సూర్యాంజనేయం


శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.

బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

సూర్యశిష్యరికం :

బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

సూర్యుపుత్రునికి స్నేహితుడు :

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.

సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.

సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.

సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.

త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.

Advertisements

అక్షయ తృతీయ


వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా “అక్షయ తృతీయ” నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. 

అటువంటి పవిత్ర పర్వదినమైన “అక్షయ తృతీయ” ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.

ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.

ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.

అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపురంగు చీర లేదా ఎరుపురంగు వస్తువులు అనాధలకు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతకు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిది.

అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. అక్షయ తృతీయనాడు పండ్లు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ఉన్నత పదవులు లభిస్తాయి. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది.

ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది.

ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాలమరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది.

గోధుమ బియ్యంతో ప్రసాదం : 
అక్షయ తృతీయ నాడు సంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలిస్తుంది. కుబేరలక్ష్మి, లక్ష్మీ నారాయణన్, లక్ష్మీ నరసింహ పటాల ముందు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమతో చేసే స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చును.

అలాగే పుణ్య తీర్థాల్లో స్నానమాచరించడం వల్ల వేయి గోమాతలను దానం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా పెద్దలచే ఆశీస్సులు పొందడానికి ఇది ఉత్తమమైన రోజని పండితులు చెబుతున్నారు.


“అక్షయ తృతీయ” అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే “తృతీయ” తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి

అష్టభైరవులు


అష్టభైరవులు

భైరవులు ఎనిమిది మంది.
1. అసితాంగభైరవుడు
2. రురుభైరవుడు
3. చండబైరవుడు
4. క్రోధబైరవుడు
5.ఉన్మత్తభైరవుడు
6. కపాలభైరవుడు
7. భీషణభైరవుడు
8. సంహారభైరవుడు.

ఈ ఎనిమిది మంచి శ్యామలా, ఛండీ యంత్రాలలో కూడా పూజింపబడే దేవతలు. వీరు రక్షక స్వరూపాలు. తీవ్రమైన నాదశక్తి, తేజశ్శక్తి కలిగినవారు భైరవులు. మార్తాండభైరవుడు – ఆదిత్య స్వరూపుడు. కాలభైరవుడు – శివస్వరూపం. ఆ భైరవులు అంశలుగా వీరిని భావించవచ్చు

పాప విమోచన ఏకాదశి


చైత్ర బహుళ ఏకాదశిని ” పాప విమోచన ఏకాదశి” లేక ” సౌమ్య ఏకాదశి” అని అంటారు. పూర్వం కుబేరుని పుష్పవాటికలో అప్సరసలు విహరించసాగారు. ఎంతో సుందరమైన ఆ పుష్పవాటికలో దేవతలతో పాటు మునీశ్వరులు కూడా తపస్సు చేస్తు ఉంటారు. ఆ పుష్పవనానికి చైత్ర,వై శాఖమాసాలలో ఇంద్రుడు తన పరివారంతో వస్తూ ఉంటాడు. ఆ వనంలో మేధావి అనే పేరు గల ఓ మునీస్వరుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు.

ఇంద్రుని పరిజనంతో పాటు వచ్చిన వారిలో మంజుఘోష అనేఅప్సరస , మేధావి ముని తపాస్సుకు భగ్నం చెయ్యాలని చూస్తూ ఉండేది. ఒకరోజు ఆమే పట్ల మోహావేశుడైన మేధావి,తపస్సును వదిలి ఆమేతో గడుపుతూండగా,ఒక రోజు మంజుఘోష తన లోకానికి వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వమని అడిగింది. ఆమే అలా అడిగినప్పుడు అల్లా అతను వద్దు అని అంటూ ఉండేవాడు. అలాగ 57 సంవత్సరాలు 9 నెలలు 3 రోజులు గడిచాయి. చివరకు ఆమే తనతో గడిపిన కాలాన్ని లెక్కవేసుకొమని చెప్పగా, లెక్కలు వేసుకున్న మేధావి ఇన్ని సంవత్సరలు వ్యర్ధం అయిపొయాయని చింతించి, కోపావేసంలో ఆ అప్సరసను శపించాడు. మేధావి శాపానికి మంజుఘోష శాపవిమోచనాన్ని అభ్యర్దించింది. పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందని చెప్పిన మేధావి ,తన తండ్రి సలహాను అనుసరించి,తను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తగిన ఫలితం పొందాడు.

ఈ రోజున పొద్దున్నే సూర్యొదయానికి ముందు లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానము ఆచరించి, ఆ రోజు ఉపవసం ఉండి, ఎదైన ఆలయం దర్సించుకుని, విష్ణు సహస్రనామ పారయణం పఠనం అనంతమైన ఫలితం కలిగిస్తుంది.

పాప విమోచన ఏకాదశి
ఓం నమో భగవతే వాసుదేవాయ

దుర్వాసమహర్షి


దుర్వాసమహర్షి యొక్క చరిత్ర మహాభారతంలో కనపడుతోంది. ఇతరపురాణాలలో కనపడుతుంది. రామాయణంలో కూడా వీరియొక్క ప్రస్తావన ఉన్నది. మహాభారతంలో కృష్ణ పరమాత్మ దుర్వాస మహామునియొక్క మహిమను తాను స్వయంగా పేర్కొంటాడు. అంతేకాదు హస్తినకు దూర్వాసుల వారు వచ్చినప్పుడు తాను సత్యభామాసహితుడై రథంపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తాడు. దూర్వాస మహర్షియొక్క మహిమ అంపశయ్య దగ్గర భీష్ముడి సన్నిధిలోనే వివరిస్తాడు మొత్తం. దుర్వాసమహర్షి గురించి చెప్తూ అలా శివసహస్రంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే శివాంశ సంభూతుడు దూర్వాస మహర్షి.

దూర్వాసుల వారు ఎవరి పుత్రుడు అంటే దత్తాత్రేయుల వారితో పాటే అత్రి అనసూయలకు తనయుడిగా కలిగినటువంటి మహానుభావుడాయన. అత్రి అనసూయలకు త్రిమూర్తులూ కూడా తనయులుగా కలిగారు. అందులో బ్రహ్మాంశ చంద్రుడిగానూ, విష్ణ్వంశ దత్తాత్రేయుల గానూ, రుద్రాంశ దూర్వాస మహర్షిగానూ, వచ్చినది. మూడూ కలిసి ఒకే పరబ్రహ్మ వస్తువు. అందులో సందేహమేమీ లేదు. అయితే దత్తాత్రేయ ఉపాసన, దత్తాత్రేయ పరంపర ఒకటున్నది. దుర్వాస మహర్షికి కూడా పరంపర ఉండి ఉండాలా? చరిత్ర ఏమిటి? అని పరిశీలిస్తే ఆశ్చర్యకర అంశములు మనకు ఎన్నోఎన్నో తెలుస్తూ ఉంటాయి. దుర్వాస మహర్షికి శ్రీవిద్యలో ఒక పేరున్నది. క్రోధభట్టారకుడు అని పేరు ఆయనకి. భట్టారకుడు అంటే పూజ్యుడు, గౌరవనీయుడు అని. అమ్మవారిని కూడా పరాభట్టారికా అని అంటున్నాం కదా! క్రోధం అనే దానిని సుగుణం జేసి కీర్తిస్తున్నారట. గొప్ప కోపిష్టిగారొచ్చారండి అని అంటారా? కానీ క్రోధభట్టారక అనడం కూడా సంతోషమే. అలా అంటే ఆయనకి క్రోధం రాదట. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశమే. పురాణాలు పరిశీలిస్తే అనేకచోట్ల దుర్వాస మహర్షి శపించడాలు కనపడుతూ ఉంటాయి. లోకవ్యవహారంలో కూడా ఎవరైనా కోపిష్టి కనపడితే వాడు దుర్వాసుడండీ అంటారు.

అప్పటికి ఏదో వీళ్ళకి దుర్వాసుడు తెలిసినట్లు. కానీ మహర్షుల శాపాలు అనుగ్రహం యొక్క మరొక రూపాలు. అయితే మన్యుశక్తి అని ఒకటుంది పరమేశ్వరుడికి. “నమస్తే రుద్ర మన్వవా” అని మన్యు సూక్తంలో చెప్పబడుతూ ఉంటుంది. మన్యుసూక్తంలో చెప్పబడుతున్న మన్యుశక్తి యేదో ఈశ్వర స్వరూపమే గనుక తదంశ దూర్వాసుల వారిగా వచ్చిఉండవచ్చు. త్రిపురా రహస్యంలో దత్తాత్రేయ స్వామివారే స్వయంగా జీవన్ముక్తుల గురించి చెప్తూ జీవన్ముక్తులైనవారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు అన్నప్పుడు కొన్ని విశేషణాలు వివరిస్తూ దూర్వాసుడి గురించి ప్రస్తావన చేస్తారు పరశురాముల వారితో. త్రిపురారహస్యమే శ్రీవిద్యా గ్రంథం. అందులోకూడా దూర్వాసుల ప్రస్తావన మనకు కనపడుతున్నది. మహాభారతంలో దూర్వాసుడి ఉత్పత్తి కథ కనపడుతున్నది. అదేవిధంగా అత్రిఅనసూయల పుత్రుడు అని కూడా కనపడుతున్నది. పురాణాలలో రెండుచోట్ల కనపడే సరికల్లా పరస్పర విరుద్ధం అంటారు వెంటనే సమన్వయం చేతకాక. భారతంలో యేం కనపడుతోందంటే దుర్వాసమహర్షియొక్క ఆవిర్భావఘట్టం. పరమేశ్వరుడు ఒక మార్గడము(బాణం)తో త్రిపురాసురసంహార సమయంలో త్రిపురాలను దగ్ధం చేశాడు. ఆ బాణంయొక్క కొనయందు అగ్ని ఉన్నాడట. మొత్తం స్వరూపం విష్ణు స్వరూపం, కొనయందు అగ్ని ఉన్నాడు. అది జ్వలిస్తోంది. విష్ణువే అగ్నిగా జ్వలిస్తున్నాడు అనుకోవచ్చు. మొత్తంమీద బాణశక్తి విష్ణువే. విష్ణువే అయిన బాణశక్తి త్రిపురాలని దహించిన తర్వాత తిరిగి పరమాత్మ వద్దకు వచ్చిందట. పరమేశ్వరుడు దానిని తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నాడట.

ప్రకాశమైనటువంటి ఆ బాణం ఒళ్ళో పెట్టుకోగానే మహర్షులందరూ చూసి నమస్కరిస్తూ ఉంటే ఆ బాణం కాస్తా ఒక శిశువు(ఋషి) ఆకృతిగా మారిందిట. ఏమిటి ఈ స్వరూపం అంటే ఇతడే నా అంశయైనటువంటి దూర్వాసుడు అని సాక్షాత్ శివుడు చెప్పినట్లుగా మనకు మహాభారతంలో కనపడుతున్నది. అంటే బాణం ఎవరు? నిజానికి విష్ణువు కనబడుతోంది. కానీ అది రుద్రప్రయోగం గనుక రుద్రశక్తి లేకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ మనకి హరిహరాత్మక తత్త్వం కనపడుతున్నది. అతడే దూర్వాసుడు అని శివుడు చెప్పాడు అంటే దూర్వాసునిలో హరిహరాత్మక తత్త్వం ఒకటి ఉన్నదని ప్రస్తావన. పురాణములు మనకు ఆ తత్త్వసంకేతాలు ఇస్తూ ఉంటాయి. తర్వాత మనకు కనబడే మరొక కథ అత్రి అనసూయల పుత్రుడయ్యాడని.

యేది ఇందులో స్వీకరించాలి? అంటే రెండూ స్వీకరించాలి. ఏ అంశ అయితే అక్కడ ఉన్నదో అదియే అత్రిఅనసూయలకు పుత్రుడుగా ఉద్భవించినది అని గ్రహించుకోవలసినటువంటి అంశం. కనుక రెండూ స్వీకరించవలసినదే. ఎందుకంటే ఒక దివ్యత్వం భువికి అవతరించింది. అవతరించింది అంటే అంతకు ముందు లేదు అని కాదు కదా! అంతకు ముందున్నది వచ్చినది. కనుక అంతకుముందున్న దుర్వాస రూపమైనటువంటి ఆ దేవర్షి స్వరూపమేదైతే ఉన్నదో అది ఈరూపంగా వచ్చింది అని అన్వయించుకోవలసి ఉన్నది. అయితే అత్రి అనసూయల పుత్రుడైన దత్తులవారికి కూడా ఒక పరంపర మనం చెప్పుకుంటూంటాం. సంప్రదాయబద్ధమైన దత్త పరంపర ఒకటున్నది. ఇప్పుడు దత్తపరంపరలో అసంప్రదాయ ధోరణులు కొందరు వాడుతూన్నారు. కలి ప్రభావం చేత. కానీ దత్తపరంపర అని సంప్రదాయ ధోరణి ఉన్నది మనకి. అది వైదికమైన పద్ధతిలో ఉన్నటువంటిది. అవధూత సంప్రదాయానికి చెందినది. దత్తోపాసన. దత్తోపాసన అని ఒక పరంపర ఎలా ఉన్నదో దుర్వాస మహర్షియొక్క ఉపాసనా పరంపరకూడా ఒకటి ఉండవచ్చు అని సూచనలు మనకు అనేకం కనపడుతున్నాయి. చిత్రమేమంటే దూర్వాస మహర్షికి సంబంధించినటువంటి ఉపాసన ఆయన అనుగ్రహం పొంది వేదాంతవిద్యలో, శ్రీవిద్యలో ఉత్తీర్ణ దశకు వెళ్ళినటువంటి ఘట్టాలు మనకి కొన్ని కనపడుతూ ఉన్నాయి. దుర్వాస మహర్షికూడా ఒక ఉపాస్యమైనటువంటి ఈశ్వర స్వరూపమే కేవలం మహర్షితేజమే కాకుండా.

దూర్వాసుల వారి చరిత్ర మనం చూస్తే ఆయన సర్వలోక సంచారం యథేచ్ఛగా చేసినట్లుగా మనకు అనేకచోట్ల కనపడుతున్నది. అంబరీష చరిత్రలో కూడా ఆయన ఈలోకానికి వెళ్ళాడు, ఆలోకానికి వెళ్ళాడు అనేటప్పుడు ఆయన పరుగెడుతున్నాడనడం చూశాంగానీ ఇన్ని లోకాలకి ఎలా వెళ్ళగలిగాడు అని ఆలోచించామా? అంబరీష చరిత్రలో దూర్వాసుడు తగ్గినట్లు కనపడతారు. కానీ దాని పరమార్థం దానికున్నది. అక్కడ దూర్వాసుడేమీ తగ్గలేదు. అంబరీషుని గొప్పదనం బయటపడింది. అది ఒక సందర్భం. అంతమాత్రం చేత మహర్షిని మనం తక్కువ చేయరాదు.

గంగను భరించడంలో,చంద్రుని పొందడంలో ఈశ్వరుడు అంతర్యం?


గంగను భరించడంలో అంతరార్థం?
ఈ భూమండలంలో గంగానదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పలు కార్యాలు దిగ్విజయం చేసిన గంగానది యుగాలందు కలిగిన మార్పులలో ఒకసారి గౌతమమహర్షి పాపనివృత్తికై గోభస్మం నుండి ప్రవహించి గోదావరిగా మానవాళికి ఉపయోగకారిగా, వునీతులను చేస్తోంది. ఇలా గోదావరిగా భూలోకానికి వచ్చింది. ఆ సమయంలోనే ఆమె ప్రవాహం ఆపడానికి తన జటాఝాటంలో ముడివేసాడు గౌరీశుడు. అనేకానేక కార్యాలను నిర్వ హించిన ఘనత నదులలో గంగానదికి తప్ప మరే ఇతర నదులకు లేదు. అనేక అంశరూపాంశాలను పొంది ఒకదానికొకటి పొంతన లేని అనేక కార్యాలను సాగించిన గంగ, సరాసరి మానవాళి విషయంలో చంచలమైన మనసు వంటిది. మనస్సు అడ్డూ ఆపు మరచి నియమం హద్దు దాటి ప్రవహించే గంగా ప్రవాహంతో పోల్చుకుంటే, వేగాన్ని కట్టడి చేసేందుకే పరమేశుడు తన జటాఝాటంలో బంధించి వేగాన్ని నియంత్రించి లోకాలను హద్దులేని గంగా ప్రవాహం నుండి సంరక్షించాడు.అంటే మనస్సు వేగాన్ని మనం కూడా సరైన రీతిలో సంరక్షించకపోతే అదుపు లేక గతి తప్పి మనస్సు మనలను ముంచేస్తుందన్న నిగూడార్థం.

శివ-మహాపురాణము

చంద్రుని పొందడంలో అంతర్యం?
ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా మారిన కారణం మనకు విదితమే. తనకు కలిగిన పాప ప్రక్షాళన నిమిత్తం చంద్రుడు చేసిన తప: ప్రభావాన పరమేశుడు చంద్రుడిని ధరించి చంధ్రశేఖరుడయ్యాడు. పార్వతీశుని త్రినేత్రం అగ్నితో సమానం. సూర్య తేజస్సు కంటే అమిత తేజోమయం. సూర్యచంద్రులే ప్రపంచ ఉనికికి మూలం. మానవ జీవనాధారం. అలా ప్రగతికి, మనుగడకు, విశ్వానికి మూలాధారమైన సూర్య చంద్రులను తాను పొందడం ద్వారా ఈ సృష్టి తనలోనే నిక్షిప్తమై ఉన్నదనీ, ఈ సృష్టికి తానే మూలమనీ, అద్యంతాలు, మూలాధారం తానే అనీ సుస్పష్టం చేస్తున్నాడు

మహాభారతాంతర్గత మార్కండేయ కృత సుబ్రహ్మణ్య స్తుతి:


మహాత్మా! మూడులోకాలలో ప్రసిద్ధమైన కార్తికేయుని నామాలను వినగోరుతున్నాను అని యుధిష్ఠిరుడు అడుగగా మహాతప్స్వి, మహాత్ముడు అయిన మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు.

ఆగ్నేయుడు, స్కందుడు, దీప్తకీర్తి, అనామయుడు, మయూరకేతువు, ధర్మాత్ముడు, భూతేశుడు, మహిషాసురమర్దనుడు, కామజిత్తు, కామదుడు, కాంతుడు, సత్యవాక్కు, భువనేశ్వరుడు, శిశువు, శీఘ్రుడు, శుచి, చండుడు, దీప్తవర్ణుడు, శుభాననుడు, అమోఘుడు, అనఘుడు, రౌద్రుడు, ప్రియుడు, చంద్రాననుడు, దీప్తశక్తి, ప్రశాంతాత్ముడు, భద్రకృత్తు, కూటమోహనుడు, షష్ఠీప్రియుడు, ధర్మాత్ముడు, పవిత్రుడు, మాతృవత్సలుడు, కన్యాభర్త, విభక్తుడు, స్వాహేయుడు, రేవతీ సుతుడు, ప్రభువు, నేత, విశాఖుడు, నైగమేయుడు, సుదుశ్చరుడు, సువ్రతుడు, లలితుడు, బాలక్రీడనక ప్రియుడు, ఆకాశచరుడు, బ్రహ్మచారి, శూరుడు, శరవణోద్భవుడు, విశ్వామిత్రప్రియుడు, దేవసేనా ప్రియుడు, అనే ఈనామాలను పఠించేవాడు స్వర్గాన్ని, కీర్తిని, ధనాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహంలేదు.