి. వివరంగా తెలియ జెయ్యండి ” ఆ ప్రశ్న పార్వతీదేవి అడగగానే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. పరమశివుడు ఏమి సమాధానం ఇస్తాడో అని ఆతురతగా ఎదురు చూసారు.

పరమశివుడు :” పార్వతీ ! నువ్వు అడిగిన ప్రశ్న చాలా సందేహాలతో కూడుకున్నది పరమరహస్యము కూడా. పితరులు కూడా దేవతల వంటివారే ! దేవతలు ఉత్తరదిక్కున ఉంటారు. దేవతాపూజకు హవ్యము అనీ పితృకార్యములకు కవ్యము పేర్లు. పితృకార్యములు చేస్తే దేవతలు సంతోషించి ఆ కర్తకు ఆయుస్షు, ధనము, కీర్తి ప్రసాదిస్తారు. పితృగణములు దేవతలకు, అసురులకు, గరుడులకు, యక్షులకు మొదలగు వారు పూజనీయులు. పార్వతీ శ్రద్ధగా విను కుంచెడు ధాన్యము కలవాడు ఆ కుంచడు ధాన్యమును దానంగా ఇచ్చినా కోటి రూపాయలు ధనం ఉన్న వాడు ఆ కోటి రూపాయలు దానంగా ఇచ్చినా రెండూ సమానమే. కనుక దానములు తన శక్తికి తగ్గట్టు చేయాలి. అప్పుడే ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానము చేసినా మనసులో తిట్టు కోకుండా ప్రేమతో మనసారా ఇస్తే ఆ దానము సత్ఫలితాన్ని ఇస్తుంది ” అని చెప్పాడు ఈశ్వరుడు.

పితృకార్యములలో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా ! అలా ఎందుకు ఇస్తారు ?


ధర్మరాజు: ” పితామహా ! పితృకార్యములలో గొడుగులు, చెప్పులు దానంగా ఇస్తారు కదా ! అలా ఎందుకు ఇస్తారు ? వివరించండి ” అని అడిగాడు.

భీష్ముడు: ” ధర్మనందనా ! ఈ సందర్భంలో జమదగ్నికి సూర్యుడికి జరిన సంవాదం వినిపిస్తాను. ఒక సారి జమదగ్ని తన భార్య రేణుకాదేవితో కలిసి ఆశ్రమం వదిలి దూరంగా వెళ్ళి విహరించసాగాడు. అప్పుడు జమదగ్ని విల్లు పట్టుకుని ఉన్నాడు. రేణుకాదేవి అంబుల పొది పట్టుకుని ఉంది. జమదగ్ని ఆరుబయట బాణములు వదులుతున్నాడు. రేణుకాదేవి ఆబాణములు తిరిగి తెచ్చి జమదగ్నికి ఇస్తుంది. ఇలా మధ్యాహ్నం అయింది. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. ఒక సారి రేణుకదేవి బాణములు తీసుకు రావడంలో ఆలస్యం జరిగింది. జమదగ్ని రేణుకాదేవిని చూసి ” ఇంత ఆలస్యం జరిగిందేమి ? ” అని అడిగాడు. రేణుకాదేవి ” నాధా ఎండవేడిమి ఎక్కువగా ఉంది. అందుకని కొంతసేపు చెట్టునీడన నిలబడ్డాను. అందుకని ఆలస్యం అయింది ” అని బదులు చెప్పింది రేణుక. జమదగ్ని కోపించి ” ఏమీ ఆ సూర్యుడు నీకు తాపం కలిగించాడా ? ఉండు సూర్యుడికి తగిన బుద్ధి చెప్తాను. నా బాణములతో సూర్యమండలం కప్పి వేస్తాను ” అని అన్నాడు. ఆ మాటలు సూర్యుడు విని బ్రాహ్మణ వేషంలో జమదగ్ని వద్దకు వచ్చి ” అయ్యా సూర్యుడి మీద కోపం మానండి ” అని వేడుకున్నాడు. జమదగ్ని ” నువ్వు మాట్లాడకు పక్కకు పో నేను ఈ సూర్యుడిని కాల్చి వేస్తాను ” అని అన్నాడు. సూర్యుడు ” మునీంద్రా తాపసులైన మీరు కోపిస్తే ఎలాగా ! సూర్యుడి తాపము చేతనే కదా జలములు వేడెక్కి మేఘములుగా మారి వర్షరూపంలో లోకాలకు నీరు లభిస్తుంది. దానివలన మనకు ఓషధులు, పంటలు లభిస్తాయి కదా ! మరి సూర్యకిరణాలు తపించక పోతే ఎలాగ ” అని అన్నాడు. అప్పటికి జమదగ్ని శాంతించ లేదు. సూర్యుడు నిజస్వరూపంతో జమదగ్ని ముందు నిలిచి ” మునీంద్రా ! నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించండి ” అని వేడుకున్నాడు. ఆ మాటలకు జమదగ్ని శాంతించాడు. వెంటనే సూర్యుడు గొడుగు చెప్పులు సృష్టించి జమదగ్నికి ఇచ్చి ” మహర్షి ఈ సాధనము ఇంతకు ముందు లేవు. ఈ గొడుగు వేసుకుంటే సూర్యతాపము సోకదు, ఈ చెప్పులు వేసుకుంటే ఎండవేడిమికి కాళ్ళు కాలవు. ఈ గొడుగును, చెప్పులను బ్రాహ్మణులకు దానంచేస్తే పుణ్యం లభిస్తుంది ” అని అన్నాడు. ఆ వస్తువులను స్వీకరించిన జమదగ్ని సంతోషించాడు. ధర్మరాజా ! గొడుగు, చెప్పులు సూర్యుడి చేత సృష్టించబడ్డాయి. వాటిని దానంగా ఇస్తే పుణ్యలోకాలు లభిస్తాయి ” అని భీష్ముడు చెప్పాడు.