దుర్వాసమహర్షి

దుర్వాసమహర్షి యొక్క చరిత్ర మహాభారతంలో కనపడుతోంది. ఇతరపురాణాలలో కనపడుతుంది. రామాయణంలో కూడా వీరియొక్క ప్రస్తావన ఉన్నది. మహాభారతంలో కృష్ణ పరమాత్మ దుర్వాస మహామునియొక్క మహిమను తాను స్వయంగా పేర్కొంటాడు. అంతేకాదు హస్తినకు దూర్వాసుల వారు వచ్చినప్పుడు తాను సత్యభామాసహితుడై రథంపైన కూర్చోబెట్టుకొని తీసుకువెళ్తాడు. దూర్వాస మహర్షియొక్క మహిమ అంపశయ్య దగ్గర భీష్ముడి సన్నిధిలోనే వివరిస్తాడు మొత్తం. దుర్వాసమహర్షి గురించి చెప్తూ అలా శివసహస్రంలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే శివాంశ సంభూతుడు దూర్వాస మహర్షి.

దూర్వాసుల వారు ఎవరి పుత్రుడు అంటే దత్తాత్రేయుల వారితో పాటే అత్రి అనసూయలకు తనయుడిగా కలిగినటువంటి మహానుభావుడాయన. అత్రి అనసూయలకు త్రిమూర్తులూ కూడా తనయులుగా కలిగారు. అందులో బ్రహ్మాంశ చంద్రుడిగానూ, విష్ణ్వంశ దత్తాత్రేయుల గానూ, రుద్రాంశ దూర్వాస మహర్షిగానూ, వచ్చినది. మూడూ కలిసి ఒకే పరబ్రహ్మ వస్తువు. అందులో సందేహమేమీ లేదు. అయితే దత్తాత్రేయ ఉపాసన, దత్తాత్రేయ పరంపర ఒకటున్నది. దుర్వాస మహర్షికి కూడా పరంపర ఉండి ఉండాలా? చరిత్ర ఏమిటి? అని పరిశీలిస్తే ఆశ్చర్యకర అంశములు మనకు ఎన్నోఎన్నో తెలుస్తూ ఉంటాయి. దుర్వాస మహర్షికి శ్రీవిద్యలో ఒక పేరున్నది. క్రోధభట్టారకుడు అని పేరు ఆయనకి. భట్టారకుడు అంటే పూజ్యుడు, గౌరవనీయుడు అని. అమ్మవారిని కూడా పరాభట్టారికా అని అంటున్నాం కదా! క్రోధం అనే దానిని సుగుణం జేసి కీర్తిస్తున్నారట. గొప్ప కోపిష్టిగారొచ్చారండి అని అంటారా? కానీ క్రోధభట్టారక అనడం కూడా సంతోషమే. అలా అంటే ఆయనకి క్రోధం రాదట. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన అంశమే. పురాణాలు పరిశీలిస్తే అనేకచోట్ల దుర్వాస మహర్షి శపించడాలు కనపడుతూ ఉంటాయి. లోకవ్యవహారంలో కూడా ఎవరైనా కోపిష్టి కనపడితే వాడు దుర్వాసుడండీ అంటారు.

అప్పటికి ఏదో వీళ్ళకి దుర్వాసుడు తెలిసినట్లు. కానీ మహర్షుల శాపాలు అనుగ్రహం యొక్క మరొక రూపాలు. అయితే మన్యుశక్తి అని ఒకటుంది పరమేశ్వరుడికి. “నమస్తే రుద్ర మన్వవా” అని మన్యు సూక్తంలో చెప్పబడుతూ ఉంటుంది. మన్యుసూక్తంలో చెప్పబడుతున్న మన్యుశక్తి యేదో ఈశ్వర స్వరూపమే గనుక తదంశ దూర్వాసుల వారిగా వచ్చిఉండవచ్చు. త్రిపురా రహస్యంలో దత్తాత్రేయ స్వామివారే స్వయంగా జీవన్ముక్తుల గురించి చెప్తూ జీవన్ముక్తులైనవారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు అన్నప్పుడు కొన్ని విశేషణాలు వివరిస్తూ దూర్వాసుడి గురించి ప్రస్తావన చేస్తారు పరశురాముల వారితో. త్రిపురారహస్యమే శ్రీవిద్యా గ్రంథం. అందులోకూడా దూర్వాసుల ప్రస్తావన మనకు కనపడుతున్నది. మహాభారతంలో దూర్వాసుడి ఉత్పత్తి కథ కనపడుతున్నది. అదేవిధంగా అత్రిఅనసూయల పుత్రుడు అని కూడా కనపడుతున్నది. పురాణాలలో రెండుచోట్ల కనపడే సరికల్లా పరస్పర విరుద్ధం అంటారు వెంటనే సమన్వయం చేతకాక. భారతంలో యేం కనపడుతోందంటే దుర్వాసమహర్షియొక్క ఆవిర్భావఘట్టం. పరమేశ్వరుడు ఒక మార్గడము(బాణం)తో త్రిపురాసురసంహార సమయంలో త్రిపురాలను దగ్ధం చేశాడు. ఆ బాణంయొక్క కొనయందు అగ్ని ఉన్నాడట. మొత్తం స్వరూపం విష్ణు స్వరూపం, కొనయందు అగ్ని ఉన్నాడు. అది జ్వలిస్తోంది. విష్ణువే అగ్నిగా జ్వలిస్తున్నాడు అనుకోవచ్చు. మొత్తంమీద బాణశక్తి విష్ణువే. విష్ణువే అయిన బాణశక్తి త్రిపురాలని దహించిన తర్వాత తిరిగి పరమాత్మ వద్దకు వచ్చిందట. పరమేశ్వరుడు దానిని తీసుకొని ఒళ్ళో పెట్టుకున్నాడట.

ప్రకాశమైనటువంటి ఆ బాణం ఒళ్ళో పెట్టుకోగానే మహర్షులందరూ చూసి నమస్కరిస్తూ ఉంటే ఆ బాణం కాస్తా ఒక శిశువు(ఋషి) ఆకృతిగా మారిందిట. ఏమిటి ఈ స్వరూపం అంటే ఇతడే నా అంశయైనటువంటి దూర్వాసుడు అని సాక్షాత్ శివుడు చెప్పినట్లుగా మనకు మహాభారతంలో కనపడుతున్నది. అంటే బాణం ఎవరు? నిజానికి విష్ణువు కనబడుతోంది. కానీ అది రుద్రప్రయోగం గనుక రుద్రశక్తి లేకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ మనకి హరిహరాత్మక తత్త్వం కనపడుతున్నది. అతడే దూర్వాసుడు అని శివుడు చెప్పాడు అంటే దూర్వాసునిలో హరిహరాత్మక తత్త్వం ఒకటి ఉన్నదని ప్రస్తావన. పురాణములు మనకు ఆ తత్త్వసంకేతాలు ఇస్తూ ఉంటాయి. తర్వాత మనకు కనబడే మరొక కథ అత్రి అనసూయల పుత్రుడయ్యాడని.

యేది ఇందులో స్వీకరించాలి? అంటే రెండూ స్వీకరించాలి. ఏ అంశ అయితే అక్కడ ఉన్నదో అదియే అత్రిఅనసూయలకు పుత్రుడుగా ఉద్భవించినది అని గ్రహించుకోవలసినటువంటి అంశం. కనుక రెండూ స్వీకరించవలసినదే. ఎందుకంటే ఒక దివ్యత్వం భువికి అవతరించింది. అవతరించింది అంటే అంతకు ముందు లేదు అని కాదు కదా! అంతకు ముందున్నది వచ్చినది. కనుక అంతకుముందున్న దుర్వాస రూపమైనటువంటి ఆ దేవర్షి స్వరూపమేదైతే ఉన్నదో అది ఈరూపంగా వచ్చింది అని అన్వయించుకోవలసి ఉన్నది. అయితే అత్రి అనసూయల పుత్రుడైన దత్తులవారికి కూడా ఒక పరంపర మనం చెప్పుకుంటూంటాం. సంప్రదాయబద్ధమైన దత్త పరంపర ఒకటున్నది. ఇప్పుడు దత్తపరంపరలో అసంప్రదాయ ధోరణులు కొందరు వాడుతూన్నారు. కలి ప్రభావం చేత. కానీ దత్తపరంపర అని సంప్రదాయ ధోరణి ఉన్నది మనకి. అది వైదికమైన పద్ధతిలో ఉన్నటువంటిది. అవధూత సంప్రదాయానికి చెందినది. దత్తోపాసన. దత్తోపాసన అని ఒక పరంపర ఎలా ఉన్నదో దుర్వాస మహర్షియొక్క ఉపాసనా పరంపరకూడా ఒకటి ఉండవచ్చు అని సూచనలు మనకు అనేకం కనపడుతున్నాయి. చిత్రమేమంటే దూర్వాస మహర్షికి సంబంధించినటువంటి ఉపాసన ఆయన అనుగ్రహం పొంది వేదాంతవిద్యలో, శ్రీవిద్యలో ఉత్తీర్ణ దశకు వెళ్ళినటువంటి ఘట్టాలు మనకి కొన్ని కనపడుతూ ఉన్నాయి. దుర్వాస మహర్షికూడా ఒక ఉపాస్యమైనటువంటి ఈశ్వర స్వరూపమే కేవలం మహర్షితేజమే కాకుండా.

దూర్వాసుల వారి చరిత్ర మనం చూస్తే ఆయన సర్వలోక సంచారం యథేచ్ఛగా చేసినట్లుగా మనకు అనేకచోట్ల కనపడుతున్నది. అంబరీష చరిత్రలో కూడా ఆయన ఈలోకానికి వెళ్ళాడు, ఆలోకానికి వెళ్ళాడు అనేటప్పుడు ఆయన పరుగెడుతున్నాడనడం చూశాంగానీ ఇన్ని లోకాలకి ఎలా వెళ్ళగలిగాడు అని ఆలోచించామా? అంబరీష చరిత్రలో దూర్వాసుడు తగ్గినట్లు కనపడతారు. కానీ దాని పరమార్థం దానికున్నది. అక్కడ దూర్వాసుడేమీ తగ్గలేదు. అంబరీషుని గొప్పదనం బయటపడింది. అది ఒక సందర్భం. అంతమాత్రం చేత మహర్షిని మనం తక్కువ చేయరాదు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s