కలి లక్షణాలు-శ్రీ విష్ణు పురాణము

ప్రతిరోజూ కొద్దికొద్దిగా ధర్మం తగ్గిపోయి, పురుషార్ధాలు క్షయ మవుతూంటాయి. స్త్రీత్వమే భోగకారనమవుతుంది. ధనంగలవాడే కులీనుడని పిలువబడతాడు. అబద్ధమే వ్యవహార హేతువవుతుంది. బ్రాహ్మణులకు జంధ్యం అలంకారప్రాయమవుతుంది.

ఎవరిదగ్గర బంగారం, రత్నాలు ఉంటే వారే పొగడబడుతూంటారు. భయం లేకుండా బల్లచరిచి చెప్పేవాడే పండితుడవుతాడు. స్నానమే పెద్ద కర్మానుష్ఠానం. దానం చెయ్యడమే ఓ గొప్ప ఉపకారం. మంచి వేషగాడే దానానికి అర్హునిగా ఎన్నుకోబడతాడు. కపటవేషధారణమే మహాత్మ్యానికి హేతువు. దూరంగా ఉన్న నీళ్లే తీర్థాలవుతాయి. (పెరట్లో నీరు పనికిరాదని అర్థం)

సకల ఉపద్రవాలకు ఓర్చుకొని జనం జీవించవలసి వుంటుంది. నరసంతానం అధికం అవుతుంది. పాలకులు పీడకులుకాగా, ప్రజలు కొండలు గుట్టల్లో తలదాచుకుంటారు. పాతికేళ్లు మించి బ్రతకడం కష్టతరమవుతుంది.

కలిలో ఈ విధంగా దుర్లక్షణాలు ప్రబలమైన వెనుక, వాసుదేవుని అంశము శంబళగ్రామంలో విష్ణుయశుని ఇంట కల్కిరూపుడై అవతరిస్తాడు. దొంగలను దుర్నడతగలవారిని నశింపజేసి ధర్మాన్ని నిలుపుతాడు. తిరిగి కృతయుగపు చిహ్నాలను అప్పుడు చూడగలము.

స్వచ్చమైన స్ఫటికదళం వంటి పరిశుద్ధులు మిగులుతారు.

చంద్రసూర్యులు, బృహస్పతి, పుష్యమి నక్షత్రములు ఏకరాశిలో ఉన్నప్పుడు తిరిగి కృతయుగం ఆరంభమవుతుంది. ఇంతవరకు గడిచిన ప్రస్తుతం ఉన్న, రాబోయే రాజుల గురుంచీ చెప్పబడింది. పరీక్షిత్‌ జన్మించినది మొదలు నందరాజుల అభిషేకం వరకుగల కాలం – ఒక వెయ్యి పైన ఏభై సంవత్సరాలు.

సప్తరుషులు పరీక్షిత్‌ కాలంలో మఖానక్షత్రంలో ఉన్నారు. అప్పటికి కలియుగం 1200 సంవత్సరములముందు ఆరంభమైంది.

కృష్ణనిర్యాణం జరగగానే కలి భూమ్మీదకు వచ్చాడు.

కనుకనే పరీక్షిత్తుకు ఇదే సమయంలో పట్టాభిషేకం జరిగింది.

ఈ కలిలో 1200 దివ్యసంవత్సరాలు పూర్తిగా జరిగాక తిరిగి కృతయుగం ప్రవేశిస్తుంది.

(115, 116, 117 శ్లోక సంఖ్యప్రకారం) బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రకులాలలో మహాత్ములు అనేకులు యుగయుగాల్లోనూ వేలకొద్ధీ గతించారు. వారివారి పేర్లు, వారి లెక్కకు మించినందున, నామసామ్యంచేత పునరుక్తి చేత అవన్నీ చెప్పడం సాధ్యం కాదు. (ఇలా అని పరాశరులవారే (సాక్షాత్‌) అసాధ్యం అనేశారు.)

ఈ భూమండలం మీదా ఈ తుచ్చమైన శరీరం మీద రాజులు, మరింకా ఎందరెందరో మోహాంధకారం చేత, మమకారంచేత బద్ధులైనారు. ఈ నేల నాదెలా అవుతుంది? నా కొడుకుదెలా అవుతుంది? నా వంశానిదైనా కాగలదా? కేవలం ఈ చింతతోనే ఎంతోమంది గతించారు. వారికి ముందు తరం వారైనా, వారి తర్వాతి తరంవారైనా ఇదే యోచనతో గతిస్తూనే ఉంటారు. తనను గెల్చుకోడానికి, దండయాత్రలతో తనను వశపరచుకోజూసేవారికి చెంపపెట్టువలె భూమి విరగబడినవ్వుతుంది. మైత్రేయా! ఇదే పృద్ధ్వీగీత. రాజుల మోహాన్ని చూసి పుడమి జాలిపడటం దీని సారాంశం.

ఇదీ మనువు వంశక్రమం. స్థితి కార్యప్రవృత్తుడైన విష్ణువు యొక్క అంశాంశ మూర్తులైన రాజులు దీనిలో అవతరించారు. దీన్ని విన్నా, చదివినా పాపం నశిస్తుంది.

కాలస్వరూపం – కాలమహాత్మ్యం వర్ణించడం ఎవరితరం? కాలం చేత ఎంతటి వారలైనా కీర్తిశేషలుగావించబడక తప్పదు. పృథుచక్రవర్తి మొదలు, కార్తవీర్యార్జునుని పర్యంతం, రాఘవుడైనా, భగీరథుడైనా కీర్తిమాత్రమే గదా మిగిల్చిన వారైనారు. పండితుడైన వాడికిది సాకల్యంగా తెలుస్తుంది. మిగిలిన వారీ మాయా మోహాదులలో పడి దారీతెన్నూ గానరు. కనుక శరీరమమకారం విడనాడాలి.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s