దేవతా గణాలు – ( యక్షులు )

యక్షులు అనగానే వాళ్ళు దెయ్యాలేమో అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. కానీ మన శివ పంచాక్షరీ స్తోత్రంలో శివుడిని స్తుతిస్తూ “యక్ష స్వరూపాయ” అని అంటాం కదా!శివుడు దేవుడు. కాబట్టి వాళ్ళెవరో కూడా గొప్పవాళ్ళే అయ్యుంటారు. ఈ యక్షుల ప్రస్తావన మన పురాణాలలో కూడా చాలా సార్లు వస్తుంది కనుక వారి గురించి మరిన్ని ఆసక్తికరమయిన విషయాలు చదువగలరు.

విషయానికి వస్తే, వీరు దేవతా గణాలలో ఒకరు. వీరి నివాసం అథో లోకాలలో ఒకటయిన తలాతలం (అతలంలో పిశాచ గణాలు, వితలంలో గుహ్యకులు, సుతలంలో రాక్షసులు, రసాతలంలో భూతాలూ, తలాతలంలో యక్షులు, మహాతలంలో పితృదేవతలు, పాతాళంలో పన్నగులు ఉంటారు.(అయితే ఇవన్నీ “తలాలు”. (Dimensions)” అలానే, గోమాతలో సకల దేవతలు, దేవతా గణాలన్నీ ఉన్నాయి.అలా చూసుకుంటే వీరి నివాసం గోమాత యొక్క వామ భాగం. వరాహ పురాణంలో ఒక్కో దేవతా గణానికీ ఒక్కో పర్వతం నిలయంగా ఉంటుందని చెప్పబడింది. దాని ప్రకారం వీరి నివాస పర్వతం శతశృంగం.
………..వీరు ఎక్కడుంటారో తెలిసింది, కనుక ఎలా ఉంటారు? అన్నది తెలియాలి. వీరిలో మగ వారిని యక్షుడు అని, ఆడవారిని యక్షిణి అని అంటారు. వీరు సౌందర్యమయిన శరీరాకృతిని కలిగి ఇక్కడ చిత్రములో చూపిన విధముగా ఉంటారు. యక్షులకి కుబేరుడు రాజు. వీరి పని గుప్త నిధులకి కాపలా. వీరిని ప్రసన్నం చేసుకోగలిగితే మనం కోరుకున్నవి దక్కించుకోవచ్చు అని ఉత్థమారేశ్వర తంత్రంలో చెప్పబడింది. వీళ్ళల్లో యక్షిణులు అత్యంత శక్తి కలవారు. వారిని మనం ఆవాహనం కూడా చేసుకోవచ్చు. ఎన్నో యక్షిణీ సాధనలు ఉన్నాయి. మన మనుజులలోనే కొందరు గొప్పవారయిన సాధకులు అనేక యక్షిణీ సాధనల్లో, సాకార సాక్షాత్కారం పొందినవారే. అటువంటి సమయాల్లో వాళ్ళు మనిషి శరీరంలోకి చెవి ద్వారా ప్రవేశిస్తారుట. వీళ్ళు సాధారణంగా మంచి చేస్తూ శాంతంగా ఉంటారు . కానీ కొద్ది మంది రౌద్రంగా ఉండి చెడు చేస్తారుట.
యక్షులు మంచి కళాపోషకులు అని అంటారు. కాళిదాసు రచించిన మేఘదూతం (తెలుగులో మేఘసందేశం)లో యక్షుడు తన ప్రియురాలయిన యక్షిణిని వదిలి ఉండలేక ఆ విరహానికి చక్కని అక్షర రూపం ఇచ్చాడు. అలానే, మహాభారతంలో యక్ష ప్రశ్నల గురించి వినే ఉంటారు. అవి చదివితే అబ్బో వాళ్ళెంత తెలివయిన వాళ్ళో అనిపిస్తుంది. హరివంశ కావ్యాన్ని తెలుగులో రచించిన వారిలో ఒకరయిన

నాచన సోమన గారిని , ఘన నన్నయ భట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిణి దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్ అని కొనియాడారు పరవస్తు చిన్నయసూరి గారు…. మనకి బాగా తెలిసిన యక్షిణి “తాటకి”. సుకేతుడు అనే యక్షుడు పిల్లలకోసం తపస్సు చేసినపుడు నీకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న కూతురు పుడుతుంది అని బ్రహ్మ వరం ఇవ్వగా తాటకి పుట్టింది. ఈమెను ఝఝరుడను యక్షుని కుమారుడయిన సుందుడు కి ఇచ్చి పెళ్లి చేయగా వారికి మారీచుడు పుడతాడు. ఒకసారి సుందుడు అగస్త్యున్ని కొట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆయన ఆగ్రహంతో సుందుడిని భస్మం చేస్తాడు . అది భరించలేక తాటకి, మారీచుడు కలిసి అగస్త్యుని చంపడానికి వెళ్తే ఆయన వీరివురినీ రాక్షసులు అవ్వమని శపిస్తారు. అలా యక్షులు కాస్తా రాక్షసులుగా మారారు అని వాల్మీకి రామాయణంలో బాలకాండలో చెప్పబడింది.

మనకి బాగా తెలిసిన మరికొంతమంది యక్షులు మణిగ్రీవుడు, నలకూబరుడు. వీరిద్దరినీ మద్ది చెట్టులై పడమని ఒక ముని శపిస్తాడు. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి కృష్ణుడు రోలుని (యశోదా దేవి కృష్ణుడిని రాతికి కట్టినపుడు) పెట్టి లాగడం వలన వాళ్ళకి శాపవిమోచనం జరుగుతుంది.

యక్షులు దేవతా గణాలే అయినా కొంతమంది స్వార్థ పరులకి ఉపయోగపడటం వలన, వీరు రాత్రి పూట ఎక్కువగా విహరించటం వలన వీరిని భూతాల్లా భావిస్తున్నారు. కనీసం ఒక యక్షిణిని అయినా వశం చేసుకుంటే, కామ్యకాలయినా నెరవేరతాయి.

Make any Suggitions