స్త్రీ ధర్మము (పార్వతీ పరమశివుడు )


పరమశివుడు ” పార్వతీ !  స్త్రీధర్మము గురించి నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పవా ” అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి ” అయ్యో ! నేను మీకు చెప్పగలదాననా ! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు. కాని నన్ను కోరారు కనుక నేను చెప్పకుండా ఉండడం భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కాని నేను ముందు నన్ను ఎన్నడూ విడువకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను ” అని చెప్పి గంగా, యమునా, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తమస మొదలైన నదులను మనసులో తలచుకుంది. వారు స్త్రీ స్వరూపములతో పార్వతి ముందు నిలిచారు. వారికి పరమేశ్వరుడు తనను స్త్రీ ధర్మము గురించి అడిగాడని తనకు ఎలా చెప్పాలో తెలియక మిమ్ము పిలిచానని తెలిపింది. వారు ” పార్వతీ ! నీ కంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు. నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు అమృతధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము ” అన్నారు. అప్పుడు ” పార్వతీదేవి ” మహేశ్వరుడి మీద చూపు నిలిపి ” ఓ దేవా ! నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరకీ స్త్రీ ధర్మము గురించి చెబుతున్నాను. స్త్రీ వివాహత్పూర్వము కన్య అని పిలువబడుతుంది. తల్లి తండ్రులు కాని, పినతండ్రి కాని, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. స్త్రీ వివాహానంతరం భర్తకు ఆమె మీద సర్వహక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి. ఇటువంటి పతివ్రత ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా సుఖములు అనుభవిస్తుంది.

8

బ్రాహ్మణుడి భార్యలు

పార్వతీదేవి స్త్రీ ధర్మములగురించి ఇంకా చెప్తూ ” ఈ సందర్భంలో ఒకకథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పక పోయినా దేవతాపూజలు, పితృతర్పణలు, అతిధిపూజలు, చేస్తూ ఉండేది. రెండవభార్య భర్తను అనుసరిస్తూ ప్రతిపనీ ఆయన అనుమతితో చేస్తుడేది. ఆ భర్త, ఇద్దరు భార్యలు ఒకేసారి మరణించారు. భర్త రెండవభార్య భర్తను అనుసరిస్తూ స్వర్గానికి పోయారు. భర్త అనుమతి తీసుకోకుండా దేవతాకార్యములు చేసిన రెండవభార్యను యముడు స్వర్గలోకముకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో ” నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందు వలన నీకు స్వర్గలోకార్హత లేదు. కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను ” అని శాసించాడు. ఆమె విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆమె మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు ” ఓ వనితా ! భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయడం తగదు. మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి ” అన్నాడు. పార్వతీదేవి ఇంకా స్త్రీధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది. భర్తకు ఇష్టం అయిన వంట వండిపెట్టాలి. ఆయన కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్తమాటకు ఎదురు చెప్పకూడదు. అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చెయ్యవలసిన కార్యములను మరచిపోతే ఆయనకు గుర్తు చెయ్యాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి. భర్త తన వద్ద ఏదైనావస్తువు దాచిన దానిని భద్రంగాదాచి అతడు అడిగినప్పుడు అందచెయ్యాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడినా, అందగాడైనా, కురూపి అయినా, తెలివి కలవాడైనా, ఆరోగ్యవంతుడైనా, అనారోగ్యంతో బాధపడుతున్నా, భర్తను భార్య గౌరవించాలి. ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కుర్చోకూడదు. పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టడం, యాచకులకు అన్నదానం చెయ్యడం, దేవతలకు పితృదేవతలకు పూజచెయ్యడం. ఆ పనులన్నీ భర్త క్షేమంకోరి భార్య చెయ్యడం భార్య కర్తవ్యం. పరమేశ్వరా ! స్త్రీలందరూ ధర్మపరులు కారుకదా ! అధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పరపుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసురవంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడ ఉండదు. ఎప్పుడూ సుఖవాంఛల మీద కోరిక కలిగి ఉంటారు. క్రూరమైన పనులు చెయ్యడంలో ఆసక్తి కలిగి ఉంటాడు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఆమెకు కోపము ఎక్కువ. భర్తయందు, పిల్లల అందు ప్రేమ ఉండదు. ఇంటి పనులు చెయ్యదు. నిర్లక్ష్యము ఎక్కువ. ఎప్పుడూ అబద్ధాలు చాడీలు చెప్తుంటుంది. ఎప్పుడూ నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరివలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమతప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా, భర్తచనిపోయిన తరువాత ఆయనతో సహగమనము చేసిన భార్య, భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. ఇందులో ఒక ధర్మసూక్ష్మము ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చెయ్యకూడదు. అది అధర్మము ” అని పార్వతీదేవి పరమేశ్వరుడికి స్త్రీల ధర్మము గురించి వివరించింది ” అని నారదుడు శ్రీకృష్ణుడికి వివరించాడు.

అనుశాసనిక పర్వము పంచమాశ్వాసము నుండి

Advertisements

శ్రీకృష్ణుడు,భీష్ముడు చెప్పిన బ్రాహ్మణ మహిమ


భీష్ముడు ఉపదేశించిన విష్ణుసహస్రనామ మహిమ విన్న తరువాత ధర్మరాజు మహదానందం పొందాడు. అయినా ధర్మరాజుకు సందేహాలు ఇంకా మిగిలి ఉన్నాయి. అందుకే ధర్మరాజు భీష్ముడితో ” పితామహా  ! పూజించడానికి, నమస్కరించడానికి అర్హులు ఎవరు. ఎవరికి ఆనందం కలిగిస్తే మానవులకు శుభములు కలుగుతాయి. ఎవరికి హాని కలిగిస్తే మానవులకు హాని, అశుభములు కలుగుతాయి ” అని అడిగాడు. భీష్ముడు ” ధర్మనందనా ! ఈ లోకములో పూజించడానికి అర్హులు బ్రాహ్మణులే. బ్రాహ్మణులకు హాని కలిగించినట్లయితే సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా తిప్పలు తప్పవు. బ్రాహ్మణులు సంతోషించిన సకల శుభములు కలుగుట తధ్యము. బ్రాహ్మణులు ఈ లోకముకు ఆధారము. బ్రాహ్మణులు ధర్మముకు వారధిలాంటి వారు. సకలశాస్త్రములు వేదవేదాంగములు ప్రవచించడానికి అర్హులు బ్రాహ్మణులు మాత్రమే. విప్రులకు తపస్సు, సత్యవాక్కు ధనముతో సమానము. బ్రాహ్మణులకు ఒక్క పూట భోజనము పెట్టిన వాడి పాపములు పటాపంచలు ఔతాయి. దేవతలకు కూడా దేవతలు బ్రాహ్మణులు బ్రాహ్మణులే. బ్రాహ్మణుడు బాలుడైనా పూజనీయుడే. ఇక వృద్ధ బ్రాహ్మణుని విషయము చెప్పనలవి కాదు ” అని భీష్ముడు చెప్పాడు.

ధర్మరాజు ” పితామహా ! బ్రాహ్మణులను గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా ! బ్రాహ్మణులను పూజించిన వారికి కలుగు శుభములు ఎవి ? వారిని ఇంతగా పూ జించడానికి బ్రాహ్మణులలో ఉన్న విశిష్ట గుణములు ఏవి ? ” అని అడిగాడు. ” ధర్మనందనా ! నీ సందేహానికి సమాధానంగా పవనార్జున సంవాదం వినిపిస్తాను. కార్తవీర్యార్జునుడు వేయచేతులు కలిగిన మహావీరుడు. అతడు తనకు కలిగిన బలగర్వము వలన ” ఈ ముల్లోకములలో నాకు సాటి బలవంతుడు లేడు ” అని బిగ్గరగా పలికాడు. అది విన్న ఒక భూతము బదులుగా ” ఓరాజా ! నీ విలా పలుకతగదు. లోకములకన్నా భూసురులైన బ్రాహ్మణులు అధికులని నీకు తెలియదా ! ” అని పలికింది. అందుకు కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణులు రాజులను ఆశ్రయించుకుని జీవిస్తారు కదా ! అలాంటి బ్రాహ్మణులు రాజులకంటే అధికులు ఎలా ఔతారు ? నాకు అనుగ్రహం వస్తే బ్రాహ్మణులను ఆదరిస్తాను. కోపము వస్తే అందరినీ దండిస్తాను ” అని చెప్పాడు. ఈ మాటలకు ఆ భూతము మారుపలుకక వెళ్ళి పోయింది. ఆ సమయంలో వాయుదేవుడు తనను తాను ఎరిగించుకుని ” ఓ రాజా ! నీవు బ్రాహ్మణులను రక్షిస్తున్నానని అనుకుంటున్నావు. కాని ఆ బ్రాహ్మణుల రక్షణలోనే నీవు ప్రజలను రక్షిస్తున్నావని తెలుసుకో. ముల్లోకాలలో పూజనీయులు బ్రాహ్మణులే. అహల్యను కోరిన ఇంద్రుడు గౌతమ ముని శాపం పొంద లేదా! అగస్త్యుడు సముద్రమును ఔపోసన పట్ట లేదా! భృమహర్హి అగ్ని దేవుడిని శపించ లేదా!” అన్నాడు. ఆ మాటలకు కార్తవీర్యార్జునుడు బదులు పలుక లేదు.

ఉచధ్యుని వృత్తాంతం

వాయుదేవుడు తిరిగి కార్తవీర్యార్జునితో ” ఒ మహారాజా ! నీకు ఒక కథచెప్తాను విను. పూర్వము అంగీరస వంశంలో జన్మించిన ఉచధ్యుడు చంద్రుడి కుమార్తెను కోరగా చంద్రుడు తన కుమార్తెను ఉచధ్యుడికి ఇచ్చి వివాహము చేసాడు. వారిరువురు ఆనందంగా జీవిస్తున్న తరుణంలో వరుణుడు చంద్రుని కుమార్తె మీద కోరిక పెంచుకుని ఉచధ్యుడు స్నానికై నదీతీరానికి వెళ్ళిన తరుణంలో ఉచధ్యుడి భార్యను అపహరించి తీసుకుని వెళ్ళి తన అంతఃపురంలో ఉంచాడు. ఈ విషయం నారదుడికి తెలిసి ఉచధ్యుడికి విషయం తెలిపాడు. ఊచధ్యుడు ” దిక్కులకు అధిపతి అయిన వరుణుడికి పరుల భార్యల మీద మక్కువ పెంచుకొనుట తగదు. నీవు ఉచధ్యుడి వద్దకు వెళ్ళి నేను ఇలా చెప్పానని చెప్పు ” అని చెప్పాడు. నారదుడు ఈ విషయం వరుణుడికి చెప్పాడు. కాని కామంతో కళ్ళు మూసుకు పోయిన వరుణుడు ” నారదా ! నీవు చెప్పినా సరే నేను ఉచధ్యుని భార్యను విడువను ” అని చెప్పాడు. నారదుడు ఉచధ్యుని వద్దకు వెళ్ళి ” ఉచధ్యా ! వరుణుడు నా మాటను కూడా గౌరవించక నీ భార్యను వదలడానికి నిరాకరించడమే కాక నన్ను తన వారితో బయటకు గెంటించాడు ” ఆ మాటలు విన్న ఉచధ్యుడు ఆగ్రహించి సముద్రజలాలను ఒక్క గుక్కలో పీల్చి వేసి లోకాలను గడగడలాడించాడు. వరుణుడు కూడా గడగడ లాడుతూ ఉచధ్యుని భార్యను తీసుకు వచ్చి అతడికి సమర్పించి తనను మన్నించమని వేడుకున్నాడు. కనుక రాజులకంటే బ్రాహ్మణులు గొప్పవారు ” అని వాయుదేవుడు కార్తవవీర్యార్జునుడికి చెప్పాడు.

దేవతలను రక్షించిన బ్రాహ్మణులు

వాయుదేవుడు తిరిగి ” పూర్వము దేవతలు రాక్షసుల చేతిలో ఓడి పోయి ఇక్కట్ల పాలైన తరుణంలో అగస్త్యుడు రాక్షసులను జయించి దేవతలను రక్షించాడు. మరొకసారి రాక్షసులు దేవతలను ఓడించి వారిని హింసల పాలు చేసిన తరుణంలో దేవతలు వశిష్టుడికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. వశిష్ఠుడు ఆగ్రహించి ఒక్క హూంకారం చేసి రాక్షసులను భస్మము చేసాడు. కనుక దేవతల కంటే కూడా బ్రాహ్మణులు గొప్పవారు ” అని వాయుదేవుడు చెప్పాడు. కార్తవీర్యార్జునుడు బదులు పలుక లేదు. వాయుదేవుడు తిరిగి ” ఒకసారి రాక్షసులకు దేవతలకు జరిగిన యుద్ధంలో రాహువు సూర్య చంద్రులను తన అస్త్ర ప్రయోగంతో మూర్చిల్ల జేసాడు. లోకాలన్ని చీకట్లలో మునిగి పోయాయి. రాక్షసులు దేవతలను తరిమికొట్టారు. వారు అత్రిమహామునికి మొరపెట్టుకొనగా అత్రి మహాముని తన తపోమహిమతో సూర్య, చంద్రుల మూర్చను పోగొట్టి లోకాలను కాంతివంతం చేసి రాక్షసులను నాశనం చేసి దేవతలను రక్షించాడు. కనుక బ్రాహ్మణులు ముల్లోకాలకు గొప్పవారు ” అని చెప్పాడు. వాయుదేవుడు ఇంకా ఇలా చెప్పాడు ” కార్తవీర్యార్జునా ! ఒకసారి ఇంద్రుడు అశ్వినీ దేవతలకు సోమపానముకు అర్హత లేదని శాసించంచాడు. అప్పుడు అశ్వినీ దేవతలు చ్యవనుడిని ఆశ్రయించారు. చ్యవనుడు అశ్వినీదేవతలకు మేలు చేయడము కొరకు ఇంద్రుడితో పగ తెచ్చుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడిని చంపాలనినుకున్నాడు. ఇంద్రుడు చ్యవనుడి మీదకు ఒక కొండను, వజ్రాయుధాన్ని విసిరాడు. చ్యవనుడు వాటిని తిప్పి కొట్టి చేసి మదుడు అను రాక్షసుడిని సృష్టించి వారి మీదకు పంపాడు. మదుడు దేవతలను దేవేంద్రుడితో సహామింగి వేసాడు. అప్పుడు వారంతా చ్యవనుడిని ప్రార్ధించి తమ స్వస్వరూపాలను తిరిగి పొందారు. ఇంద్రుడు దేవతలతో సహా చ్యవనుడికి ప్రణామం చేసి తమను మన్నించమని కోరాడు. చ్యవనుడు ఇంద్రుడిని అశ్వినీదేవతలకు సోమపానార్హత కలిగించమని కోరాడు. ఇంద్రుడు దేవతలకు సోమపానార్హత కలిగించాడు. చ్యవనుడు బ్రాహ్మణుడైనా దేవేంద్రుడికంటే గొప్పవాడని అనిపించుకున్నాడు కదా ! ” అన్నాడు. ఇంతచెప్పినా కార్తవవీర్యార్జునుడు అంగీకరించక మౌనం వహించాడు. అప్పుడు వాయు దేవుడు తిరిగి ” మహారాజా ! అంతెందుకు నీ గురువు బ్రాహ్మణుడు అయిన దత్తాత్రేయుడి మహిమవలెనే కదా నీవింత గొప్పవాడివి అయి ఇంతటి మహా బలపరాక్రమాలు సంపాదించి రాజులలో మాణిక్యములా వెలుగుతున్నావు. నీవే కాదు మానవులు, దేవతలు కూడా బ్రాహ్మణుల మహిమవలెనే మనుగడ సాగిస్తున్నారు. కనుక నీవు కూడా బ్రాహ్మణుల మహిమను గుర్తించి వారిని పూజించి సౌఖ్యములను పొందు ” అన్నాడు. కార్తవవీర్యార్జునుడి గర్వము అంతటితో అణిగి పోయి బ్రాహ్మణుల గొప్పతనము అంగీకరించి బ్రాహ్మణులను పూజించి సుఖములను పొందాడు. కనుక ధర్మరాజా ! నీవు కూడా బ్రాహ్మణులను పూజించి సౌఖ్యములను పొందు ” అన్నాడు భీష్ముడు.

బ్రాహ్మణ పూజ

ధర్మరాజు ” పితామహా ! ఎంత విన్ననూ నాకు శ్రీకృష్ణతత్వము వినవలెనని కోరికగా ఉన్నది. నాకు ఇంకా బ్రాహ్మణమహిమలు వివరించండి ” అని అడిగాడు. భీష్ముడు ” ధర్మనందనా ! నాకు ఇంద్రియములు, వాక్కు, మనస్సు దుర్బలము అయ్యాయి. నేనిక అలసి పోయాను. దక్షిణాయనము అయిపోవస్తుంది. ఉత్తరాణము సమీపిస్తుంది. నేను ఇక నిష్క్రమించ వలసిన కాలము సమీపిస్తుంది. శ్రీకృష్ణుడికి బ్రాహ్మణతత్వము బాగా తెలుసు. అతడు సర్వజ్ఞుడు. అతడు నీకు బ్రాహ్మణమహిమలు వివరిస్తాడు. నాకు కృష్ణతత్వము బాగా తెలుసు. అతడు వరాహరూపము ఎత్తి భూమిని అవలీలగా తన కోరల మీద ఎత్తాడు. ఈ భూమి మీద జీవజాలము ఆవిర్భావము శ్రీకృష్ణలీల కాక మరేమి ? అతడు తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించి ఈ సృష్టికార్యము జరిపంచాడు. బ్రహ్మ కారకుడే కాని మూలము శ్రీకృశష్ణుడే. ఎప్పుడైతే దనుజులు ధర్మమును నశింపచేస్తారో అప్పుడు శ్రీకృష్ణుడు అవతరించి ధర్మమును కాపాడి ధర్మాత్ములను రక్షిస్తాడు. దేవతలు, విశ్వపతి, దిక్పాలకులు, పరమేశ్వరుడు అన్నీ శ్రీకృష్ణుడే. కాలము, జగత్తు, దిక్కులూ అన్నీ తానే అయి ఉన్నాడు. యజ్ఞ స్వరూపుడైన శ్రీకృష్ణుడిని ఋత్విక్కులు వేద మంత్రములతో స్తుతిస్తారు. ఋగ్వేదములో శ్రీకృష్ణస్తుతి వింతకాదు. యజ్ఞము, ఋత్విక్కులు, యజ్ఞ సామాగ్రి, మంత్రములు, యజమాని అన్నీ ఆయనస్వరూపమే. సూర్యచంద్రులకు వెలుగును ఇచ్చే పరంజ్యోతి స్వరూపుడు అతడే. అతడే సత్యము, నిత్యము, అజరామరమైన పరమపదము ” అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన బ్రాహ్మణ మహిమ

ధర్మరాజు ” శ్రీకృష్ణుడి ముందు ప్రణమిల్లి ” దేవదేవా ! శ్రీకృష్ణా ! నాకు బ్రాహ్మణతత్వము వినవలెనన్న కోరిక తీరలేదు కనుక నన్ను కరుణించి వివరించవా ! ” అని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ” ధర్మనందనా ! నేను ప్రద్యుమ్నుడికి చెప్పిన విషయాలు నీకు వివరిస్తాను. మానవులకు ధర్మార్ధకామమోక్ష సాధనకు, దేవతార్ఛనకు, పితృదేవతార్చనకు, ఇహలోకసౌఖ్యములు పొందుటకు కారణం అందుకు సహకరించే బ్రాహ్మణులే. దేవతలకు కూడా ఆయుస్షు, సంపద, కీర్తి కలగడానికి కారణం బ్రాహ్మణులే. బ్రాహ్మణులు అనుగ్రహిస్తే సంపదలు పొందగలరు. బ్రాహ్మణులు ఆగ్రహించిన ఎంతటి వారైనా భస్మము కాగలరు. ఇహలోక సుఖములకే కాక పరలోక సుఖములు పొందుటకు కూడా కారణం బ్రాహ్మణులే. ఇది తెలపడానికి నీకు ఒక వృత్తాంతం చెప్తాను విను. దుర్వాసుడనే మహాముని ఉండే వాడు. అతడు వింతమనస్కుడు. అతడి చేష్టలు ఎవరికి అర్ధము కావు. ఒకసారి మంచముమీద నిద్రిస్తాడు. ఒకసారి నేలమీద నిద్రిస్తాడు. మన మిచ్చినప్పుడు ఆహారము తినడు. తను అనుకున్న వెంటనే ఆహారము అందివ్వవలసినదే. ఒక్కోసారి ఏమీతినడూ. ఒక్కోసారి వందమంది భోజనము ఒక్కడే తింటాడు. ఒక నాడు దుర్వాసుడు మా ఇంట పాయసం కావాలని అడిగాడు. మేము అతడికి పాయసం ఇచ్చిన వెంటనే దానిని కొంచం తిని తరువాత తన ఒంటికి పూయమని కోరాడు. నేను అలాగే చేసాను.

పుణ్య నదులు…


గంగ : మంగళ తరంగ – ఇందులో స్నానం చేసివారు సురలోక వాసులౌతారు.

గోదావరి : గోదావరి దివ్యనది. గోహత్య, బ్రహ్మహత్యాది పాపాలను తొలగిస్తుంది. ఈ నదికి దక్షిణ తీరాన గౌతమ మహర్షిచే ప్రతిష్ఠింపబడిన గౌతమేశ్వరాలయం ఉన్నది. (మంథని) మాఘమాసంలో నియమానుసారం స్నానాదానాదులు చేస్తే ఏడుజన్మల పాపాలు పోతాయి. కొన్ని ప్రాంతాల్లో గోదావరిని గంగ అని పిలుస్తారు.

ప్రయాగ : ఈ నది(వూతివేణి సంగమం)లో చేసేవారు సర్వపాప విముక్తులై సురలోక సౌఖ్యం అనుభవిస్తారు.

నైమిశారణ్యం : శౌనకాది మహామునులు, యజ్ఞాలు చేసిన పుణ్యభూమి.

శమంత పంచకం : ఇహపర సుఖాలిచ్చే దివ్యతీర్థం.

కురుక్షేత్రం : శ్రీ కృష్ణుడు, అర్జునునికి గీతోపదేశం చేసి, విశ్వరూప దర్శనమిచ్చాడు. భీష్ముడు తనువు చాలించి, ముక్తి పొందాడు. ఇక్కడ సార్వవూతికోటి తీర్థాలున్నాయని వాయుదేవుడు చెప్పాడు.

అవంతీ : ఈ నగరలో మాఘస్నానం చేసినవారికి శివలోక ప్రాప్తి సిద్ధిస్తుంది.

అయోధ్య : మాంధాత, హరిశ్చంవూదుడు, శ్రీరాముడు మున్నగు సూర్యవంశ రాజులు దయించిన మహానగరం. ఈ పట్టణానికి పక్కనే సరయూనది ప్రవహిస్తుంది. మాఘమాసంలో అయోధ్యలో స్నానం చేస్తూ దేవతలకూ, పితృదేవతలకూ తర్పణాలిస్తే అటూ, ఇటూ 20తరాల వారు తరిస్తారు.

మధువనం : మాఘమాసంలో ఇక్కడ స్నానం చేసినవారు విష్ణు సాయుజ్యం పొందుతారు.

యమున : నీల తరంగమూర్తియైన యమున కృష్ణునికెంతో ఇష్టమైంది. దీనిలో స్నానం చేసినవారు వైకుం

ద్వారక : విశ్వకర్మ నిర్మించిన ఈ పట్టణంలో ధర్మ సంస్థాపనకై అవతరించిన విష్ణువు శ్రీ కృష్ణునిగా నివసించాడు. సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘస్నానం చేస్తే సురలోక వాసులౌతారు.

మాయావతి : ఇక్కడ ‘మల ప్రహారిణి’అనే నది ప్రవహిస్తూంది. ఈ నదిలో స్నానం చేసేవారి కల్మషాలను హరిస్తుంది. కనుక దీనికి ‘మల ప్రహారిణి’అనే పేరు సార్థకమైంది. ఇక్కడ మాఘమాస వ్రతం చేసినవారు ఉభయలోక సౌఖ్యాలు పొందుతారు.

సరస్వతి : ఈ నదిలో స్నానం చేస్తే సరస్వతి అనుక్షిగహం కలిగి చివర బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణాలు విడిచి, బ్రహ్మపదం పొందుతారు.

గంగా సాగర సంగమం : గంగ సమువూదంలో కలిసేచోట మాఘ స్నానం చేసి తిలలను తినిపిస్తూ, నల్లని ఆవును దక్షిణతో సహా దానమిస్తే స్వర్గస్థులౌతారు.

కాంచి : దక్షిణ భారతదేశంలో పరమపావనమైన పట్టణం కంచి. మహావిష్ణువు లక్ష్మీదేవితో అవతరించాడు. అక్కడ స్నానాదానాలు చేసిన వారి పుణ్యం కోటి రెట్లు. అందుకే పుణ్యకోటి అంటారు. ఈ పట్టణానికి దక్షిణంగా వేగవతి నది ఉన్నది. ఈ నదిలో మాఘస్నానం చేసిన సర్వపాపాలు నశించి, స్వర్గసుఖాలనుభవిస్తారు.

త్రయంబకం : త్రయంబకమనగా ముల్లోకాల్లో పేరుపొందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో మాఘస్నానం చేస్తే తప్పక ముక్తి లభిస్తుంది.

కావేరి తుంగ భద్రాచ కృష్ణవేణీచ గౌతమీ
భాగీరథీ విఖ్యాతః పంచగంగా పరికీర్తితాః!!
ఈ ఐదు జీవనదులను పంచగంగలంటారు.

పంప : కాలాత్మక పట్టణానికి ఉత్తరం వైపు పంపానది ఉంది. దక్షిణం వైపు అదే పేరుతో పట్టణం ఉంది. మాఘమాసంలో ఉదయకాలంలో స్నానం చేసినవారు కైలాసవాసులౌతారు.

ప్రభాస తీర్థం : పంపానదికి అల్లంత దూరంలో లోక సంరక్షణకై శివుడు లింగరూపంతో అవతరించాడు. ఈ తీర్థానికి ప్రభాసం అని పేరు.
దిలీపరాజా! మాసాలన్నిటిలో మాఘమాసం ఉత్తమోత్తమం. ’మాఘే నిమగ్నాస్సలిలే సుశీతే విధూత పాపా స్త్రి దివం ప్రయాంతి’మాఘమాసంలో చన్నీటి స్నానం చేసినవారు పాప విముక్తలౌతారు.

దిలీపుడు వశిష్ఠునికి నమస్కరించి, తన దేశంలో అనేక సత్రాలను, చెరువులను, బావులను, బాటసారులకై నెలకొల్పాడు. సద్గతిని పొందాడు. రాజులందరికీ ఆదర్శపురుషుడైనాడు.

‘త్రాహిమాం పుండరీకాక్ష! శరణ శరణాగతం
త్వమేవ సర్వభూతానాం, ఆశ్రయః పరమాగతిః’

అతిథిని ఆకలితో వెళ్లనీయకూడదా ?


అతిథి దేవోభవ అనే మాటను మనం తరచూ వింటూనే వుంటాం. అతిథిని దైవంగా భావించి సేవించాలని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో మహర్షుల నుంచి సాధారణ ప్రజల వరకూ అతిథి లేకుండా ఏ పూటకూడా భోజనం చేసేవారు కాదు. తమ ఇంటికి అతిథి రాని రోజున ఊళ్లోకి వెళ్లి ఆకలితో వున్న ఎవరినో ఒకరిని వెతికి తీసుకువచ్చి మరీ భోజనం పెట్టేవాళ్లు.

అతిథికి అర్పించకుండా భోజనం చేయకూడదనే నియమాన్ని అప్పట్లో అందరూ పాటించే వాళ్లు. భోజన సమయంలో దేవతలు తమ భక్తులను పరీక్షించడానికి అతిథుల రూపంలో వస్తుంటారనే విశ్వాసం కూడా ఇందుకు కారణమైంది. పోతన భోజనానికి కూర్చున్న సమయంలో శ్రీరామచంద్రుడు మారువేషంలో అతిథిగా వస్తాడు. అప్పుడు పోతన తాను పస్తులు వుండి ఆ భోజనాన్ని అతిథికి వడ్డిస్తాడు. ఫలితంగా ఆయన శ్రీరామచంద్రుడి అనుగ్రహాన్ని పొందడాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భోజన సమయంలో ఆకలితో వచ్చిన అతిథిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సంతృప్తికరంగా భోజనంపెట్టి పంపించాలి. అప్పుడు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఆకలితో వచ్చిన అతిథిని పట్టించుకోకుండా భోజనం చేసిన వారికి నరకలోకప్రాప్తి కలుగుతుంది. ఆకలితో తిరిగివెళ్ళే అతిథి ఆ కుటుంబీకుల పుణ్యఫలాలను తీసుకెళ్లిపోతాడని శాస్త్రం చెబుతోంది. అందువలన అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించాలి … ఆదరించాలి … రుచికరమైన వంటకాలతో సంతృప్తి పరచాలి. అప్పుడే ఆర్జించిన పుణ్యం స్థిరంగా వుంటుంది … అతిథిని సేవించిన పుణ్యం అనంతమవుతుంది.

మాఘమాసం మహిమ


చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.

మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలోఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.

తిథులు:- 
1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. 2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి 4. శుద్ధ పంచమి 5. శుద్ధ షష్టి 6. శుద్ధ సప్తమి 7. అష్టమి 8. నవమి 9. ఏకాదశి 10. ద్వాదశి 11. త్రయోదశి 12. మాఘ పూర్ణిమ 13. కృష్ణపాడ్యమి 14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి 17. కృష్ణ చతుర్దశి 18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

మాఘస్నానానికి సంబంధించిన కథ 

మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన
ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.

అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.

మాఘస్నాన పుణ్య ఫలితాలను వివిరించే కథ

పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది.

తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది.

సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం


మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.
పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు.

తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ||

DSCI1090

|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||