గీత సప్తమాధ్యాయ పారాయణ(శంకు కర్ణుడు)

పూర్వం పాటలీపుత్రమనే నగరంలో శంకు కర్ణుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు. అతడు తన బ్రాహ్మణ వృత్తిని వదిలిపెట్టి, ధనాశతో వివిధ కార్యకలాపాలను చేసి కాలం గడుపుతూ వుండేవాడు. అతడొకనాడు బంధువులతో కలిసి పొరుగు ఊరికి పోతూ, పాముకాటుకు గురై మరణించాడు. వెంటనే అతడొక సర్పమై పుట్టి, పూర్వజన్మ ధనాశా సంస్కారపు వాసన విడువక, ముందు జన్మలో తాను భూమిలో దాచిన నిధిని సంరక్షించడానికి అక్కడే నివసిస్తూ ఉన్నాడు.

ఒకనాటి రాత్రి కుమారులకు కలలో కనిపించి, “నాయనలారా! నేను మీ తండ్రిని. ధనంమీద వ్యామోహంతో సర్పాన్నై, ఆ నిధిని కాపాడుతూ మన పెరటిలోనే ఉన్నానని చెప్పాడు. మరునాడు తెలతెలవారుతూనే కొడుకులు, తండ్రి చెప్పిన ప్రదేశాన్ని గునపాలతో త్రవ్వసాగారు.

అంతలో ఒక బిలంనుంచి ఆ సర్పం లేచి, “నాయనలాా! ధనాశతో నాకు పట్టిన ఈ దీనదశనుంచి నన్ను ఉద్ధరించండి. భగవద్గీత సప్తామాధ్యాయ పారాయణయే నన్ను ఈ దశనుండి సద్గతికి చేర్చగలదు” అని చెప్పింది. పుత్రులు ఆ విధంగానే చేసి, పామురూపంలో ఉన్న తండ్రిని ఉద్ధరించారు.

గీతానం సప్తమాధ్యాయ మన్తరేణ సుధామయం!
జన్తోర్జరా మృత్యు దుఃఖ నిరాకరణ కారణమ్!!

గీత ఏడవ అధ్యాయం అమృత పూర్ణం. పారాయణ చేసిన జీవులు జన్మ, జరా, మృత్యు దుఃఖాలనుండి విముక్తులు కాగలరని గీతావాక్కు. శంకుకర్ణుని పుత్రులు గీత సప్తమాధ్యాయ పఠనం చేయడంవల్ల తండ్రి సర్పజన్మ నుండి విముక్తిపొంది, దివ్యలోకాలకు చేరుకున్నాడు. పుత్రులు తండ్రి దాచిన ధనాన్ని అంతా దాన ధర్మాలకు వినియోగించారు. సచ్చీలురై నిరంతరం సప్తమాధ్యాయ పారాయణతో భగవత్ జ్ఞానాన్ని పొంది ముక్తులయ్యారు.

సప్తమాధ్యాయ జపతోముక్తి భాజో భవం స్తతః!
దేవమిష్టతమం జ్ఞాత్వా నిర్వాణార్పిత బుద్ధయః!!

కనుక గీత సప్తమాధ్యాయ పారాయణ వల్ల మానవులే కాక పితృదేవతలు, సర్పాది జన్మలెత్తిన వారు కూడా మోక్షగాములవుతున్నారు అని తెలుస్తోంది.

Make any Suggitions