రాముడికి,శివుడికి,అమ్మవారికి బ్రహ్మహత్యాపాతకాలు అంటవు

ఒకప్పుడు కైలాసంలో పరమేశ్వరుడితో సరసమాడుతూ అమ్మవారు వెనకనుంచి వచ్చి ప్రణయంలో భాగంగా కళ్ళు మూశారట. మామూలు వారితో ప్రణయాలు వేరు కానీ మహాదేవుడితో ప్రణయం ఏమిటి? అన్నమాచార్య ఒక కీర్తనలో వేంకటేశ్వరునికి, మహాలక్ష్మికి సరసం గురించి చెప్తూ ఒక గొప్ప మాట చెప్తారు. ఈయనతో సరసమాడినా ప్రమాదమే అందావిడ.

“చాలు చాలును భోగసమయమున మైమరపు పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ” అన్నారు అన్నమాచార్యులు ఒక కీర్తనలో.

“నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల కలయ చీకట్లైన గ్రక్కనను వదలె” –

లక్ష్మీదేవి సరసమాడుతూ వేంకటేశ్వరుడి కళ్ళుమూసిందట. లోకమంతా చీకటైపోగానే భయపడి చేతులు తీసేసిందట. అటు తర్వాత గట్టిగా కౌగలించుకుందిట విష్ణువును.

“ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము కందునని నీ బిగువు కౌగిలే వదలె” –

గట్టిగా పట్టుకోగానే ఆయన లోపల జగాలు ఎక్కడ కదిలిపోతాయోనని వదిలి వేసిందిట. ఈయనతో సరసమాడదామన్నా ఇబ్బందే అనుకుంది అని అంటాడు అన్నమాచార్య. చెప్పడంలో ఎంత అందం ఉందో చూశారా? సరసం చెప్తూ ఒక దివ్యత్వాన్ని చూపిస్తున్నారు. అది ఆయన గొప్పతనం. అది అన్నమాచార్యుల వంటి మహానుభావులు ఇలాంటి భావనలు చూపిస్తున్నారు. అన్నమాచార్యుల వారియొక్క భావన మనకీ కథలో కనిపిస్తున్నది.

అలా పార్వతీదేవి పరమేశ్వరుడి కళ్ళుమూయగానే లోకాలన్నీ చీకటైపోయాయిట. ఆయనకి రెండు కళ్ళు – సూర్యుడు, చంద్రుడు. మూడో కన్ను అగ్ని. నిజానికి జోలపాటలు, లాలిపాటలు లేవు శివుడికి. ఆయన వ్రతమే జాగరణ వ్రతం. మొత్తం ప్రపంచానికి ప్రళయమైనా కళ్ళు తెరుచుకు చూస్తూ ఉంటాడు మహానుభావుడు. సూర్యచంద్రాగ్ని రూపాలతో ప్రపంచాన్ని చూస్తూంటాడాయన. కళ్ళు మూస్తే సూర్యచంద్రాగ్నులు మూడూ మూసుకు పోయాయిట. ఎప్పుడైతే మూడూ మూసుకుపోయాయో అకాల ప్రళయం వచ్చిందిట.

నిజానికి అమ్మవారు కైలాసంలో క్షణకాలం మూశారు. ప్రపంచానికి మహా ప్రళయం వచ్చి కూర్చుంది. మన లెక్కలకీ దేవతల లెక్కలకీ చాలా తేడా ఉంది కదా! వెంటనే అమ్మవారికి ఒళ్ళంతా నీలంగా మారిపోయిందిట. అంతవరకూ బంగారు రంగుతో ఉన్నటువంటి పార్వతీదేవి నీలంగా మారిపోయింది. ఏంటి నా శరీరం ఇలా మారిపోయింది అని శివుడిని అడుగగా పాపం నీకంటింది అని అన్నాడు శివుడు. ఏమిటా పాపం? అంటే ప్రపంచానికి అకాలప్రళయం తెచ్చిన పాపం నీకంటింది. ప్రపంచమంతా సర్దుకుపోయింది. మధ్యలో చేసిన పాపానికి ఫలితం ఏమిటి? కనుక ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి నువ్వు అన్నారు అమ్మవారితో. సరే అన్నదావిడి. ఇప్పుడు మనం అతితెలివైన వాళ్ళం గనుక అసలు కథ వినకుండా కొన్ని ప్రశ్నలు మనకి మిగిలిపోతాయి.

అమ్మవారికి పాపమేమిటండీ? ఆ మాటకొస్తే బ్రహ్మదేవుడికి ముందు అయిదు తలలుండేవి. ఒకతలతో అబద్ధమాడాడని ఒక తల గిల్లాడాయన. లోకకళ్యాణం కోసమే గిల్లాడు.

శివుడికి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. శివుడికేంటి? పైగా తప్పుచేసిన వాడి తల గిల్లితే? ఆ మాటకొస్తే రామచంద్రమూర్తి రావణాసురుడిని సంహరించాడు లోకకళ్యాణం కోసం. మంచిపనే కదా! కానీ రావణాసురుడిని చంపింనందుకు వచ్చిన బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి శివాలయ ప్రతిష్ఠ చేశాడు. రాముడికి పాతకమేంటి? శివుడికి పాతకమేంటి? అమ్మవారికి పాతకమేంటి? నిజానికి వాళ్ళకి పాతకాలు అంటవు. అంటించుకుంటారు. ఎందువల్ల అంటే లోకానికి ఒక ఆదర్శం చూపించడం కోసం. తాను మాత్రం బ్రహ్మకపాలం చేతికంటించుకొని తిరగలే?? అది చేసినా అనుభవించక తప్పదు అని చెప్పడం కోసం వాళ్ళు ఆచరిస్తారే తప్ప వాళ్ళకి పాపమంటదు. పైగా ఇంకొక రహస్యమున్నది. ఎందుకంటే పురాణ కథలు చెప్తూ పోతూంటే ఒకలా ఉంటాయి. అర్థం చెప్తే ఆవలింతలు వస్తాయి. కానీ తెలుసుకోవాలి. భగవంతుడు ఇలాంటి పనులు చేయడం వల్ల ఏం జరుగుతుంది?

 

  1.  లోకానికి ఆదర్శం చూపించడం కోసం.
  2.  లోకానికి ఉపకారం చేయడం కోసం.

 

వాళ్ళు చేసిన ఒకానొక పని లోకానికి మహోపకారం అయిపోతుంది. ఎందుకంటే మనం చేసేవన్నీ కర్మలు. దేవతలు చేసేవన్నీ లీలలు. లీలకు పరమార్థం లోకకళ్యాణం. కర్మకి పరమార్థం కర్మ. ఈశ్వర కృత్యములు లీలలు. లీలలకు పరమార్థం లోకకళ్యాణం.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s