స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి


విజయవాడలో దుర్గ అమ్మ మొదటి రోజున మనకి అమ్మవారు స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి గా దర్శనం ఇస్తుంది.

….. ఒకోక్క రోజు ఒకొక్క రూపములో మనము అమ్మని పూజిస్తాము..ఒకోక్క స్వరూపములో అమ్మ మనకి దర్శనము ఇస్తుంది…

విజయవాడలో దుర్గమ్మకి మొదటి రోజున స్వర్ణకవచ అలంకృతరూపముగా పూజిస్తాము…ఆ రూపము వెనుక ఉన్న కధ ను తెల్సుకుందాము…ఈ కధ ను నవరాత్రుల ప్రధమ రోజున ఎవరైన చదువుతునప్పుడు విన్నా, లేక చదివినా……..అనంతమైన ఫలితాలు కలుగుతాయి…

దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు…ఆయన గొప్ప తపస్సు చేసాడు బ్రహ్మ గారి కోసము…బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యి…” ఏమి కావాలి నీకు అని అడగగా…”నాకు వేదములు అన్ని కూడా వశము కావాలి ” అని అడిగాడు…”దేవతలను నేను జయించాలి ” అని అన్నాడు…అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు “తధాస్తు” అనగా వేదములు అన్నీ కూడా దుర్గముడు లోకి ప్రవేసించాయి…బ్రాహ్మణులు అందరు వేదాలు మర్చిపొయారు…సంధ్యవందనాలు లేవు…హవ్విసులు లేవు..యగ్నాలు లేవు…యాగాలు లేవు…..దేవతలకి హవిస్సులు లేక ఆకలితో విలవిల లాడి పొయారు….నీటి చుక్క లేదు…తల్లి అనుగ్రహం లోపించి పోయింది…భూమండలం మీద అంతా వాతావరణం క్షీణి ంచిపోయింది…అందరు నాశనము అవుతుంటె ఆ దుర్గముడు చాలా సంతొషించాడు…హవిశ్శులు లేక దేవతలు అందరు వృద్ధులు లాగా మారిపోయి…..నీరస పడిపోతు…డీలా పడిపొయారు..

అప్పుడు…దేవతలు అందరు కలిసి అమ్మని ప్రార్థన చేసారు….అప్పుడు అమ్మ ప్రత్యక్షమైనది..అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపమునకు ” శతాక్షి ” అని పేరు.. అమ్మ దర్శనము ఇచ్చిన తీరు ఎలా ఉంది అంటే….ఒంటి నిండా కన్నులతో దర్శనం ఇచ్చింది…దేవతల ఆవేదన చూసి….అమ్మ అంది ” మిమ్మల్ని చుడటానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకు ఎందుకు భయం” అని అభయం ఇచ్చింది…. బ్రతకాడినికి అన్నము, నీరు లెవూ అని దేవతలుచెప్పగా…అప్పుడు అమ్మ తన ఒంటి మీద ఉన్న నేత్రాలలో నుండి నీరు కరుణ రసముగా మొత్తం బ్రహ్మాండము అంతా నింపేసింది……..అంతే మళ్ళి భూమండలం అంతా…అమ్మ కరుణకటక్షములతో నిండ్పోయింది……..నూతులు, చెరువులు, నదులు అన్ని యధావిధిగా ప్రవహించసాగాయి…

అన్నములేక ఆకలిగా ఉంది అమ్మ , నిన్ను స్తుతి చెయ్యడానికి కుడా మాకు ఒపిక లేక ఉన్నాము అని దేవతలు అమ్మని ప్రాధేయపడగా…..అమ్మ అప్పుడు అందరికి ” శాఖాంబరి దేవిగ ” కనిపించింది..అనంత హస్తాలతో…

అసలు పృథ్వి శాకాంబరి దేవి కాదా….అలా అమ్మ ఆ రూపము దాల్చి అందరికి…పళ్ళు, కాయగూరలు…అన్ని ఇచ్చింది…..మళ్ళి హోమాలు, యగ్నాలు, యాగాలు మొదలు అయ్యాయి….
ఎంటి నీరసపడిపొయిన బ్రహ్మాండం అంతా మళ్ళి చిగురించుకుంది అని దుర్గముడు ఆలోచన చెయ్యగా…..అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది…అప్పుడు అమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చెయ్యలెదు..ముందు అందరికి రక్షణ చక్రం వేసి… .అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి…దుర్గముడి కన్నులు తీసి…అందరిని కాపాడుతు …..వేదములు తన లోనుండి…మళ్ళి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి……దేవతలకు వాటి రక్షణ కార్యము అప్ప చెప్పింది …అందుకే ఆ రక్షణ కవచం తో అమ్మ అందరిని కాపాడింది కనుక …..నవరాత్రుల్లో…అమ్మని మొదటి రోజున…” స్వర్ణకవచ అలంకృత” రూపములో పూజిస్తాము…….

Advertisements

త్రిపురసుందర్యష్టకం


కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబినీసేవితామ్
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౧ ||

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీమ్
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౨ ||

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితా వయం లీలయా || ౩ ||

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీమ్
విడంబితజపారుచిం వికచచంద్ర చూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౪ ||

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీమ్
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే || ౫ ||

స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలామ్
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే || ౬ ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్
అశేషజనమోహినీమరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్ || ౭ ||

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతామ్
ముకుందరమణీ మణీ లసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికామ్ || ౮ ||

బాలాత్రిపురసుందరి


నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా దర్శనము ఇస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠన దేవత.కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.

అసలు బాలా త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి…..అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు…ఆది దంపతులు…వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే ” మనలోని ముడు అవస్థలూ…జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలు …లేద పురములకు బాల అధిష్ఠాన దేవత!

ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు ….”బాలగా..”….అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.

అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది….ఆవిడ ఆత్మ స్వరూపురాలు….ఆవిడను పూజిస్తే….ఙ్ఞానము కలిగి .. …తానె శివ స్వరూపము తో…చైతన్యము ప్రసాదించి…మోక్షమునకు…అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది…ఈ కరుణామయి..
సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందరిదేవి భక్తుల పూజలు అందుకుంటోంది.
ఈ రోజు రెండు నుండి పది సంవత్సరములు లోపు కలిగిన బాలికలను అమ్మవారి స్వరూపముగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.

అమ్మవారికి పాయసం నివెదన చెయ్యాలి.

శ్రీ శైలపుత్రీ దేవి మహత్యం (నవదుర్గల మహత్యం – 1)


వందే వాంచిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం.
దుర్గా దేవి ప్రధమ రూపంలో శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందింది. శైల(పర్వత) రాజైన హిమవంతుని సదనంలో పుత్రికా రూపంలో ప్రభవించడం వల్ల ఈమె శైలపుత్రిగా కూడా వ్యవహరించబడినది. వృషభారూఢురాలైన ఈమె దక్షిణ హస్తంలో త్రిశూలము, వామ హస్తములో పద్మము శోభిల్లూతూ ఉంటాయి. నవదుర్గలలో ప్రధమ దుర్గ ఈమెయే.

shilaputri
పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి పుత్రికగా అవతరించి సతీ అన్న నామముతో పిలువబడినది. శంకరునితో ఈమెకు వివాహమైనది. ఒకానొక సమయములో దక్ష ప్రజాపతి ఓ మహాయాగాన్ని చేశాడు. తమ యాగభాగాలను స్వీకరించవలసినదని అతడు దేవతలందరినీ అహ్వానించాడు కాని శంకరున్ని మాత్రము ఆహ్వానించలేదు. తన తండ్రి ఓ మహాయాగాన్ని చేయబోతున్నాడని ఆలకించిన సతీదేవి మనస్సు యాగానికి వెళ్ళాలని మధనపడసాగింది. తన అభీష్ఠాన్ని ఆమె మహాదేవునికి విన్నవించుకున్నది. సర్వ విషయములు తెలిసిన శంకరుడు “సతీ! నీ తండ్రి ఏ కారణం వల్లనో మనయందు కృధ్ధుడై ఉన్నాడు. తనయాగానికి దేవతలందరిని అహ్వానించాడు కాని కావాలనే మనల్ని పిలువలేదు. పిలవని చోటికి వెళ్ళడం సరి కాదు.” అని అన్నాడు. శంకరుని పలుకులు సతీ దేవికి నచ్చలేదు. తండ్రి యాగాన్ని చూడాలని సోదరీమణులను కలిసి సంభాషించాలని ఆమె తొందరపడసాగినది. ఆమె స్థితిని గమనించిన శంకరుడు పుట్టినింటికి వెళ్ళడానికి అనుమతిని ప్రసాదించాడు.

పితృగృహం చేరిన సతీదేవితో బంధుభాంధవులెవరు మాట్లాడలేదు. కేవలం ఆమె తల్లి మాత్రం ప్రేమగా కౌగలించుకున్నది. అందరికందరూ ఎడమొహం పెడమొహం గా ఉండిపోయారు. అక్క చెల్లెళ్ళ ముఖాలలో వ్యంగ పరిహాస భావాలు కనిపించాయి. పరిజనుల వ్యవహారానికి సతీదేవి మనస్సు తీవ్రంగా గాయపడింది. అంతేకాదు అక్కడ సర్వే సర్వత్ర శంకరుని పట్ల తిరస్కార భావాలు గోచరించాయి. దక్షుడు కృధ్ధుడై ఆమె పట్ల అవమాన జనకంగా ప్రవర్తించి కఠోరంగా భాషించాడు. అదంతా చూసిన సతీదేవి హృదయం క్రోధ సంతప్తమైనది. పతిదేవుని పలుకులు వినక తాను ఇక్కడికి రావడం పొరబాటే అని ఆమె గ్రహించినది.

మహాదేవునకు అక్కడ జరుగుతున్న అవమానన్ని చూసి ఆమె సహించలేకపోయినది. ఆమె తన దేహాన్ని యోగాగ్నిలో భస్మం చేసివేసుకున్నది. పిడుగువంటి విషాద వార్తను వింటూనే శంకరుడు కృధ్ధుడై తన ప్రమధ గణాలను పంపి దక్షుని యాగాన్ని సంపూర్ణంగా ద్వంసం చేయించాడు.
యోగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసికొన్న సతీదేవి ఉత్తర జన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా ప్రభవించినది. అప్పుడే ఆమె శైలపుత్రి నామంతో ఖ్యాతిగాంచినది. పూర్వజనమలో వలెనె ఏమె ఈ జన్మలో కూడా శంకరార్ధింగినిగానే విశేష ఖ్యాతి పొందింది. పార్వతి, హైమవతి స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణచివేసినది.

దుర్గామాత యొక్క ఈ ప్రధమ స్వరూపం భక్తులకూ, సిధ్ధులకూ సర్వ మంగళములను ప్రసాదించునట్టిది. ఈమె ఉపాసనవల్ల దాంపత్య జీవనంలోని ఒడిదుడుకులు తొలగిపోతాయి. శైలపుత్రీ దేవి చల్లని కరుణాకటాక్ష వీక్షణముల వల్ల సర్వుల జీవితాలలోను శాంతి,సుఖం,సంతోషం,సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. శైలపుత్రి దుర్గ యొక్క మహాశక్తులు అనంతాలు. నవరాత్ర పూజలలో మొదటిరోజు శైలపుత్రీ ఉపాసనలు కొనసాగుతుంటాయి. ఈ ప్రధమ దివసోపాసనలో యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నిలిపి ఉంచుతాడు. ఇక్కడ నుండియే అతని యోగ సాధన ప్రారంభం అవుతుంది.


శ్రీ శైలపుత్రీ దేవికీ జై

నవదుర్గలు


హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కధనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు.
గొవా, మహారాష్ట్రలలో అధికంగా ఉన్న గౌడ సారసజ్వత బ్రాహ్మణుల కులదేవత “నవదుర్గ”. గొవాలో మడికియమ్, పాలె, పోయింగ్వినిమ్, బోరిమ్‌లలోను, మహారాష్ట్రలోని రేడి, వెంగుర్ల లలోను నవదుర్గా మందిరాలున్నాయి. 16వ శతాబ్దిలో గోవా రేడి నవదురగ్ా మందిరం ప్రస్తుత మహారాష్ట్రలోని వెంగుర్లకు మార్చబడింది. నవరాత్రి ఉత్సవాలలో నవదుర్గలను పూజిస్తారు.

ధ్యానం

యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా 
యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ
ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.

నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే

నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.

నవదుర్గలు
సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీకవచంలోనవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇలా ఉంది.
1. ప్రథమం శైల పుత్రీతి
2. ద్వితీయం బ్రహ్మచారిణీ
3. తృతీయం చంద్ర ఘంటేతి
4. కూష్మాండేతి చతుర్థకం
5. పంచమం స్కందమాతేతి
6. షష్ఠం కాత్యాయనీతి చ
7. సప్తమం కాలరాత్రీతి
8. మహాగౌరీతి చాష్టమం
9. నవమం సిద్ధిదా ప్రోక్తా
నవదుర్గా ప్రకీర్తితా ఇక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా
ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని వుంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు.

శైలపుత్రి

shilaputri

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి.

Click Here to read Full Story……

బ్రహ్మచారిణి
‘బ్రహ్మచారిణి’ యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.

చంద్రఘంట
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు ‘చంద్రఘంట’ యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.

కూష్మాండ
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి ‘కూష్మాండ’ అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

‘అష్టభుజాదేవి’ అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద – అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని ‘స్కందమాత’పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, ‘పద్మాసన’ యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
కాత్యాయని
“కాత్యాయనీ మాత” భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.

కాళరాత్రి
“కాళరాత్రి” శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.

కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము – కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను “శుభంకరి” అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
మహాగౌరి
అష్టవర్షా భవేద్గౌరీ – “మహాగౌరి” అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు “మహాగౌరి” యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.

సిద్ధిధాత్రి
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడినది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.

సప్తశతి
సప్తశతి లో –

 1.  మహాలక్ష్మి
 2. మహాకాళి
 3. మహాసరస్వతి
 4.  నంద
 5. శాకంభరి (శతాక్షి)
 6. భీమ
 7. రక్తదంతిక
 8. దుర్గా
 9. భ్రామరీ

అనే వారి చరిత్రలను చెప్పారు. కానీ, వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా వ్యవహరించలేదు.
సప్తసతీ దేవతలు
సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం వుంది. దీనిలో

 1.  నందా
 2.  శతాక్షీ
 3. శాకంభరీ
 4.  భీమా
 5. రక్తదంతికా
 6.  దుర్గా
 7.  భ్రామరీ

అనే ఏడుగురు సప్తసతులు. వారిగురించి సప్తశతీ గ్రంథంలో వుంది. దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతి అని మొరొక పేరు వచ్చింది.