దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర

పతివ్రత అయిన సతీసుమతి ఒక మహర్షి శాపం వల్ల ఆ మరునాటి సూర్యోదయాన తన భర్త అయిన కౌశికుడు చనిపోతాడని, తన పాతివ్రత్య మహిమతో సూర్యోదయాన్ని ఆపేసింది. సూర్యుడు ఉదయించక పోయేప్పటికి లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. అప్పుడు అత్రి మహర్షి భార్య సతీ అనసూయాదేవి సుమతిని ఒప్పించి, సూర్యుని ఉదయింపజేసి, మరణించిన కౌశికుని తన పాతివ్రత్య మహిమతో బ్రతికించింది. సూర్యుడు ఉదయించేలా చేసి, లోకాలను రక్షించినందుకు దేవతలు, త్రిమూర్తులు ఆమె వద్దకు వచ్చి, ఏం కావాలో కోరుకోమన్నారు. అంతకు ముందే చాలా కాలం అత్రి అనసూయ దంపతులు త్రిమూర్తులను సంతానంగా పొందగోరి చాలా కాలం తపస్సు చేశారు. ఇప్పుడు త్రిమూర్తులు వరమిస్తామనగానే, త్రిమూర్తులు తమకు బిడ్డలుగా పుట్టాలని కోరారు. త్రిమూర్తులు వారి అంశలను ఆమెలో ప్రవేశపెట్టారు. బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు పుట్టాడు. ఈశ్వరుని అంశతో దుర్వాస మహర్షి జన్మించాడు, శ్రీ మహావిష్ణువు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు జన్మించేటప్పుడు బ్రహ్మ దేవుని నుంచి ఒక కళను, పరమశివుని నుంచి ఒక కళను తీసుకుని, తన కళ మూడవదిగా, త్రిమూర్తుల కళలతో, మూడు శిరస్సులతో, ఆరు చేతులతో, డమరుకం, త్రిశూలం మొదలైన త్రిమూర్తుల ఆయుధాలను ధరించి, నుదుటిన విభూతి రేఖలతోను, విష్ణు నామంతోను ప్రకాశిస్తూ విచిత్రమైన బాలునిగా జన్మించాడు.

మరొక పురాణ కథనం ప్రకారం స్వర్గలోకంలో – ఆ కాలంలో భూలోకంలో ఉన్న నారీమణులందరిలోకి ఎవరు పరమ పతివ్రత ? అనే చర్చ వస్తే, సతీ అనసూయాదేవి పరమ పతివ్రత అని నిర్ధారించారు. అప్పుడు త్రిమూర్తులు తాము ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించి, నిరూపించాలని తలచి ముగ్గురు సన్యాసులలా రూపము ధరించి, అనసూయాదేవి ఆశ్రమానికి అతిథులుగా వచ్చారు. ఆమె గృహస్థ ధర్మం ప్రకారం వారిని పూజించి, భోజనం చెయ్యమని అడిగింది. వారు ఆమెతో “నీవు వివస్త్రగా పెడితే, స్వీకరిస్తాము” అన్నారు. ఆమె తన పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులను పసిబిడ్డలుగా మార్చి, పాలు త్రాగించింది. అలా త్రిమూర్తులను పసిబిడ్డలుగా చేసి ఉయ్యాలలూపింది, త్రిమాతలను తమ కోడళ్ళుగా పొందింది.

శ్రీ దత్తాత్రేయుని రూపం అసామాన్యమైనది. అది త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించిన తత్త్వం. మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు.
అత్రి కుమారుడు కావడంతో ఆయనను ఆత్రేయుడంటారు.

దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి గొప్ప అవధూత, మహాజ్ఞాని, చిరంజీవి, యుగయుగాలకు ఆదర్శమూర్తిగా ఉంటూ లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. మానవ జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. శ్రీ దత్తాత్రేయుడు సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. మహర్షులందరూ తమకు బ్రహ్మ జ్ఞానం బోధించమని ఆయన వెంట పడ్డారు. గురువు వచ్చిన వారిని పరీక్షించి కానీ, అనుగ్రహించడు కదా! దత్తాత్రేయుడు వారిని పట్టించుకోకుండా అరణ్యంలోకి వెళ్ళి ఒక సరస్సులోకి ప్రవేశించి, వెయ్యి సంవత్సరాలు ఆ నీళ్ళల్లో ఉండిపోయాడు. ఆ మహర్షులు ఆయన నీటిలోంచి బైటికి వచ్చే దాకా అక్కడ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన బైటికి రాగానే, ఇప్పుడైనా మా శ్రద్ధను గమనించావు కదా ! నీ శిష్యులుగా స్వీకరించు. కావాలంటే మమ్మల్ని ఇంకా పరీక్షించు అన్నారు. ఆయన ఒక పాము పుట్టలోకి ప్రవేశించి, కొంత కాలానికి చేతిలో మద్యపాత్ర పట్టుకుని తాగుతూ ఒక స్త్రీతో కలిసి బైటికొచ్చాడు. ఆ మహర్షులు అతనిని ఆ స్థితిలో చూసి, అసహ్యాంచుకుని, ఇటువంటి వాడు మనకు గురువేమిటని భావించి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా తమను పరీక్షించటానికేనని భావించి, ఆయన కాళ్ళ మీద పడి గురువుగారూ ! మమ్మల్ని పరీక్షించటం చాలు, అనుగ్రహించమని ప్రార్ధించిన వారిని బ్రహ్మ జ్ఞానముతో అనుగ్రహించాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి భార్య అనఘాదేవి అనీ, ఆమె సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి దేవి అనీ భక్తులు భావిస్తారు. పురాణాలలో మధుమతీ సమేత దత్తాత్రేయుని గురించి చెప్పారు. అంటే దత్తాత్రేయుని శక్తి “మధుమతి” అన్నమాట.

త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడం వలన, శ్రీ దత్తాత్రేయుని రూపం మూడు శిరసులతో సందేశాత్మకమై ప్రకాశిస్తూ ఉంటుంది.

దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు తత్త్వోపదేశం చేస్తూ, ప్రకృతిలోని ప్రతి శక్తీ మనకు గురువులేనని బోధిస్తూ, భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని, అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలనీ, కొండచిలువలా భ్రాంతిలో పడకూడదనీ, స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, పట్టుదలను ఏనుగు నుంచి, చేపనుంచి త్యాగచింతనను నేర్చుకోవాలనీ, మానావమానాలకు సమస్పందనఅలవరచుకోవాలని బోధించారు. సాలెపురుగు నుంచి సృష్టి, స్థితి, లయకారకుడు పరమాత్మేనని తెలుసుకోవాలన్నాడు. సీతాకోక చిలుకలా ఆత్మానందాన్వేషణ అలవరచుకోవాలనీ, చంద్రుడి నుంచి వృద్ధిక్షయాలు శరీరానికే కాని ఆత్మకు కావని గ్రహించాలనీ, ఆర్తులను కాపాడే చింతనను నీటినుంచి గ్రహించాలనీ, చీమలా జిహ్వ చాపల్యానికి లోనుకారాదని తెలుసుకోవాలని వివరిస్తూ 24 మంది గురువుల గురించి బోధించాడు. ఇవన్నీ అందరికీ గురువులని చెప్పి, వీరందరినీ తనకు గురువులుగా ప్రకటించిన జ్ఞానానందమయుడు, జగద్గురువు దత్తాత్రేయ స్వామి!

శ్రీ దత్తాత్రేయ స్వామి సతీమదాలస యొక్క మూడవ కుమారుడైన అలర్కుడికి యోగవిద్య నేర్పించాడు, ఓంకారోపాసనా విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను, ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞాన రహస్యాన్ని ప్రసాదించాడు. కార్తవీర్యార్జునునికి కూడా ఆధ్యాత్మిక విద్యను బోధించాడు.

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పదహారు అవతారాలను గురించి ‘దత్తపురాణం’ చెబుతోంది. శ్రీపాదవల్లభులు, శ్రీనృసింహ సరస్వతి, శ్రీ అక్కల్‌కోట మహరాజ్‌, శ్రీమాణిక్య ప్రభువు, షిరిడీ సాయిబాబా, గజానన మహరాజ్‌, శ్రీకృష్ణ సరస్వతీ మహరాజ్‌, వాసుదేవానంద సరస్వతీ మహరాజ్, నిత్యానంద సరస్వతీ, స్వామి సమర్థ మొదలైన వారిని శ్రీ దత్తావతారాలుగా దత్తచరిత్ర చెబుతోంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా గురు చరిత్రగా పారాయణ చేస్తారు.

పద్ధెనిమిది పురాణములలోను శ్రీ దత్తాత్రేయుని ప్రసక్తి ఉన్నది. మత్స్య పురాణం, స్మృతి కౌస్తుభములలో దత్తచరితము విస్తృతంగా ఉంది.

భక్తులు శ్రీ దత్తజయంతిని భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుపుకుంటారు. దత్తాత్రేయ స్వామి ‘ఉగ్రదేవత’ అని గర్గసంహిత చెబుతున్నది. ఉగ్రత్వము అజ్ఞానము మీదనే ! అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును కలిగించే జ్ఞానమూర్తి, గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆయనకు గురువారం అత్యంత ప్రీతికర దినమని చెబుతారు. ఆ స్వామికి ఇష్టమైన వృక్షం మేడివృక్షం. ప్రేమ, అహింస, భూతదయ, త్యాగశీలత, ఆత్మజ్ఞానం మనుషులకు రక్షణ కవచాలన్న దత్తాత్రేయుడి సందేశాలు సర్వ మానవాళికి సర్వదా ఆచరణీయం. 🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

Make any Suggitions