సంకల్ప బలం


బలం అంటే- శారీరక దృఢత్వం ఒక్కటే కాదు, మానసిక బలం కూడా! ‘అబలం’ అనడంలోనూ- శరీర, మనో సంబంధమైన తత్వాలు రెండూ ఉంటాయి. 

శరీరం దుర్బలంగా ఉన్నవారూ, మానసికంగా దృఢమైన స్వభావం కలిగి ఉండవచ్చు.
ఒక బలమైన శత్రువును జయించడానికి శారీరక, మానసిక, ఆత్మ, సంకల్ప బలాలన్నీ పటిష్ఠంగా ఉండాలి. అందుకే సాక్షాత్తు అవతార పురుషుడైనప్పటికీ, శ్రీరాముడికి గురువు విశ్వామిత్రుడు అస్త్ర ప్రయోగ శిక్షణలో భాగంగా బల, అతిబల విద్యల్ని ప్రసాదిం చాడు. రావణుడితో తలపడే ముందు తాటకి, మారీచుడు, సుబాహు వంటి రాక్షసుల్ని సంహరించడం ద్వారా రాముడు తన శౌర్యానికి మరెంతో పదును పెట్టుకున్నాడు.

విశ్వరూప దర్శనంలో పరమాత్మకు సూర్యుడు కుడికన్ను వంటివాడు. అలాంటి సూర్యుణ్ని సైతం ‘ఆదిత్య హృదయం’ ద్వారా ప్రసన్నం చేసుకోవాలంటారు. జీవితంలో ఏ పనికైనా మానవ ప్రయత్నం ఒక్కటే చాలదు, సరిపోదు. అతడికి దైవసహాయమూ ఉండాలి. ‘మానవ యత్నానికి దైవం ఆశీస్సు తప్పనిసరి’ అని సందేశమిచ్చే గాథలెన్నో పురాణాల్లో కనిపిస్తాయి.

జగత్తుకు సూర్యుడే ప్రత్యక్ష నారాయణుడు. ఆయనను ‘జగచ్చక్షువు’ అనీ పిలుస్తారు. లోకంలో ఎంతటి వరబల సంపన్నులైనా, దాన్ని పదిలం చేసుకోవడమన్నది సూర్యారాధన వల్లనే సాధ్యపడుతుంది. శివ ప్రతీక అయిన ఆత్మలింగాన్ని సాధించిన భక్తాగ్రగణ్యుడు రావణాసురుడు. సప్తసముద్రాల్లోస్నానం చేసి అర్ఘ్యం వదిలే మహాబలి- వాలి. వారు అంతటి శక్తిసంపన్నులైనా తొలి నుంచీ సూర్యారాధనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి దైవానికి విధేయులయ్యారు.

అన్ని బలాల్లోనూ ధర్మబలం ఎంతో గొప్పది. పరమాత్మ సదా ధర్మ పరిరక్షకుడు. అధర్మ వినాశనానికే ఆయన పలు అవతారాలు ధరించాడు. లోకంలో మహా సంగ్రామాలన్నీ ధర్మరక్షణ కోసమే సాగాయి. ధర్మాన్ని స్థాపించడమే రామ, రావణ; పాండవ, కౌరవ యుద్ధాల అంతిమ లక్ష్యం, ఫలితం!
ధర్మం లేనప్పుడు, అది పిశాచాల పాలన అవుతుంది. రాక్షస రాజ్యంగా, ప్రజలకు ప్రత్యక్ష నరకంగా మారిపోతుంది. అప్పుడు దైవశక్తులన్నీ ఒక్కటై ధర్మం వైపు, అసుర శక్తులన్నీ అధర్మం వైపు ఉండి పోరాటం సాగిస్తాయి.

ధర్మవిజయాన్ని వేనోళ్ల చాటే వేడుకలుగా దసరా, దీపావళి వంటి పండుగలు ప్రసిద్ధి చెందాయి. మానవాళికి అవన్నీ వివిధ దివ్య సందేశాలు అందజేస్తాయి. వాటి అంతరార్థాన్ని తరచి చూడకుండా, కేవలం సంబరాలుగానే భావించి కాలక్షేపం చేయడం సరైన పని కాదు. ఉల్లాసంగా గడపడానికే ఆ ఉత్సవాల్ని పరిమితం చేయడం వల్ల, జనావళికి కలిగే ప్రయోజనం శూన్యం!
ఇంతకీ ఏమిటా సందేశాలు? అధర్మాన్ని ఆశ్రయించడం, అహంకరించడంతో పాటు లోకాన్ని నానారకాలుగా పీడించేవాళ్లు ఎంతటివారైనా- చివరికి ఏదో ఒకనాటికి పతనం చెందక తప్పదు. అతి బీదవాడైనా, అన్నివిధాలా సామాన్యుడైనా- ధర్మజీవనం కారణంగానే మాన్యుడిగా వెలుగొందుతాడు.

పుట్టిన ప్రతి మనిషీ మరణించక తప్పదు. ఆ లోగా అతడు తనకంటూ ఏదైనా ఒక ప్రత్యేకతను జీవన గ్రంథంలో నమోదు చేసుకోవాలి. అందుకోసం తన శక్తియుక్తుల్ని, విజ్ఞాన వికాస సంపదల్ని ధారపోయాలి. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే ప్రతి పనిలోనూ సఫలమవుతారు. ఆత్మబలం, స్వయంకృషితో అద్భుతాలు సృష్టిస్తున్న వారెందరినో కాలం మనముందు ప్రదర్శిస్తోంది.
అమూల్యమైన మేధ గల ప్రతి ఒక్కరూ జీవితరంగంలో విజయాలు సాధించితీరతారు. 

ఆంజనేయుడికి మొదట తన బలం ఏమిటో తెలియదు. తెలిసిన తరవాత, ఆయన చరిత్ర చిరస్థాయిగా రామాయణంలో సుందరకాండగా అవతరించింది. మనిషి మనసూ ఆంజనేయమే! బల విశ్వాసాలే అతడికి విజయ ప్రదాతలు!

Advertisements