యమధర్మరాజుకృత శివకేశవ స్తుతి


కార్తీకమాసం శివకేశవులిద్దరికి ప్రీతి. ఒకరి హృదయం మరియొకరు. ఇద్దరికీ కలిపి స్తోత్రం చేస్తే వారు చాలా ప్రీతి చెందుతారు. కాబట్టి యమధర్మరాజు వారిదూతలతో 108 కి పైగా శివకేశవనామాలను చెప్పి ఇవి చదివిన వారి దగ్గరకు వెళ్ళవద్దని హెచ్చరించారు.

ధ్యానం

మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ

స్తోత్రం:

(1) గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే
భూతేశ ఖండపరశో మృడ చండికేశ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే ఆనందకంద ధరనీధర పద్మనాభ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ చాణూరమర్దన హృషీకపతే మురారే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస కంసప్రణాశన సనాతన కేశినాశ
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(9) గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర
గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి.

(11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం సంధర్భితాం లలితరత్నకదంబకేన
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య: కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్.

అగస్త్య ఉవాచ:

యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం
ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు:

కృష్ణసంతానం


శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ తదితర అష్ఠ మహిషులు, పదహారు వేల వంద మంది భార్యలు ఉన్నారు. కృష్ణుడికి ఆ భార్యల వల్ల కలిగిన సంతానం ఎంత? భార్యలందరితోనూ ఆయనకు ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు.

రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు.

కృష్ణుడికి సత్యభామ వల్ల భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు.

జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.

నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు.

కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు.
లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.
మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టా.
కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు

శ్రీ కృష్ణ నిర్యాణం


కురుక్షేత్ర సంగ్రామం అనంతరం, ఒకనాడు కణ్వ, విశ్వామిత్ర , నారద మహర్షులు శ్రీ కృష్ణుని సందర్శనార్దం ద్వారకకు విచ్చేశారు. వీరు పురవీధుల్లో సంచరిస్తూ ఉండగా కొందరు ద్వారక యువకులకు చిలిపి ఊహ తట్టింది. ఆ యువకులు ఒకడికి స్త్రీ వేషం వేసి ఆ మునుల వద్దకు తీసుకుని పోయి ఈ చిన్నదానికి ఆడ బిడ్డ పుడతాడో , మగ బిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు అమాయకులు కాదు కదా, దివ్యదృష్టి తో మొత్తం కనుక్కుని ఆగ్రహం తో, ఆడబిడ్డా కాదు మగబిడ్డా కాదు ఒక ముసలం(రోకలి) పుడుతుంది, అది మీ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీ కృష్ణునికి తెలిసింది. విధి రాత ను ఎవరూ తప్పించలేరు, యాదవ వంశానికి కాలం చెల్లింది అనుకున్నాడు.

మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం జన్మించింది. ఆ యువకులు దానిని శ్రీ కృష్ణుని వద్దకు తీసుకుపోయారు. శ్రీ కృష్ణునికి అది యాదవ వంశాన్ని నాశనం చేసే ఆయుధం లా కనిపించింది. దానిని పిండి చేసి సముద్రం లో కలపమని ఆ యువకులకు చెప్పాడు. వారు దానిని పిండి చేసి సముద్రం లో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రం లోనికి విసిరివేశారు. పిండి చేసిన ముసలం మనల్ని ఎలా నాశనం చేస్తుంది లెమ్మని సంతోషం గా ఇళ్ళకు పోయారు. కానీ మునుల వాక్కు వృధా పోదు కదా. మిగిలిన ఆ రోకలి ముక్క తీరానికి కొట్టుకు వచ్చి ఒకానొక చోట ఇసుకలో దిగబడింది. సముద్రంలో కలిసిన రోకలి పిండి బడబాగ్ని వలె కాచుకుని ఉంది. శ్రీ కృష్ణునికి ఇవన్నీ తెలిసినా విధి రాతను తప్పించే శక్తి లేక మిన్నకుండి పోయాడు.

అది మొదలు ద్వారక నగరం లో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎపుడూ లేని విధంగా యాదవులు సజ్జనలును బాధించడం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. యాదవవంశ నాశనం దగ్గరలోనే ఉందని కృష్ణునికి అర్ధం అయ్యింది. తను ఎంతో ప్రేమించే ద్వారకలో యాదవులు నాశనం అవ్వడం ఇష్టం లేని కృష్ణుడు యాదవులు అందరినీ కొలువుపర్చాడు. సముద్రానికి జాతర చెయ్యాలని అందరినీ బయలుదేరమని చెప్పాడు. అందరూ కావలసిన సరంజామా అంతా తీసుకుని బయలుదేరారు. బలరాముడు అరణ్యమునకు బయలుదేరాడు. శ్రీ కృష్ణుడు ఒక్కడే యాదవుల తో పాటు వెళ్ళాడు. వెళ్ళే ముందు తండ్రియైన వసుదేవునితో ఇలా అన్నాడు. “తండ్రీ! కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తనున్నది. అర్జునుడు వస్తాడు మిమ్ములను అందరినీ ఉద్ధరిస్తాడు. అతను వేరు నేను వేరు కాదు. అందరూ అతని ఆజ్ఞను పాటించండి.”

సముద్ర తీరానికి వెళ్ళిన యాదవులు సుష్ఠుగా భోజనం చేసి, కృష్ణుని ఎదుటే మద్యం తాగి ఒకరిలో ఒకరు కలహించుకోసాగారు. అన్నీ తెలిసినా కృష్ణుడు ఏమీ చెయ్యలేని వాడయ్యాడు. అంతలో ఒకడు ఆనాడు సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకడిని మోది చంపేశాడు. అది మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు.

మిగిలిన దారుకుడిని, భబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీ కృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యం లో ధ్యానం లో ఉన్నాడు. అపుడు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని ద్వారకకు తీసుకురమ్మని దారుకుడిని పంపాడు. భబ్రుడి ని ద్వారకలోని స్త్రీలను, మిగిలిన వాళ్ళని ప్రయాణమునకు సిద్దం చెయ్యమని పంపాడు. కానీ మార్గమధ్యం లో ఒక ఆటవికుడు అతనిని అదే రోకలి తుంగ తో సంహరించాడు.

దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అతనిని ఆ పరిస్థితి లో చూసి పాండవులు చలించిపోయారు. అపుడు దారుకుడు జరిగిన విషయం చెప్పి బలరామకృష్ణులు అరణ్యం లో ఉన్నారని, అర్జునుడుని ద్వారకకు తీసుకువెల్లమన్నారని చెప్పాడు. అది విని పాండవులు ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణ భగవానుడు అచట ఉండగా ఇలా ఎందుకు జరిగిందా అని చాలా భాధపడ్డారు. అర్జునుడు వెంటనే ద్వారకకు పయనమయ్యాడు.

అచట అరణ్యంలో బలరాముడు తన దేహమును విడిచి తన అంశ అయిన మహా సర్ప రూపం ధరించి సముద్రం లో కలిసిపోయాడు. తన అన్న లేని లోకంలో ఉండటం వృధా అని తలచి, తను చెయ్యవలసిన పనులు కూడా ఏమీ లేవని గ్రహించి తన శరీరం వదలడానికి ఏమి కారణం దొరుకుతుందా అని వేచి చూడసాగాడు. ఒకనాడు తనకు అరికాలితో మరణం సంభవిస్తుందని దుర్వాస మహాముని శాపం ఇవ్వడం గుర్తుకువచ్చింది. అపుడు శ్రీ కృష్ణుడు ఒక మహా వృక్షం నీడన మేను వాల్చి, అక్కడకు వస్తున్న ఒక బోయవానికి, తన పాదం లేడి పిల్ల లాగా భ్రమింపచేశాడు. అది తెలియని బోయవాడు గురి చూసి కృష్ణుని పాదానికి బాణం వదిలాడు. తర్వాత వచ్చి చూసి దేవదేవుడైన వాసుదేవునికా నేను బాణం వేసింది అని రోదించడం మొదలు పెట్టాడు. శ్రీ కృష్ణుడు అతనిని ఓదార్చి ఇలా అన్నాడు. “త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవు.” అని శ్రీ కృష్ణుడు తన శరీరమును త్యజించాడు.

ద్వారకకు చేరుకున్న అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకను చూసి ఖిన్నుడయ్యాడు. శ్రీ కృష్ణుడి ప్రియ సఖుడైన ఆర్జునుడిని చూడగానే శ్రీ కృష్ణుని భార్యలు పలు విధాల రోదించారు. వసుదేవుడు శ్రీ కృష్ణుడు తనకు చెప్పినదంతా అర్జునుడికి చెప్పి తన యోగనిస్ఠ తో శరీరం వదిలాడు.

వసుదేవుని మరణవార్త శ్రీ కృష్ణునికి చేరవేయడానికి అర్జునుడు అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యం లో శ్రీ కృష్ణ భగవానుని మృతదేహం చూసి కన్నీళ్ళ పర్వంతం అయ్యాడు. మృతదేహానికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసి తను ద్వారకకు పయనమయ్యాడు. సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు. అర్జునుడు ద్వారక విడిచిన మరుక్షణం అప్పటివరకు కాచుకుని ఉన్న సముద్రం ద్వారకను ముంచెత్తింది.

ఇపుడు సముద్రం లో బయటపడిన ద్వారక అదేనని అధికుల విశ్వాసం.

శుభకార్యాల్లో అక్షతలు ఎందుకు వేస్తారు?


పూజాదికాల్లోను, వివాహం తదితర శుభకార్యాలు జరిగినప్పుడు పసుపు రాసిన బియ్యాన్ని అక్షతలుగా చల్లి ఆశీర్వదించడం మన సంప్రదాయం. అక్షతలు అంటే క్షతములు కానివి అని అర్థం. భగ్నము కాని బియ్యాన్ని అక్షతలు అంటారు. నిండు గింజలైన అక్షతల లాగానే మీ జీవితం కూడా భగ్నం కాకుండా ఉండాలని, నిండు నూరేళ్లూ సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తారు.

హారతి వల్ల లాభము ఏమిటి?


గృహములోను, పూజాగదిలోనే కాడు, గుడిలోనూ, శుభకార్యాలప్పుడూ….పిల్లల పుట్టిన రోజుల వేడుకలలోను, క్రొత్త పెళ్లికూతురు గృహములోకి ప్రవేశించేతప్పుడూ హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. సుభాకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకేచోట చేరుతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుడిని దర్శిస్తుంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులూ, అంటూవ్యాధులూ ప్రబల కుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిచేసిన పోతుందో, అలాగే మనం తెలిసీ సమసిపోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవటమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం.

 

 

అధిక మొహం అనర్ధాలకి మూలం….


దేనినైన అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు. అధికంగా ఇష్టపడటం, దాని గురించే పదే పదే ఆలోచించడం వల్ల ముందు వ్యామోహం పెరిగి ఆ తరువాత ప్రేమగా మరి ఆ తరువాత క్రోధంలా మారి పగని పెంచుతుంది.
ఒక అమ్మాయి/అబ్బాయి ఇద్దరిలో ఒక్కరే ఇంకొకరిని ప్రేమిస్తే ముందు అనురాగం పెరుగుతుంది. ఆతరువాత ఎదుటువారు ఒప్పుకుంటే సరే లేకపోతే కొన్నాళ్ళవరకు ప్రేమని హృదయ పంజరంలో ప్రేమని దాచి ఆతరువాత క్రమంగా గెలవలేమేమో అనే భాధ వల్ల కావచ్చు లేదా వారి వ్యక్తిత్వం వల్ల కావచ్చు ఆ ప్రేమని క్రోదంగా మర్చి పగ పెంచుకొని కొందరు వదిలేస్తారు. ఇంకొందరు దాడులకి దిగుతారు. ప్రేమ ఒక్కటే కాదు కొంతమంది కొన్ని విషయాలమీద కూడా ఇలానే ప్రవర్తిస్తారు.

ఒకడికి ఒక స్నేహితుడు ఉన్నాడనుకుందాం. వీడు వాడిమీద వాడు వీదిమీద కొన్ని అభిప్రాయాలు ఎర్పరుచుకుంటారు. వీరిలో ఎవరికో ఏదో అవసరం వచ్చింది. అది నా స్నేహితుడు వున్నాడు కదా వాడు సాయం చేస్తాడు అని వీడిలో వీడే ఆలోచించుకొని వాడి దగ్గరికి వెళ్లి సమస్యని చెప్తే అవకాశం లేక కావచ్చు, చేయలేక కావచ్చు, ఇంకా ఏ ఇతర కారణం చేత కావచ్చు చెప్పిన పని చేయలేదని వీడి ధోరణిలో వీడు అలోచించి సాయం చేయలేదు అని ఒకే ఒక్క కారణంతో ఎంతో కాలం నుండి సాగుతున్న స్నేహాన్ని క్షణకాలంలో విడగోట్టేస్తారు.

ఈ లోపం ఎక్కడ ఉంది అంటే కారణం ఆలోచించకుండా చెప్పేయొచ్చు.. కేవలం ఇంటి వాతావరణం అని. తల్లితండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం కావచ్చు, వీరికి తల్లితండ్రుల దగ్గర చనువు లేక కావచ్చు, ఎందుకంటే ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పెళ్లి కావడంతోనే విడికాపురం పెట్టేస్తున్నారు. ఏదైనా అడిగితె స్వేచ్చ అని ఒక్క కారణంతో ముగించేస్తున్నారు. ఉద్యోగాల వేటలో, వ్యాపారాలలో వేగం అనే పేరు పెట్టి ఇటు పిల్లల్ని, అటు వీరు గంగిరేద్దుల్లా చదువు వ్యాపారం ఇంకేమిలేదు. పిల్లలైతే చదవాలి, పెద్దలైతే సంపాదించాలి ఇంతకుమించి వేరే ఆలోచనలేదు. వేరే వైపుకూడా ఆలోచించడం లేదు. సంప్రదాయాలని తుంగలో తొక్కేసి, ఆధ్యాత్మికత వదిలేసి నేను నాది, కష్టం వస్తే స్నేహితులు, సాయం చేయకపోతే ఎంత స్నేహం అయినా బలాదూర్. వదిలేయడమే. ఇదేనా జీవితం అంటే! ఇలాంటి విలువలు లేని బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారు ఆలోచిస్తున్నారా?

బేలతనం, భయం, స్వార్ధం, క్రోధం ఇలా మనిషి కి ఉన్న దుర్గుణాలు పోవాలంటే ఒక్కటే మార్గం. ఆధ్యాత్మిక చింతన. శస్త్ర పటనం. కనీసం తెలుసుకోవడానికి ప్రత్నించినా కొంతలో కొంత మార్పు రావచ్చు. ప్రయత్నించండి..

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది


విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
బ్రాహ్మణ, క్షత్రీయులు “మానస్తోకే మంత్రము ” తో, వైశ్యులు ” త్ర్యయంబక ” మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.  ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని “శాంతికము ” అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని “పౌష్ఠికం” అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని “కామదం” అని అంటారు..

భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.

యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.  అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.

హర హర మహా దేవ శంభో శంకర _/\_

 

 

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?


జంబుద్వీపే భరతవర్షే భరతఖండే

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష

(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

 

శ్రీరాముని తరువాత అయోధ్యను ఎవరు పాలించారు?


ఈ ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. శ్రీ రాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశ లవులకు, తమ్ములకుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూచాము. వారంతా రాముడు జీవించియుండగానే ఆ యా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రముగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవదేహాలను త్యజించి వైకుంఠవాసులౌతారు. అయోధ్యానగర పౌరులు అనేకులు కూడా శ్రీరామునితోబాటుగా సరయూనదిలో జలప్రవేశం చేస్తారు. అయోధ్య కళావిహీనమౌతుంది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుంది. అయోధ్యానగర అధిదేవత దర్శనము ఇచ్చినది. అయోధ్యకు తిరిగివచ్చి పాలనను చేపట్టమని, పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది. 

ఆమెకోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుంది. ప్రజలు ఆనందంగాఉంటారు. ఒక దినం కుశుడు సరయూనదిలో జలక్రీడలు సలుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది. వెదకినా దొరకదు. ఆనదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు. కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వాచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు. తరువాత తన సోదరి కుముద్వతిని వివాహంచేసుకొమ్మని అడుగుతాడు. కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తరువాత అతడు అయోధ్యను పాలిస్తాడు.. గొప్ప రాజనీతికోవిదుడు. కాని దుర్జయుడనే అసురునిచేతిలో మరణిస్తాడు. 

తరువాత 21 రాజుల పేర్లు రఘువంశం చెబుతుంది. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడికుమారుడు అగ్నివర్ణుడు. స్త్రీలోలుడు. క్షయ వ్యాధితో మరణిస్తాడు. తరువాత ఆవంశంలో గుర్తుంచుకోవలసిన వారులేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవులతరఫున యుద్దంచేసి మరణిస్తాడు. అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. బాబరు అయోధ్యపై దాడిచేసిన ఆధునిక అసురుడు.

 

పంచభూతలింగాల గురించి మీకు తెలుసా?


అయితే ఈ కథనం చదవండి. పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.