సోమవతి అమావాస్య రోజున


శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు.

ఆ రోజు వెనుక ఉన్న కథ
దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ… ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.

శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి… తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు
శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే… సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.

ముహూర్తం ఖరారు చేసేటప్పుడు పంచకరహితం అంటే?


ఏదైనా ముహూర్తమును నిర్ణయించ దలచుకున్నప్పుడు ఆ ముహూర్తమునకు పంచక రహితం అయ్యిందో లేదో చూసుకోవాలి. ముహూర్త సమయానికి ఉన్న తిథి – వార – నక్షత్ర – లగ్న ములు అను నాలుగింటిని కలిపి తొమ్మిదిచే భాగించగా వచ్చిన శేషం 1 తప్ప మిగిలిన బేసి సంఖ్యలైతే శుభం.
అదే శేషం 1 అయితే మృత్యు పంచకం. ఇది అస్సలు మంచిదికాదు. ఆ ముహూర్తమునకు చేసే శుభకార్యము వలన మృత్యువు సంభవించ వచ్చును.
2 అయితే అగ్ని పంచకం. దీని వలన అగ్నిప్రమాదములు జరుగుతాయి.
4 అయితే రాజ పంచకం. అనుకోని అవాంతరాల వలన కార్యం ఆగిపోవచ్చు.
6 అయితే చోర పంచకం. కార్యక్రమంలో కొన్ని దొంగలచే దొంగిలించ బడతాయి.
8 అయితే రోగ పంచకం. కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు రోగముచే బాధపడతారు.


కనుక శేషంగా 1,2,4,6,8 అను ఐదు సంఖ్యలు ( పంచకములు ) వస్తే అవి శుభప్రదం కాదు. ఆముహూర్తమును వదిలి పెట్టవలెను.
అయితే తప్పని సరి పరిస్థితులలో …..
చోర రోగ త్యజే రాత్రౌ దివారాజాగ్ని మేవచ
అహోరాత్రం త్యజేత్ మృత్యుః పంచకాని విచారయేత్
అని చెప్పుటచే చోర, రోగ పంచకములను రాత్రి ముహూర్తంలో త్యజించాలి( పగలైతే ఉపయోగించ వచ్చును ). రాజ, అగ్ని పంచకములను పగటి ముహూర్తాలలో వదిలివేయాలి ( రాత్రి స్వీకరించ వచ్చును ). మృత్యు పంచకమును ఎల్లప్పుడూ వదిలివేయాలి.
మృత్యు, అగ్ని, రాజ, చోర, రోగ ములను ‘పంచకము’ అంటారు. ఇవి ‘రహితం’ చేసుకుని ముహూర్తము నిర్ణయించడాన్నే ” పంచక రహితం ” అంటారు.
ఉదాహరణ : 19- 01-2012 సా.గం. 17-04 ఏదైనా శుభముహూర్తం నిర్ణయించాలనుకున్నాం.
ఈ సమయానికి ( ముహూర్తానికి ) పంచక రహితం అయ్యిందో లేదో చూద్దాం.
తిథి మొదలైనవి పంచాంగంలో చూసుకోవాలి.
19 తేదీ నాడు గురువారం, ఏకాదశి రా. 7.30 వరకు, అనూరాధ నక్షత్రం రా. 7-10 వరకు ఉన్నాయి. ఈ రోజు సా. 03-14 నుండి 05-26 వరకు మిథున లగ్నం ఉంది.
వారం గురువారం – ఆదివారంనుంచి మొదలుపెడితే గురువారం ఐదవది. అనగా దీని సంఖ్య 5 అవుతుంది.
తిథి సాయంత్రం 7-30 లోపే మన ముహూర్తం ఉంది కనుక ఏకదశి తిథినే తీసుకోవాలి. తరువాత అయితే ద్వాదశి తిథిని తీసుకోవాలి. ( కొందరు సూర్యోదయానికి ఉన్నతిథినే ఆ రోజంతా లెక్కించాలి అంటున్నారు. కానీ అది సరి అయినది కాదు. ఆ సమయానికి ఏ తిథి ఉంటే అదే తీసుకోవాలి. ) కనుక ప్రస్థుతం ఏకాదశి తిథి. అంటే పాడ్యమి నుండి మొదలు పెడితే ఏకాదశి 11 వ తిథి అవుతుంది. అనగా దీని సంఖ్య 11 అవుతుంది.
నక్షత్రం అనూరాధ. అశ్వని మొదలు అనూరాధ 17 వ తార. కనుక దీని సంఖ్య 17 అవుతుంది.
లగ్నం మిథునం. మేషం మొదలు మిథునం 3 వ రాశి కనుక దీని సంఖ్య 3 అవుతుంది.
ఇప్పుడు ఇవన్నీ వరసగా రాసుకుని కూడదాం.
తిథి + వారము + నక్షత్రము + లగ్నము
ఏకదశి + గురువారం + అనూరాధ + మిథునం
11 + 5 + 17 + 3 = 36 దీనిని 9 తో భాగహరించాలి.
9) 36 ( 4
36
—–
శేషం      0
—–
సున్నా అంటే 9 గా భావించాలి. తొమ్మిది ‘బేసి` సంఖ్యకనుక ఈ ముహూర్తానికి పంచక రహితం అయినది.

బ్రహ్మేశ్వరాలయం


ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామం మరియు మండలం. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కి. మీ. దూరంలో ఉంది.

భృగు మహర్షి ” బ్రహ్మకు ఎక్కడా పూజింపబడవని ” ఇచ్చిన శాపం కారణంగా బ్రహ్మ దేవునికి ఎక్కడా కూడా ఆలయాలు ఉండవు. కానీ రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం ,కాశీ లో ఒక ఆలయం, ఇక్కడ మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చేబ్రోలు ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మ కు ఆలయాలు ఉన్నాయి.
పరమేశ్వరుని తో కూడిన బ్రహ్మ ఇచట దర్శనమిస్తారు కనుక బ్రహ్మేశ్వరాలయం అని పిలువబడుచున్నది.

రెండు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని శ్రీ రాజ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కట్టించారని చెప్పుచుందురు . ఇచట బ్రహ్మ తనకు గల నాలుగు ముఖాలతో నలువైపులా చూచు చుండును .