వారణాసీ పురవాసం-శ్రీ శివ మహాపురాణము

నగరవాసం మీద తనకేమాత్రం మోజులేనప్పటికీ, సుకుమారంగా పెరిగిన సతీదేవి తనతోపాటు కొండల్లో – కోనల్లోను, మేఘాల మీదను విహరింపవలసి రావడం పరమశివునికీ బాధ కలిగించేదిగానే వుంది.

నివాసానికి అనుకూలమైన ప్రదేశం కోసం లోకాలన్నీ పరికించి చూశాడు. భూలోకంలో గంగానది ఒడ్డున ఉన్న వారణాసీ పురాన్ని, తాను ఇంతకుముందే చూసివున్నాడు. బాగా యోచించి అదే తన నివాస స్థానంగా చేసుకోవాలని భావించాడు.

varanasi

వెంటనే, అక్కడున్న నికుంభుడనే గణనాయకుని పిలిచి, వారణాసీ వాటికలో ఎలాంటి అకృత్యాలూ చేయకుండా, ఆ పురాన్ని ప్రజలచేత ఖాళీ చేయించమన్నాడు. అప్పుడక్కడ దివోదాసుడనే ధర్మప్రభువు రాజ్యం చేస్తున్నందున శివుడలా ఆనతిచ్చి ఉన్నాడు. శివదీక్షాపరుడైన మంకణుని సాయం తీసుకుని నికుంభుడు నేర్పుగా ఖాళీ చేయించాడు ఆ పట్టణాన్ని.

అలా ఖాళీ అయిన ఆ నగరాన్ని స్వర్గంతో తులతూగేలా – వాసయోగ్యంగా నిర్మించి ఇవ్వమని శంకరుడు పరమాత్ముని ధ్యానించాడు. సంకల్పమాత్రాన అది అపురూప నగరిగా రూపాంతరం చెందింది. సతీ సమేతుడై శంకరుడానగరిలో చిరకాలం సుఖించాడు.

కొంతకాలానికి ఆ సతీదేవికి, ఆ నగరవాసం పై ఆసక్తి సన్నగిల్లింది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోదామని పోరసాగింది. “ఈ వారణాసి ఏమిటనుకుంటున్నావు? నాకు ఎంతో ఇష్టమైన గృహసీమ! దీన్ని విడిచి నేనెక్కడికీ రాలేను” అన్నాడు శివుడు. నాటినుంచి వారణాసికి, ‘అవిముక్తము’ అనగా (శివునిచే) విడువబడనిది అనే పేరు సార్థకమైంది.

క్రమంగా సతీదేవికి, శంకరుని వైఖరి కోపకారణం కాసాగింది. ఎన్నిసార్లు అడిగినా, తానెక్కడికీ రాను అనడమే గాక, ఆమెను ఎక్కడికి కావాలంటే – అక్కడికి పోవచ్చునని అనసాగాడు. ప్రణయ కలహాలే కాదు… దంపతులమధ్య అప్పుడప్పుడు మనఃస్పర్థలు కూడా ఏర్పడ తాయని నిరూపించారు ఆది దంపతులు. ఇంతకంటే వేరే నిదర్శనాలేల?

ఏదైనప్పటికీ – ఇటువంటివి సంసారంలో సహజములేనని సరి బుచ్చుకున్న సతీదేవి, మళ్లీ యథాప్రకారమే ఉండసాగింది.

శివుడిపై దక్షునికి తేలిక భావం కలుగుట:

వారణాసికి దగ్గరలోనే ఉన్న అదే నైమిశారణ్యం , ప్రస్తుతం మనం ఉంటున్న నైమిశారణ్యమే! ఒక కల్పకాలంలో ఇప్పటి మనకు మల్లెనే, అప్పటికాలపు ఋషిగణాలంతా ఓ మహాయజ్ఞం తలపెట్టారు.

ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడి నుంచో ఋషులు, దేవతలూ, సనక సనందనాదులూ, సిద్ధ పురుషులూ, చారణులూ, గంధర్వులూ, నారదాది దేవర్షులూ అంతా విచ్చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న స్థాణు దేవుడైన పరమశివుని ఆహ్వానించగా , ఆయన కూడా అక్కడికి వేంచేశాడు. శివదర్శనమాత్ర సంతోషితాంతరంగులై సర్వులూ ఆయనను అర్చించారు. ఎంతో ప్రశాంతంగా యాగం సాగుతూండగా మహదార్భాటం చేసుకుంటూ అక్కడ దక్షప్రజాపతి ప్రవేశం చేశాడు. వస్తూనే దక్షుడు, బ్రహ్మకు నమస్కరించాడు. (బ్రహ్మ దక్షప్రజాపతికి తండ్రి) వయసులో పెద్దవాడు కదా అనే గౌరవంతో, ఇతర దేవ సిద్ధ గణాదులంతా దక్షునికి మర్యాద సూచకంగా లేచి నిలబడ్డారు. శివుడదేమీ పట్టించుకోలేదు.

అప్పటికే.. ఆనోటా – ఈ నోటా శంకరుడు కపాలం చేబూని అడుక్కుంటున్నాడని విని ఉన్న దక్షునికి, ఈ శివుడు చూపిస్తున్న అల్లుడి టెక్కు – నిక్కు మహామంట కలిగించాయి. గొప్ప గొప్ప దేవతలే లేచి నిలబడగా, అడుక్కొనేవాడింత బెట్టు చేయడమేమిటనే అహం బుసకొట్టింది. అది మహా అవమానంగా తోచింది. ఎంతటి వారైనా పెద్దలను గౌరవించాలి! తాను వస్తూనే ప్రజాపిత బ్రహ్మకు నమస్కరించలేదా? అట్లే ‘పిల్లనిచ్చిన మామగారిని – పెద్దవాడిని నన్ను గౌరవించనక్కర్లేదా?’ అనే లౌకిక మర్యాదను మాత్రమే అపేక్షించాడు దక్షుడు. ఆ క్షణంలో అతడ్ని కమ్మేసిన శివమాయా విలాసం అట్టిది. వాస్తవంగా ఎవరికంటె ఎవరు అధికులన్నది యోచనకు కూడా తోచదు – శివ మాయకమ్మిన కనులకు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s