పంచామృతం


స్వచ్ఛమైన ఆవుపాలు, తీపిగా వున్న పెరుగు, స్వచ్ఛమైన నేయి, తేనె, చక్కెర మిశ్రమమే ఈ పంచామృతం. భక్తిపరమైన విషయాలను పక్కనబెడితే… ఈ పంచామృతంలో వున్న ఐదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తాయి.

ఆవుపాలు : ఆవులను ‘‘గోమాత’’ పూజిస్తారు మన తెలుగువారు. ఎందుకంటే.. ఆవు పాలు తల్లిపాలతో సమానమైనవి, ఎంతో శ్రేష్ఠమైనవి కూడా. గేదె పాలలో ఏ విధంగా అయితే కాల్షియం వుంటుందో.. అదే విధంగా ఆవులలో కూడా కాల్షియం ఎక్కువగా వుంటుంది. ఈ ఆవు పాలు తొందరగా జీర్ణం అవుతాయి. చిన్న పిల్లల్లోనూ, పెద్ద పిల్లల్లోనూ ఈ ఆవుపాలు ఎముకల పెరుగుదలకు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలను అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో వున్న ‘‘విటమిన్ ఏ’’ త్వరగా అంధత్వం రాకుండా నివారిస్తుంది.

పెరుగు : పెరుగులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ఔషద విలువలున్నాయి. పెరుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. శరీరంలో వేడి (ఉష్ణతత్వం) ఎక్కువగా వున్నవారికి పెరుగు అద్భుతమైన ఔషదంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నిరారించే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రాస్థానం వుంది. ప్రతిరోజు ఉదయం పూట పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పూర్వీకులు కూడా పెరుగుతో అన్నం తినే పొలం పనులకు వెళ్లేవారు.

నెయ్యి : మేధాశక్తిని పెంపొందించడంలో నెయ్యే అగ్ర తాంబూలం. ఆయుర్వేదం ప్రకారం నెయ్యితో కూడిన ఆహారపదార్థాలను (జీడిపప్పు వంటివి) తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంపొందించుతాయి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాల్సి వుంటుంది. ఇందులో ‘‘విటమిన్ ఏ’’ వుంటుంది.

తేనె : కొన్ని తరాల నుంచి మానవులు తేనెను పౌషకాహారంగానే ఉపయోగిస్తున్నారు. ఇది సూక్ష్మజీవులతో శక్తివంతంగా పోరాడటమే గాక, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రానివ్వకుండా మనల్ని కాపాడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలోవుంటాయి. జీర్ణకోశానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. చర్మసౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగిస్తున్నారు. తేనె చర్మ సంరక్షణలో ఆద్వితీయమైన పాత్ర పోసిస్తుంది.

ఇకపోతే… చక్కెర మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. దీన్ని బట్టి ఇన్ని సుగుణాలున్న ఈ అయిదింటి కలయికతో తయారైన పంచామృతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

Advertisements

ఇంట్లో గడప అవసరం


‘దేహళి’ అంటే ‘కడప’ ద్వారం దాటడానికి వేసే ‘నడిమి పడిని’ కడప అంటారు. కడప పట్టణానికి ఆ పేరు రావడానికి అది తిరుపతి వెంకటేశ్వరస్వామి యొక్క దేవుని కడప కావటమే. అయితే కొన్ని ప్రాంతాలలో గడపగా కూడా పిలుస్తుంటారు.

కడప ఇళ్లల్లోకైతే మేలైన కలపతో ద్వారానికి అనుసంధానంగాను, దేవాలయాలలో అయితే శిలా రూపంలోనూ చెక్కుతారు. ఈ గడపను తొక్కుతూ ఇంట్లోకి కాని, దేవాలయంలోకి కాని వెళ్లకూడదు. దాటుతూ వెళ్లాలి. ఈ కడపను ద్వార ప్రమాణానికి అనుప్రమాణ రీతిలో నిర్మించాలి. అలా కాకుండా నిర్మిస్తే అది దేహళీ భిన్న వేధగా ఇంట్లో నివసించే వారికి అనేక రకములైన ఇబ్బందులకు గురి చేస్తుంది.

గడప నిర్మాణంవలన మరొక వాస్తు ప్రయోజనం లౌకిక ప్రయోజనం కూడా ఉంది. ఏ గదికి ఆ గదికి గడప, లేకపోతే పడక గదికీ, వంట గదికీ దేవుని గదికీ తేడాయే ఉండదు.

ఒక సామాన్యమైన ఉదాహరణ గమనించండి. ఒక భూస్వామికి పదెకరాల పొలం ఉందనుకోండి, ఆ మొత్తం పొలానికి ఏకంగా నీరు పెడతాడా? పెట్టడు. మడికీ మడికీ మధ్య గట్టు ఏర్పరచి మళ్లు మళ్లుగా నీరు పెడతాడు. కారణం ‘మడి’ అంటే హద్దు గట్టు అంటే హద్దును ఏర్పరిచే ఒక గడప.

దేవుని పూజకు మడికట్టుకోవడమంటే కూడా అదే అర్థం. ఒక ప్రత్యేకమైన పనికి కట్టుబడి ఉండడం. అందుకే ఇంట్లో గడప అవసరం ఎంతైనా ఉంది.

గడప వలన మరొక లౌకిక ప్రయోజనం కూడా ఉంది. పాములూ, తేళ్లు వంటి పాకుడు క్రిమి కీటకాలు (సరీసృపాలు) ఎప్పుడూ ఏదో ఒక ఆధారంగా ఓరగా పాకుతుంటాయి. అదే గడప ఉన్నట్టయితే ఇంట్లోకి రాకుండా బయటినుండే వెళ్లిపోతాయి. అందుకే ఇంట్లో ప్రతి గదికీ గడప (కడప) ఉండాలి అని వాస్తు శాస్త్రం సర్వార్ధ సాధక నియమాన్ని నిర్దేశించింది. ఆ గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు, నరుకులు ఉండకుండా అఖండంగా ఉండాలి. అది దోషంగా ఉన్నప్పుడు దేహళీభిన్న వేధగా పీడిత ద్వార దోషంగా హాని కలిగిస్తుంది.

ఏ గృహానికయినా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలో ఏ గదికైనా గడపలు లేకుండా ద్వారా లు బిగించబడ వు. గడపలేని గృహం కడుపులేని దేహం లాంటిది. పెదాలు లేని నోరులాగే గడపలేని గృహాలు ఉండకూడదు.

గోత్రం


గోత్రం అనగా మూల పురుషుడి పేరు. మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ మనుష్యడి తాలూకు విత్తనానికి (లేక వీర్యకణానికి) జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది.గోత్రము అనగా గో అంటే గోవు,గురువు,భూమి,వేదము అని అర్థములు.ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా,ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు,కపిలగోవువారు,తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట,భరద్వాజ,వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువు కు సంబంధించిన వారమని,ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.ఆ తరువాత భూములను కలిగిన బోయ/క్షత్రియులు భూపని,భూపతి,మండల అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు.ముఖ్యముగా బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద,ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు.

గోత్రాలు ఆటవిక కాలము/ ఆర్యుల కాలంలోనే ఏర్పడ్డాయి.తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి)పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధములు ఉండ రాదని, వేరు గోత్రికుల మధ్య వివాహములు జరపటము మంచిదని గోత్రములు అందునకు ఉపకరిస్తాయని, ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు. తండ్రి(మూల పురుషుడు) చేసిన పని, వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించ బడినాయి.

క్రైస్తవుల మతగ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద,ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి. బ్రాహ్మణుల గోత్రములు భారత దేశమునందు కల బ్రాహ్మణ కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక గోత్రము, ప్రతి గోత్రానికి ముగ్గురు (త్రయార్షేయ) లేదా అయిదుగురు(పంచార్షేయ) ఋషుల వరస ఉంటుంది. ఈ ఋషుల వరసే ఈ కుటుంబాల మధ్య వారధి. బ్రాహ్మణ వివాహ విధి ప్రకారము, స్వగోత్రీకులు(ఒకే గోత్రం ఉన్న అబ్బాయి, అమ్మాయి) వివాహమాడరాదు. అలానే, త్రయార్షులలో మొదటి ఋషి కలవరాదు. వీరు దాయాదుల లెక్కన వస్తారు. ప్రతి గోత్రము సప్తర్షులలో ఒకరి నుండి వచ్చినదే. బౌద్ధాయనస్రౌత-సూత్రము ప్రకారము విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి(క్రిష్ణాత్రియ), వశిష్ట, కాశ్యప, అగస్త్య అనే 8 మంది ఋషులు,వారి సంతానము పేర్లే బ్రాహ్మణ గోత్రములు. ప్రజాపతి కి, ఈ 8 మంది ఋషులకి సంబంధము లేదు. వీరిని, వీరి సంతానమును గోత్రములని, మిగతావారిని “గోత్రవ్యయవ” అని అందురు. గోత్రములన్నీ గుంపులుగా విభజింపబడ్డాయి. వశిష్ట గణము నాలుగు గా విభజింపబడింది. అవి ఉపమన్యు, పరాశర, కుండిన, వశిష్ట. వాటికి మళ్ళీ పక్షాలు వున్నాయి. గణము, పక్షము, గోత్రము, ఇలా వస్తాయి. గణము, పక్షము, గోత్రము, అన్నీ కలిపి చదవడానిని ప్రవర అంటారు. పరాశర గోత్రానికి ప్రవర “వశిష్ట, శాక్త్య, పరాశర”. ఉపమన్యు కి “వశిష్ట, భరద్వసు, ఇంద్రప్రమద”. 19 మంది ఋషులు దాకా, ఏకార్షేయ, ద్వార్షేయ, త్రయార్షేయ, ఇలా ఎంత మందితో అయినా ప్రవర ఉండవచ్చు. ఆంధ్రదేశము లో కాశ్యపస గోత్రానికి కనీసము రెండు ప్రవరలు ఉన్నాయి. ఒకటి త్రయార్షేయ ప్రవర, ఇంకొకటి సప్తార్షేయ ప్రవర. ప్రవరలు రెండు విధాలుగా వున్నాయి.

  • శిష్య – ప్రశిష్య – ఋషి పరంపర
  • పుత్ర పరంపర

పుత్ర పరంపర లో ఒక ఋషి కలిసినా, వివాహము నిషిద్ధము. శిష్య – ప్రశిష్య – ఋషి పరంపరలో సగము, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఋషులు కలిస్తే వివాహము నిషిద్ధము..

మహాశివరాత్రి వృత్తాంతం


మహాశివ రాత్రి మహాత్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది.

గంగా యమునా సంగమ స్థానమైన ప్రయాగలో (నేటి అలహాబాదు) ఋషులు సత్రయాగం చేస్తున్నసమయంలో రోమర్షణ మహర్షి అని పేరు గాంచిన సూతమహర్షి అక్కడకు వస్తాడు. ఆలా వచ్చిన సూతమహర్షికి అ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పుమనగా అతను తనకు గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాధను వివరించడం ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్కుమారుడు వెళ్ళుతుంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మ కుమారుడైన సనత్కుమారునకు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాధను తెలుపుమంటాడు.

అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మ కుమారుడైన సనత్ కుమారుడు తనకు, నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా, వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగంలో ఋషులకు చెబుతాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడిని శివుని సాకారమైన మూర్తిగా, నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని చెబుతాడు.

బ్రహ్మ, విష్ణువుల యుద్ధం

ఒకప్పుడు ప్రళయ కాలం సంప్రాప్తము కాగ మహాత్ములగు బ్రహ్మ, విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగిరి. ఆ సమయంలోనే మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించెను. దాని వివరాలు ఇలాఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి, శేష శయ్యపై నిద్రించుచున్న విష్ణువును చూసి, “నీవెవరవు నన్ను చూసి గర్వముతో శయ్యపై పరుండినావు లెమ్ము. నీ ప్రభువను వచ్చి ఉన్నాను నన్ను చూడుము. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడును” అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి, ఆసనం ఇచ్చి, “నీచూపులు ప్రసన్నంగా లేవేమి?” అంటాడు. దానికి సమాధానంగా బ్రహ్మ “నేను కాలముతో సమానమైన వేగముతో వచ్చినాను. పితామహుడను. జగత్తును, నిన్ను కూడా రక్షించువాడను” అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో “జగత్తు నాలో ఉంది. నీవు చోరుని వలె ఉన్నావు. నీవే నా నాభిలోని పద్మమునుండి జన్మించినావు. కావున నీవు నా పుత్రుడవు. నీవు వ్యర్థముగా మాట్లాడు తున్నావు” అంటాడు.

ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదము లోనికి దిగి, చివరికి యుద్ధసన్నద్దులౌతారు. బ్రహ్మ హంస వాహనం పైన, విష్ణువు గరుడ వాహనం పైన ఉండి యుద్ధాన్ని ఆరంభిస్తారు. ఈ విధంగా వారివురు యుద్ధం చేయుచుండగా దేవతలు వారివారి విమానాలు అధిరోహించి వీక్షిస్తుంటారు. బ్రహ్మ, విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటే వారు ఒకరి వక్షస్థలం పై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించుకొన సాగిరి. ఇలా సమరం జరుగుచుండగా, విష్ణువు మాహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరిమీదకు ఒకరు సంధించుకొంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కల్గుతుంది. ఏమీ చేయలేక, దేవతలందరు శివునికి నివాసమైన కైలాసానికి బయలు దేరుతారు. ప్రమథగణాల కు నాయకుడైన శివుని నివాసస్థలమైన కైలాసం లో మణులు పొదగబడిన సభా మధ్యం లో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికలు శద్ధతో వింజామరలు వీచుచుంటారు. ఈ విధంగా నున్న ఈశ్వరునికి దేవతలు ఆనందభాష్పాలతో సాష్టాంగంగా ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమథ గణాలచేత శివుడు దేవతలను దగ్గరకు రమ్మని అహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో “బ్రహ్మ, విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియును. మీ కలవరము గాంచిన నాకు మరల చెప్పినట్లైనది ” అంటాడు. బ్రహ్మ, విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న వంద ప్రమథ గణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి, తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనం పై రంగు రంగుల ధ్వజముతో, వింజామరతో, పుష్పవర్షముతో, సంగీతము నాట్యమాడే గుంపులతో, వాద్య సముహంతో, పార్వతీదేవి తో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషను ఆపి, రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు.మాహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయే సమయంలో శివుడు అగ్ని స్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ రెండు అస్త్రాలను తనలో ఐక్యం చేసుకొంటాడు. బ్రహ్మ, విష్ణువులు ఆశ్చర్య చకితులై ఆ స్తంభం ఆది, అంతం కనుగొనడం కోసం వారివారి వాహనాలతో బయలు దేరుతారు. విష్ణువు అంతము కనుగొనుటకు వరాహరూపుడై, బ్రహ్మ ఆది తెలుకొనుటకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంతపోయినను అంతము తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనుకకు తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయం లో మార్గమధ్యం లో కామధేనువు క్రిందకు దిగుతూను, ఒక మొగలి పువ్వు(బ్రహ్మ, విష్ణువు ల సమరాన్ని చూస్తూ పరమేశ్వరుడు నవ్వినప్పుడు ఆయన జటాజూటం నుండి జారినదే ఆ మొగలి పువ్వు) క్రింద పడుతూనూ కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ ‘నేను ఆది చూశాను అని అసత్యము చెప్పండి. ఆపత్కాలమందు అసత్యము చెప్పడము ధర్మ సమ్మతమే” అని చెప్పి కామధేనువు తోను, మొగలి పువ్వుతోను ఒడంబడిక చేసుకొంటాడు. వాటి తో ఒడంబడిక చేసుకొన్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి,అక్కడ డస్సి ఉన్న విష్ణువు ని చూసి, తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు, మొగలి పువ్వు అని చెబుతాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మ కి షోడశోపచారా లతో పూజ చేస్తాడు.కాని,శివుడు ఆ రెండింటిని వివరము అడుగగా, బ్రహ్మ స్తంభం ఆది ని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెపుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి, నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు.మోసము చేసిన బ్రహ్మ ను శిక్షించడంకోసం శివుడు అగ్ని లింగ స్వరూపం నుండి సాకారమైన శివుడి గా ప్రత్యక్షం అవుతాడు. అది చూసిన విష్ణువు, బ్రహ్మ సాకారుడైన శివునకు నమస్కరిస్తారు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇకనుండి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకొంటాడని, విష్ణువు కి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు.

బ్రహ్మకు శాపము

శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని సృష్టించి పదునైన కత్తి తో ఈ బ్రహ్మ ను శిక్షించుము అని చెబుతాడు. ఆ భైరవుడు వెళ్లి బ్రహ్మ పంచముఖాల లో ఏ ముఖము అయితే అసత్యము చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తి తో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్లి, పూర్వము ఈశ్వర చిహ్నం గా బ్రహ్మ కు ఐదు ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవము అగు బ్రహ్మ ను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు బ్రహ్మని క్షమించి, బ్రహ్మకు స్థానము, పూజ , అభిషేకము మున్నగునవి ఉండవు అని చెప్పాడు. నిన్ను అగ్నిష్టోమము, యజ్ఞములలో గురుస్థానము లో నిలబెడుతున్నాను అని విష్ణువుతో చెప్పాడు.

మొగలి పువ్వుకు శాపము

ఆతరువాత కేతకీపుష్పము వైపు చూసి , అసత్యము పల్కిన నీతో పూజలు ఉండకుండా ఉండు గాక అని అనగానే దేవతలు కేతకీపుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలతచెందిన కేతకీపుష్పము పరమేశ్వరుడవైన నిన్ను చూసిన తరువాత కూడా అసత్య దోషము ఉండునా అని మహాదేవుడిని స్తుతించింది. దానితో ప్రీతి చెందిన శివుడు అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కాని కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపము లో నాపై ఉంటుంది అని చెబుతాడు.

కామధేనువుకు శాపము

అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువుకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించుమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. భోలాశంకరుడు కనుక, కోపమును దిగమ్రింగి, ” మొగము తో అసత్యమాడితివి కనుక నీ మొగము పూజనీయము కాదు; కాని సత్యమాడిన నీ పృష్ఠ భాగము పునీతమై, పూజలనందుకొనును” అని శివుడు వాక్రుచ్చెను. అప్పటి నుండి గోముఖము పూజార్హము కాని దైనది; గోమూత్రము, గోమయము, గోక్షీరము లు పునీతములైనవై, పూజా, పురస్కారములలో వాడబడుచున్నవి.

శివరాత్రి పర్వదినం

ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు , దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో “మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది.

ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది” అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగరూపము గా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధిచెంద గలదని చెబుతాడు.

జాగరణము

జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాయుజ్యము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము

హరహర మహాదేవ……. మహాశివరాత్రి ఆంతర్యం!


పౌరాణిక వాఞ్మయంలో ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ… శివరాత్రినాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.

స్కాంద పురాణంలోని ఈశాన సంహితలో ఓ కథ ఉంది. బ్రహ్మ, విష్ణువులోసారి ఒకరి కంటే ఒకరు అధికులమన్న అహంతో పరస్పరం కలహించుకుని తీర్పు కోసం పరమ శివుణ్ని అర్థించారట. శివుడు వారి మధ్య మహాగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపజేశాడు. దాని ఆద్యంతాలు తెలుసుకురమ్మని వారిరువురినీ పంపాడు. బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి అగ్రభాగాన్ని కనుగొనలేక వెనుదిరిగి వచ్చాడు. విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునే యత్నంచేసి, తానూ భంగపడ్డాడు. ఇదే లింగోద్భవ కథనం.

గుణనిధి అనే ఓ దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో కాకతాళీయంగా శివరాత్రినాడు శివాలయంలో శివలింగం వెనుక దాగివుండి, కొండెక్కుతున్న దీపం వత్తిని ఎగదోసి, తన ఉత్తరీయపు పోగుల్ని తెంచి దానికి జతచేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడిచినా ఆ శివరాత్రి నాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహా పుణ్యకృత్య ఫలితంగా మరుజన్మలో కళింగ రాజు అరిందముడికి పుత్రుడై జన్మించి, దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి, ఆపై కుబేరుడిగా జన్మించి, ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాధుడి కాశీఖండంలో ఉంది.

శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగర తీరాన ఇసుకతో శివలింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ని ప్రసన్నం చేసుకున్నదీపర్వదినానే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ని శ్రీకృష్ణుడు ప్రార్థించాడనీ కథనం వ్యాప్తిలో ఉంది.

‘శివ’ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. ‘శ’ అంటే శివుడనీ, ‘వ’ అంటే ‘శక్తి’ అనీ శివ పదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటిజాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.

క్షీరసాగర మధన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాన్ని రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడా గరళాన్ని గళాన నిలిపి ముల్లోకాలను కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయ సింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రత విధానం పేర్కొని ఉంది.

మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్కనైనారు, అక్కమహాదేవి, బెజ్జమహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.

రాముడికి ‘పంచాక్షరి’ని ప్రబోధించి రామనామం జపించాడు సాంబశివుడు. రాముడు శివనామం జపించాడు. అందుకే ‘శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే’ అన్నారు. భగవంతుడు, భాగవతుడు తానేనన్న సనాతన ధర్మసూత్ర ప్రసూనం వెదజల్లే ఈ అద్వైత సుమగంధం సర్వులకు ఆఘ్రాణయోగ్యం. ఇది భక్తగణ భాగ్యం. శివభక్తులే నాకిష్టులని రాముడంటే, రామభక్తులే నాకిష్టులన్నాడు హరుడు. మంత్ర బీజాక్షరాలలో ప్రధమాక్షర బీజం ‘ఓం’కారమే సదాశివుడు.

ఏటా అయిదు రకాలైన శివరాత్రులొస్తాయి. 1. నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధాన చేస్తారు. 2. పక్ష శివరాత్రి: ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3. మాస శివరాత్రి: ప్రతినెలా బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి: మాఘ బహుళ చతుర్దశినాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి. 5. యోగశివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం!

మహాశివరాత్రి వ్రత కథ


ఒకనాడు కైలాసపర్వత శిఖరముపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోను ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమనుదాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘబహుళచతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసికాని, తెలియకగాని ఒక్కమారు చేసినను యముని నుండి తప్పుంచుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ క్రింది కథను వినిపించెను.

ఒకప్పుడు ఒక పర్వతప్రాంతమున హింసావృత్తిగల వ్యాధుడొకడు వుండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచు కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేవి అడవియంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటిపడుతున్నా ఉత్తచేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికొక తటాకము కనిపించెను. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను, కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి “శివ శివ” యని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచియుండెను.
మొదటిజామున ఒక పెంటిలేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడువబోగా లేడి భయపడక “వ్యాధుడా! నన్ను చంపకుము” అని మనుష్యవాక్కులతో ప్రార్ధించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి మనుష్యులవలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక “నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను. హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి కామాతురయైన నీవు, నీ ప్రియుడును జింకలుగా పన్నెండేళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాపవిముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదలుము. మరొక పెంటిజింక ఇచటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువుల కప్పగించి తిరిగివస్తాను” అని అతన్ని వొప్పించి వెళ్ళెను.

రెండవజాము గడిచెను. మరొక పెంటిజింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లెక్కుపెట్టి బాణము విడువబోగా అదిచూచిన జింక భయపడి మానవవాక్కులతో “ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేదోమాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక యొకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగివత్తును” అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను.

మూడవజాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడువబోగా ఆ మృగము వ్యాధుని చూచి మొదటి రెండు పెంటి జింకలు తన ప్రియురాలుల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు పెంటిజింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞచేసి వెళ్ళినవి, నిన్ను నాకు ఆహరముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని “నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చెదను నా భార్య ఋతుమతి. ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞపొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను.

ఇట్లు నాలుగు జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను. కొంతసేపటికి ఆ నాలుగు జింకలును వచ్చి నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పలేదు. తన హింసావృత్తిపై జుగుప్స కలిగెను.

“ఓ మృగములారా ! మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనా పాపము చేయను. ధర్మములకు దయ మూలము. దమయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మము నాశ్రయించి అస్త్రములను వదలిపెట్టుదును.” అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ మాచరించి నమస్కరించెను.

అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను. పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి యిట్లనిరి : ఓ మహానుభావా. శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము, జాగరమును జరిపితివి, తెలియకయే యామ, యామమునను పూజించితివి, నీవెక్కినది బిల్వవృక్షము. దానిక్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి యున్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా! నీవు సకుటుంబముగా నక్షత్రపదము పొందుము.”

ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో నిట్లనెను: దేవీ! ఆ మృగకుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. మూడు నక్షత్రములలో ముందున్న రెండూ జింకపిల్లలు, వెనుకనున్న మూడవది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష మందురు. వాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్జ్వలమైనది లుబ్ధక నక్షత్రము .

ఏకాదశరుద్రులు


సకల శుభస్వరూపుడైన పరమశివుడు అవసరమైనప్పుడు సాకార రూపంలో
ప్రత్యక్షమై కరుణిస్తూంటాడు. నిరాకారుడైన ఆ మహాదేవుడు పదకొండు రుద్రస్వరూపులుగా భాసిస్తుంటాడని వేదాలుబోధిస్తున్నాయి.”శివ, శంభు, పినాకి, స్థాణు, భర్గ, గిరీశ సదాశివ, హర, శర్వ,కపాలి, భవ” ఇవి ఏకాదశరుద్రుల నామాలు.

శివ : సృష్టి ఆదిలో ఓంకార నాదంతో, తెజోమూర్తిగా, దిగంబరంగా భాసించే వాడే “శివుడు”. దిక్కులే అంబరములు [వస్త్రములు]గాగలవాడు కనుక ఆయన దిగంబరుడు.

శంభు : రుద్రమాయకులోనైన బ్రహ్మ, విష్ణువులు తమ జన్మకు కారణంతెలుసుకునే ప్రయత్నం చేయగా వారిముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై, సృష్టి క్రమాన్ని వివరించినవాడే “శంభుడు”.

పినాకి : చతుర్వేదాలయందు శబ్దబ్రహ్మలా తేజరిల్లేవాడే”పినాకి”.

స్థాణు : పరిపూర్ణ నిష్కామునిగా, సమాధిస్థితిలో నిమగ్నమై జగత్కల్యాణ కాంక్షతో తపస్సు చేసేవాడే “స్థాణుడు”.

భర్గ : క్షీరసాగరమధనవేళ జనించిన హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి గరళకంఠుగా ప్రఖ్యాతి నొందినవాడే “భర్గుడు”.

గిరీశ : కైలాసగిరిపై పార్వతీదేవితో కొలువై భక్తుల కోర్కెలుతీర్చేవాడే “గిరీశుడు”.

సదాశివ : నిరాకార పరబ్రహ్మగా, సర్వరూపాత్మకంగాక్ శుభస్వరూపంగా సకల లోకాలను పాలించేవాడే “సదాశివుడు”.

హర : సర్పాలంకార భూషితుడై, ధనుస్సును ధరించి పాపాలను హరించేవాడే “హరుడు”.

శర్వ : ఇంద్రచాపాన్ని ధరించి, పృధ్వీరధికుడై, త్రిపురాసురసంహారం చేసినవాడే “శర్వుడు”.

కపాలి : దాక్షాయణీ వియోగంతో క్రోధతామ్రాక్షుడై దక్షయజ్ఞ ధ్వంసం చేసియన్ శూలపాణే, “కపాలి”.

భవ : రురు, దధీచి, అగస్త్య, ఉపమన్యుడు మొదలైన భక్తులకు యోగశాస్త్రాన్ని బోధించిన ఆదిగురువే “భవుడు”.

ఇలా ఏకాదశరుద్రులుగా లోకహితం కోరే పరమేశ్వరుడు అష్టమూర్తిగా విశ్వసంరక్షణ చేస్తూంటాడని శివపురాణం చెబుతుంది.”శర్వుడు”గా జీవుల మనుగడకోసం భూమిని అధిష్టించి -“భవుడు”గా జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి -“రుద్రుడు”గా దుఃఖనివారకుడైన అగ్నిని అధిష్టించి -“ఉగ్రుడు’గా జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి-“భీముడు”గా గ్రహనక్షత్ర మండలాలకు ఆధారం కలిగించడానికి ఆకాశాన్ని ఆశ్రయించి -“పశుపతి”గా జీవులను కర్మపాశ విముక్తులను గావించడానికి జీవాత్మను అధిష్టించి -“ఈశానుడు”గా ఈ చరాచర జీవులకు ప్రాణశక్తిగా, సూర్యుని అధిష్టించి -“మహాదేవుడు”గా తన శీతల కిరణాలలో ఓషధీరూపంతో జీవులను పాలించే చంద్రుని అధిష్టించి -లోకపాలన చేసే పరమేశ్వరుని అనంత కళ్యాణ గుణగణాలను వర్ణించి, విశ్లేషించి, వివరించడానకి వేదాలకే సాధ్యంకాదు. ఇక మనమెంత.ఇంతటి మహోన్నత చరిత్రుడు కనుకనే జగజ్జనని అయిన పార్వతి, పరమేశ్వరుని వలచింది. ఆయనను భర్తగా పొందాలని తహతహలాడింది.”అపర్ణ”యై పంచాగ్నిమధ్యంలో తపస్సు చేసింది. తత్ ఫలితంగా ఆ జగత్పితను వరించింది. శివనామ భాగయై వినుతికెక్కింది

శివ-మహాపురాణము