మొత్తం పరమేశ్వరునియొక్క లక్షణం ఐదువేళ్ళల్లోనే ఉందిట

కన్నప్ప

మొత్తం పరమేశ్వరునియొక్క లక్షణం ఐదువేళ్ళల్లోనే ఉందిట. ఈ జగత్తులో మనం చూసేది ముందు నామం, రూపం. వీటి వెనకాల ఉండే అస్తి, భాతి, ప్రియం అనేవి ప్రధానములు. అస్తిభాతిప్రియములు బ్రహ్మవి. నామరూపం జగత్తు. నామరూపములతో భాసిస్తూ ఉన్న జగత్తుయందు లీనమైయున్నాడు. కానీ ఆయనకి నామం, రూపం, లేవు. నామరూపాత్మకమైన జగత్తును చూస్తున్నాం కానీ జగత్తుకు ఆధారమైన అస్తి,భాతి, ప్రియం(సత్తు, చిత్తు, ఆనందం) అంటే ఉనికియైన వాడు, ప్రకాశస్వరూపుడు, ఆనందస్వరూపుడు. చిటికెన వేలునుంచి లెక్కిస్తే అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం – (బొటన, చూపుడు). మన లక్ష్యం అస్తిభాతిప్రియములు. అందుకు నామరూపములను ఉపసంహరించి అస్తిభాతిప్రియములను(చిటికెన, ఉంగరంవేలు, మధ్య వేలు) చూడు. స్ఫురణశక్తియైన చైతన్యమే ఎదురుగా రూపం ధరించి అనుగ్రహంతో కూర్చుంది గనుక ఆ జీవబ్రహ్మైక్య అనుభవాన్ని పొందారు. స్వాత్మారామం-తనయందు తాను ఆనందించువాడు, రమించువాడు, క్రీడించువాడు. జగతి అవసరం లేదు. కడవలో నీళ్ళుపోస్తాం అది నిండేవరకు. నిండిపోయాకకూడా పోస్తే ఇమడదు, ప్రయోజనం కూడా లేదు.

“సర్వపరిపూర్ణునకు వెలి ఏడ? లోనేడ?” అంటారు అన్నమాచార్యులు. సర్వమూ తానైన పరిపూర్ణునికి వెలుపల, లోపల ఏమున్నది? కొలత, కొరత ఎవరికి ఉంటుందో వాడు ఆనందం కోసం వెంపర్లాడతాడు. అప్రమేయుడు గనుక స్వాత్మారామం. ముదిత వదనం-ఆనందం స్వభావమే కాదు రూపం స్వీకరించినప్పుడు కూడా ప్రతి అణువు ఆయనలో ఆనందాన్ని ప్రకటీకరిస్తోంది. అందులో ముఖం భావస్థానం కనుక పైగా రుద్రయత్తే దక్షిణం ముఖం అన్నాం గనుక ఆ ముఖంలో ఆనందం కనపడుతోంది.
“వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకలముని జనానాం జ్ఞానదాతార మారాత్
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం 
జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి!!”

దక్షిణ అనే శబ్దానికి నిర్వచనం ఇస్తున్నారు గురువుగారు. దక్షిణ అనగా సమర్థత. జనన మరణ దుఃఖాన్ని సమూలంగా ఛేదింపడమనే దక్షత. అది దక్షిణామూర్తి ఒక్కరి దగ్గరే ఉన్నది. ఆయన తప్ప ఏ ఒక్కరూ మోక్షాన్ని ఇవ్వలేరు. అందుకోసమే ఈమూర్తి ధరించాడు కనుక దక్షిణామూర్తి. చిత్రం-ఎంత ఆశ్చర్యం! ఆశ్చర్యమే పరమాత్మ.

“చిత్రం వట తరోర్మూలే-విస్తరించుకుపోతే వట తరువు. మన బ్రతుకే పెద్ద వటవృక్షం. బ్రతుకు అంటే పుట్టుక, చావు మధ్య మాత్రమే కాదు. అది ఇప్పుడు మనకు కనిపించే ఊడ మాత్రమే. కానీ జీవుడు అవిద్య అనే దుంపలోంచి ఎన్ని ఊడలు చించుకున్నాడో, ఎన్ని జన్మలెత్తాడో? కనుక వీడి విశాలమైన జన్మపరంపర అంతా వటవృక్షం. పెరుగుతున్నది అంటే చైతన్యం ఆధారంగానే పెరుగుతున్నది. అవిద్య వల్ల ఇంత విస్తరిస్తున్నది. దానిలో జీవుడు ఇంతకాలం తిరిగి తిరిగి ఎంతటివాడో? జీవభావం అనే పరిమితత్వంతో ఆలోచిస్తే వృద్ధుడే జీర్ణించుకుపోయే లక్షణంలో తిరిగాడు కనుక ముసలివాడు. ఇదంతా ఎవరివల్ల నడిచిందో ఆయన యువకుడే. ఇంత మర్రిచెట్టుకీ మూలమైన ఈశ్వర చైతన్యాన్ని దర్శించు. ఏది అధిష్ఠాన చైతన్యమై ఉన్నదో దానిని దర్శించు. అందుకు నీలోని తలపులన్నీ కూడా నిరంతర చింతనతో, విచారణతో, సాధనతో పండి ఈ చింతనలే మహర్షులు(దర్శన శక్తి కలవారు). మన ఆలోచనలే మహర్షులు. మన బ్రతుకే వటవృక్షం. దీనికి మూలంలో ఉన్న అధిష్ఠాన చైతన్యమే దక్షిణామూర్తి. అటువైపు ఈ ఆలోచనలన్నీ వెళితే అక్కడ జరామరణ మర్జితుడైనటువంటి, నిత్య యౌవనుడైనటువంటి, పూర్ణ బ్రహ్మము అయినటువంటి ఆయన సాక్షాత్కరిస్తున్నాడు. అది చిత్రం-ఆశ్చర్యం! “ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేనం”-అని మనకి ఉపనిషత్తులు, గీత చెప్తున్నాయి. ఆశ్చర్యం అనే మాట నుంచి శంకరులు “చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః” ఆయనను ఆశ్రయించినప్పుడు ఉపన్యాసాలు లేవు. ఎందుకంటే అఖండమైన ఆత్మత్వమ్ ఆనందానుభూతి. అంతేకానీ దీపం వెలిగించి నాకు వెలుగునిమ్ము అని ప్రార్థించక్కరలేదు. ఆయన ఇచ్చేదే అది. ఈశ్వర సాక్షాత్కారానభవంతో నాకు జ్ఞానమివ్వు. అని అనక్కరలేదు. జ్ఞానమే ఆయన. “గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం! నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః!!” “ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే! నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః!!” కేవల జ్ఞానమే ఆయన మూర్తి. మనకి మూర్తి వేరు, జ్ఞానం వేరు. భగవంతునికి జ్ఞానమే మూర్తి. జ్ఞానమే మూర్తీభవిస్తే దక్షిణామూర్తిగా గోచరిస్తున్నాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s