పరశురామావతారం

శ్రీ మహావిష్ణువు పరశురామునిగా అవతరించిన వైశాఖ శుద్ధ తదియను పరశురామ జయంతిగా పిలుస్తారు. ఈ రోజున ఉపవసించి ప్రదోషకాలంలో పరశురాముని షోడశోపచారాలతో పూజించి అర్ఘ్యమివ్వాలి. పరశురాముని కథ, మహిమలు అద్భుతం. శ్రీమన్నారాయణుని అంశావతారం ఈ పరశురామావతారం.

అధికార గర్వంతో మధించిన అనేకమంది రాజులను చంపి పృథ్విపై ధర్మమును స్థాపించడానికి అవతరించినవాడు పరశురాముడు. జమదగ్ని మహర్షి – రేణుక దంపతుల కుమారుడు. రేణుకాదేవి ఒక రాజును మోహించినదని భావించి జమదగ్ని ఆమెను వధించమని కొడుకులను ఆదేశించాడు. మిగిలినవారు నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞ నిర్వర్తించినాడు. తండ్రి సంతోషించి వరం కోరుకో అన్నాడు. తల్లిని బ్రతికించమనీ, సోదరులను మన్నించమనీ అడుగగా తండ్రి పరశురాముని కోరిక తీర్చాడు. పిదప ఋచీకుని వద్దకు వెళ్ళాడు. మనుమడి వైఖరి గమనించి శివుని గురించి తపస్సు చేయమన్నాడు. పరశురాముడు శివుని గురించి తీవ్ర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. రౌద్రాస్త్రం యివ్వమని కోరినాడు. అంత అస్త్రాన్ని ధరింపగల శక్తి లేదన్నాడు శివుడు. తిరిగి తపస్సు కొనసాగించాడు. అదే సమయంలో రాక్షసులు దేవలోకంమీద దాడి చేశారు. శివుడు పరశురాముని రప్పించి దానవులను తరిమివేసే బాధ్యత అప్పగించాడు. నా దగ్గర ఆయుధం లేదన్నాడు పరశురాముడు. వెంటనే శివుడు అతనికి ఒక పరశువు అనగా గొడ్డలిని బహూకరించాడు. పరశురాముడు రాక్షసులను తరిమివేసి తిరిగి తపస్సులో కూర్చున్నాడు. శివుడు మరోసారి ప్రత్యక్షమైనాడు. అతడు కోరిన అస్త్రాలన్నీ యిచ్చాడు. పిదప వేయి చేతులుగల కార్తవీర్యార్జునుడనే రాజు సపరివారంగా జమదగ్ని ఆశ్రమానికి వెళ్లి ఆశ్రమంలో వున్న కామధేనువును చూశాడు. ముని కామధేనువును ప్రార్థించి రాజుకు పరివారానికీ పలు రకాల విందులు అందజేశాడు. రాజు ఆ కామధేనువును అపహరించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని భటులు సంహరించారు. భృగుమహర్షి వచ్చి జమదగ్నిని తిరిగి జీవింపజేస్తాడు. రాజు కార్తవీర్యుని దురాగతం గురించి తెలిసికొని పరశురాముడు క్రోధంతో ఇరవై యొక్కసార్లు దండెత్తి కార్తవీర్యునితో సహా రాజులందరినీ వధించాడు. ఆ విధంగా పొందిన భూమిని కశ్యపునికి దానం చేసి హింసకు ప్రాయశ్చిత్తంగా తండ్రి సూచనపై తపస్సు వెళ్లిపోయాడు. స్కంద – భవిష్య పురాణములననుసరించి వైశాఖ శుక్ల తృతీయ పునర్వసున రాత్రి మొదటి యామం సమయంలో శ్రీహరియే రామునిగా రేణుకాదేవి గర్భం నుండి స్వయంగా అవతరించాడు. ఆరు గ్రహాలు ఉచ్ఛస్థానంలో ఉన్నాయి. మహాతపశ్శాలి పరశురామ జననం శ్రీమన్నారాయణుని దశావతారాల్లో విశిష్టమైనది. ధర్మస్థాపన చేసిన మహర్షి. భూమండలములోని రాజులను వెతికి 21 సార్లు దండెత్తి క్షత్రియుల్ని లేకుండా చేసి భార్గవ రాముడైనాడు. త్యాగశీలిగా తను పొందిన రాజ్యమును కశ్యప మహర్షికి దానం చేసి తపోదీక్షకై మహేంద్ర గిరికి తరలిపోయాడు. తండ్రి యాజ్ఞను నెరవేర్చి తల్లిని సంహరించి తిరిగి పొందిన పితృవాక్య పరిపాలకుడు. మాతృప్రేమను చాటిన మహనీయుడు పరశురాముడు. పరశురాముడు భూమిమీద దైవభక్తి- సత్కర్మాచరణ- ఆస్తికత్వం నెలకొల్పిన మహాతపశ్శాలి. ఇంతటి మహాతపశ్శాలి జయంతిని పరశురామజయంతిని యావద్భారతదేశం జరిపి ఆ రోజున విష్ణు సహస్రనామపారాయణం – పురాణ పఠనం- సద్గోష్ఠులను నిర్వహించడం ఆనవాయితీ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి శివధనర్భంగమనకు ముందు విశ్వామిత్రునితో పయనమవుతున్న రామలక్ష్మణులను గాంచి విషయం తెలుసుకుని శివధనుస్సు కన్నా ముందు తన వద్దనున్న విష్ణు చాపమును విరువమని ఆవేశంతో కోరగా, వినయంతో శ్రీరాముడు అలాగేయని పరశురాముడు అందించిన వైష్ణవ చాపమును స్పశింపగా అది మాయమైనది. వెంటనే శ్రీరాముని దీవించి తరలిపోయినాడు. రామాయణ మహాకావ్యంలో ఇది ఒక గొప్ప లీలగా వెలిగింది. రాజులపై చేసిన దండయాత్రలో శరణువేడిన రాజులను కరుణతో క్షమించి వదిలి క్షమాసంపన్నునిగా పేరొందిన కరుణామూర్తి పరశురాముడు. మునికుమారునిగానున్న ఈ పరశురామ జయంతి పురాణ ప్రసిద్ధి చెందినది. యుగయుగాలలో ఈయనను స్మరించి తరించుట ఎంతో భాగ్యం. మహనీయం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s