కలి స్వరూపం – శ్రీ విష్ణు పురాణము

మైత్రేయ ఉవాచః

శ్లో|| శ్రోతుమిచ్ఛామ్యహం త్వత్తో యథావ దుప సంహృతిమ్‌ | మహాప్రళయ సంజ్ఞాం చ కల్పాంతే చ మహామునే ||

కల్పాంతమందు జరిగే ప్రాకృత ప్రళయంలో ఆ పరమాత్మ ఈ జీవజాలాన్నంతటినీ ఎలా ఉపసంహరిస్తాడో వినగోరుతూన్నాను – అని మైత్రేయుడు అడిగినపుడు, పరాశరుడిలా చెప్తూన్నాడు…

“బ్రహ్మ కలియుగాంతాన ఈ సృష్టిని ఉపసంహరిస్తాడు. ఋగ్యజుస్సామవేదోక్త ధర్మప్రవృత్తికి హేతువైన సదాచారాలు కలియుగంలో సాగవు. వర్ణాశ్రమ ధర్మాలపట్ల ప్రజలకు నిర్లక్ష్యం ప్రబలుతుంది. వివాహాలు ధర్మబద్ధంగా జరగవు. దాంపత్యక్రమం ఉండదు.

గురుశిష్యులకు ఆత్మీయమైన గురుకుల పద్ధతి సాగదు. అగ్నిహోత్రాలు, దేవతోపాసన బాహ్యాడంబరాలుగా మాత్రమే ఉండి ధర్మానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి. బలం గలవాడే కలిలో ప్రభువుగా చలామణీ అవుతాడు. కన్యను పెళ్లాడటానికి అన్ని వర్ణాలలోను ధనం – బలం ప్రాముఖ్యత వహిస్తాయి. పాండిత్యంతో యోగ్యులనిపించుకోవాలని ప్రయత్నించడం వృథా ప్రయాస కాగలదు. ఎవరేం చెప్పినా అదే శాస్త్రం! తన బుద్ధిననుసరించి ఎవరేం చేస్తే అదే గొప్ప సత్కార్యం. తనకు తాను మంచిదని భావించే పనిచేసేవాడు మహాయజ్ఞకర్త. సర్వం దేవతలను పైపైన తలచేవారే! అంతటా ఆశ్రమాలే! అందరూ ధార్మిక వచోవేత్తలే! స్త్రీలకు కేశాలే అందంగా తోస్తాయి. వాటిపట్ల శ్రద్ధనే అందం అనుకుంటారు.

‘స్త్రీణాం రూపం మదంశ్చైవం కేశై రేవ భవిష్యతి’

సువర్ణం, మణి, రత్న, వస్త్రాది సౌందర్యం లోపిస్తుంది. విత్తవంతుడినేభర్తాగా వరించడానికి స్త్రీలు ఇష్టపడతారు. డబ్బులేనివారికి విడాకులప్రాప్తి తప్పదు.

“పరిత్యక్ష్యంతి భర్తారం విత్తహీనం తథా స్త్రియః | భర్తా భవిష్యతి కలౌ విత్తవానేవ యోషితాం ||”

ఉత్తమ వంశంలో జన్మించడం అనేది పరిపాలకునికి ప్రధమార్హత కానేకాదు. గృహం గలవాడే భోగి. తాను ఎంత గొప్పగా ధనాన్ని అనుభవించగలిగితే అతడే ప్రభువు – ధనవంతుడు – తెలివైనవాడుగా గణనలోకొస్తాడు. స్త్రీలు చిత్రవిచిత్రమైన కోర్కెలకు – పై మెరుగులకు ప్రాముఖ్యమిచ్చి వాటికోసం వెంపర్లాడి వ్యభిచారానికైనా వెనుదీయక తమ కోరికలు తీర్చుకుంటారు. అందరూ అన్యాయార్జిత విత్తానికి ఉబలాటపడతారు.

బ్రాహ్మణాదరణ శూన్యమవుతుంది. వారినీ జనుల్లో ఒకడని తలుస్తారే తప్ప ‘భూసురుడ’ నిగౌరవించరు. విశిష్ట గౌరవముండదు. ఆవులకు కూడా ఇదే పరిస్థితి. కేవలం పాలుఇచ్చే గుర్తింపు తప్ప, వాటికీ పూజలుండవు.

వర్షాభావ పరిస్థితులవల్ల జనులంతా ఆకలికి అల్లాడుతూ, తాపసులవలె కందమూలాలు తినవలసివస్తుంది. స్నాన ధ్యానాదులు, అగ్నిహోత్ర దేవతారాధన – అతిథి పూజాదికాలు లేకుండానే భోజనం చేస్తూ, ఇవే సుఖ సంతోషాలనుకుంటూ ఉంటారు. ప్రజలు దురాశాపరులై, హ్రస్వదేహులై, (మరుగుజ్జులుగా) దుర్బలులై సేవక వృత్తితో జీవితం గడుపుతారు. దుర్బలుడైనా ధనాఢ్యుడతే బ్రహ్మరథం పడతారు. స్త్రీలు రెండుచేతులా తలలు గోక్కుంటూ, కేశ సౌందర్యమే ముఖ్య మనుకుంటారు. పెద్దల – భర్తల ఆజ్ఞను ధిక్కరిస్తుంటారు. శీలం చెడినవారు అధికులవుతారు. ఉత్తమ కులాలవారు కూడా, నీచపురుషుల పంచన డబ్బుకోసం చేరతారు.

బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించకుండానే, ఒడుగుచేసుకున్నవారు వేదాల్ని చదువుతారు. గృహస్థులు అగ్నిహోత్రాలు నిర్వర్తించరు. తప్పసిసరిగా చేయవలసిన దానాలు కూడా చేయరు. గ్రామ్యాహారాలు, పాడుతిళ్ళు, పాడుదానాలు పట్టడానికీ సంకోచించరు. సన్యాసులు సైతం ఇంతే!

ఇక – రాజులు రక్షకులుగా గాక, భక్షకులవలె ప్రవర్తించి పన్నులపేరిట దొంగలకంటే హీనంగా ప్రవర్తిస్తారు. ప్రత్యక్ష పన్నులకంటే పరోక్షపన్నులచేత ప్రజల నడ్డి విరుస్తారు.

వైశ్యులు స్వధర్మపాలన అయిన వాణిజ్యం, మారు వర్తకాలు విడిచి వడ్రంగం, కమ్మరి వృత్తి మొదలగు శూద్రవృత్తులు అవలంబిస్తారు. (కొందరు వ్యాపారాల్లో మోసాలకు పాల్పడి, నిందలకు గురౌతారు). శూద్రులు సన్యాస చిహ్నాలు దాల్చి, కాషాయాలు కట్టి ప్రవచనాల వరకే పరిమితమై, నానా అనాచారములు – అకృత్యాలు సల్పుతారు. దుర్భిక్షాలు అధికమవుతాయి. పదేళ్లవయసుకే గర్భోత్పత్తి సామర్థ్యం వచ్చి, కన్యాగర్భాలు హెచ్చుతాయి. పన్నెండేళ్లవయసొచ్చేసరికే జుట్టు నెరిసిపోవడం ప్రారంభమవుతుంది. పాతికేళ్ళకు మించి జనులు బతకడం అసాధ్యం. అల్పమతులవల్ల సంసారాలు విచ్చిన్నమై జారిణులు – స్వైరిణులు అధికం అవుతారు.

ధర్మహాని జరిగే ఈ కలిలో, ధర్మపరులు ఎప్పటికప్పుడు కలిప్రభావాన్ని అంచనా వేస్తుంటారు. విచక్షణులకు కలి చెలరేగడం బోధపడుతూనే ఉంటుంది. మేఘాలు స్వల్పంగా వర్షించడం – పంటలు అల్పమాత్రమై ఫలించడం – ఉత్పాతాలు అధికం కావడం, జనుపనార వంటివి వస్త్రాలుగా చెలామణీ కావడం, పాలు ఆజ్యప్రాయమై రుచిలేక ఉండటం, వట్టివ్రేళ్ళే గంధంగా భావించబడటం…ఇవన్నీ మహాత్మ్యాలే !

నరులకు – మాతాపితృ గురు బాంధవులకంటే, భార్య – భార్యవైపున వారు అధిక ప్రీతికరమైన వారవుతారు. సత్య – శౌచాలు అంతరిస్తాయి. స్వాధ్యాయ వషట్కారాలు వినిపించవు. కలిలో స్వల్ప ప్రయత్నం చేత సంపాదించిన పుణ్యమే, కృతయుగంలో వేలఏళ్లు తపస్సు చేసి సంపాదించిన పుణ్యంతో తూగునట్లు చెప్పుకుంటారు. దీనిపై మహాజ్ఞాని వ్యాసుడోశారి గంగలో నీటమునిగే సందర్భంలో చేసిన వ్యాఖ్యాలిక్కడ చెప్పుకోవలసి వున్నది.

కలిలో ధర్మసూక్ష్మం

త్రేతాయుగంలో పదేళ్ళు చేసిన పుణ్యం – ద్వాపరంలో నెలరోజులు చేసిన పుణ్యాలకు, కలిలో ఒక ఏడు – ఒక రోజు చేసిన పుణ్యంతో సమానం. జపం – తపం – బ్రహ్మచర్యవ్రతాలకు ఇదీ ఫలితం. అందువల్లనే కలి ‘బాగుంది’ అన్నాడు. ఆ నదిలో ఒక మునక వేసిన వ్యాసుడు. తర్వాత – అల్పశ్రమచేత బాగా ధనాన్ని సంపాదించే అవకాశాలు కలిలో అధికం. బ్రాహ్మణులు సైతం వ్యర్థప్రసంగాలు – వృథా ఆచరణలు – సంతర్పణలు చేసి పతితులౌతారు. పరాధీనతవల్లనే వారికీపాట్లు. కనుక వీరికి క్లేశం తప్పదు.

బ్రాహ్మణులకంటె అధికంగా యజ్ఞాలపట్ల శ్రద్ధవహించి శూద్రులు పుణ్యలోకాల్ని గెలిచి ధన్యులవుతారు. అందువల్ల ‘బాగుబాగు’ అని రెండోమునక వేస్తూ అన్నాడు వ్యాసుడు.

పతిసేవ త్రికరణశుద్ధిగా ఆచరించే ఉత్తమ ఇల్లాళ్ల కొరత కలిలో అధికం. ఎంతో శ్రమించి పురుషుడు పుణ్యం చేస్తే, ఒకవైపు తాను జారచోరస్వైర విహారాలు చేస్తూనే స్త్రీ ఆ పుణ్యంలో భాగం పొందడం ‘మహాబాగుబాగు’ అని మూడవ మునకవేస్తూ అన్నాడు వ్యాసుడు.

తాను నీట మునకలు వేస్తూ భవిష్యద్దర్శనం చేస్తూ మునక కొకటి చొప్పున పైవిధంగా ప్రశంసిస్తున్నది ఎవరినో తెలీక, అక్కడకు చేరిన ఋషులకు సందేహనివృత్తి చేశాడు వ్యాసుడు. వారీ విషయాన్నే అడగాలని అక్కడకురాగా, దివ్యదృష్టితో అది గ్రహించిన వ్యాసుడు వారు అడగకముందే, తన వచనాలకు తానే ముందుగా భాష్యం చెప్పేసరికి ఆ ఋషులంతా ఆశ్చర్యపోయారు.

“అవును మహాత్ములారా! ఇంకేం చేయమంటారు? కృతాది యుగాల్లో ధర్మసంపాదన నిమిత్తం ద్విజులకు అధికశ్రమ ఉన్నది. కలిలో ఈ శ్రమ చాలా తగ్గింది. ఇంకేం చెప్పమంటారు”? అని వ్యాసుడన్నాడు. ఋషులు వ్యాసమహర్షిని ప్రశంసించి వెళ్ళారు. ఇదీ కలియుగ ధర్మసూక్ష్మం.

మైత్రేయా! సర్వభూత ప్రపంచానికీ మూడు విధాల ప్రళయం ఉంటుంది. 1. నైమిత్తికం. 2. ప్రాకృతం, 3. అత్యంతికం. ఇందులో మూడోవది మోక్షము. చతుర్దశ మన్వంతరాల చివర వచ్చే లయమే నైమిత్తిక ప్రళయం. (దేవతల కాలమానం ప్రకారం..)

వెయ్యి చతుర్యుగములు (బ్రహ్మకల్పమున) ముగిశాక భూమండలం క్షీణప్రాయం కాగలదు. నూరేళ్లకాలంపాటు భయంకరమైన అనావృష్టి ఏర్పడుతుంది. అల్ప సత్త్వం గల పార్థివ జీవులన్నీనశిస్తాయి.

విష్ణుభగవానుడు రుద్రరూపుడై ఇతర జీవజాలాన్ని కూడా హరించడం ప్రారంభిస్తాడు. సూర్యకిరణాలు తీక్షణమై జలవనరుల్లోని నీటినేగాక, ప్రాణమున్న జీవజాలంలోని నీటినీ శోషింపచేయడం వల్ల, ఎక్కడా చుక్క నీరు ఉండదు. ఏడు సూర్యకిరణాలే ఏడుగురు సూర్యుల్లా ప్రకాశించడం చేత, మొత్తం భూమి తాబేటి డిప్పవలె నీరింకిపోయి ఘనీభవించిపోతుంది.

అప్పుడా ప్రళయకాలాగ్ని రుద్రుడు సర్వహరుడై, శేషుని నిశ్వాసాల్లోంచి మొదట పాతాళం అడుగునుంచి కాల్చడం ప్రారంభిస్తాడు. ఆపైన భూమ్మీదకొచ్చి సర్వం దహించేస్తాడు. అటుపైన వరుసగా అంతరిక్షం – ఆ పైలోకాలకు వ్యాపించి తన జ్వాలకీలాగ్రముచేత కమ్ముకొని, కాలుతూన్న అంబరీషమా అన్నట్లుంటాడు.

మూడులోకాల వాసులూ వేడికి మాడిపోతారు. ఇంకొక దశలో శ్రీమహావిష్ణువు ఇట్లే సర్వజగత్తులను దహించి తన ముఖ నిశ్వాసములచేత (బైటికి ఊపిరిని దీర్ఘంగా వదలుట) ఘోరమైన సంవర్తకాలనే మేఘాల్ని సృష్టిస్తాడు. ఏనుగుల్ని పోలిన, ఉరుములు – మెరుపులతో కూడిన ఆ మేఘాలు వివిధవర్ణాలతో, వివిధ ఆకృతులతో ఆకాశాన్ని నింపి అతి భయంకరంగా అగ్నిని వర్షిస్తూ త్రిజగత్తులలో చెలరేగిన కాలాగ్నిని మించిపోతుంది.

ఆపైన నిర్విరామంగా వర్షం కురిసి, అగ్ని ఆరిపోయి క్రమంగా ఉదకం చేత లోకత్రయము నిండిపోతుంది. లోకాలు అంధకారబంధురమై, చరాచర భౌతిక ప్రపంచమంతా నశించిపోయేలా నూరేళ్ళు అలాగే వర్షిస్తుంది. ఇది అంతా ఆ పరమాత్మ లీల.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s