ఆలయాలలో దానం చేయవలసిన వస్తువులు

ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.

ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.

చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు. కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.

దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు. పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.

వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది. పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి. నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.

దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s