గాంధారి శాపం-శ్రీ మహాభారతంలో కథలు

కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. “ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు” అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.

వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, “నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?” అన్నాడు.

“రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.

‘నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?’ అని దేవతలను ప్రశ్నించిందామె.

‘ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ‘ అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.

“విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?”

ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.

పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.

ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.

కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.

కోపంతో మండిపడిందామె.

“శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?” ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.

అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.

మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని “నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి” అంది.

కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.

“వాసుదేవా! ఇలా రావయ్యా” అని పిలిచింది గాంధారి.

“కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను – నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక” అని శపించిండి గాంధారి.

సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.

“అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?” అన్నాడు నవ్వుతూనే.

పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s