అభ్యాసంతోనే ఆత్మజ్ఞానం( యముడు, నచికేతునుఢు )


ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి చెబుతున్నాడు. మనస్సును ఎలా నడిపించాలో వివరిస్తున్నాడు….నీ శరీరమే రథం. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మనస్సు ఆ సారథి చేతిలో ఉండే కళ్లెం. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. విషయాలు, కోరికలే దారులు. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఆత్మనే జ్ఞానులు ‘భోక్త’ అని పిలుస్తున్నారు. అంటే ఆత్మ ఉనికికి ఈ మూడూ కారణమన్నమాట. అదుపులోలేని మనస్సుతో ఆత్మజ్ఞానం లేకుండా తిరిగేవాడి ఇంద్రియాలు సారథి అధీనంలో లేని అశ్వాల్లాగా విచ్చలవిడిగా యథేచ్ఛగా పరుగెత్తుతాయి. ఎవడు విజ్ఞానవంతుడై మనస్సును స్వాధీన పరచుకుంటాడో అతడి ఇంద్రియాలు సారథి అదుపులో ఉన్న గుర్రాల్లాగా సరైన దారిలో ప్రయాణిస్తాయి.


మనస్సును అదుపులో పెట్టుకోకుండా, విజ్ఞానం లేకుండా శారీరకంగా మానసికంగా అశుభ్రంగా ఉండేవాడు సంసారాన్ని దాటలేడు. పరమపదాన్ని పొందలేడు. చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవడు విజ్ఞానవంతుడై, మనస్సును అధీనంలో ఉంచుకుంటాడో శుచిగా ఉంటాడో వాడు మాత్రమే మళ్లీ జన్మించనవసరం లేని పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవడు విజ్ఞానాన్ని సారథిగా, మనస్సును కళ్లెంగా చేసుకుంటాడో ఆ మానవుడు సర్వవ్యాప్తమైన పరమపదానికి చేరుకుంటాడు. ఇంద్రియాల కంటే విషయాలు, విషయాలకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ బలమైనవి.

ఆత్మ కంటె అవతల ఉండేది అవ్యక్తం. అవ్యక్తానికి పైన ఉండేది పరమ పురుష స్థితి. దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ గూఢంగా కనపడకుండా ఉంటుంది. సూక్ష్మమూ, ఏకాగ్రమూ అయిన బుద్ధితో తపస్సుతో సాధన చేసేవారికి మాత్రమే అది గోచరిస్తుంది. సాధకుడైన మానవుడు జ్ఞానవంతుడై తన వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో, ఆత్మను పరమశాంతమైన పరమాత్మలో లీనం చేసుకోవడం అభ్యాసం చెయ్యాలి.

వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?


గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. “ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?”

“మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించృ పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కదైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ” అని చెప్పాడు సూతుడు.

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి. ఓం గం గణపతయే నమః