ఇంద్రద్యుమ్నుడు

పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజు అనేక పుణ్యకార్యాలు చేసి, యజ్ఞ యాగాలు నిర్వహించి అందరిచేత మంచివాడనిపించుకుని తనువు చాలించాకా స్వర్గలోకానికి వెళ్ళాడు. ఏళ్ళు గడిచేసరికి భూలోకంలో ఆయన కీర్తి మాసిపోయి ఆ పేరుగల రాజు ఒకప్పుడుండేవాడన్న సంగతి కూడా ప్రజలకు జ్ఞప్తి లేకూండా పోయింది. అప్పుడు దేవతలు ఇంద్రద్యుమ్నుణ్ణి స్వర్గంలో వుండనీయక భూమి మీదకు తోసేశారు. ఇంద్రద్యుమ్నుడు బాధపడుతూ మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్ళి “మహర్షీ! తమకు నేనెవరో తెలుసు కదా, నా పేరు ఇంద్రద్యుమ్నుడు” అన్నాడు.

మహర్షి అతన్ని తేరిపార చూసి “నాయనా! నీవెవరో నాకు తెలీదు. నీ పేరు నేనెప్పుడూ వినను కూడా వినలేదు. అయినా నేను హిమగిరివాసిని. తాపసిని. రాజులూ, వాళ్ళ చరిత్రలతో నాకు సంబంధం లేదు” అని బదులు చెప్పారు.

“మహర్షీ! మీ కంటే ముందు పుట్టి సజీవులుగా వున్న వారెవరైనా వున్నారా? ఉంటే సెలవియ్యండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం వారికైనా నేను తెలుసేమో విచారిస్తాను” అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. “మంచుకొండ మీద గూబ ఒకటి వుంది. దాని పేరు ప్రావారకర్ణుడు. అది నా కంటే చాలా ఏళ్ళు ముందు పుట్టింది. వెళ్ళి దానిని అడిగి తెలుసుకో” అన్నాడు మార్కండేయ మహర్షి.

“అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అశ్వాకారం ధరించి మహర్షిని మోసుకుంటూ ప్రావారకర్ణుడున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు.

“ఉలూకమా! నేనెవరో తెలుసుకదా” అన్నాడు రాజు తన నిజరూపం చూపి , తన కథంతా చెప్పాకా, ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి నాకు తెలీదన్నాడు.

రాజు సిగ్గుపడ్డాడు.

“నీకంటే ముందు పుట్టి చిరంజీవులుగా ఉన్నవారెవరైనా వున్నారా?” అని మళ్ళీ ప్రశ్నించాడు.

ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి “ఇక్కడికి దగ్గరలోనే ఒక సరస్సు వుంది. అక్కడ నాడీజంఘుడనే కొంగ వుంది. అది నాకంటే వయస్సులో పెద్దది” అని చెప్పాడు. ఇంద్రద్యుమ్నమహారాజు మార్కండేయ మహర్షినీ, ప్రావారకర్ణుణ్ణి మోసుకుంటూ సరోవరం దగ్గరకు వెళ్ళి కొంగను కలుసుకుని “నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?” అని అడిగాడు. అది కూడా కొంతసేపు ఆలోచించి తెలీదని తల అడ్డంగా వూపింది. తనకంటే ముందు పుట్టి తనతోపాటూ ఆ సరస్సులో వుంటున్న తాబేలుకు తెలుసేమో కనుక్కుంటానంది.

సరేనన్నాడు రాజు.

తాబేలుకు కబురు పంపారు. వణుక్కుంటూ ముసలి కమఠం వచ్చింది. “ఇంద్రద్యుమ్నుడు తెలుసా?” అని అడిగితే, కాసేపు ఆలోచించి, కాసేపు నవ్వుకుని , మరి కాసేపు స్మృతి తప్పినదానిలా తనలోతాను ఏదో గొణుక్కుని “నేను ఆయన్ని ఎరగకపోవటమేమిటి? ఆ మహారాజు వేయి యజ్ఞాలు చేసాడు. అసలీ సరస్సు పేరేమిటనుకున్నారు – ఇంద్రద్యుమ్న సరోవరం! ఆ మహానుభావుడు చేసినన్ని దానాలు మరెవరూ చేసి వుండరు. ఎన్నో గోదానాలూ, ఎన్నో భూదానాలూ, నిత్య సంతర్పణలూ జరిగేవి.

“ఆ మహనీయుడు భూసురులకు దక్షిణలుగా వేనవేల గోవులు దానం చెయ్యటం వలన ఆ గోవుల తొక్కిళ్ల చేతనే ఈ సరోవరం ఏర్పడింది” అని చెప్పి ఆ మహానుభావుణ్ణి స్మరిస్తూ నమస్కరించింది కూర్మం.

“నేనే ఆ ఇంద్రద్యుమ్నుణ్ణి ” అని చెప్పి మహారాజు కూడా కమఠానికి నమస్కారం చేశాడు.

ఇంద్రద్యుమ్నుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగినందుకు తన జన్మ ధన్యమైందని సంతోషించింది మసలి తాబేలు.

ఎన్నో వేల ఏళ్ళ తరువాత కూడా ఇంద్రద్యుమ్న మహారాజు గొప్పతనాన్నీ, ఆయన చేసిన పుణ్యకార్యాలనూ ఒకరైనా గుర్తు పెట్టుకున్నందుకు దేవతలు సంతోషించి దివినుండి భువికి పుష్పక విమానంలో వచ్చి, “మహారాజా! ఇప్పటికీ భూలోకంలో నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా వుంది. నీవూ మాతోపాటు స్వర్గంలోనే వుండాలి. ఇది మా అందరి కోరిక” అని పలికారు.

ఇంద్రద్యుమ్నుడు కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరించాడు.

మార్కండేయ మహర్షినీ , గూబనూ, కొంగనూ ఎవరి ప్రదేశాలలో వారిని విడిచిపెట్టి దేవతలు ఇంద్రద్యుమ్నుణ్ణి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకువెళ్ళారు.

కాబట్టి –

చేసిన పుణ్యం చెడని పదార్థం. పుడమిపై కీర్తి ఎంతకాలం వుంటుందో అంతకాలం స్వర్గంలో వుంటారు మానవులు. అపఖ్యాతి వున్నంతకాలం నరకంలో వుంటారు. అందుచేత బ్రతికిన నాలుగురోజులూ పుణ్యకార్యాలు చేసి అందరి దీవెనలూ పొంది మశస్సును ఆర్జించుకోవాలి.

పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకీ కథ చెప్పి “ధర్మరాజా! అన్ని దానాలలో అన్నదానం ఉత్తమం. అన్నదానం చేయలేనివాడు పిడికెడు మెతుకులు పెట్టే ఇల్లు చూపించినా పుణ్యం లభిస్తుంది” అని దాన ధర్మ స్వరూపాన్ని వివరించాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s