మయూరధ్వజుడు

ధర్మరాజు అశ్వమేధయాగం చేసి హయాన్ని వదిలాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు యజ్ఞం చేసే చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్లే!పాండవులు వదిలిన యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు అతని నగరం చేరుకున్నారు.మయూరధ్వజుడు కృష్ణభక్తుడనీ, అతనితో యుద్ధం చేసేటప్పుడు అప్రమత్తంగా వుండాలని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. సరేనన్నాడు పాండవమధ్యముడు.

మయూరధ్వజుడు అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేశాడు. సవ్యసాచి అతన్ని సంబాళించలేక పోయాడు. విధి లేక శౌరి సాయం ఆర్థించాడు. పార్థసారథి కూడా యుద్ధంలోకి దిగాడు. మయూరధ్వజునికి తన ఆరాధ్యదైవంతో పోరాడటం ఇష్టం లేదు. కాని రణరంగంలో వెనుదీయడం క్షత్రియధర్మం కాదని తలచి “కృష్ణా! కృష్ణా!” అని నామస్మరణం చేస్తూ బాణాలు గుప్పించడం మొదలు పెట్టాడు. ఆ శరాల ధాటికి ఆ మహాయోగి కూడా చలించాడు.

“బావా! ఎందుకు సంకోచిస్తావు. నీ చక్రంతో మయూరధ్వజుని చంపలేవా?” అన్నాడు అర్జునుడు. పద్మనాభుడు మందహాసంతో “పార్థా! నీ గాండీవం గాని, నా సుదర్శనం గాని ఆ మహాభక్తుని మీద పనిచేయవు” అన్నాడు.

‘మయూరధ్వజుడు అంతటి భక్తుడా!’ అని గాండీవి విస్తుపోయాడు. మాధవభక్తులలో తనను మించిన వారు లేరని కృష్ణసఖునికి కించిత్తు గర్వముంది. అది మునుపే ఎరిగిన కృష్ణుడు మయూరధ్వజుని భక్తి ఎంత గొప్పదో అర్జునుడికి చూపించాలనుకున్నాడు. ఇద్దరూ అనాటికి యుద్ధం చాలించారు.

మరునాడు కృష్ణార్జునులు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులుగా వెళ్ళారు. విప్రుల రాక గమనించి ఆ రాజు వారికి ఎదురేగి గౌరవ పురస్కారంగా మర్యాద చేశాడు.

“అయ్యా! మీరు నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాడు. “రాజా! నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకొక పెద్ద ఆపద వచ్చిపడింది. అది తీరితేగాని మేము మరొక విషయం ఆలోచించలేము” అన్నాడు మాయారూపంలో ఉన్న కృష్ణుడు.

“స్వామీ! మీకు కలిగిన విపత్తేమిటో చెప్పండి. నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే నా ప్రాణమైనా ఇస్తాను” అన్నాడు మయూరధ్వజుడు.

“రాజా! మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుణ్ణి ఒక పులి పట్టుకుంది. అది ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత “మయూరధ్వజ మహారాజు శరీరంలో సగభాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు” అని అశరీరవాణి పలికింది. అందుకని నాకు పుత్ర భిక్ష పెట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అన్నాడు విప్రుని వేషంలో ఉన్న కృష్ణుడు.

“ఆహా! నా జన్మ తరించింది. ఒక పసిబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతోంది. ఇంతకంటే ఏం కావాలి. అయ్యా! సందేహించకండి. వెంటనే నా శరీరంలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళి పులికి ఆహారంగా ఇవ్వండి” అని వారిని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే భార్యాబిడ్డల్ని పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా కోయమన్నాడు.

మయూరధ్వజుడు ఏదో మహత్తర కార్యక్రమానికి తన శరీరాన్ని వినియోగించబోతున్నాడని వారికి అర్థమైంది. మారుమాట్లాడక రాజుగారి శరీరాన్ని చేదించడం ప్రారంభించారు.

కృష్ణార్జునులు అనిమిషులై ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అలా చూస్తుండగా వారికొక వింత కనిపించింది.

మయూరధ్వజుని ఎడమ కంటి నుండి నీటి చుక్కలు రాలసాగాయి. అప్పుడు కృష్ణుడు తెచ్చిపెట్టుకున్న కఠిన్యంతో “రాజా! బాధపడుతూ నువ్వేమీ నీ శరీరాన్ని నాకివ్వనవసరం లేదు. మనస్ఫూర్తిగా , సంతోషంగా చేస్తేనే ఏదైనా త్యాగమవుతుంది. ఎదుటివాడి కష్టాన్ని చూసి కన్నీరు కార్చడంలో దివ్యత్వముంటుంది. మనల్ని చూసి మనం దుఃఖించడం నైచ్యమౌతుంది. మనమీద వున్న మమకారాన్ని మనం చంపుకోలేక పోవడం దీనికి కారణం. నీ కిష్టం లేని పనిని నీవు చెయ్యవద్దులే” అని వెనుదిరిగాడు.

మయూరధ్వజుడు కృష్ణుని చేతులు పట్టుకుని, “అయ్యా! నా శరీరం అర్పిస్తున్నానని నాకు బాధలేదు. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నాకే నిజంగా బాధ వుంటే రెండు కళ్ళూ కూడా నీరు కార్చాలి కదా! ఒక కంటి నుండి మాత్రమే నీరు వస్తోంది. ఎందుకో ఆలోచించారా? నా శరీరంలో కుడిభాగం ఆర్తరక్షణకు అర్పితమవుతున్నదనీ , వామభాగానికి ఆ భాగ్యం కలగలేదని ఎడమకన్ను దుఃఖిస్తోంది. ఒంటరిగా మిగిలిపోయిన తాను ఏ పరమార్థాన్నీ సాధించకుండానే, ఎవరికీ ఎట్టి ప్రయోజనాన్నీ కలిగించకుండానే ఖిలమైపోవాలి కదా అని చింతిస్తోంది” అన్నాడు.

ఈ మాటలు విని కృష్ణుడు అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. ఇదంతా తనకు గర్వభంగం చేయడానికి అచ్యుతుడు ఆడిన నాటకమని గ్రహించి సిగ్గుపడ్డాడు.

పునీతుడైన ప్రియబాంధవునితో సహా కృష్ణుడు తమ నిజరూపాలు తెలియజెప్పి మయూరధ్వజుని దీవించాడు. ఆ రాజు శరీరానికి పూర్వపు స్థితిని కలుగచేశాడు.

మయూరధ్వజుడు యాగాశ్వాన్ని అర్జునునికి అప్పగించి మాధవుడికి పాదాభివందనం చేశాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s