గరుత్మంతుడు చెప్పిన విష్ణుమాయ గుణాలు, ప్రభావము

పూర్వం ఒకసారి హిమగిరి మీద మునిగణాలన్నీ పురాణ శ్రవణం చేస్తూ ఆనందిస్తున్న సమయంలో అక్కడికి వినత కుమారుడైన గరుత్మంతుడు వచ్చాడు. ఆ ముని గణాలన్నీ ఆయనకు వినయంగా నమస్కరించి తమకు శ్రీమహావిష్ణువు వైభవాన్ని, మాయ, రూప విలాసాన్ని వివరించమని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు వైనతేయుడు (గరుత్మంతుడు) ఆనందించి వారందరికీ విష్ణు విలాసాన్ని చెప్పటం ప్రారంభించాడు. అయితే తనకే కాక ఎంతటి వారికైనా కూడా ఆ శ్రీమహావిష్ణుమాయ, స్వస్వరూప విషయాలను వర్ణించే శక్తిలేదని, తనకు తెలిసినంతలో తనకు అనుభవంలోకి వచ్చిన విషయాలను వివరించగలనని అన్నాడు.

గతంలో తన తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు దేవేంద్రుడితో పోరాడి అమృతభాండాన్ని స్వాధీనం చేసుకొని తరలిపోతున్న తరుణంలో తనకు ఒక ప్రేమపూరితమైన పిలుపు వినిపించిందని గరుత్మంతుడు చెప్పాడు. ఆ మాటలు వినిపించిన దిశగా మరికొంత ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో నీకొక వరం ఇస్తున్నాను. తీసుకో అన్న పలుకులు మళ్ళీ వినిపించాయని, అయితే ఆ పలుకుతున్న దెవరో? ఎటువంటివారో? తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఆ శబ్ధం వచ్చిన దిక్కుకు చూస్తూ మీరెవరో నాకు పూర్తిగా మీ విషయాన్ని వివరించాకే వరం ఇవ్వవలసినదిఅని గరుత్మంతుడు అడిగాడు. అందుకు సమాధానంగా తనస్వరూపమేమిటోఇకమీదట పూర్తిగా అవగతమవుతుందని, అయితే ముందుగా గరుత్మంతుడు తనకు వాహనంగా మారాలని మళ్ళీ వినిపించింది. అలా అయినందువల్ల వృద్ధాప్యం, మృత్యువు లాంటివి లేకుండా ఉండే ఒక మహాత్తర శక్తి సంప్రాప్తిస్తుందని గరుత్మంతుడికి వినిపించింది. అనుకొని ఆ వర ప్రసాదానికి గరుత్మంతుడికి ఒళ్ళు పులకించింది. వెంటనే భక్తిపూరితంగా నమస్కరించి తాను వెంటనే వాహనమూర్తిగా మారి సేవించుకుంటానని ఒకవేళ ఆ అడుగుతున్న మహానుభావుడు రథాన్ని ఎక్కివుంటే ఆ రథానికి కేతనంగా ఉండగలనని అలా తనను అనుగ్రహించమని గరుత్మంతుడు వేడుకున్నాడు. అలాగే తాను అనుగ్రహిస్తున్నట్లు ఆ అద్భుతశక్తి పలికింది. ఆ తరువాత గరుత్మంతుడుఎంతో ఉత్సాహంగా తన తండ్రి అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చిజరిగిన విషయాన్నంతా వివరించాడు. కశ్యపుడు ఎంతగానో ఆశ్చర్యపడి ఆ మాటలు ఎవరివోకాదని, ఆ వరం ఇచ్చింది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువేనని తెలియచెప్పాడు.

ఎంతో గొప్ప సమాధినిష్ఠతో తపస్సుచేస్తే తప్ప లభించని శ్రీమహావిష్ణువు అనుగ్రహం గరుత్మంతుడికి లభించిందని, వెంటనే వెళ్ళి శ్రీమహావిష్ణువు ఉండే బదరికాశ్రమంలో ప్రవేశించి ఆయనను భక్తితో సేవించమని కశ్యపుడు గరుత్మంతుడికి చెప్పాడు. ఆ వెంటనే గరుత్మంతుడు బదరికాశ్రమానికి వెళ్ళి శ్రీమహావిష్ణువును అనేక విధాలుగా స్తుతించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు పచ్చని వస్త్రాలతో, శంఖ, చక్ర, గదాది ఆయుధాలతో ఎనిమిది భుజాలతో చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఆ వెంటనేఇక తనను అనుసరించమని గరుత్మంతుడితో చెప్పాడు.

అలా చెప్పిన వెంటనే ముందు శ్రీమహావిష్ణువు వెళుతుండగా గరుత్మంతుడు అనుసరించాడు. అలా చాలా యోజనాల దూరం వాయువేగంతో గరుత్మంతుడు వెళ్ళాడు. ఇంతలో ఒకచోట భయంకర అగ్నిజ్వాలలు ఎదురుపడ్డాయి. అక్కడ ఎటుచూసినా ఇంధనం కానీ, మరొకటి కానీ ఎమీలేదు. ఆ మంటలను లెక్కపెట్టక తీవ్రవేగంతో వాటిలోకి ప్రవేశించాడు గరుత్మంతుడు. అయినా అతడికేమీ ప్రమాదం సంభవించలేదు. మరికొంత ముందుకెళ్ళాక తీవ్రమైన తపస్సు చేస్తున్న పార్వతీపరమేశ్వరులు కనుపించారు. అక్కడినుండి ఇంకా ముందుకు వెళుతున్న విష్ణువును అనుసరిస్తున్న గరుత్మంతుడికి బాగా ఒడలిక కలిగింది. అయినా ఆ ఒడలికను లెక్కచేయక ముందుకు వెళ్ళాడు అక్కడ ఒకచోట గాడాంధకారమైన ప్రదేశం ఉంది. ఆ చిమ్మచీకట్లో దిక్కుతెలియని స్థితిలో చేసేది ఏమీలేక గరుత్మంతుడు బాధపడుతూ తనకేమీ కనుపించటంలేదని తనను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఇదిగో ఇటుచూడు, ఈ వైపురా అని అన్నాడు. ఆ శబ్ధం వినిపించిన దిక్కు చూడగానే చిమ్మచీకట్లన్నీ చెల్లాచెదురైపోయాయి.

దివ్వమైన తేజస్సుతో వెలుగొందుతున్న ఆ ప్రదేశంలో భగవానుడు అంతకన్నా ఎక్కువగా తేజరిల్లుతూ కనుపించాడు.అక్కడ మంగళవాద్య ధ్వనులు మారుమోగసాయి. అద్భుతమైన సరోవరాలు కమలాలతో నిండి కనుపించాయి. ఆ ప్రదేశాన్ని కన్నార్పకుండా చూస్తున్నంతలోనే మళ్ళీ విష్ణువు తన ప్రయాణం సాగించాడు. ఆయనను గరుత్మంతుడు అనుసరించాడు. మళ్ళీ ఇంతలో ఒక భీకరమైన జ్వాల కనుపించటంతో గరుత్మంతుడు తత్తరపడ్డాడు.

మళ్ళీ తన శక్తిమీద ఆశలువదులుకొని ఆ దేవదేవుడిని ప్రార్థించాడు. అప్పుడు ఆనారాయణుడు అనుగ్రహించి దోవచూపి అగ్నిజ్వాలలు పోగొట్టి మరికొంతదూరం గరుత్మంతుడు తన వెంటరాగానే అదృశ్యమైపోయాడు. ఆ క్షణంలో గరుత్మంతుడు ఉన్న ప్రదేశమంతా ఎంతో ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ కనుపించింది. అక్కడున్న ఒక చక్కని సరోవరంలో శ్రీమన్నారాయణుడు జలకాలాడుతూ కనుపించాడు. ఆ సరోవరం ఒడ్డుకు గరుత్మంతుడు చేరుకోగానే విష్ణువు మాయమయ్యాడు. ఆ సంఘటనకు మళ్ళీ బాధపడ్డాడు గరుత్మంతుడు. దానికితోడు అక్కడ ఒక పక్క చతుర్వేదాల గంభీర ఘోష వినిపిస్తున్నా ఎవరూ అక్కడ ఉన్నట్లు కనుపించలేదు. మళ్ళీ అంతలోనే మహా భయంకరమైన గరుడ పక్షులెన్నెన్నో ఆ ప్రదేశమంతా తిరుగాడుతూ కనుపించాయి. గరుత్మంతుడిక ఆ పరిస్థితి నుండి తాను బయటపడేందుకు పరమాత్ముడొక్కడే తనకు దిక్కని ఎలుగెత్తి పలుకుతూ రక్షించమని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు ఆందోళన పడవద్దని తాను రక్షిస్తాననిపలికాడు. ఆ పలుకులు వినిపించిన మరుక్షణంలో శ్రీమన్నారాయణడక్కడ సాక్షాత్కరించాడు. ఆయనకు భక్తితో నమస్కరించి గరుత్మంతుడు చుట్టూఒకసారి తేరిపారచూడగా ఆ ప్రదేశం మరేమీకాదని ఒదరికా వనమేనని స్పష్టమైంది.

అలా తనకు శ్రీమహావిష్ణువు స్వస్వరూపాన్ని, తన మాయా విశేషాలను వివరించినట్లు గరుత్మంతుడు మునులకు చెప్పాడు. అహంకారభావంతో మనిషి ప్రవర్తిస్తుంటాడు. అహంకార భావాన్ని విడిచి భక్తితో, ఆర్తితో భగవానుడిని స్తుతించినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు .

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s