గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి?


గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎఅవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.

1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.

2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి

3 సర్వ సమర్ధత :- తాను సిశ్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.

ఇటువంటి వారిని మనపు పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.

అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు…గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికమ్ గా పతన హేతువవుతుంది.

శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.

కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.

మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?

గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చెస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరుత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.

Advertisements

ఆహారశుద్ధి నియమం


భోజన సమయములో ఇతరులపైన కోపిగించుకోకూడద,భయంకర వార్తలువింటూ కాని, దృశ్యాలు చూస్తూ కాని చేయకూడదు, అలా చేస్తే రోగాలపాలు అవుతాము,

ఇది నేను చెప్పిన మాట కాదు, మన పెద్దలు చెప్పిన మాట. మనస్సు మంచిగా ఉంటే ఎన్ని కష్టాలనైనా ఆనందంగా భరించగలుగుతాము.శారీరకముగా ఎన్ని సుఖములున్నను మనసు చెది దుఃఖమునే పెంచును.మనసుని ఉపయోగించుట మానవునికి లభించిన గొప్ప వరము. మనం తీసుకొనే ఆహారము యొక్క ప్రభావము, మన మనస్సు మీద ప్రభావం చుపిస్తుంది. అందుకని అనేక విధాలుగా మనసుని పనిచేయించు ఆహారము కూడా సరిఅయిన రీతిలో సంస్కరించి తీసుకోవలెను.

సాత్వికమైన ఆహారము(అనగా శాఖాహారము) ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెప్పారు, వారు అటువంటి నియమాలు పాటించుటవల్లనే సతాధికులుగా జీవించారు అని చెప్పటంలో సందేహమేమీ లేదు.”జంతూనాం నరజన్మ దుర్లభం”–అన్నా రు కదా మన పెద్దలు, అంటే మానవులను కూడా జంతువులమని చెప్పారు కదాని ఉత్తమమైన మానవుడు తనకంటే తక్కువగా అంచనా వేయు జంతువులను చంపి తినుట సంస్కారమేనా ? సంస్కరింప బడిన ఆహారము తినగలిగిన మనిషి, చెత్తా– చెదారము తినేటి తువులను చంపి ఆహారముగా తీసుకోవచ్చునా,. .ఒక జంతువుని చంపి తిని తిరిగే జంతువులను క్రూర మ్రుగమందురు. శాఖాహారము తినే జంతువులను చూసి ఎవ్వరం భయపడము, అటువంటి వాటిని ఇంటిలో పెంచుకుంటాము. కనుక నియమము తెలుసుకుని, శాఖాహారములై సమస్త ప్రాణుల శ్రేయస్సును కోరుట మానవుని కనీస ధర్మము.

దర్భ యొక్క ప్రాముఖ్యం


మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి

చిత్రగుప్తుని దేవాలయం


మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది. కలియుగంలో అతని పేరిట గుళ్లు గోపురాలు కూడా ఉన్నాయి. మన రాజధాని నగరంలోనూ చిత్రగుప్తుడికో ఆలయం ఉంది. అసలు చిత్రగుప్తుడు ఎవరో, ఆయన మన పాప పుణ్యాల చిట్టా రాయడం ఏమిటో తెలుసుకుందాం..
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి. కానీ వీటిని వేళ్ల మీద లెక్కించొచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలో చిత్రగుప్తుడి భక్తులు ఎక్కువగా ఉన్నారు భరతుడు పాలించిన భారత దేశంలో వీటిని నిర్మించారు. రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యప్రదశ్‌ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో చిత్రగుప్త దేవాలయాలు ఉన్నాయి. జబల్‌ పూర్‌ లోని ఫూటాతాల్‌, షిప్రా నదీ తీరంలోని రామ్‌ఘాట్‌లో , ఉజ్జయినిలో రెండు దేవాలయాలు ఉన్నాయి. అవి దాదాపు రెండు శతాబ్దాలు దాటినవి అయి ఉంటాయి. అంటే ఒక్క మధ్య ప్రదేశ్‌లో నాలుగు చిత్ర గుప్త దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్‌ అల్వార్‌లో మూడు శతాబ్దాల చిత్రగుప్త దేవాలయం ఉంది. అదే రాష్ట్రం ఉదయపూర్‌లో మరో చిత్రగుప్త దేవాలయం ఉంది.
ఉత్తర భారత దేశంలో అరుదుగా ఉన్న చిత్రగుప్త దేవాలయాలు దక్షిణాదిన తమిళనాడులోని కాంచిపురంలో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్రగుప్తుడి దేవాలయం కేవలం ఒకే ఒకటి ఉంది. ఇంత అరుదైన దేవాలయం హైద్రాబాద్‌ పాతబస్తీ కందికల్‌ గేట్‌ ప్రాంతంలో ఉంది. అయినా స్థానికులు చాలా మందికి ఇక్కడ చిత్రగుప్త దేవాలయం ఉందన్న విషయం తెలియదు. చిత్రగుప్తుడి గుడి గంట మోగే శబ్దం వినిపించడం కన్నా వారికి చావు డప్పు, బంధువుల శోకాలు వినిపిస్తుంటాయి. దేవాలయం ముందు నుంచి తరచుగా పీనుగులను మోసుకెళ్లే పాడెలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే దేవాలయానికి కూత వేటు దూరంలోనే నల్లవాగు స్మశాన వాటిక ఉండటంతో ఈ మార్గం గుండానే అనేక శవయాత్రలు వెళాల్సి ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో సాంబ్రాణి పొగ వాసనకు బదులుగా శవం కాలుతున్న వాసనలే విపరీతం. పాతబస్తీలో ఇదే అతిపెద్ద స్మశానవాటిక అని చెప్పొచ్చు. అపుడపుడు కందికల్‌ గేట్‌ రైల్వే ట్రాక్‌ మీద ప్రమాదాలు జరిగి మృత్యువాత పడే జీవులెందరో. బహుశా ఆ భయంతోనే ఇక్కడ రాత్రిపూట పెద్దగా జనసంచారం ఉండదు. దీపావళి రెండో రోజు మాత్రమే ఘనంగా జరిగే ఉత్సవం తప్పించి మామూలు రోజుల్లో కూడా పెద్దగా పూజలు జరగవు.

దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం అని దేవాలయ పూజారీ రంచాచార్యులు చెప్పారు.అభిషేకం, ప్రత్యేక పూజలు జరుపుతామన్నారు. అకాల మృత్యువును జయించడానికి మాత్రమే కాదు ఆరోగ్యం, చదువు, పెళ్లి, సంతానం ఇలా అనేక వాటికి పరిష్కారం కోసం ఈ దేవాలయాన్ని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. కేతు గ్రహ దోష నివారణకు కూడా ఈ దేవాలయంలో పూజలు జరుగుతుంటాయని మరో పూజారీ చంద్రకాంత్‌ జోషి తెలిపారు. ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య కూడా అంతంత మాత్రమే.ఇంతటి విశిష్టమైన దేవాలయం అభివృద్ది కాకపోవడానికి వాస్తు దోషమేనంటారు ప్రముఖ వాస్తు నిపుణులు జాలిగామ నరేష్‌ కుమార్‌. తూర్పు ఆగ్నేయం పెరగడం,తూర్పు భారం,ఈశాన్యం బరువు, దక్షిణ నైరుతి గేటు తెరవడం వల్ల దేవాలయం ఖ్యాతి చెందడం లేదని ఆయన అన్నారు.

బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి విధులని ఆచరించాలి?


బ్రాహ్మణుడైన వాడు నిత్య ఆచార వంతుడై, అనుష్ఠాన పరుడై, స్వాధ్యాయమును సాగించుచూ క్రొత్త విషయములను వేదములనుండి గ్రహించుచూ, తనకు తెలిసిన వాటిని తెలియని వారికి తెలుపుచూ ఉండవలెను. తాను ఎంత శ్రమకు ఓర్చి అయినను నిత్యానుష్ఠాన,దేవతార్చనాదులను ఆచరించ వలెను. ఆవిధముగా ఆచరించినపుడు మాత్రమే అతడు “భూసురుడు” అన్న మాటకు తగిన వాడు అవుతాడు. అటులకాని వాడు భూలోకమున దేవతల రూపముధరించిన కలిపురుషుడే కానీ మరొకడు కాదు.

ఇక బ్రాహ్మణుడు నిత్యము ఏమేమి చేయాలి అన్నది చాలామందికి సందేహము. అది కొంత తీర్చే ప్రయత్నము చేద్దాము.

ప్రొద్దున్నే నిద్రనుండి ౪ గం.లకు లేవాలి. ప్రాతస్మరణము,శుభవస్తు దర్శనము చేసి, కాలకృత్యములు తీర్చుకుని, నదికి గానీ తటాకమునకు గానీ వెళ్లిస్నానమాచరించవలెను.

౧. స్నానము
౨.సంధ్యోపాసనము
౩.జపాదికము
౪.ఔపాసనము
౫. పంచాయతన దేవతార్చనము
౬.బ్రహ్మయఙ్ఞము
౭. వైశ్వదేవము
౮. పంచాయతనమునకు పునః పూజ
౯. అతిథిపూజ( భోజనము)
౧౦.భోజనము
౧౧.సత్సంగము
౧౨. సాయం సంధ్యావందనము
౧౩. సాయమౌపాసనము
౧౪. రాత్రి వైశ్వదేవము
౧౫. రాత్రి దేవతార్చనము

ఇవిగాక స్వాధ్యాయము, అధ్యాపనము, యజనము-యాజనము, దానము-ప్రతిగ్రహణము,నైమిత్తికములు,శాంతులు, నిత్య లౌకిక కృత్యములు మొదలైనవి నిత్యము చేయాలి

ప్రస్తుత కాలంలో మంచి లక్షణాలు కలిగిన బ్రాహ్మణులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు.
బ్రాహ్మణులకి ఉండవలసిన, ఉండకూడని లక్షణాలు ఏమిటి ?.

దైవాధీనం జగత్ సర్వం | మంత్రాధీనంతు దైవతం ||
తన్మంత్రం బ్రాహ్మణాధీనం | బ్రాహ్మణో మమ దేవత ||

ఈ జగత్తు మొత్తము దైవము యొక్క అధీనంలో వుంటుంది.
ఆ దేవతలు మంత్రముల ద్వారా సంతృప్తి చెంది, ఆ మంత్రములకు అధీనులై వుంటారు.
ఆ మంత్రము సాత్విక లక్షణములు కలిగిన బ్రాహ్మణుల అధీనంలో వుంటుంది.
అటువంటి బ్రాహ్మణులు దేవతా స్వరూపములు అని తెలుసుకోవాలి.

పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం చేత, మనుష్యులలో బ్రాహ్మణ జన్మ లభిస్తుంది. కానీ, లభించిన ఆ జన్మలో చెడు మార్గాల వైపు ప్రయాణం చేస్తూ వుంటే మాత్రం, అందుకు తగిన పరిహారం ఖచ్చితంగా చేల్లించుకోవాలి. వచ్చే జన్మ సంగతి ఎలా వున్నా, ఈ జన్మలోనే ముందు ఆ దోషముల ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఉద్యోగాలు చేసుకునే బ్రాహ్మణుల విషయం ఎలా వున్నా, కనీసం వైదికంలో వుండే బ్రాహ్మణులు (హిందూ ప్రీస్ట్) మాత్రం కొన్ని కనీస నియమాలు పాటించాలి. అవి పాటించటం కష్టం అనుకుంటే, వైదికవృత్తి వదిలేసి వేరే వృత్తి చూసుకోవటం మంచిది.

బ్రాహ్మణుడికి ఉండవలసిన కనీస లక్షణాలు :

యజ్ఞోపవీత (జంధ్యం) ధారణ :
కేవలం యజ్ఞోపవీతం ధారణ చేయటమే కాకుండా, దానికి సంబంధించిన నియమాలు పాటించాలి.

నిత్య సంధ్యావందనం :
నిత్యం ఖచ్చితంగా సంధ్యావందనము, గాయత్రీ జపము చేస్తూ వుండాలి.

శిఖా సంస్కారం (పిలక), చెవి పోగులు :
బ్రాహ్మణులకి శిఖా సంస్కారం (పిలక) మరియు చేవిపోగులు ఖచ్చితంగా వుండాలి. ఎవరైనా బ్రాహ్మణులు శిఖ లేకుండా బ్రాహ్మణ వృత్తి చేస్తూ వుంటే, అతనికి తన వృత్తి పట్ల, దేవతల పట్ల నమ్మకం లేదు అని తెలుసుకోవాలి. అంతే కాకుండా, అతను సమాజాన్నీ, భక్తులనీ మోసం చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. అతనిని గౌరవించవలసిన అవసరం లేదు. సంస్కారాలకి విలువ ఇవ్వనివాడు ఎంత చదువుకున్నా ప్రయోజనం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే శిఖ లేనివాడు బ్రాహ్మణుడే కాదు.

పవిత్రద్రవ్య ధారణ :
ముఖము నందు బ్రహ్మ తేజస్సు కనిపించాలి. ఎల్లవేళలా, నుదిటిన కుంకుమ లేక విభూది లేక గంధము ధరించినవాడై వుండాలి. వారిని చూస్తే గురు భావన కలగాలి.

ప్రశాంతంగా ఉండుట :
ఎప్పుడూ ప్రశాంతంగా వుండాలి తప్ప, కోపము, చికాకు, విసుకు, అయిష్టము, ద్వేషము వంటి గుణములు వుండకూడదు. నిగ్రహం లేనివ్యక్తి దేవతా అర్చానాదులకి అర్హుడు కాడు.

స్పష్టంగా మాట్లాడుట :
మాట్లాడే మాట స్పష్టంగా వుండాలి. మనస్సులో ఒకటి, బయటికి చెప్పేది వేరొకటి వుండకూడదు. సత్యమే మాట్లాడాలి. మాటలో వెకిలితనం, గర్వం, ఇతరులని నిందించటం వంటివి వుండకూడదు. అట్లాగే, ఇతరులకి చెడు కలిగే మాటలు మాట్లాడకూడదు.

చెడు వ్యసనములు లేకుండుట :
మాంసం, మద్యం, పొగ త్రాగటం, మత్తు పదార్థాలు నములుతూ వుండటం పనికిరాదు. పర స్త్రీ, పర ధనం గురించి వ్యామోహం వుండకూడదు.

సమ భావన :
ధనిక, బీద అనే తేడా లేకుండా అందరితో సమ భావన కలిగి వుండాలి.

కేవలం, పైన చెప్పిన లక్షణాలే కాకుండా ఇంకా అనేక అంశాలు వుంటాయి. కనీసం, పైన చెప్పిన లక్షణాలు వుంటే అతను మంచి బ్రాహ్మణుడు అని చెప్పవచ్చు. వైదికాన్ని (అర్చకత్వ, పురోహిత లేక ఆగమం) ఒక డబ్బు సంపాదించే వృత్తిగా మాత్రమే భావిస్తూ, డబ్బుతో బాటు చెడు వ్యసనాలు కూడా కలిగినవారిని గౌరవించాల్సిన అవసరం లేదు.

కానీ, నిస్వార్థంగా లోకశ్రేయస్సు కోసం దేవతా అర్చన, ఆరాధనలు చేస్తున్న బ్రాహ్మణులకు ఏ కష్టం రాకుండా కాపాడుకునే బాధ్యత సమాజంలో ప్రతి వ్యక్తి పైనా వుంది. బ్రాహ్మణులు, గోవులు సుభిక్షంగా వున్నంత కాలం లోకం సుభిక్షంగా వున్నట్లే అని గ్రహించాలి.

సప్తపది


saptapadi03ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటి చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పూరోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది. తలంబ్రాల కార్యక్రమం తర్వాత వధూవరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. ఇప్పుడు జరిగేది సప్తపది. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. పూరోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.

“సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం”
“సభాసప్తపదాభవ”

ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు.

మొదటి అడుగు..
“ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు”
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!”

రెండవ అడుగు..
“ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు”
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక

మూడవ అడుగు…
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.

నాలుగవ అడుగు..
“చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు”
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.

ఐదవ అడుగు..
“పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.

ఆరవ అడుగు..
“షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు ”
ఈ ఆరవ అదుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.

ఏడవ అడుగు..
“సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు”
ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక.

సప్తపది మంత్రార్ధం గురించి తెలుసుకుందాం..

“సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదా బభూవ! సఖ్యంతే గమేయం సత్యాత్, తేమాయోషం సఖ్యాన్నే మాయోష్మాః సమయావః సంప్రియౌ రోచిష్ణూ సుమన సుమానౌ! ఇష మూర్జం అభిసంపసానౌ సం నౌమనాంసి సంవ్రతా సమచిత్తాన్యాకరం”

“ఓ నా అర్ధాంగి! ఈ ఏడడుగులతో నీవు నా స్నేహితురాలవయ్యావు. ఈ స్నేహాన్ని ఎన్నటికీ వీడకుండా నాతో సహవాసిగా ఉండిపో. ఒకరినొకరు విభేదించక సమానమైన ఆలోచనలతో కలిసి ఉందాము. మన బంధం శాశ్వతమైనది. నీవు నన్ను ఎన్నటికీ విడిచిపోరాదు” అంటాడు వరుడు.

“సాత్వమసి అమూహం! అమూహమస్మి! సాత్వం ద్యౌః అహం పృధివీ! త్వమ్ రేతో అహంరేతో భృత్ ! త్వం మనో అహమస్మివాక్! సామాహమస్మి! ఋక్తం సా మాం అనువ్రతాభవ !”

” ఓ స్వామి! నీవు ఎప్పుడూ ఎటువంటి పొరపాటు చేయకుండా ఉండుము. నేను కూడా ఏ పొరపాటు చేయక నీతో కలిసి మెలిసి ఉంటాను. నీవు ఆకాశమైతే నేను ధరణిని. నీవు శుక్రమైతే నేను శోణితాన్ని. నీవు మనసైతే నేను వాక్కును. నేను సామవేదమైతే నీవు నన్ను అనుసరించే ఋక్కువు. మనిద్దరిలో బేధం లేదు. ఎప్పటికీ ఒక్కటే. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉందాము ” అని సమాధానమిస్తుంది పెళ్లి కూతురు.

ఎంత చక్కని సన్నివేశమిది..
భార్యను భర్త ఎలా ప్రేమించాలో, ఆదరించాలో , భర్తను భార్య ఎలా గౌరవించాలో వివాహ మంత్రాల్లొ స్పష్టంగా చెప్పబడింది. కష్టసుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవించడమే వివాహధర్మం. ప్రతీ వివాహంలో కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న కలతలు, కలహాలు సహజమే. అర్ధం చేసుకుని

గ్రహదోషాలు తొలగిపోవడానికి వివిధ రకాల స్నానాలు…………….


నవగ్రహాలలో ఒక్కో గ్రహం … దాని తాలూక దోషం … ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అందువల్ల గ్రహదోషం అనగానే వాటికి శాంతి చేయించడానికి నానారకాల అవస్థలు పడుతుంటారు. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను గురించి కూడా శాస్త్రాలు చెబుతున్నాయి.

కుంకుమ – ఎర్ర చందనం కలిపిన ‘రాగిపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. కుంకుమ – గంధం కలిపిన నీటిని ‘శంఖం’తో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి. అలాగే గంధం – తిలలు కలిపిన ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానమాచరించడం వలన కుజదోషాల బారినుంచి బయటపడవచ్చు.

ఇక నదీ సాగర సంగమంలోని నీటిని ‘మట్టిపాత్ర’లో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు వదలిపోతాయి. మర్రి – మారేడు కాయలను బంగారుపాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఇక నువ్వులు … మినువులు కలిపిన ‘లోహపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు … పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాలను పాటించడం వలన ఆయా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.