నారద – శాపచాలనం

మొదట కామాతురుడై, ఆ పిదప కార్యభంగ వికల మానసుడై, ప్రస్తుతం క్రోధోన్మత్త మిళిత వేదనా పరివృతుడై వైకుంఠంలోకి అడుగిడిన నారదుడు శ్రీహరిని నిందించసాగాడు. “ఆశ్రితులను సైతం అల్లరిపెట్టే తుంటరితన మేలనయ్యా శ్రీహరీ? నువ్వు మహామేధావివే కాదు! మాయావివి కూడా! అయితే మాత్రం…?! నీవే శరణన్నవారిని కూడా, నవ్వులపాలు చేస్తే ఇక నీ మహిమకెంత మచ్చ? కనీసం అదయినా నువ్వు ఆలోచించుకున్నావా? నువ్వింతటి అఖండుడవని తెలిసే, ఆ మహాదేవుడు సర్వాధికులుగా బ్రాహ్మణులను నియుక్తుల్ని చేశాడు. నిన్ను ఆ తర్వాతివాడిగానే కొలువమన్నాడు. పరమౌన్నత్యం కట్టబెట్టడానికి శివుడంతటివాడే జంకాడూ అంటే – నీ సంగతి అయనకు బాగా తెలిసినట్టే ఉంది..” అంటూ దెబ్బిపొడవసాగాడు.

“శ్రీ మహావిష్ణువు కంటె బ్రాహ్మణులను ఎట్లు అధికుల్ని చేశాడా భూతేశుడు?” మహర్షులు ప్రశ్నించారు.

సాక్షాత్తు ఆ విరాట్పురుషుని ముఖం నుంచి ఉద్భవించడమేకాక, అపర సరస్వతీ మూర్తులైన వేదాల్ని అభ్యసించే దేవతలుగా వెలుగొందుతారని ఆ పరమశివుని ఆనతి. ఉదాత్త అనుదాత్త సర్వ సహితంగానూ – అప శబ్దోత్పన్నం కాకుండానూ వేదాన్ని చదవగల ప్రజ్ఞ భూసురుల సొంతం చేశాడా భగవంతుడు. సమస్త మునిజనాలకు మూల పురుషులు బ్రాహ్మణులే! అందుకే బ్రాహ్మణ దూషణ బ్రహ్మహత్యాపాతకంతో సమానమని సెలవిచ్చి ఉన్నారు. భారతగాధలో దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. వారిని సాక్షాత్తు విష్ణుస్వరూపులుగా సంభావించాలి. బ్రాహ్మణ ద్వేషులను శ్రీహరి ద్వేషులుగా నెంచును. సరే! అది అట్లుండనిండు! నారదుడు నోరు నొప్పిపుట్టేలా శ్రీహరిని నిందించి – చివరకు ఒక శాపం కూడా దయచేశాడు. ‘ స్త్రీ విషయమై నన్ను మోసం చేసిన నీవు, భూలోకములోనే రాజుగా పుట్టి , నీ ఇష్టపత్ని వియోగబాధలో కొన్నాళ్ళు పరితపించెదవుగాక! నన్ను కోతిని చేసి ఆడించబోయిన నీ మర్కటబుద్ధికి, ఆ జన్మమందు – కోతి మూకలే నిన్ను కొలుచుగాకా!’…అంటూ నారదుడు అప్పటికి శాంతించాడు.

శివమాయా విలసనం – దాని ప్రభావం చిదానంద స్వరూపుడై పరికిస్తున్న శ్రీహరి ఆ మహాదేవుని తలచి, నారదునికి కమ్మిన మాయ తెరలను పటాపంచలు అయ్యేలాచేశాడు.

ఎప్పుడైతే మాయ నారదుని వీడిందో, జరిగినదంతా స్పష్టంగా దృగ్గోచరం కాసాగింది – ఆ మునివర్యునికి. జరిగిన పోరపాటుకు అసాధారణంగా చింతాక్రాంతుడై, చతుర్భుజుని పాదాల చెంత వ్రాలాడు నారదుడు.

“బ్రహ్మ మనసపుత్రా! ఇందులో నీ దోషం లేదు. అంతా పరమేశ్వరుడి లీల! నేనూ – నువ్వు అందరం ఆయన అడించినట్లు ఆడవలసిందే! కేవలం శివేచ్చానుసారమే ఇదంతా జరిగింది. నీవు నాకు శాపం దయచేయడం కూడా అందులో అంతర్భాగమే. కనుక – నీ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. జరిగిందేదో జరిగింది. త్రికరణ శుద్ధిగా ఇకనైనా ఆ పరమశివుని ధ్యానించుకో! పురాకృత పుణ్య విశేష వశాన మాత్రమే లభించే శివభక్తి తత్పరుడవై తరించు! నీ తండ్రినే గురువుగా చేసుకుని అద్వైత శివతత్త్వాన్ని అనుసరించు! ఆ పరమ శివానుగ్రహం నీకు కలిగి తీరుతుంది” అంటూ అంతర్హితుడయ్యాడు శ్రీహరి.

నారద పుణ్యతీర్థ యాత్ర:

నారాయణమూర్తి ఆనతిచ్చిన ప్రకారం – శివభక్తి తత్పరుడయ్యాడు నారదుడు. అందులో భాగంగా శైవక్షేత్రాలన్నీ సందర్శిస్తూన్న తరుణంలో ఒకచోట నారదశాపానికి గురైన రుద్రగణాధినేతలు ఇద్దరూ తారసపడ్డారు.

తమ నిజరూపాలు చూపించి, శాపం సడలింపజేయమని అభ్యర్ధించారు. శాపం వెనక్కు తీసుకోగల అవకాశం లేదనీ – వశ్యవాక్కు అయిన తనశాపం అనుభవించక తప్పదనీ – అయితే కొంత ఉపశమనం ఉండేలా సవరించగలననీ చెప్పి, రాక్షసులై జన్మించినప్పటికీ వారు శివునిభక్తి వీడరనీ – శివుడంతటి దేవుడిచేతనే నిర్జితులవుతారనీ వారిని ఊరడించాడు నారదుడు.

అలా తీర్ధాలన్నీ చరిస్తూవున్న నారద మునీంద్రుడు వారణాశీ పురం చేరుకున్నాడు. విశాలాక్షీ – విశ్వేశ్వరుల దర్శనం చేసుకున్నాడు. అక్కడ్నుంచి సరాసరి బ్రహ్మలోకం చేరుకున్నాడు.

తండ్రి అయిన పరమేష్ఠికి ప్రణామమాచరించి “తండ్రీ! ఎన్నెన్ని తీర్ధాలు సేవించినా శివతత్త్వసారం వంటపట్టలేదు. నాయందు దయతో నీవే గురువుగా ఆ పరిజ్ఞానం కలిగింప వేడుతున్నాను” అన్నాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s