ఉండ్రాళ్ల తద్ది

నోము కథ
పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.

ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ‘‘ఉండ్రాళ్లతద్ది’’ అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. ‘‘నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటు చేయ’’మని అడిగింది.

ఆమె ప్రతిజ్ఞను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది.

చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న ఉండ్రాళ్లను చేసి, నైవేద్యం పెట్టింది. అయిదు ఉండ్రాళ్లను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చింది. నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందడంత.. ఐదేళ్లు నిర్వఘ్నంగా నోము నోచుకుంటుంది. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది.

విధానం :
భాద్రపద తృతీయనాడు స్త్రీలు ఉదయాన్నే లేచి ముందుగా అభ్యంగన స్నానం ఆచరించాలి. సాయంత్రవరకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉపవాసం వుండాలి. బియ్యపు పిండితో తయారుచేసిన ఉండ్రాళ్లను చేసి, వాటిని వండుకోవాలి. గౌరిదేవిని పూజామందిరంలో ప్రతిష్టించుకున్న తరువాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

తరువాత ఐదు ఉండ్రాళ్లను గౌరిదేవికీ, మరో ఐదు ఉండ్రాళ్లను ఐదుగురు ముత్తైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సాలవరకు ఈ నోమును ఆచరించిన తరువాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు-పారాణి రాసి, వారి ఆశీస్సులను పొందాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు.

ఇతర విశేషాలు :
భాద్రపద బహుళ తదియరోజు స్త్రీలు సద్గతులు పొండానికి నిమిత్తం ఉండ్రాళ్ల తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి, నిర్వహించుకుంటారు. ఈ నోమును ‘‘మోదక తృతీయ’’ అనే మరో పేరు కూడా వుంది. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో.. ‘‘తద్ది’’ అనేమాట మూడవరోజు ‘‘తదియ’’ అనే అర్థంతో ఉపయోగించబడింది. దీంతో ఇది ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది.

భాద్రపదంలో పూర్ణిమ వెళ్లిన మూడోరోజున బహుళ తదియనాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు.. సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని ఐతహ్యం.

 

===============================================================================

మన తెలుగింటి ఆడపిల్లలు అందానికి ప్రతీకలు. ఒకొక్క వయసులో ఒకో రకం గా మనల్ని మురిపిస్తారు. చిన్న పిల్లలప్పుడు బుట్ట చేతుల గౌన్లు వేసుకుని ముద్దుగా ఉంటారు. ఇంకొంచెం వయసు వస్తే పట్టు లంగాలు జాకెట్లు వేసుకుని, పొడుగు జడలు వేసుకుని ఏంతో ముచ్చ్హటగా ఉంటారు. ఇలా ఒకొక్క ఏడాది వయసు పెరిగే కొద్ది వాళ్ళ అందచందాలతోనే కాకుండా ముద్దు మురిపాలతో, ఆట పాటలతో ఏంతో సందడిగా ఉంటారు. వారి ప్రత్యేకమైన ఆటలు –తొక్కుడు బిళ్ళ, అష్టా చెమ్మా, చెమ్మ చెక్క లాంటి ఆటలు ఊరి వారనందరిని ఎంతో ఆకట్టుకునేవి. కానీ ఈ ఆధునిక యుగం లో చిన్నప్పటి నుండే పోటి చదువులు మూడో తరగతి నుండే ఐ ఐ టి ఫౌన్డేషన్ కోర్స్ పరీక్షల ఒత్తిడి, రేంక్ లకై తల్లిదండ్రుల పరుగులాటలలో పడి మనం కూడా ఆడపిల్లల అచ్చట ముచ్చట మర్చిపోయి, చదువు సంధ్యలకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వడం మొదలు పెట్టాము. ఫలితంగా ఆడపిల్లల ప్రత్యేక పండగలైన ‘ఉండ్రాళ్ళ తద్ది’, ‘అట్ల తద్ది’ పండగలు పూర్తిగా మరుగున పడుతున్నాయి. ఈ ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది ఆడపిల్లల పండగలు. ఈ పండగలను ఊరులోని ఆడపిల్లలంతా కలిసి కోలాహలంగా జరుపుకుంటారు. రంగు రంగుల దుస్తులు ధరించి, ఉండ్రాళ్ళ తద్ది, అట్ల తద్ది నోములు నోచుకునేటప్పుడు కన్నుల పండుగ గా అగుపిస్తారు.

ఉండ్రాళ్ళ తద్ది భాద్రపద మాసంలో బహుళ తదియ నాడు అనగా సెప్టెంబర్ నెల 11 తారీఖున వస్తుంది. సరిగ్గా ఒక మాసం తర్వాత అనగా ఆశ్వీయజ మాస బహుళ తదియ నాడు అనగా విజయదశమి తర్వాత వచ్చే తదియ నాడు అంటే అక్టోబర్ 11 న అట్ల తద్ది జరుపుకుంటారు. ఈ రెండు పండగలను ఎందుకు కలిపి ప్రస్తావిస్తున్నానంటే ఈ రెండు పండగలు జరుపుకునే విధానం, ప్రాశస్త్యము ఒకటే కావడమే కాకుండా ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది కి శిక్షణ గా కూడా భావించబడేది. ప్రస్తుతం ముందుగా వచ్చే ఉండ్రాళ్ళ తద్ది గురించి మాట్లాడుకుని తర్వాత అట్ల తద్ది సమయం లో అట్ల తద్ది గురించి ప్రస్తావించు కుందాము.

ఉండ్రాళ్ళ తద్ది రెండు రోజుల పండగ. ఈ పండగను అయిదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల లోపు ఆడపిల్లలు జరుపుకుంటారు. అది ఆడపిల్లలు మానసికంగాను, శారీరకం గాను ఎదిగే వయసు. మొదటి రోజు అంటే తదియకు ముందురోజు అనగా విదియనాడు ఆడపిల్లలు తెల్ల వారుజామునే లేచి తలారా స్నానం చేసి, మూడు, అయిదు లేక తొమ్మిది మంది ముత్తైదువులకు కుంకుడు కాయలు, సున్నిపిండి, పసుపు కుంకుమ, గోరింటాకు ముద్ద వాయనం ఇస్తారు. ఇది సూర్యోదయానికి ముందే జరగాలి. తర్వాత అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. దానితో మొదటి రోజు పండగ ముగిస్తుంది.

రెండవ రోజు తెల్లవారుజామున నోము చేసుకునే వారంతా లేచి, కుంకుడుకాయ తో తలంటుకుని, కొత్త బట్టలు వేసుకుని, గోంగూర పచ్చడి, అన్ని కూరగాయలతో చేసిన పులుసు, పెరుగన్నం తిని, బయటకు వెళ్తారు. నోము చేసుకునే పిల్లలంతా ఒక చోట జేరి ఒకరికి ఒకరు తమ పండిన చేతులు చూపించుకుని మురిసిపోతారు. ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని ఆనందిస్తారు. పెద్ద పెద్ద చెట్లకి ముందు గానే వేసుకున్న ఉయ్యాలలు ఊగుతారు పాటలు పాడుకుంటూ. రకరకాల ఆటలు ఆడుకుంటారు. దాగుడుమూతలు, నేలాబండా, రంగుల రాట్నం, చెమ్మ చెక్క, వుప్పురు గుప్ప లాంటి ఆటలు ఆడుకుని, ఆనందం మరియు ఆరోగ్యానికి కావలిసిన మంచి శారీరక పరిశ్రమ పొందుతారు. తర్వాత ఇంటికి వెళ్లి, రోజంతా ఉపవాసం ఉండి, సాయం కాలం పూజకి సిద్ధం చేసుకుంటారు. చలిమిడి, పానకం, వడపప్పు, మినపట్లు, ఉండ్రాళ్ళుతో పాటు తమకు వీలు అయిన మధుర పదార్ధాలు తయారు చేసుకుంటారు. సాయంకాలం భక్తి శ్రద్ధలతో పసుపు వినాయుకుని, పసుపు గౌరమ్మను చేసుకుని ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వమని షోడశోపచార పూజలు చేసి, అన్ని నివేదనలు చేసి గౌరమ్మ మీద అనేక పాటలు పాడుకుని, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ఉండ్రాళ్ళు కూడా వాయనం ఇస్తారు. రాత్రి చంద్రుడిని చూసి ఉపవాస దీక్ష విరమిస్తారు. తర్వాత వచ్చే అట్లతద్ది దాకా ఆటపాటలు జరుగుతూనే ఉంటాయి.

అసలు ఈ పండగ మన పెద్దలు మనకు ఎందుకు అందించారంటే ఇది కేవలం ఏదో ఆటపాటలు ఆడుకునే వేడుక మాత్రమే కాదు. ఎండాకాలం ముగిసి శ్రావణ భాద్రపదాలు వానాకాలం. నార్లు నాటుకుని అందరు ఆనందం గా వుండే సమయం. సకాలంలో వానలు సరిపడా కురవాలి. దానికి దేవతలు కరుణించాలి. అందుకని సందర్భాలు కల్పించుకుని దేవతారాధన చేస్తారు. విపరీతమైన వేడి నుండి వానాకాలం లో కలిగే శీతలానికి అలవాటు పడటానికి, చేతి వ్రేళ్ళ ఆరోగ్యానికి గోరింటాకు పెట్టుకుంటారు. వానాకాలం లో జలుబులు అవి రాకుండా మినుములతో చేసిన అట్లు, గోంగూర పచ్చడి తింటారు. పిల్లలంతా కలిసి మెలిసి ఆడుకోవడం వలన ఐకమత్యం పెంపొందుతుంది. ఒక పద్దతి ప్రకారం చేయడం వలన ఆడపిల్లలికి క్రమశిక్షణ, ఆధ్యాత్మిక భావాలు పెరిగి, ఆరోగ్యకరమైన మనస్తత్వాన్ని, అలవరుచుకుంటారు. శారీరక ఆరోగ్యాన్ని పొందుతారు. సకల సౌభాగ్యప్రదాయిని గౌరీ దేవి కనుక గౌరమ్మ పూజ, చదువులకు విజయానికి అధినేత వినాయుకుని పూజ చేస్తారు. మనస్సుకి అధిపతి చంద్రుడు కనుక ఆరోగ్యకరమైన మనస్సు కోసం చంద్ర దర్సనం చేసుకుని భోజనం చేస్తారు.

ఇలా ఎన్నో పద్ధతులను నేర్పి ఎంతో వినోదాన్ని కూడా కలిగించే ఈ పండగను మన ఆడపిల్లలకు దూరం చేయవద్దు. చదువు సంధ్యలు చాలా ముఖ్యమే; వాటి తో పాటు మన సంప్రదాయాలు, ఆచారాలుకూడా మన పిల్లలు మరువరాదు కదా? మనలో చాలా మంది ఈ ఆటపాటలను మిస్ అయ్యే ఉంటారు. కనీసం మన ఆడపిల్లలైనా ఇలాంటి చక్కటి పండగలు చేసుకునే ఒక అందమైన అవకాశం కల్పించి ఉండ్రాళ్ళ తద్దిని మరుగున పడకుండా కాపాడుకుందాము. కాబట్టి తల్లులందరూ ఈ ఏడాది నుండి అయినా ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ నాడు వచ్చే ఉండ్రాళ్ళ తద్ది పండగను తమ ఆడపిల్లలు జరుకునేలా గా చూస్తారు కదూ?

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s