మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?

పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.
ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది. ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి. ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు. గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు. అయిపోయిందిఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకేఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s