యమలోక వర్ణనం-శ్రీ విష్ణు పురాణము

“పరాశర మహర్షీ! కర్మబంధం చేత బంధించబడని చోటు ఈ బ్రహ్మాండాంతర్భాగంలో ఎక్కడైనా సూక్ష్మంగానైనా ఉందా? అన్ని ప్రాణులూ ఆయువు ముగియగానే యమునికి వశమవుతున్నాయి. అక్కడ యాతనలూ ఉంటాయని వినికిడి. అక్కడ్నుంచి శుద్ధిగావించబడిన ప్రాణులు తిరిగి జననమరణచక్రంలో పడి కొట్టుకుంటున్నారు. నరులు ఇలా యమవశవర్తులు కాకుండా ఉండాలంటే ఏంచెయ్యాలో తెలుపగోరుతున్నాను” అని మైత్రేయుడడిగాడు.

“పూర్వం ఒకప్పుడు నకులుడికీ ఇదే సందేహం కలిగి, భీష్మపితామహుడిని అడగ్గా, భీష్ముడు చెప్పిన అంశం నీకు వివరిస్తున్నాను. మైత్రేయా! భీష్ముడికి ప్రియసఖుడైన ఒక కళింగద్విజోత్తముడు, ఒక మహర్షి వల్ల తన పూర్వజన్మవృత్తాంతం తెలుసుకుని ఆశ్చర్యపడి, ఆ అపూర్వానుభవాన్ని తన మిత్రుడైన భీష్మపితామహునికి మాటల సందర్భంలో చెప్తూ, యాతనాప్రాణులను గురించిన విశేషాలు తాను విన్నవి విన్నట్టుగా విన్నవించాడు. నరకలోక విభుడు యమధర్మరాజు, మధుసూదన భక్తుల జోలికి, ముముక్షువులజోలికి వెళ్లొద్దని తన కింకరులను రహస్యంగా ఆదేశించాడనీ – అట్టి పుణ్యాత్ములను నేను సేవించి తీరాలని విష్ణ్వాజ్ఞ గనుక, తాను శ్రీహరి వశవర్తిని అని చెప్పగా – విష్ణుపుప్రభావాన్ని గూర్చి ఆ కింకరుడిలా ప్రశ్నించాడు.

“మహాప్రభూ! తమవంటి చక్రవర్తులే, త్రిగుణాతీతుడైన విష్ణువశవర్తులని చెప్పడం నాకు మహదాశ్చర్యంగా ఉంది. తమ ఆజ్ఞను శిరసావహించడానికి నేను సదా సంసిద్ధుడను. పాపాలు చేసినవారిని గుర్తించగల నైపుణ్యం ఉంది గానీ, విష్ణుభక్తులను ఎలా గుర్తించాలి? వారి లక్షణాలు ఏమిటో విశదీకరించండి” అని వేడుకున్నాడు. అందుకు యమధర్మరాజు…

ఓయి కింకరుడా! ఎవరు తమ వర్ణాశ్రమధర్మాలను వదలకుండా ఉంటారో, ఎవరు శత్రువుల్నీ – మిత్రుల్నీ సమబుద్ధితో చూస్తారో, ఎవరైతే అపహరణ హింస మొదలగు దుర్గుణాలు కలిగివుండరో, ఎవరు అత్యంత నిర్మల మనస్కులై ఉంటారో, అట్టివారిని విష్ణుభక్తులుగా గుర్తించు! కలిదోషంచేతనైనా సరే – ఎవరి మనసులు నిశ్చలంగా ఉండగలవో – ఎప్పుడూ శ్రీహరినే మనస్సున నిల్పి ధ్యానిస్తుంటారో అట్టివారి జోలికి వెళ్లకు.

ఎందుకంటే – స్సటిక పర్వతపు శిలవలె నిర్మలులైన మనుజుల హృదయాలలో వాసుదేవుడు స్థానం ఏర్పరుచుకుంటాడు. చంద్రుని మీదకు అగ్నిప్రసరించగలదా? సూర్యుడున్న చోట చీకటి ఉండనట్లే – ఎవరి హృదయంలో హరి ఉంటాడో, అతని పాపాలన్నీ ఆ శ్రీహరిచేతనే భేదింపబడుతూన్నాయి.

యమము, నియమము మొదలగు యోగశాస్త్రసంబంధ అభ్యాసములచేత కలుషాలను శుద్ధిచేసుకున్నవారు, నిత్యము శ్రీహరి లగ్నమానసులైనవారు, బంగారాన్నయినా ఇతరుల కంటబడకుండా ఉంటే – దొంగలించేబుద్ధి మాని తృణప్రాయంగా ఎంచేవారు విష్ణుభక్తులని తెలిసి వారికి దూరంగా జరుగుము. ఓయి కింకరుడా! ఇంకా విను!…

ప్రాణుల్ని హింసించేవారిలో, కఠిన చిత్తులలో, దురహంకారులలో, అసత్యప్రలాపులలో, పరధనాలకు ఆశపడువారిలో విష్ణుభగవానుడు ఉండడు. అలాగే – మిత్రులను, బంధువులను, తల్లిదండ్రులను, భృత్యులను హింసించేవాడు, దుశ్శీలురతో సాంగత్యం చేసేవాడు, కలుషాత్ముడు, మత్తులో నిరంతరం మనిగితేలుతూ చేయరాని పాపాలు చేసేవాడు, దేవతారాధన చేయనివాడు, దానాదుల పట్ల ఉపేక్ష వహించేవాడు వాసుదేవభక్తుడని భావించకు.

అనంతుడైన శ్రీహరి హృదయంలో ఉన్నవారికి ఈ సకలదృశ్యమయ ప్రపంచం, నేను, పరమశివుడు, వాసుదేవుడు అందరూ ఒక్కటే అనే స్థిరబుద్ధి కలుగుతుంది. అటువంటి వారిని నువ్వు విడిచి దూరంగా ఉండు! నాయొక్క నామస్మరణం చేత నిత్యం పునీతులయ్యే వారిని తాకకు. శ్రీమహావిష్ణుని తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వారి కనుచూపు మేరలో మనం సంచరించగలమా? విష్ణుభక్తుని ప్రతిభ అనన్యసామాన్యం. అతడి ప్రభావం అతి తీవ్రం. నరకాన అతడ్ని ఉంచాలనుకోవడం అవివేకం. ఆ పుణ్యాత్ముడు ఉత్తమ లోకాలకు అర్హుడని గ్రహించుకో!”….

ఇదీ యముడు తన భటులకు ఉపదేశించినట్టి – శాసించినట్టి విషయం. ఆ యమధర్మరాజు స్వయంగా ఇలా అనడం నాకు తెలుసు గనుక నీతో చెప్పానని ఆ కళింగద్విజుడు తన ఆప్తమిత్రుడైన భీష్మునికి వివరించగా ఆ సంగతినే అతడు నకులునితో చెప్పాడు. కేశవుని కరుణగలవానిని యమకింకరులుగాని, యమదండంగాని, యమపాశంగాని, సాక్షాత్‌ యముడేగాని ఏమీ చేయడానికి శక్యం కాదని నలుకుడు భీష్మాచార్యుని వల్ల గ్రహించిన దానినే నీకు చెప్తున్నాను మేత్రేయా!” అని పలికాడు పరాశరుడు.

చాతుర్వర్ణవ్యవస్థ – వాటి ధర్మాలు

విష్ణ్వారాధనా ఫలితాన్నీ, ఆ శ్రీహరిని ఆరాధించే తీరును వినిపించ వలసిందిగా కోరిన మైత్రేయునికి పరాశరుడు ఈ విధంగా చెప్పసాగాడు…

“మైత్రేయా! ఒకప్పుడు ఇదే విషయాన్ని భృగువంశజుడైన ఔర్వమహర్షిని సగరచక్రవర్తి అడగ్గా, అందుకా మహాముని చెప్పిన ప్రకారమంతటినీ నీకు వివరిస్తాను. విష్ణ్వారాధనకు సంబంధించి నీకు గలిగన సందేహాలన్నీ తీరగలవు. విను! ఒకప్పుడు ….

“ఓయి సగరుడా! విష్ణ్వారాధన ఫలం గురించి ఒక్కమాటలో చెప్పొచ్చు! భూలోకంలో ఏది కోరితే అది నెరవేరడం; ఎంత ఫలం అనుభవించదలచినా అదంతా దక్కడం శ్రీహరి ఆరాధకులకు సాధ్యం! అంతేకాక ఉత్తమమైన మోక్షఫలాన్ని కూడా పొందగలుగుతారీ మనుజులు.

శ్రీహరి ఆరధన చేసేరీతి ఎలా ఉంటుందంటే – మానవులు తమ వర్ణాచార ధర్మాలనే పాటిస్తూనే శ్రీహరిని సేవించుకోవచ్చు! ఆచారం – నిష్థ అంటూ ఏవేవో అందనివాటికి అర్రులు చాచనవసరం లేదు. బ్రాహ్మణుడయితే – తాను చేసే యజ్ఞాలలో జరిగించే దేవతారాధన మూలంగా విష్ణువును ఆరాధించిన వాడవుతున్నాడు. చిత్తశుద్ధితో మంత్రజపం చేసినా అదీ హరిసేవయే! ఏ ప్రాణిని హింసించినా, అది విష్ణుహింసయే!

కొండెములు పలుకుట, దంభముగా ప్రవర్తించుట, ఇతరుల్ని నిందించుట, అసత్యము, ఇతరులను కష్టపెట్టుట…ఇవన్నీ కేశవుని పట్ల ఆచరించే అపచారాలవుతాయని తెలుసుకో!

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే నాలుగు వర్ణాలవారు తమ తమ వర్ణాశ్రమధర్మాలు పాటించడం ద్వారానే శ్రీహరి ఆరాధన చేసినవారవుతారు. అంటే విహితకర్మ కెంతటి ప్రాధాన్యమీయబడినదో గుర్తించు! విప్రులను – దేవతలను – గురువులను నిత్యం సేవించడం పట్ల ఆసక్తి కలిగివుండి, సర్వభూతములను తన వలెనే భావించి వాటిహితాన్ని కోరేవారికి, రాగద్వేషాలకతీతంగా అన్నిటిపట్ల సమదృష్టిని కలిగి ఉండే వారికి, విష్ణ్వారాధన ఫలం దక్కుతుంది.

అప్పుడు – సగరుని కోరిక మేరకు, ఔర్వుడు వర్ణాచార ధర్మాలు ఈ ప్రకారం చెప్పసాగాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s