వివాహానికి బ్రహ్మ పురాణం ఆధారముగా శ్రీ అపర్ణాదేవి వివాహ చరిత్ర


వైవస్వత మన్వంతరములో మేనకా హిమవంతులకు ఉమ అను పేరుతో పార్వతి జన్మించెను.పూర్వజన్మలో సతీదేవిగను, తర్వాత జన్మలో ఉమాదేవిగను పార్వతి ప్రఖ్యాతి పొందెను.గిరిజాపుత్రికగా జన్మించిన పిమ్మట శివ పార్వతులకు ఏ విధముగా వివాహము జరిగెనో వివరింపుమని మునులు బ్రహ్మగారిని అడిగిరి.సర్వసిద్ధిప్రదమైన ఉమాశంకరుల కథ చెప్పెదను వినుమని బ్రహ్మగారు చెప్పుట ప్రారంభించెను.

హిమవంతుడు పుత్రులకై తపస్సు చేయచుండగా శివుడు ప్రత్యక్షమై ముగ్గురు పుత్రికలను వరముగా ఇచ్చితిని అని అంతర్ధానమయ్యెను. ప్రధమ పుత్రిక పాటల. ద్వితీయ పుత్రిక ఏకపర్ణా. తృతీయ పుత్రిక అపర్ణా. ఈ మువ్వురు శివుని వివాహము చేసుకొనవలెనని ప్రయత్నించుచుండిరి.

బ్రహ్మగారు ప్రధమ, ద్వితీయ పుత్రికలకు శివునితో వివాహము జరగదని అపర్ణతో శివుని వివాహము జరగగలదని చెప్పెను. ఈ అపర్ణ ఉమ అను పేరుతో ముల్లోకాలలో కీర్తి పొందును అని చెప్పెను.అపర్ణ నిరాహారిగ ఉండిపోయెను. తల్లి బాధతో “ఉ” మా = వద్దు అని నివారించెను. అప్పటి నుండీ పార్వతి ఉమ గా పిలువబడుచున్నది.

ఓ దేవీ నీ యొక్క తపస్సుచే లోకములన్ని దద్దరిల్లుచున్నవి. నీచే సృష్టించబడిన ఈ ప్రపంచమును చేయవద్దని ఉమ తల్లి మేనక ప్రార్థించెను.నీవు ఎవరికొరకు తపస్సు చేయుచుంటివో వారే స్వయముగా వచ్చి నిన్ను వరింపగలడని బ్రహ్మగారు చెప్పెను.
కైలాసవాసి చరాచర ప్రభువు అప్రమేయుడు చంద్రునితో కూడినవాడు, ఇంద్రునితో సమానుడు, మూడవ కన్ను కలవాడు అయిన మహేశ్వరుడే శివుడని పార్వతికి బ్రహ్మ చెప్పెను. నీ తపస్సుకై నీకు అనువైన ప్రదేశముకు వెళ్ళమని బ్రహ్మగారు ఉమకు చెప్పెను.

ఓ సుందరీ! నీవు శీఘ్రముగా దండకారుణ్యమునకు వెళ్లి నీలలోహితుడైన శివుని గూర్చి తపమాచరింపుమని దేవతలు చెప్పిరి.అపుడు పార్వతి
నా తపస్సు వృథా కాకుండా శివుడే భర్త కాగలడని నిశ్చయించుకుని తల్లిదండ్రులకు, దేవతలకు, బ్రాహ్మణులకు ప్రదక్షణము చేసి పార్వతి దండకారుణ్యమునకు బయలుదేరెను.

పార్వతి తపస్సు చేయచుండగా శివుడు :-
వికృతరూపము, పొట్టి చేతులు, బాహువులు, భిన్నమైన నాసిక, పొట్టివాడు, పింగళ వర్ణములు కేశములతో శివుడు పార్వతి ఎదుట నిలబడెను.

పార్వతి యోగశక్తి ద్వారా శివుడు వచ్చెనని కనుగొని మానసికపూజ గావించెను. మనస్సుతోనే షోడశోపచారములను గావించెను.

ఓ దేవా! నేను స్వతంత్రురాలుని కాను. తండ్రి అధీనములో ఉన్నదానిని. నీవు నా తండ్రి వద్దకు వెళ్లి నీ కుమార్తె అపర్ణను నాకిచ్చి వివాహము జరిపించమని విన్నవింపుడని అపర్ణ చెప్పెను.

ఆ మాటలు విని వికృతాకారముగా హిమవంతుని వద్దకు వెళ్లి అడిగెను. మరల ఉమ వద్దకు వచ్చి తన తండ్రి చెప్పిన మాటలను ఈ విధముగా చెప్పెను.

నీ తండ్రి స్వయంవరములో అపర్ణ నిన్ను భర్తగా స్వీకరింపగలదని చెప్పెను.శివుని మాటలు విని పార్వతి రుద్రునిపై మనస్సు లగ్నము చేసి మరల తపస్సు ప్రారంభించెను.

అపుడు బ్రహ్మ గారు ప్రత్యక్షమై ఉమతో ఇట్లు పలికెను.నాయందు నీకు సందేహము వలదు. ఇచటనే శివుని వరునిగా పొంది నీ కోరిక నెరవేరునని చెప్పెను.

బ్రహ్మ పార్వతి చేతికి పుష్పమాలను యిచ్చి, శివుడు నిన్ను వరించు సమయమునకై వేచి ఉండమని బ్రహ్మ పలికెను. మరియు
ఈ పుష్పమాల తో శివుని వరింపగలవు. నీకు ముసలితనము ఉండదు. అమరత్వము సంభవింపగలదని వక్కాణించెను.

కోరిన రూపము గలదానా! కోరికతో పూవులను ఆభరణముగా చేసి ధరించితివి. ఆ ఫలితమును నీవు పొందగలవు.
ప్రాణములను లెక్క చేయకుండా నీవు చేయి తపస్సుకు విఘ్నములు కలుగవని చెప్పి బ్రహ్మగారు అంతర్థానమయ్యెను.
ఆ తరువాత శివుని కెదురుగా రాతిపై నిలిచి మనస్సు లఘ్నము చేసి తపస్సు చేయిచుండెను.

ఆ సమయములోఆశ్రమమునకు దగ్గరలో సరస్సు తీరమున బాలుని యొక్క ఆర్తనాదము వినిపించెను.
దేవదేవుడైన శివుడు స్వయముగా బాలుని రూపము ధరించి సరస్సునందు ఆడుచుండగా మొసలి బాలుని యొక్క కాలుని పట్టుకొనెను.

యోగమాయను కల్పించి ప్రపంచము ఉద్భవించుటకు కారణభూతుడైన శివుడు బాల రూపముతో ఈ క్రింది విధముగా మాట్లాడెను.

నాకు ఏ కోరిక తీరకుండగనే మొసలి నన్ను తీసుకొనిపొవుచున్నది. నేను బాలుడను. ఈ మొసలి బారినుండి రక్షింపుడని ఆర్తనాదము చేసెను.
మొసలి పట్టుకొనుటచే నా ముఖము పాలిపోయినది. నా ప్రాణములు ఈ మొసలి చేతిలోనే అంతమగునని దుఃఖించుచుండెను.

తపస్సు చేయిచున్న పార్వతిని చూచి ఓ దేవీ! నీవే నా తల్లివి. తండ్రివి. మొసలి పట్టుకుని నన్ను చంప ప్రయత్నిస్తున్నదని అఱచుచున్ననూ నీకు వినబడలేదా!
నా తల్లిదండ్రులకు ఏకైక పుత్రుడను. ప్రియమైనవాడిని. నేను ప్రాణములు విడిచినచో నా తల్లిదండ్రులు ఎంతగా దుఃఖింతురో గదా!

పార్వతి ఆ బాలుని యొక్క ఆర్తనాదమును విని సరస్తీరమున ఉన్న బాలుని చూచెను.
ఆ బాలుడు ముగ్ధ మనోహరాకృతి కలిగి యుండెను. భయపడుచున్న బాలుని చూచి సరోవరములోనికి దిగెను.

ఓ మొసలీ! ఈ బాలుడు అతని తల్లిదండ్రులకు ఏకైకపుత్రుడు కావున వెంటనే విడిచిపెట్టుమని పార్వతి అడిగెను.
ఓ దేవీ! బ్రహ్మ నాకు మధ్యాహ్న భోజనముగా ఈ బాలుని స్వీకరింపుమని చెప్పెను, నీ తపస్సును ధారపోసినచో విడిచెదనని మొసలి చెప్పెను.

మొసలికి నమస్కారము చేయుచూ పార్వతి నా తపస్సును నీకు ధారపోసెదను ఈ బాలుని విడిచి పెట్టెదవా అని అడిగెను.

నీ తపస్సును దానము చేసిన విడిచెదనని మరల మొసలి పార్వతితో చెప్పెను.
జన్మ మొదలకుని ఇప్పటివరకు సంపాదించిన పుణ్యము నీకు ధారపోసెదను. బాలుని విడిచిపెట్టుమని మొసలిని ఆతృతతో పార్వతి అడిగెను.
వెంటనే మొసలి యొక్క ముఖము మధ్యాహ్న సూర్యుని వలే ప్రకాశించెను.

ఓ దేవీ! నీవు బాగుగా ఆలోచించి చెప్పుచుంటివి గదా! మరల పుణ్యము సంపాదించుట కష్టమే కదా! అని మొసలి పార్వతిని అడిగెను. బ్రాహ్మణ బాలుని కొఱకు నీ తపస్సు ధార పోయుచుంటివి. నీకేమైనా వరము కావలెనో కోరుకొమ్మని అడిగెను.
అపుడు పార్వతి నేను మరల తపస్సు చేసి పుణ్యము సంపాదించగలను. అందువలన నాకేమీ కోరిక లేదని చెప్పెను.

నాచే ఈయబడిన ఈ దానము తిరిగి తీసుకొనబడదు. నీవే అనుభవించు. బాలుని విడిచిపెట్టుమని పార్వతి అడిగెను.ఉమాదేవి అడిగిన విధముగా బాలుని విడిచిపెట్టి మొసలి అంతర్థానమమయ్యెను.మొసలి చేత విడిపింపబడిన బాలుడు కలలో చూచుచున్నట్లుగా బాలుడు కూడా అంతర్థానమమయ్యెను.

మరల పార్వతి తపస్సు చేసుకొనుటకై సన్నద్ధమగుచుండెను.మరల తపస్సు చేయిటకై వెళ్ళుచున్న పార్వతిని చూచి శంకరుడు తపస్సు చేయవద్దని వారించెను.

నీచే ఈయబడిన ఈ తపోదానము వలన నీ తపస్సు అక్షయమగును. భవిష్యత్తులో అనేక విధములుగా ఈ తపోదానము ఉపయోగపడునని శంకరుడు పలికెను.నీయొక్క తపఃఫలము అక్షయమగునని శివుని వద్ద వరము పొంది పార్వతి స్వయంవరమునకు సంతోషముగా బయలుదేరెను.

ఈ కథను ఎవరైతే పఠిన్తురో వారికి వెంటనే వివాహము కాగలదు. ఆ తర్వాత గణేశుడు, కుమారస్వామి వంటి పుత్రులు కలిగెదరని శిలా రూపమున ఉన్న పార్వతిని పూజించిన వారికి సమస్త కోరికలు తీరునని చెప్పి శివ పార్వతులిద్దరూ అంతర్థానమయ్యెను.

అపర్ణ అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అను గ్రామములో కలదు. ఈ గ్రామం అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో కలదు. శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.

Advertisements

ప్రతి నిత్యము మరియు సమస్యలు వచ్చినప్పుడు పటించవలసిన స్తోత్రము / ప్రార్దనలు


ఉదయం నిద్ర లేచిన తరువాత
“కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజ
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్”

ఉదయం భూప్రార్ధన
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”

మానసిక శుద్ది
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”

ఉదయం కరదర్శనం
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం”

స్నాన సమయంలో
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు”

భోజనానికి ముందు
“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే”

భోజన తరువాత
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం

ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి
“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ”

అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి
“ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా”
మరియు / లేక “క్రీం అచ్యుతానంత గోవింద”

విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి
“ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి”

విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం
“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ”

ప్రారంబించిన పనిని విజయ వంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా”

చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“శ్రీ రామ జయరామ జయజయ రామరామ”

అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం
“ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:”

ఉద్యోగం లొ ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి
“ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా” మరియు / లేక “శ్రీ రాజ మాంతాంగై నమ:”

ఉత్తమ భర్తను పొందుటకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”

ఉత్తమ భార్యను పొందుటకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”

వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”

అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం”

బ్బాయిలకు వివాహాం తోందరగా జరగడానికి
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”

స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి
“హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్”

వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి
“శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”

కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
“ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం”

కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యంగ ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి
“ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ” లేక
“సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని”

కుటుంబ సమస్యలతో దూరమైన భర్త ను పొందడానికి మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి
:ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
మే వశ్యం కురు కురు స్వహా”

ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:”

సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః”

ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక”

ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం

“దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని”

సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం
“నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల”

ఐదు అక్షయ నిధులు(ఈ ఐదు నిధులనూ ఏ చోరులూ దోచుకోజాలరు)


శీలం శౌర్యమనాలస్యం పాండిత్యం మిత్రసంగ్రహః
అచోర హరణీయాని పంచైతాన్యక్షయో నిధిః.”

“శీలము, శౌర్యము, ఆలస్యము చేయకుండుట, పాండిత్యము, స్నేహితులను సంపాదించుకొనుట అనునవి దొంగలు దోచుకొనుటకు సాధ్యముకాని ఐదు అక్షయనిధులు.” అని ఈ శ్లోకానికి అర్థం.

“శీలం పరం భూషణమ్ ” (శీలమే శ్రేష్ఠమైన అలంకారము) అని పెద్దలమాట. శీలమంటే సజ్జనసమ్మతమైన నడవడిక. “ఉత్తమ శీలాన్ని వదలటం కంటే – ఎత్తైన పర్వతాగ్రం నుంచి రాతినేలమీద దూకి చనిపోయినా మంచిదే, విషసర్పం నోటిలో చేయి పెట్టి, దానికాటుతో మరణించినా మంచిదే, అగ్నిలో దూకి చనిపోయినా మంచిదే” అని చాలా పదునుగా చెప్పాడు భర్తృహరి. అందుకే శీలం ఒక గొప్ప నిధి.

శౌర్యం ఆత్మాభిమానానికి చిహ్నం. ధైర్యం, సాహసం, పరాక్రమం, ఈ పాదులోనివే. ఈ లక్షణం ఉన్నవాడు జీవితంలో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. శత్రువులను అదుపు చేసుకోగలుగుతాడు. మంచి పనులను చేయటంలో తన శౌర్యాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు. ఈ గుణం ఒక అమూల్యనిధి.

అనాలస్యం అంటే, “జంతూనాం నరజన్మ దుర్లభమ్” అనే సూక్తిని స్మరిస్తూ, ఈ జీవితపరమ ప్రయోజనాన్ని ఈ జీవితంలోనే అందుకోవటానికి తగిన ప్రయత్నాలను ఆలస్యం లేకుండా వెంటవెంటనే చేయటం. ఇది మోక్షహేతువు. అందుకే సద్గతినిచ్చే ఈ సద్గుణం అద్భుత నిధి.

కేవలం ఎన్నో గ్రంథాలు చదవటం పాండిత్యం కానేరదు. పాండిత్యం అంటే జ్ఞానమే. జ్ఞానానికి నిదర్శనం సర్వులలో దైవాన్ని దర్శించటం. ఆముష్మిక సుఖాన్నిప్రసాదించే ఇలాంటి విద్వత్తు ఒక అమేయనిధి.

మిత్రులను సంపాదించుకోవటం అపురూపమైన కళ మాత్రమేకాదు, మనలోని సౌజన్యానికి ఒక తార్కాణం. మిత్రలాభం ఎంత ప్రయోజనకారియో “పంచతంత్రం” మనకు వివరించింది. అఘము నుండి మరలించి , హితార్థ కలితులను చేసే మిత్రులను కలిగి ఉండటం అద్వితీయమైన నిధి.

ఈ ఐదు నిధులనూ ఏ చోరులూ దోచుకోజాలరు. ఇవి అక్షయనిధులు. అనగా ఏనాటికీ నశించిపోనివి.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు?


ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి “ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?” అని అడిగారు. అందుకాయన… “అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది.” వాళ్ళిద్దరూ భయంతో… “అంటే అక్కడ పులి ఉందా?” అని అడిగారు.
“కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది.” అన్నాడాయన.”ఇంతకీ ఏమిటది?” అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. “బంగారు నాణేల గుట్ట” అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా “ఎక్కడ?” అని అడిగారు.

“అదిగో ఆ పొదల్లోనే” అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. “ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?” అన్నాడొక మిత్రుడు.

“అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం.” అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. “ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు.” అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… “వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు” అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు. “పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను.” అనుకునిఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. “సన్యాసి మాటలు ఎంత నిజమో కదా” అనుకున్నాడు చివరి క్షణాల్లో.

గమనిక: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత్త.