అయ్యప్పస్వామి స్వరూపాలు


అయ్యప్పస్వామి స్వరూపాలు

శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి విభూషణం స్వామి సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమమూ ఉంటుంది. తలపై ధరించే చంద్రునిముడిలో శంకరునికి సంబంధించిన మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది.

పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.

అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్లు గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (3), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది, దివి నుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ, భేరి, కాహళ, దుందుభి, తుంబురు, మర్దల, వీణ, వేణు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జజ్జరి, జంత్ర, అనే 18 వాయిద్యాలను మ్రోగించారు.

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.


సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]
బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణము – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణము – నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం – విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణము – నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం – భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం – కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం – శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం – వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం – పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
వామన పురాణము – బ్రహ్మదేవుని రచన – 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం – శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం – శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం – శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం – బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే

ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

వైష్ణవ పురాణాలు – సాత్విక గుణాన్ని
బ్రహ్మ పురాణాలు – రాజస గుణాన్ని
శైవ పురాణాలు – తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం

నువ్వు మాత్రం ధర్మాన్నే పట్టుకో. ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది


కౌసల్య మాత రాముడిని అరణ్యానికి పంపిస్తూ ఈ మాటలు అన్నది.

యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ
సవై రాఘవశార్దూలా ధర్మస్త్వ మభిరక్షతు

చూడు రామ, రాబోయే కాలం నీకు పరీక్ష సమయం. చాలా మంది నీకు తారసపడి వచ్చి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు.

నియమేనచ – నువ్వు మాత్రం ధర్మాన్నే పట్టుకో. ధర్మం నిన్ను రక్షించి తీరుతుంది. కౌసల్య మాత ఇలా ఆశీర్వదించి రాముడుని అడవులకు పంపింది.

బ్రమరాంబికాష్టకం


శ్రీ కంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం
లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం వేదాన్తవేద్యాం నిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీః
బంధూక ప్రసవోజ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

మాద్యచ్ఛుంభనీశుంభమేఘపటల ప్రధ్వంసజంఝానిలాం
కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ ధూమోరుదావానలాం
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం చాముండికాధీశ్వరీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

కేళీమందిరరాజతాచలసరో జాతోరుశోభాన్వితాం
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం దేవీ జగన్మోహినీమ్
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

సంసారార్ణవతారికాం భగవతీం దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికప్రియసతీం సద్భక్తకామప్రదాం
శింజన్నూపురపాదపంకజయుగాం బింబాధరాం శ్యామలాం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

చంచత్కాంచనరత్నచారుకటకాం సర్వంసహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘనాం కంజాతపత్రేఓనాం
సారోదారగునాంచితాం పురహర ప్రాణేశ్వరీం శాంభవీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

బ్రహ్మర్షీ శ్వరవంద్పాదకమలాం పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం శృంగారభూషానిధఙం
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం దాక్షాయణీం భూరవీం
శ్రీ శైలభ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్

భ్రమరాంబామహాదేవ్యా అష్టకం సర్వసిద్ధిదం
శత్రూనాం చాసురాణాం చ ధ్వంసనం త ద్వదా మ్యహమ్.

దేవీస్తుతి


సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే

మధుకైటభ విద్రావ విధాత్రి వరదే నమః
రూపం దేహి జయం దేహిం యధోదేహి ద్విషో జహి

మహిషాసుర సంహారీ విధాత్రీ వరదే నమః
రూపం దేహి జయం దేహిం యదోదేహి ద్విషో జహి

ధూమ్రలోచన దర్పఘ్నీ విధాత్రీ వరదే నమః
రక్తబీజ కులచ్చేత్రి చణ్ణముణ్ణ విమర్దినీ
నిశుంభ శంభమదినీ తదా దూమ్రాక్షమర్దినీ

వందితాజ్ఞ్రియుగేదే వైర్దేవీ సౌభాగ్య దాయనీ
అచిన్త్యరూప చరితే సర్వశత్రు వినాశినీ
సతేభ్యస్సర్వదా భక్త్వా చణ్ణకే దురితావహే

స్తువర్భో భక్తి పూర్వంత్వాం చణ్ణకే వ్యాధినాశినీ
చణ్ణకే సతతం యేత్వామర్చయ న్తీహభక్తితః
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం

విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకై
దేహిమే దేవి కళ్యాణం దేహిమే విపులాం శ్రియమ్

సురా సురశిరోరత్న నిఘ్నుష్టచర్ణామ్బుజే
ప్రచణ్ణదైత్య దర్పఘ్నీ చణ్ణికే ప్రణతాయ మే
విద్యావవంత యశస్వంతం లక్ష్మీవంతంచమాంకురు

చతుర్భుజ చతుర్వక్త్వంస్తుతే పరమేశ్వరీ
ఇంద్రాణీపతి సధ్బావన పూజితే పరమేశ్వరీ
దేవీ ప్రచండరణ్ణ దైత్యదర్ప వినాశినీ

దేవీ భక్తజనోద్దామా దత్తానన్దోదయాన్వితే
పుత్త్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహిమే

రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జహి
సత్నీం మనోరమాందేహి మనోవిత్తాను సారిణీమ్

తారిణీం దుర్గసంసార సాగరస్య కులోద్భవామ్
ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః
స తు సప్తశతీ సజ్జ్యావర మాప్నోతి సంపదః

శ్రీ కృష్ణాష్టకం


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ||

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||

7వ దినము– అరణ్యకాండ


శాంతించిన రాముడితో లక్ష్మణుడు ” అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా. ( ఎన్నో కష్టాలు పడి, ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు, అదేంటంటే ” యయాతి! నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడు ఎవరు? ” అని అడిగాడు. తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా ” నేను ఎన్నడూ అసత్యం పలకలేదు ” అన్నాడు. ” నీ వైపుకి చూపించి, ఒక విషయాన్ని నీ అంతట నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపత్ముడివి. అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు ” అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తోసేశాడు.)  జీవితకాలం కష్టపడిన యయాతి, ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి, స్వర్గమునుండి పతనమై భూమి మీద పడిపోయాడు.

అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు, అందరూ తండ్రిమాట వినేవారే. అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజూ శాపానికి గురై శరీరాలని వదిలేశారు. అంత కష్టమొచ్చినా మన గురువు గారు బెంగపెట్టుకోలేదు. మనం రోజూ చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది, ఎంతోమందిని భరిస్తుంది. ఈ భూమి ఎప్పటినుంచో ఉంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్కనాడు పాపభారాన్ని మోయలేక కదులుతుంది. అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరు మహాబలం కలిగినవారు, వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్ని ప్రకాశిస్తున్నాయి. అటువంటి సూర్యచంద్రులని పాప గ్రహాలైన రాహు కేతువులు గ్రహణ సమయంలో గ్రశిస్తున్నారు, మళ్ళి విడిచిపెడుతున్నారు. మనిషికి జీవితంలో కష్టం వచ్చిననాడు, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిననాడు కదా, అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది. అందుకని అన్నయ్యా, దయ చేసి నీ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు జ్ఞానివి అన్నయ్యా, నీకు సమస్తం తెలుసు. కాని నిప్పుని బూది కప్పినట్టు, నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది. అందువలన నువ్వు కోపానికి వశుడవయ్యావు. నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడంలేదు, నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను, అంతే ” అన్నాడు.

పూర్వజో అపి ఉక్త మాత్రః తు లక్ష్మణేన సుభాషితం |
సార గ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవః ||

అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి, తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు, లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి ” తమ్ముడా! నువ్వు చెప్పిన మాట యదార్ధం రా. కాని నన్ను అనుగమించి వచ్చిన సీత కనపడకపోతే నేను బతకలేను. ఈ పర్వతగుహలలో ఎన్నో గుహలు, పొదలు ఉన్నాయి. సీత వాటిల్లో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము ” అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు.
అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటినిండా రక్తంతో తడిసిపోయి, ముక్కుకి రక్తంతో, రెక్కలు తెగిపోయి, ఒక పక్కకి కూర్చుని ఉన్న జటాయువు కనపడింది. అప్పుడు రాముడు ‘ రాక్షస రూపంలో ఉన్నవాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు. నేను, లక్ష్మణుడు వెళ్ళగానే సీతని ఈ పక్షే తినేసింది. దీనిని నేను నమ్మాను, ఇప్పుడిది నాకు ప్రమాదం తెచ్చింది. అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను’ అని మనసులో అనుకొని, కొదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు.

అప్పుడు జటాయువు ” రామ! నువ్వు ఏ ఓషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో, అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా. నువ్వు, లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు. సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురిడితో యుద్ధం చేశానయ్యా, నా శక్తి మేర అడ్డుపడ్డాను. రావణుడి రథాన్ని, సారధిని, ధ్వజాన్ని పడగొట్టాను, కాని వాడిని నిగ్రహించలేకపోయాను. ఆకాశమార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని, మేఘాల్ని సృష్టి చేశాడు, ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు, నా కాళ్ళు నరికేశాడు, అందుకని నేను ఏమి చెయ్యలేకపోయాను. రామ! నేను చచ్చిపోయానయ్య, ఇంకొక్కసారి నన్ను చంపకు ” అన్నాడు.

జటాయువు మాటలు విన్న రాముడు, ఆ కొదండంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి జటాయువుని గట్టిగా కౌగలించుకుని ఏడిచాడు. ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతినుండి విడిపోయి కింద పడిపోయింది. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడిచాడు.

రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్టా మృతే ద్విజః |
ఈదృశీ ఇయం మమా లక్ష్మీః నిర్దహేత్ అపి పావకం ||

అప్పుడు రాముడు ” నాకు రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను, సీతని పోగొట్టుకున్నాను, నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు. ఇవ్వాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొచ్చి అక్కడ పెడితే, ఆ అగ్నిని నా శోకం కాల్చేస్తుంది.  అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణా! ” అన్నాడు. అలాగే ” జటాయు! నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు. ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతని ఎటువైపుకి తీసుకెళ్ళాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అతని స్వరూపం ఏమిటి. నాకు చెప్పు ” అన్నాడు.

అప్పుడా జటాయువు ” ఆ రావణుడు సీతమ్మని అపహరించి, మేఘములను, ధూళిని సృష్టించి, సీతమ్మని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకెళ్ళిపోయాడు. ఇంతకన్నా చెప్పాలని ఉంది కాని, నా రెక్కలు తెగిపోవడం వలన, నా కళ్ళు కనపడడం మానేశాయి. నా నోటి వెంట మాట రావడంలేదు. నువ్వు మాట్లాడుతున్నది వినపడడం లేదు. నాలొ ఉన్న భావాలని చెప్పగలుగుతున్నానో, చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటినీ మించి ఈ అరణ్యం అంతా నాకు బంగారంగా కనపడుతుంది. వింద అనే ముహూర్తంలో రావణుడు దొంగిలించాడు కనుక, నీ వస్తువు నీకు దొరుకుతుంది. ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు. నువ్వు సీతమ్మని పొందుతావు, మీ ఇద్దరికీ పట్టాభిషేకం అవుతుంది, నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్య….” అని చెబుతుండగా ఆయన నోటినుండి రక్తంతో కూడిన మాంసం ముద్దని కక్కి, తన చిట్టచివర ప్రాణాలని కూడా లాగి ” ఆ రావణాసురుడి తండ్రి విశ్రవసో బ్రహ్మ, ఆయన తమ్ముడు కుబేరుడు…..” అని చెప్పి, శిరస్సు పక్కకి పడిపోగా, ఆ జటాయువు మరణించాడు.

అప్పుడు రాముడు ” చూశావ లక్ష్మణా! రావణుడు సీతని బలవంతంగా అపహరించుకుపోతుంటే, తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది. మనం ఆలోచించి చూస్తే, ధర్మాన్ని పాటించేవారు, శూరులైనవారు, శరణాగతి చేసినవారిని రక్షించేవారు మనుష్యులలోనే కాదు, జంతువులలో కూడా ఉన్నారు. సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఖం కన్నా, ఒక పక్షి నాకు ఉపకారం చెయ్యడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవ్వాళ ఎక్కువ దుఖం పొందుతున్నాను. నాయనా లక్ష్మణా! దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో, ఆయనకి స్నేహితుడైన జటాయువు కూడా మనకి గౌరవింపదగ్గవాడు. ఆనాడు నేను తండ్రిగారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశానో, జటాయువుకి ఇవ్వాళ అలా చెయ్యాలని అనుకుంటున్నాను.

అందుకని లక్ష్మణా! అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు, ఆ చెట్ల యొక్క ఎండుకర్రలు కిందపడతాయి, నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా. అప్పుడు మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెడదాము. ఆయన శరీరాన్ని అగ్నిలో కాల్చాక, రోహి మాంసాన్ని పిండంగా పెడదాము ” అన్నాడు. (రోహి అనేది ఒక మృగం పేరు, జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు).

ఆ జటాయువుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదకక్రియలు చేసి ” నాచేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా! నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను, నీకు ఇష్టం వచ్చిన ఉత్తమలోకాలకి వెళ్ళు” అని రాముడు అన్నాడు. తరువాత నదిలో జలతర్పణ చేశారు.

జటాయువు ఉత్తమలోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు.

తరువాత రామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరి క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు. అతి భయంకరంగా ఉండే ఆ క్రౌంచారణ్యాన్ని రామలక్ష్మణులు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక చీకటి గుహ కనబడింది. ఆ చీకటి గుహ దెగ్గర అలికిడి, చప్పుడు వినబడ్డాయి. అంతలోనే ఎక్కడినుంచో ఒక భయంకరమైన రాక్షస స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె పేరు అయోముఖి. కడుపు కిందకి జారిపోయి, వికృతమైన రూపంతో ఉన్న ఆ అయోముఖికి లక్ష్మణుడి మీద వ్యామోహం పుట్టింది. అప్పుడామె పరుగు పరుగున వచ్చి లక్ష్మణుడిని పట్టుకొని ” నువ్వు చాలా బాగున్నావు, మంచి యవ్వనంలో ఉన్నావు. మనిద్దరమూ ఈ పర్వాతాల మీద తిరుగుతూ క్రీడిద్దాము ” అనింది.

లక్ష్మణుడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి ఆవిడ ముక్కుని, చెవులని, స్తనాలని నరికేశాడు. అప్పుడా అయోముఖి నెత్తురు కారుతుండగా ఏడుస్తూ, గుండెలు బాదుకుంటూ ఆ గుహలోకి పారిపోయింది.

తరువాత వారు అక్కడినుండి కొంతదూరం ప్రయాణించాక, లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు ” అన్నయ్యా! చాలా దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఏదో తీవ్రమైన భయం వేస్తుంది. ఇక్కడవంజులకం అనే పక్షి కూస్తోంది, ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది, కాని పరమ దారుణమైన యుద్ధం జెరుగుతుంది……..” అని చెపుతుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది. ఈ శబ్దం ఏమిటి అని రామలక్ష్మణులు చూసేసరికి, సృష్టిలో కనీ వినీ ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనపడింది. దానికి తలకాయ, కాళ్ళు లేవు. కేవలం గుండెల దెగ్గరినుంచి నడుము కిందభాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది. అందులోనే ఒక పెద్ద నోరు, కన్ను ఉన్నాయి. ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువులని కూడా చూస్తుంది. దానికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి. అది నడవలేదు కనుక, ఆ చేతులతో అడవిలో తడిమి, దొరికిన దాన్ని తిని బతుకుతుంది. ఆ వింత స్వరూపాన్ని చూసి, అసలు ఇదేమిటిరా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణులను పట్టేసుకుంది. అప్పుడది ”  నేను రాక్షసుడిని, నన్ను కబంధుడు అని అంటారు. అరణ్యానికి వచ్చి ఇటువైపునకు ఎందుకు వచ్చారు, ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను ” అని అంటూ వాళ్ళని దెగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడితో ” మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మనిద్దరినీ మింగేస్తాడు, అందుకని వీడి చేతులని ఖండించేద్దాము ” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని నరికేశారు. అప్పుడా కబంధుడు ” మీరు ఇద్దరు ఎవరు? ” అని అడిగాడు.

” ఈయనని రాముడు అంటారు, దశరరథుడి కుమారుడు, తండ్రి మాటకి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు. ఈయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు. సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాము. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఇలా ఉన్నవేంటి? నీలాంటి రక్షాసుడిని మేము ఎప్పుడూ చూడలేదు ” అని లక్ష్మణుడు అన్నాడు.

అప్పుడా కబంధుడు ” నేను మీకు నా కథ చెబుతాను, కాని మీరు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. అదేంటంటే, ఒక పెద్ద గొయ్య తీసి, లేకపోతె ఒక చితి పేర్చి, దానిమీద నన్ను పడుకోబెట్టి కాల్చెయ్యండి ” అన్నాడు. ” సరే, నువ్వు కోరినట్టే నిన్ను కల్చేస్తాములే కాని, సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు. నువ్వూ రాక్షసుడివి కదా, నీకేమన్నా తెలుసా ” అని రామలక్ష్మణులు అడిగారు.

అప్పుడా కబంధుడు ” మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను. నన్ను కాల్చేస్తే, నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆ శరీరంతో చెబుతాను. ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు, కాని ఆ శరీరానికి అన్నీ తెలుసు. కనుక నన్ను కాల్చెయ్యండి ” అన్నాడు.

” కాలుస్తాములే కాని, నువ్వు అసలు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నావు” అని రామలక్ష్మణులు అడిగారు.

అప్పుడు కబంధుడు ” పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్సుతో ఉండేవాడిని. నా పేరు ధనువు. సూర్యుడు ఎలా ఉంటాడో, చంద్రుడు ఎలా ఉంటాడో, ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకూ అటువంటి శరీరం ఉండేది. నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు. అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిని ఆలోచన వచ్చింది, అదేంటంటే, ‘ నేను కామరూపిని కనుక, ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది, అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది ‘ అని. అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ స్థూలశిరుడు అనే మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను ఆయన వెనకాలకి వెళ్ళి, ఒక పెద్ద కేక వేశాను. అప్పుడా మహర్షి నా వంక చూసి ‘ ఇలా ఈ రూపంతో తిరగడం నీకు ఎంత సరదాగా ఉందో, నువ్వు ఇలాగె చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు’ అని వెళ్ళిపోయారు. అప్పుడు నేను నా నిజ స్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి ‘ మీరు చెప్పిన మాట ప్రకారం, నాకు ఆ భయంకరమైన స్వరూపం తొందరలో వస్తుంది. కాని నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది’ అని అడిగాను. అప్పుడా స్థూలశిర మహర్షి అన్నాడు ‘ నీకు వచ్చిన ఈ ప్రకోపం పోవాలి. కొంతకాలానికి ఇక్కడికి రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు. అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది’ అని చెప్పారు.

అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాను. కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ‘ ఏమి కావాలి ‘ అని అడిగారు. అప్పుడు నేను ‘ నాకు దీర్ఘాయువు కావాలి ‘ అని అడిగాను. బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు దీర్ఘ ఆయుర్దాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. అప్పుడు ఇంద్రుడు నూరు అంచులు ఉన్న వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కేసింది, అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది, నా రెండుచేతులని కూడా లోపలికి నొక్కేసింది. నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకూ ఉన్న శరీరంతో కిందపడ్డాను.

అప్పుడు నేను ఇంద్రుడితో ‘ నువ్వు నన్ను కొట్టేశావు, బాగానేఉంది. నా చేతులు, కాళ్ళు లోపలికి తోసేశావు. నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరమిచ్చారు. ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కాదా, మరి నేను ఏమి తిని బతకను ‘ అని ఇంద్రుడిని అడిగాను. అప్పుడు ఇంద్రుడు నా కన్నుని, నోరుని నా ఉదరభాగం మీద ఏర్పాటు చేసి, యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు.

రామ! నేను అప్పటినుండి నేను ఇలా పడి ఉన్నాను. ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికినది తింటూ ఉంటాను. ఎప్పటినుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అనుకుంటున్నాను, ఇప్పటికి మీరు దొరికారు. మీరు నా శరీరాన్ని కాల్చెయ్యండి నేను మీకు ఉపకారం చేస్తాను ” అన్నాడు.
( మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది. ఒకడికి అందం ఉందని, ఒకడికి డబ్బు ఉందని, ఒకడికి అధికారం ఉందని, ఒకడికి చదువు ఉందని, ఒకడికి తెలివి ఉందని అహంకరిస్తుంటారు. మనకి ఉన్నదానిని పదిమందికి ఉపయోగపడే విధంగా బతుకుదామని ఉండదు. ఇదే కబంధుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది)

అప్పుడు వాళ్ళు కబంధుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్చేశారు. అప్పుడు ఆ చితి నుండి ఆభరణములు పెట్టుకుని, మంచి తేజస్సుతో, ఒక దివ్య శరీరంతొ ధనువు పైకి వచ్చి ” రామ! ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం నడుస్తుంది. నీలాగే భార్యని పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆయన కూడా ధర్మాత్ముడు. ఆయన పేరు సుగ్రీవుడు, నలుగురు వానరములతో కలిసిఋష్యమూక పర్వతం మీద ఉన్నాడు. ఆయనని, ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెడలగొట్టాడు. ఋక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడి తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరస పుత్రుడిగా జన్మించాడు. నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో. వానరుడు కాదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించద్దు. ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి, సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు. ఆ సుగ్రీవుడిని కలుసుకోవడానికి నువ్వు ఇక్కడినుంచి పశ్చిమ దిక్కుకి వెళ్ళు, అక్కడ అనేకమైన వృక్ష సమూహములు కనపడతాయి. ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు, అవి చాలా మధురంగా ఉంటాయి. మీరు ఆ పళ్ళు తిని ముందుకి వెళితే కొన్ని వనాలు వస్తాయి. మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకి వెళితే ఆఖరికి పంపా అనే పద్మ సరస్సు వస్తుంది. ఆ సరస్సు దెగ్గర హంసలు, ప్లవములు, క్రౌంచములు, కురరవములు అనే పక్షులు నేతిముద్దల్లా ఉంటాయి. మీరు ఆ పక్షులని చంపి వాటి మాంసాన్ని తినండి. అలా చెయ్యడం వల్ల మీరు సేద తీరుతారు. అలాగే ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి, మీరు వాటిని కూడా తినండి. తరువాత సుగంధ భరితమై, నిర్మలమై, చల్లగా ఉండేటటువంటి ఆ సరస్సులోని నీటిని తాగండి. మీరు సాయంత్రం పూట అక్కడ విహరించండి, అప్పుడు మీకొక విచిత్రమైన విషయం కనపడుతుంది. అక్కడ వాడని పూలదండలు పడి ఉంటాయి. ఆ పూలదండలని ఎవరూ వేసుకోరు.

ఇక్కడికి ఈ పూలదండలు ఎలా వచ్చాయో తెలుసా రామ. పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్భలు, ఇతర పదార్ధాలు అరణ్యమునుండి మూట కట్టి తీసుకెళ్ళేవారు. వారు అలా తీసుకెళుతున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి, ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి. వారు ఎంతగా గురు సుశ్రూష చేసినవారంటే, వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి. ఆ పూల దండలు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు ఆ పూలదండలని చూసి సంతోషించు. ఆ పంపా సరోవరానికి ముందరే ఋష్యమూక పర్వతం కనపడుతుంది.

ఆ ఋష్యమూక పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు, దానిని ఎక్కడం చాలా కష్టం. చిత్రమేమిటంటే, ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఆ గున్న ఏనుగులు రోజూ పంపా సరోవరం దెగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్ళు తాగుతాయి. దాహం తీరిపోగానే పౌరుషం వచ్చి ఆ ఎనుగులన్నీ నోట్లోనుంచి నెత్తురు కారేటట్టు కొట్టుకుంటాయి. అంతగా కొట్టుకున్నాక, అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకొని వెళ్ళినట్టు, తొండాలు తొండాలు ముడివేసుకొని ఆ ఋష్యమూక పర్వతం చుట్టూ తిరుగుతాయి. ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే, ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో, ఉదయానికల్లా అది జెరిగి తీరుతుంది. పాపకర్మ ఉన్నవాడు, దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఆ పర్వతాల మీద 5 వానరాలు ఉన్నాయి. ఆ పర్వతం మీదకి వెళితే ఒక పెద్ద గుహ ఉంటుంది, దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు. ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు. దాని పక్కనే ఒక పెద్ద తోట ఉంటుంది, అందులో అన్ని ఫలాలు లభిస్తాయి. ఆ ఫలాలని తింటూ, అక్కడే ఉన్న సరస్సులోని నీళ్ళు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చొని ఉంటాడు.

ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడూ గుహ నుండి బయటకి వచ్చి, ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు. గుర్తుపెట్టుకో రామ, ఆ సుగ్రీవుడికి సూర్యకిరణాలు ఎంత దూరం వరకూ భూమి మీద పడతాయో, అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో, ఎన్ని గుహలు ఉన్నాయో, ఆ గుహలలో ఎవరు ఉంటారో, ఎవరు ఎక్కడ ఉంటారో, ఎక్కడ పాలిస్తారో, వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు. అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చెయ్యి ” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అప్పుడు రామలక్ష్మణులు బయలుదేరి మతంగ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు మతంగ మహర్షి యొక్క శిష్యురాలైన శబరి రామలక్ష్మణులను చూసి గబగబా బయటకి వచ్చి వారి పాదాలని గట్టిగా పట్టుకుంది. వారికి అర్ఘ్యము, పాద్యము మొదలైనటువంటి అతిథికి ఇవ్వవలసిన సమస్త సంభారములు చేకూర్చింది. అవన్నీ స్వీకరించాక, రాముడు శబరితో ” నువ్వు నియమంగా జీవితం గడపగలుగుతున్నావా, నియమముతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నావా, తపస్సు చెయ్యగలుగుతున్నావా, నీ గురువుల యొక్క అనుగ్రహాన్ని నిలబెట్టుకుంటున్నావా ” అని అడిగాడు.

అప్పుడా శబరి ” రామ! ఏనాడు నీ దర్శనం చేశానో, ఆనాడే నా తపస్సు సిద్ధించింది. నేను కూడా మా గురువుగారైన మతంగ మహర్షి శిష్యులతో పాటు తపస్సు చేశాను. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉండగా మా గురువులందరూ దివ్యమైన విమానములు ఎక్కి ఉత్తమలోకాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నారు ‘ మహానుభావుడైన రామచంద్రమూర్తి ఈ ఆశ్రమం వైపుకి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చాక నువ్వు కూడా మేము ఉన్నటువంటి ప్రదేశానికి వద్దువు ‘ అని చెప్పి వెళ్ళారు. అందుకని నీకోసం నేను ఇక్కడే ఉండిపోయాను ” అని చెప్పింది.

అప్పుడా రాముడు శబరితో ” నీ యొక్క ప్రభావాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను శబరి ” అన్నాడు.

అప్పుడు శబరి రాముడిని ఆ ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి ఒక అగ్నివేదిని చూపించి ” రామ! మా గురువుగారు ఈ అగ్నివేది దెగ్గరే అగ్నిహోత్రం చేసేవారు. వృద్ధులైన మా గురువులు వొణికిపోతున్న చేతులతో పువ్వులు తీసి ఆ వేది మీద పెట్టేవారు. రామ! ఒక్కసారి ఆ వేది మీద చూడు, ఆ పువ్వులు ఇప్పటికీ వాడకుండా అలానే ఉన్నాయి. నువ్వు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ అగ్నికార్యం చేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఆ అగ్నివేదిలో నుంచి వచ్చే కాంతి దశదిశలని ప్రకాశింప చేస్తుంది. మా గురువులు చాలా వృద్ధులు అవ్వడం వలన, నదీ తీరానికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయేవారు. అందుకని వారు అక్కడే కూర్చొని ఒక్క నమస్కారం చేసేవారు. వారు అలా నమస్కారం చెయ్యగానే ఏడు సముద్రముల యొక్క పాయలు ఇటుగా ప్రవహించాయి, అప్పుడు మా గురువులు అందులో స్నానం చేశారు. మా గురువులు స్నానం చేసి తమ వస్త్రములను పిండి, ఇక్కడే తీగల మీద ఆరేసేవారు. నువ్వు ఆ వస్త్రములను ముట్టుకొని చూడు, అవి ఇప్పటికీ అలానే తడిగా ఉంటాయి. వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని వారు ఏ స్థితిలో ముట్టుకున్నారో, అవి ఆ స్థితిలోనే ఉండిపోయాయి తప్ప ప్రకృతి యొక్క పరిణామగతంగా ఆ వస్తువులు మారలేదు. వారు అంతగా ఆత్మగతులై ఆత్మస్వరూపంగా ఉండిపోయారు.

రామ! నీకోసమని చెప్పి నేను ఈ అరణ్యం నుండి చాలా సంభారాలని సేకరించాను, నువ్వు వాటిని స్వీకరించు” అని చెప్పి, ఆ సంభారములని రాముడికి ఇచ్చి ” మా గురువులు నీకు ఆతిధ్యం ఇవ్వమన్నారు, నేను ఇచ్చేశాను. అందుకని నేను వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ” అని చెప్పి, సంకల్పమాత్రం చేత అగ్నిని రగిల్చి, అందులో చీర క్రిష్ణాంబరాలతో సహా దూకి తన శరీరాన్ని వదిలేసింది. అప్పుడా అగ్నిలోనుంచి దివ్యమైన అంబరములతో, దివ్యమైన వస్త్రములతో ఆమె శరీరం బయటకి వచ్చి, తన గురువులు ఉన్న లోకాలకి వెళ్ళిపోయింది.

ఆహా, ఏమి ఋషులు, ఏమి తపస్సు అని రామలక్ష్మణులు పొంగిపోయి, అక్కడినుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరారు.