ఘృశ్మేశం

ఘృశ్మేశం

దక్షిణదిశయందు దేవగిరియను పేరుగల ఒక పర్వత శ్రేష్ఠము కలదు. అది చూచుటకు అద్భుతముగను, నిత్యము పరమశోభతో సంపన్నమైయుండును. దాని సమీపమున భరద్వాజ కులోద్భవుగు సుధర్ముడను బ్రహ్మవేత్త, బ్రాహ్మణుడు నివసించుచుండెను. ఆయన ధర్మపత్ని పేరు సుదేహ. ఆమె ఎల్లవేళల శివధర్మ పాలనయందు ఆసక్తురాలైయుండెడిది. ఇంటి వ్యవహారములందు నిపుణురాలు. పతిసేవయందు లగ్నమైయుండెడిది. ద్విజశ్రేష్ఠుడగ సుధర్ముడు కూడా దేవతలను, అతిథులను పూజించెడివాడు. వేదోక్త మార్గమునవలంబించెడి వాడు. నిత్యాగ్నిహోత్రుడు. మూడు కాలములందు సంధ్య చేయుటవలన ఆతని కాంతి సూర్యునితో సమానముగ తేజరిల్లుచుండెను. వేదశాస్త్రముల మర్మమునెరిగినవాడు. శిష్యులకు చదువు చెప్పెడివాడు. ధనవంతుడైన ఆతడు గొప్ప దాతకూడ. సౌజన్యాది సద్గుణ నిలయుడు. శివసంబంధమైన పూజాకార్యములందు సదా నిమగ్నుడై యుండెడివాడు. స్వయముగ శివభక్తుడే. శివభక్తులనిన అతనికి మిగుల ప్రీతి.

శివభక్తులకు కూడ అతడు మహా ఇష్టుడు. ఇవన్నియు ఉండి కూడ అనికి పుత్రులు లేకుండెను. దీనివలన బ్రాహ్మణునకు దుఃఖము కలిగెడిది కాదు. కానీ ఆ బ్రాహ్మణి మిక్కిలి బాధపడుచూ పట్టుదలతో తన సోదరియైన ఘుశ్మాతో తన భర్తకు రెండవ వివాహము జరిపించెను. “ఇప్పుడు నీవు నీ సోదరిని ప్రేమించుచున్నావు కానీ ఈమెకొక పుత్రుడు జన్మించినచో అప్పుడీమె వలన నీలో ఈర్ష్య జనించును” అని సుధర్ముడు వివాహమునకు ముందు సుదేహకు నచ్చజెప్పెను. “నేను నా సోదరియందు ఎప్పుడును ఈర్ష్యాళువును కాను” అని ఆమె మాట ఇచ్చెను. వివాహమైన తదుపరి ఘుశ్మా దాసివలె తన అక్కకు సేవ చేయసాగెను. సుదేహ కూడా ఆమె ఎడల మిగుల ప్రేమతో వ్యవహరించుచుండెను. ఘుష్మా శివభక్తురాలైన తన అక్క ఆదేశానుసారము ప్రతిదినము నూట ఒక్క పార్థవ శివలింగములను తయారుచేసి విధి పూర్వకముగ పూజించి సమీపముననున్న చెరువులో నిమజ్జనము చేయుచుండెను. శంకరుని కృపవల్ల సౌభాగ్యవంతుడు, సద్గుసంపన్నుడైన ఒక చక్కటి కుమారుడు ఆమెకు కలిగెను. ఘుశ్మాకు కొంత అభిమానము పెరిగెను. దీనితో సుదేహ మనస్సునందు అసూయ జనించెను. యుక్త వయస్సు రాగానే ఆ కుమారునకు వివాహము జరిగెను.

కోడలు ఇంటికి వచ్చెను. సుదేహ ఇంకనూ ఎక్కువగ ద్వేషింపసాగెను. ఒకనాటి రాత్రి ఆమె నిదురించుచున్న కుమారుని శరీరమును కత్తితో ముక్కలు ముక్కలు చేసి చంపివేసెను. ఖండింపబడిన అంగములను ఘుశ్మా ప్రతిదినము పార్థివలింగములను విసర్జనము చేయు చెరువులో పడవేసెను. ఇంటిలో నిశ్చింతగా నిదురించెను. సూర్యోదయమున లేచి ఘుశ్మా నిత్యపూజలు చేయసాగెను. సుధర్ముడు స్వయముగ నిత్యకర్మలందు లగ్నమయ్యెను. ఇదే సమయమున సుదేహ కూడా నిదురలేచి మిక్కిలి ఆనందముతో ఇంటిపనులు చేయసాగెను. ఆమె హృదయమునందు మొదటినుండి మండుతున్న ఈర్ష్యాగ్ని ఇప్పుడు ఆరిపోయెను. ప్రాతఃకాలము కోడలు లేచి తన భర్త శయ్యను చూసెను. అది రక్తసిక్తమైయుండెను. దానిమీద కొన్ని శరీరభాగములు ఆమెకు కనిపించెను. దీనితో ఆమెకు మిగుల దుఃఖము కలిగెను. ఆమె అత్త ఘుశ్మా దగ్గరకు వెళ్ళి నివేదించి రోదింపసాగెను. పెద్ద భార్య సుదేహ కూడా పైపైన దుఃఖించెను గాని మనస్సంతయు సంతోషముతో నిండియుండెను. ఘుశ్మా ఆ సమయమున కోడలు దుఃఖమును చూసి తన నిత్యపూజల వ్రతమునుండి విచలిత కాలేదు. ఆమె మనస్సు కుమారుని చూచుటకు ఏ కొంచెము కూడా ఉత్సాహ పడలేదు. మధ్యాహ్నము వరకు పూజలు సమాప్తము చేసికొని తన పుత్రుని శయ్యవైపు దృష్టి సారించెను. ఆమె మనస్సులో ఏ కొంచెము కూడ దుఃఖము లేకుండెను. ఈ కుమారుని ప్రసాదించిన వాడే వానిని రక్షించును. అని శివునీద నమ్మకముతో ధైర్యమును వహించియుండెను. మునుపటివలె పార్థివ శివలింగమును తీసుకొని స్వస్థ చిత్తముతో శివుని నామోచ్ఛారణ చేయుచు చెరువు గట్టుకు వెళ్ళెను. తిరిగి వచ్చు సమయమున ఆమెకు తన పుత్రుడు చెరువు తీరాన నిలబడి కనిపించెను.

అయిననూ ఘుశ్మాకు హర్షమును కలుగలేదు, విషాదమును కలుగలేదు. అప్పుడు ఆమె ఎడల శివుడు సంతుష్టుడై ఆమె ఎదుట ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనెను. దుష్టురాలగు నీ సవతి ఈ బాలుని చంపివేసెను, ఆమెను త్రిశూలముతో హతమార్చెదను. ఘుశ్మా శివునకు నమస్కరించి “ప్రభూ! ఈ సుదేహ నాకు అక్క. కనుక ఈమెను మీరు రక్షింపవలయును.” అని వరమడిగెను. ఘుశ్మా మాటలు విని పరమేశ్వరుడు ఇంకను ప్రసన్నుడై ఇంకేదైనా వరమును కోరుకొమ్మనెను. శివుని మాటలు విని ఘుశ్మా “ప్రభూ! మీరు వరము నియ్యదలచినచో ప్రజల రక్షణ కొరకు సదా ఇచట నివసింపుడు. నా పేరుతోనే మీకు ఖ్యాతి రావలయును” అని కోరుకొనెను. అప్పుడు శివుడు “నేను నీనామముతోనే ఘుశ్మేశ్వరుడని పిలువబడుదును. సదా ఇచటనే నివాసముందును. అందరికి సౌఖ్యమును ప్రసాదించెను. ఈ సరోవరము శివలింగముకు ఆలయమగును. ఈ సరోవర దర్శన మాత్రము చేత సకలాభీష్టములు ప్రసాదించును. నీ వంశమందు నూట ఒక్క తరముల వరకు పుత్రులందరు మిగుల గుణవంతులగుదురు. అట్టి నీ వంశము విస్తృతమై శోభాయమానమై అలరారుచుండును.”అని పలికి శివుడు అచట జ్యోతిర్లింగ రూపమున స్థితుడయ్యెను. జీవించియున్న పుత్రుని చూసి సుదేహ మిగుల సిగ్గుపడెను. ఆమె తన భర్తను, ఘుశ్మాను క్షమించమని ప్రార్థించెను. తన పాపమును తొలగించుకొనుటకు ప్రాయశ్చిత్తమును చేసుకొనెను. ఈ లింగమును దర్శించి పూజించుట వలన సదా సుఖ సమృద్ధులు సమకూరును. ఈజ్యోతిర్లింగ కథను చదివినవాడును, వినిన వాడును సకల పాపములనుండి ముక్తుడగును. భోగమోక్షములను పొందును.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s