జగదంబిక

ప్రధానాంశ స్వరూపా సా కాళీ కమలలోచనా దుర్గా లలాట సంభూతా రణే శుంభ నిశుంభ యోః అర్థాంశ స్వరూపా సా” – దుర్గాదేవియొక్క అర్ధాంశ స్వరూపిణి. ఈవిడ అమ్మవారి ఆరవ ప్రధాన అంశ స్వరూపంగా శోభిల్లుతోంది. ఈమె తన తేజస్సులోనూ, గుణాలలోనూ దుర్గతో సమానురాలు. అర్థాంశ అయినప్పటికీ సమానురాలు. ఇక్కడ అంశ అనగానే భాగం అని అనుకోకుండా ఉండడానికి “దుర్గ అర్థాంశ స్వరూపా సా గుణేన తేజసా సమా” అన్నారు వ్యాసులవారు. అర్థాంశ స్వరూపమైనా గుణంలో, తేజస్సులో దుర్గతో సమానమైన తల్లి అని దాని అర్థం. “కోటి సూర్య సమాదృష్ట పుష్ట జాజ్జ్వల్య విగ్రహా” – నల్లని దేహంతో ప్రకాశిస్తున్నప్పటికీ ఈ జగదంబిక తనువునుండి వచ్చే కాంతులు మాత్రం కోటి సూర్యకాంతులు వెదజల్లుతున్నాయి.

10372103_303938006432334_7956285139745063274_n 1150942_616979491684786_946775769_n

ఇప్పుడు చెప్పిన శక్తులన్నింటిలో ప్రధాన శక్తి కాళికాదేవి. ’బలాబలవతీ పరా’ – ప్రతివారియందూ బలస్వరూపంతో ఉన్న ఈ తల్లిని తలచుకుంటేనే మనకు పుష్టి, బలం లభిస్తాయి. ’సర్వసిద్ధి ప్రదా దేవీ పరమా యోగరూపిణీ’ – ఈ తల్లి ముఖ్యంగా యోగస్వరూపిణి; కాల స్వరూపిణి, కాల చైతన్యాన్ని మనం కాళీ అని ఉపాసన చేస్తున్నాం. ఈ తల్లిని “ధర్మార్థ కామ మోక్షాంచ దాతుం శక్త్యా సుపూజితా” అని బ్రహ్మాదులు, మునులు, మనువులు, నరులు స్తోత్రం చేస్తూ ఉంటారు. మనువులు అంటే 14మంది మనువులే కాక మంత్రాలన్నీ (మనువులు అంటే మంత్రాలు అని అర్థం) ఆరాధిస్తున్నటువంటిది అని అర్థం.

అయితే దశమహావిద్యల్లో మొదట చెప్పే కాళీ మాహాకాళీ – ఆ తల్లి వేరు; శుంభనిశుంభ సంహార సమయంలో అమ్మవారి లలాటం నుంచి ఉద్భవించిన కాళీ గురించి చెబుతున్నారు. ఇక్కడ కాళీ ఉపాసనలో అనేక వైవిధ్యాలున్నాయి. మళ్ళీ ఒక్కొక్క తల్లికీ ప్రత్యేక అవతారాలున్నాయి.

మనందరినీ ఆదుకునేది ఆ జగన్మాతే అనే భావన మనలో కలిగినప్పుడు అమ్మకు మనం దూరంగా లేమన్న అనుభూతి వస్తుంది. అమ్మదయ ఏమిటో అప్పుడు మనకు తెలుస్తుంది. అమ్మ ప్రతిరూపమూ, ప్రతి నామమూ కూడా దయకు సంకేతం. ఆ తల్లి ఎవరయ్యా అంటే – కరుణ అని శంకర భగవత్పాదులు “సౌందర్యలహరి”లో “జగత్ త్రాతుం శంభోర్జయతి కరుణా కాచి దరుణా” అన్నారు.

ఇదేమాటను మూకకవి “కారణపర చిద్రూపా కాంచీ పురసీమ్ని కామపీఠగతా! కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబ కోమలాంగ లతా” – కాంచీపురంలో ఒకానొక కరుణ ఎర్రని శరీరంతో తిరుగుతోందన్నాు. అమ్మ అనలేదు, శక్తి అనలేదు.

ఇక్కడ ఒకానొక అంటే అనిర్వచనీయమైన కరుణ అని అర్థం. ’అమ్మదయ ఇలాగ ఉంటుంది’ అని మనం నిర్ణయించలేం. అపారమైన, అనిర్వచనీయమైన, అఖండమైన కరుణ అరుణగా కాంచీపుర పట్టణంలో విహరిస్తోంది అని భావనచేశారు. మూకకవి రచించిన “మూకపంచశతి”లో ప్రథమశ్లోకం ఇది.

Make any Suggitions