సింధూరుడు యుద్ధంలో వినాయకుని చేతిలో మరణిస్తాడు

ఒకనాడు సత్యలోకంలో బ్రహ్మ సుఖంగా కూర్చొని ఆవులించాడు. ఆ ఆవులింతనుండి భయంకర రూపంతో ఒక పురుషుడు పుట్టాడు. ఆశ్చర్యపడిన బ్రహ్మ తన ముఖంనుండి పుట్టినందున అతనికి సింధూరుడు అని పేరు పెట్టాడు. స్వేచ్ఛగా తిరుగునట్లు, ముల్లోకాలలో జయం తప్ప అపజయం కలుగకుండేలా ఆశీర్వదించి సకల శస్త్రాస్త్రాలననుగ్రహిస్తాడు. పుత్ర వ్యామోహం బాగా పొంగిరాగా, అతను ఎవరినైనా బంధిస్తే బంధితుడు భస్మమగునట్లు వరమిస్తాడు. ఇక సింధూరుడు ఏమాత్రం కష్టపడకుండా, అనాయాసంగా, అనాయాచితంగా శక్తి, వరాలు, శస్త్రాస్త్రాలు పొందేసరికి, అతడు మదమత్తుడై గర్వపోతై, తామస ప్రవృత్తి గలవాడవుతాడు. తండ్రి అని కూడా చూడక ఆ వర ప్రభావమును తండ్రి మీదే ప్రయోగించ తలచి, బ్రహ్మను తన చేతులతో బంధించబోయాడు.

భయపడిన బ్రహ్మ వైకుంఠమునకు పోతాడు. అది తెలిసీ సింధూరుడు అక్కడికి పోయి విష్ణువుతో యుద్ధం చేయబోగా విష్ణువు మాయమాటలతో వానిని కైలాసానికి పంపుతాడు. కైలాసంలో శివుడు తపస్సమాధిలో ఉంటాడు. సింధూరుడు ప్రక్కనున్న పార్వతిని మోహంతో ఆ తల్లి జడ కొప్పు పట్టుకొని రసాతలానికి ఈడ్చుకొని పోతుండగా పార్వతీదేవి దుఃఖించసాగింది. ప్రమథగణమంతా పోయి శివుని వేడుకొనగా ఆయన సమాధినుండి లేచి ఆ ఘోర దృశ్యాన్ని చూసి క్రోధతామ్రాక్షుడై సింధూరునిపై త్రిశూలమును ప్రయోగిస్తాడు. పరమేశ్వరుని శక్తి ముందు సి౦ధూరుని శక్తి సన్నగిల్లిపోతుంది. ప్రాణభయంతో పార్వతీ దేవిని వదిలిపెట్టాడు. అపుడు పార్వతీ దేవి చతుర్భుజాలతో, సర్వాయుధాలతో, సకలార్థ సాధకుడైన, పాము ఉదరం వంటి ఉదరం గలవాడైన, సింహవాహనుడైన వినాయకుని స్మరించగా ఆ వినాయకుడు అవతరించాడు. వినాయకుడు, పార్వతీ దేవితో ‘నేనీ సి౦ధూరుని సంహరించుటకై నీకు కుమారునిగా అవతరిస్తా’నని చెప్తాడు. ఆ తరువాత గౌరీ తిథియగు తదియనాడు పార్వతీ దేవి గర్భమును ప్రవేశిస్తాడు. గర్భం దినదిన ప్రవర్థమవుతున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు విహారార్థమై వింధ్య పర్వ ప్రాంతాలకు వెళతారు.

సింధూరుడు ఋషుల ఆశ్రమాలు, చెట్లు, చెరువులు పాడుచేస్తూ, త్రిమూర్తులను గడ్డిపోచవలె చూస్తూ అహంకారంతో తిరుగుతుండగా అశరీర వాణి -“పార్వతీదేవియొక్క గర్భం నిన్ను చ౦పున”ని పలుకుతుంది. కోపంతో రెచ్చిపోయి సింధూరుడు వింధ్యాటవికి పోయి పార్వతీ పరమేశ్వరులను చూస్తాడు. మాయతో వాయురూపంలో తెలియకుండగా పార్వతీదేవి గర్భమును ప్రవేశించి, గోళ్ళతో గర్భంలోని శిశువు తలను ద్రుంచి బయట వింధ్య పర్వతం మీద పడవేసి వెళ్ళిపోతాడు.

ఇదంతా తెలియని పార్వతీ పరమేశ్వరులు కైలాసం చేరారు. పార్వతీదేవి నిండు చూలాలైనది. ప్రసవానకి ముందు ఆమెకు సింహవాహనుడైన వినాయకుడు కనపడి దుష్టశిక్షణకు, మాతృశుశ్రూషకు తాను అవతరించబోతున్నట్లు చెప్పాడు. పార్వతీ దేవి ప్రసవించింది. పిల్లవాడు పుట్టాడు. కానీ శిరస్సులేదు. పార్వతీ దేవికి భయం, శోకం ముంచుకొచ్చాయి. ఈవార్త నందీశ్వరుని ద్వారా అంతటా పాకింది. దేవతలంతా గుమిగూడారు. అపుడు తటాలున శివునికి గజాసుర సంహారం, అతనికి ఇచ్చిన వరం గుర్తుకు వచ్చాయి. వెనువెంటనే గజాసుర మస్తకం తెచ్చి ఆ శిశువు మెండెమునకు శ్రీహరి అతికిస్తాడు. అప్పటినుండి వినాయకుడు గజాననుడైనాడు.

ఈ వార్తను నారదుడు సి౦దూరుని వద్దకు మోసుకెళ్ళి చెప్పగానే సింధూరుడు మండిపడి, మూర్ఛపోయి, ఆ పిల్లవానిని చంపుటకు వెళతాడు. నాల్గు చేతులతో నాల్గు ఆయుధాలు గల్గి సింహ వాహనుడై వెలిగిపోతున్న ఆ పసికందుని చూచి, ఆశ్చర్యపడి జాలిపడి “ముక్కు పచ్చలారని పిల్లవాడివి. నీవా నన్ను చంపేది? ముందు నీ ప్రాణం దక్కించుకో” అని అంటాడు. అప్పుడా పసి బాలుని రూపంలోనున్న వినాయకుడు “అత్యంత స్వల్పమైన దీపం మొత్తం చీకటిని నశింపజేస్తుంది. ఒక చిన్న అంకుశానికి పెద్ద మదగజం లొంగుతుంది. అలా మదోన్మత్తులు నశించక తప్పదు. అని తన నిజమైన విశ్వరూపం ప్రదర్శిస్తాడు. ఆ రూపం దర్శించి గూడ సింధూరుడేమాత్రం చలించక అజ్ఞానా౦ధకారంలోనే మునిగి, క్రోధావేశంతో తలపడి యుద్ధంలో వినాయకుని చేతిలో మరణిస్తాడు. వాహనమైన సింహం, సి౦ధూరుని రథ వాహనములైన .అశ్వాదులను తుదముట్టించింది. అప్పుడు బ్రహ్మాదులంతా వినాయకుని స్తుతించి, పూజించి, సత్కరించి కానుకలతో ముంచెత్తారు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s