నైమిత్తిక ప్రళయం-శ్రీ విష్ణు పురాణము

ఓ మైత్రేయమునీ! సప్తర్షి మండలం ఆక్రమించి జలం ఉన్న స్థితిలో, ఈ ముల్లోకాలు ఒకే సముద్రంగా భాసిస్తాయి. అట్లే విష్ణు ముఖమునుండి బయల్వెడలిన దీర్ఘ నిశ్వాసాలు మేఘాలను చెల్లాచెదురుచేస్తూ నూరేళ్లు ఒకేరితిగా వీస్తుంది గాలి. ఈ వాయువు భగవన్మాయచేత కొంతకాలానికి పూర్తిగా స్తభించిపోతుంది.

అప్పుడు భగవానుడు బ్రహ్మరూపధారియై శేషతల్పాన నిద్రిస్తాడు. సనకాది ఋషు లా దేవదేవుని కీర్తిస్తూంటారు. ఇదీ నైమిత్తిక అనే ప్రళయరీతి.

తన దివ్యమాయాస్వరూపిణి అయిన యోగనిద్రలో ఉండి, ఆ మధుసూదనుడు, వాసుదేవాత్మక పరబ్రహ్మాన్ని (తనను తాను లేక తనలో తాను) ధ్యాననిష్ఠుడై ఉంటాడు. ఇది నిమిత్తము. కనుక దీనికి నైమిత్తికం అనే పేరొచ్చింది.

ఆ సర్వేశ్వరుడు మేలుకుని తిరిగి జగత్తును చేష్టాన్వితం చేస్తాడు. మాయాశయన వేళ నిఖిలజగత్తు చేష్టారహితంగా ఉండిపోతుంది. ఆ రాత్రి చివర అతడు మేల్కొని పునఃసృష్టిని ప్రారంభిస్తాడు. తిరిగి ఆ విష్ణువే బ్రహ్మస్వరూపుడవుతాడు – లోగడ చెప్పబనరీతిగానే.

ప్రాకృత ప్రళయము

అనావృష్టివంటి కారణాలచేత సకలలోకాలు రూపుమాసిపోగా, మొదట భూమియొక్క గంధగుణం పాతాళానికి అణగత్రొక్కబడుతుంది. దాంతో ఈ భూమి జలప్రళయానికి అనువైనదిగా మారుతుంది.

కృష్ణుని ఇచ్చవల్ల చేయబడే ప్రతిసంచరమిది. మహదాది వికారం నుండి వికృతివరకు సర్వము క్షయమైపోతుంది. జలమట్టం పెరిగి విశ్వమంతటా నిండుతుంది. క్రమంగా ఈ నీటిలో రసగుణం ఇంకిపోయి, నీరు తేజో రూపమును పొందుతుంది. అప్పుడు అంతటా అగ్ని వ్యాపించి నీటిని పీల్చేస్తుంది. ఈ జగత్తు అంతా అగ్నిజ్వాలలు కమ్ముకుంటాయి. వాయువు శమిస్తుంది. ఆకాశపర్యంతం ఏదీ లేక (స్పర్శ రూపరస గంధాలనే చతుర్‌ తన్మాత్రలు లేక) కేవలం శబ్ద తన్మాత్ర ఒక్కటే గుణంగా ఉంటుంది. అనులోమ – విలోమములనే మాటలచేత ఈ సృష్టి – ప్రతిసృష్టులు వ్యవహరించబడతాయి.

ఆత్యంతిక అనే మోక్షము:

తాపములు ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆదిభౌతికం అని మూడు రకాలు. ‘తాపత్రయం’ యొక్క స్వరూపం తెలిసి జ్ఞానవైర్యాగాలు పొందిన వాడే ఆత్యంతిక లయము (ముక్తి) పొందినట్లు! ఇటువంటి వారికి సృష్టి – ప్రళయాదులతో నిమిత్తం లేదు. వీరికి పునర్జన్నలుండవు. నిత్యభగవత్సన్నిధి వీరికి వాసము ఆధ్యాత్మిక తాపాలు రెండు రకాలు, అవి శారీరక సంబంధి, మానసిక సంబంధి. శరీర తాపాలు రకరకాలుగా ఉంటాయి. రోగాలన్నీ ఈ సంబంధమైనవే! జ్వరం, శూల, గుల్మ, ఆవత, శిరో రోగాలు, వాపు – వాతి వంటి వికారాలు…ఇలా ఎన్నెన్నో దైహిక బాధలు. ఇంకా కంటి రోగాలు, నాసా రోగాలు, పైకి కనిపించని (అంతర) శరీరావయవ రోగాలు అనంతం.

మానసిక రోగాలూ పలువిధాలుగా ఉన్నాయి – కామాదులవల్ల పుట్టే వికారాలూ – శోకాలూ – ఈర్ష్యాద్వేషాలు; అవమాన – మాత్సర్యాది మయం. మృగ, పక్షి, మనుష్య, పిశాచ, సర్ప, రాక్షస, గ్రహబాధలను ఆధిభౌతికము లంటారు. శీత, వాత, ఆతప, వర్ష బాధలు ఆధిదైవికాలు. ఇక గర్భ, జన్మ, జరా (ముసలితనం) మృత్యు, నరక పరంగా చెప్పవలసిన బాధలు అనంతమైనవి. జీవుని దేహం గర్భంలో ఉన్నప్పుడు, వివిధ బాధలకు లోనవుతుంది. కాని అవేవీ జీవునికి తెలియవు. మూత్ర పురీషమయమైన పెనురొంపిలో ఎన్నెన్నో పీడలను సహిస్తూనే తప్ప జన్మించడానికి లేదు గదా! ప్రారబ్ధకర్మకు చింతిస్తూ, చైతన్యశీలమై, అందుండి బైటకొచ్చేవరకు ఆ యాతనను జీవుడు అనుభవించక తప్పదు.

పుట్టేటప్పుడు మూత్రపురీష రక్తశుక్లములు ముఖాన కమ్ముకొని ఉండగా, ప్రబలమైన ప్రసూతి వాయువుచేత అధోముఖుడై తల్లి జఠరం నూంచి జీవుడు ఈ నేలనపడతాడు. ఆతురుడై మహామూర్ఛ చేత బాహ్యవాయువులు తాకడం వల్ల అంతవరకు ఉన్న విజ్ఞానం (ఫూర్వస్ముతి) కోల్పోతాడు. పుట్టాకకూడ క్రిమివలె ప్రవర్తిల్లక తప్పని స్థితి. దురదపుడితే గోక్కోలేని బాధ. పరేచ్ఛప్రకారం వర్తిల్లక తప్పదు. స్నానం, పానం, ఆహారం అంతా పరాధీనమే! జన్మాంతర దుఃఖాలన్నీ బాల్యదశయందు కమ్ముకొనవచ్చు! నేనెవరు? ఎటనుండి వచ్చాను? ఏం చెయ్యాలి? ఏమి చేయరాదు? దేనిలో ఎలా వర్తించాలి? అనే అజ్ఞానంలో పడి దుఃఖితులవుతారు.

బాల్యావస్థ, అటుపైన యవ్వనావస్థ. ఆ పిదప ముసలితనంలో అవస్థలు గడిచాక ఆపైన మరణావస్థలో కూడా ఈ జీవికి యాతనలు తప్పవు. మరణకాలంలో కాళ్ళు – చేతులు – మెడ శిథిలమవుతాయి. అంతలోనే శ్రమ, అంతలోనే తెలివి, అంతలోనే కంపం, అంతలోనే పరవశత్వం, ఏదో తెలీని తృష్ణ కలుగుతూంటాయి. తన తర్వాత తన వాళ్ళంతా ఏమవుతారో అనే చింత తొలుస్తుంటుంది. యమబాధలు పడుతూనట్లు – కనుగుడ్లు గిరగిరా తిరుగుపోతూన్నట్లు – కాళ్ళూ చేతులూ తన్నుకుంటూ, ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఆ జీవిపడే యాతనలు వర్ణనాతీతం. శ్వాస ఆడనిస్థితిలో అతి క్లేశంతో యాతనాదేహుడవుతాడు.

ఆ దేహం జీవ మరణస్థితికి సంధివంటిది. కొద్దిసేపు మాత్రమే ఈ దేహం నరక బాధలన్నిటినీ కళ్ళకు కట్టిస్తుంది. శ్వాస పూర్తిగా పోయాక, జీవుని దేహం అచేతనమవుతుంది.

ఇక – నరకంలో యమబటులు తాళ్లతో కొట్టడం, కర్రలతో కొట్టడ, యమదర్శనం, భయంకర నరకబాధలు దుస్సహమైనవి. (అవన్నీ గతంలోనే చెప్పబడ్డాయి. ద్వితీయాంశము – షష్ఠాధ్యాయము చూడుడు)

ఈ నరకబాధలు జీవుడు చేసిన పాపాల ఫలితాలే! ఒక్కమాటలో చెప్పాలంటే – ఈ సంసారంలో సుఖకారణంగా జీవులచేత భావించబడేది ఏదైతే ఉందో, నరకాన దుఃఖాలకు అదే కారణమవుతూన్నది. కనుక దారేషణ, ధనేషణ, – పుత్రేషణ అనే ఈ షణత్రయాన్ని పెంచుకోక, ముక్తికోసం యత్నించడం వివేకలక్షణం. కర్మాచరణము – విజ్ఞానము ఇవి రెండూ ముక్తి సాధకాలు.

అవ్యక్తరూపుడు, సర్వేశ్వరుడు, పరంధాముడు, ఏకరూపం అయినవాడు ఆ మహాతత్త్వం గురించి ఏదైతే తెలుపగలదో, ఏదైతే చూపగలదో అదే ‘విజ్ణానం’. ఆ విజ్ఞానమే ముక్తిమార్గం. వర్ణాశ్రమధర్మములతో కూడిన కర్మాచరణము త్రికరణశుద్ధిగా ఆచరించి కూడా మొక్షము పొందవచ్చు!

(కనుకనే, ఈ పురాణములో ఈ రెండు ముక్తిసాధనములగురించి, పునరుక్తులు అధికమైనప్పటికీ పలుతావులలో ప్రముఖంగా చెప్పబడింది.)

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s