మందేశ్వర(శనేశ్వర)_స్వామి_దేవాలయం(మందపల్లి )


మందపల్లి స్థల పురాణం.పూర్వకాలము అగస్త్యమహర్షి దక్షిణ దిక్కున సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి సంవత్సరం సత్రయాగము చేయుటకు దీక్షితుడయెను. ఆ సమయమున కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులయిన అశ్వర్ధుడు మరియు పిప్పలుడు యను యిరువురు రాక్షసులు దేవలోకంలో యుండిరి. వారిరువురిలో అశ్వర్ధుడు రావిచెట్టు రూపములోనూ, పిప్పలుడు బ్రాహ్మణ రూపములోను యుండి సమయము జూసి యజ్ఞమును నాశనంకుపక్రమించిరి. వారిలో రావిచెట్టు రూపములో నున్న అశ్వర్ధుడు ఆ వృక్షం నీడలో ఆశ్రయం పొందు బ్రాహ్మణులను దినుచుండెను. పిప్పలుడు సామవేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యులను తినుచుండెను. అంతట దిన దినము బ్రాహ్మణులు క్షీణించుటను చూచి వృద్ధులగు మహర్షులు గౌతమీ దక్షిణ తటాకమున సూర్యపుత్రుడగు శనిని చూచి వధించమని కోరిరి. దానికి శనిదేవుడు తన తపస్సు పుర్తి కాగానే వారిని వధించెదనని మాట యిచ్చెను. దానికి మహర్షులు తమ తపస్సు శనికి యిచ్చెదమని సంహరించమనీ ప్రార్థించిరి. అంతట శని బ్రాహ్మణ వేషమున దాల్చి వృక్షరూపముగ నున్న అశ్వర్ధుని వద్దకు వెళ్ళి ప్రదక్షినములు చేయనారంభించెను. అశ్వర్ధుడు రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే యనుకుని అలవాటు చొప్పున మ్రింగివేసెను. శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి రాక్షసుని ప్రేవులను త్రెంచివేసెను. వెంటనే భస్మీభూతుడయ్యెను. బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము అభ్యసించుటకు వచ్చినానని బ్రాహ్మణ వటరూపమున వెళ్ళెను. ఆ పిప్పలుడు ఈ సూర్య పుత్రుడగు శనిని అలవాటు ప్రకారముగా భక్షించెను. శని ఆ రాక్షసుని ప్రేవులు కూడా చూచిన మాత్రముననే ఆ రాక్షసుడు భస్మమాయెను.