శిశుపాలుడు

భీష్మాది రాజర్షుల సహాయంతో , కృష్ణుని పర్యవేక్షణలో ధర్మరాజు ప్రారంభించిన రాజసూయయాగం చక్కగా సాగింది. భీష్ముడు ఆ యాగం చూసి మహదానందంతో, “నాయనా! ధర్మనందనా! నీ క్రతువు మూడువంతులు పూర్తయింది. స్నారకుడూ, బుత్విజుడూ, సద్గురుడూ, ఇష్టుడూ, భూమీశుడూ, సంయముడూ పూజనీయులని పెద్దలు చెబుతారు. ఈ ఉన్న వాళ్ళందరిలో సద్గుణవంతుడైన మహాత్ముణ్ణి పిలిచి అర్ఝ్యమిర్చి పూజించు” అన్నాడు.

“తాతా! అటువంటి వారెవరో అది కూడా నువ్వే చెప్పు. నీ ఆజ్ఞానుసారం చేస్తాను” అన్నాడు ధర్మరాజు. ” నాయనా! జగన్నాయకుడైన కృష్ణుడు వుండగా ఇంక వెతుక్కోవలసిన అవసరమేముంది? అతడు యజ్ఞ పురుషుడు. లోకపూజ్యుడైన అతనిని పూజించడమే నీ యజ్ఞానికి ఫలం” అన్నారు తాతగారు. వెంటనే అర్ఝ్యాన్ని విధియుక్తంగా వాసుదేవుడికి సమర్పించాడు ధర్మరాజు. అది చూసి శిశుపాలుడు మండిపడ్డాడు.

“ధర్మరాజా! నీ వెర్రితనం చూస్తే జాలేస్తోంది. అనేకులైన రాజులుండగా , ఆర్యులై, ఆరాధ్యులైన భూసురులుండగా, ఆ గాంగేయుని మాటలు విని వివేకం లేకుండా ఈ జిత్తులమారిని పూజించావు. వృద్ధాప్యం వల్ల మతిమందగించి భీష్ముడు చెప్పాడే అనుకో – నీ తెలివితేటలు ఏమయ్యాయి? వాసుదేవుడు మీకు ఇష్టుడైతే అతడు కోరినంత ధనం ఇవ్వండి. అంతేగాని ఇంతమంది పూజనీయులున్న ఈ సభలో ఈ అనర్హుణ్ణి పూజార్హుణ్ణి చేయటం మాత్రం తగదు. వయోవృద్ధుడు కాదు, బుత్విజుడూ కాదు, ఆచార్యుడంతకంటే కాదు. ఏ యోగ్యత ఉందని అతనిని పూజించ దలుచుకున్నావు? చెవిటికి శంఖధ్వని వినిపించడం వల్ల ఎంత ప్రయోజనమో ఈ కృష్ణుణ్ణి పూజించడం వల్ల కూడా అంతే ప్రయోజనం” అంటూ శిశుపాలుడు సభ విడిచి బయలుదేరాడు.

“నాయనా శిశుపాలా! నిదానించు. ఆవేశం చాలా చెడ్డది. పరుషంగా మాట్లాడకూడదు. గుణవంతులూ, ధీరులూ అయిన వాళ్ళు చల్లగా మాట్లాడటం నేర్చుకోవాలి. కృష్ణ భగవానుడు సృష్టి కర్తయైన బ్రహ్మకే కారణభూతుడైనవాడు. వేదాది సమస్త వాజ్మయమూ అతన్నే స్తుతిస్తుంది. అతడు త్రిలోక పూజ్యుడు కనుకనే తాత గారు అలా చెప్పారు. తొందరపాటుతో ఆ మహానుభావుణ్ణి తూలనాడావు..” అని ధర్మరాజు శిశుపాలుడికి నచ్చజెప్పబోయాడు.

“ధర్మరాజా! ఈ శిశుపాలుడు బాలుడు. పైగా మూఢుడు. తనకున్న కొద్దిపాటి రాజ్యాన్ని చూసుకుని మిడిసిపడుతున్నాడు. కారణం లేకుండా కలహం పెంచుకునేవాడితో మాట్లాడకూడదు” అన్నాడు భీష్ముడు.

తరువాత శిశుపాలుణ్ని చూసి కోపంతో, “శిశుపాలా! ఏళ్ళు మీరినవాడు కాదు వృద్ధుడు – జ్ఞానవంతుడు బాలుడైనా పూజనీయుడే. పరాక్రమసంపదతో రాజులందరినీ అతిశయించినవాడు క్షత్రియుడు కాకపోయినా సన్మానార్హుడౌతాడు. గుణవృద్ధుడని తెలిసే కృష్ణుణ్ణి పూజించాం. పెద్దల చరిత్రలు అల్పులకేం తెలుస్తాయి?” అంటూ మందలించాడు భీష్ముడు.

“తాతా! మీరాగండి. సభాసదులారా వినండి! కావాలనే మేము కృష్ణుడికి అర్ఝ్యమిచ్చాం. కాదనేవాళ్ళందరినీ నా వామపాదంతో నెత్తిమీద తన్నడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఉంటే రండి ముందుకు” అన్నాడు సహదేవుడు.

వెంటనే తన పక్షం చేరే క్షత్రియులందర్నీ కూడగట్టుకుని శిశుపాలుడు యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు.

భీముడు కూడా పళ్ళు పటపట కొరుకుతూ , గద భుజాన వేసుకుని , కోపంగా శిశుపాలుడి వైపు నడిచాడు. అది చూసి భీష్ముడదిరిపడి , చటాలున వెళ్ళి భీమసేనుణ్ణి గట్టిగా పట్టుకుని వెనక్కు మళ్ళించాడు.

“నాయనా! వాణ్ణి చంపవలసింది నువ్వు కాదు, కృష్ణుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో వాడు చావడు” అంటూ శిశుపాలుడి గాథను వివరించాడు.

” పూర్వం చేది వంశంలో దమఘొషుడనే రాజుండేవాడు. అతని భార్య సాత్వతి. వాళ్ళకి పుట్టిన పిల్లవాడు వీడు. వీడు పుట్టడమే నాలుగు చేతులతో, నుదుట కన్నుతో – చాలా వికారంగా పుట్టాడు. గాడిద కంఠస్వరంతో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ లక్షణాలకు తల్లిదండ్రులిద్దరూ భయపడుతుంటే – ‘మహారాజా! ఎవరు నీ కుమారుణ్ణి ఎత్తుకుంటే వీడి వికారాలన్నీ పోతాయో, ఆ మహానుభావుడి చేతిలోనే వీడు మరణిస్తాడు. అతను తప్ప యింకెవరూ వీణ్ణి చంపలేరు ‘ అని అశరీరవాణి పలికింది.

” అప్పటినుంచి దమఘోషుడు , సాత్వతి యిద్దరూ తమ యింటికి వచ్చిన వాళ్ళందరికీ తమ బిడ్డను ఎత్తుకోమని అందిస్తుండేవారు.

ఒకసారి బలరామకృష్ణులు మేనత్త సాత్వతిని చూడటానికి వాళ్ళ యింటికి వెళ్ళారు. సాత్వతీదేవి వాళ్ళను కుశల ప్రశ్నలడిగి కొడుకును మొదట బలరాముడి చేతికిచ్చింది. వాడు మాములుగానే వికారంగా ఉన్నాడు. తర్వాత కృష్ణుడి చేతికి అందించింది. కృష్ణుడు ఎత్తుకోగానే శిశుపాలుడుకి ఎక్కువుగా ఉన్న రెండు చేతులు, నుదుట వున్న కన్ను మటుమాయమయ్యాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. కాని సాత్వతి మాత్రం భయపడింది. ‘కృష్ణా! ఈ శిశుపాలుడు నీకు మేనత్త కొడుకు. వీడొక వేళ దుర్మార్గుడై నీ కిష్టం లేని పని చేసినా, నీకు అన్యాయం తలపెట్టినా క్షమించి విడిచిపెడతానని మాట యివ్వు నాయనా! నా పై దయచూపి పుత్ర భిక్ష అనుగ్రహించు ‘ అంటూ కృష్ణుణ్ణి బతిమాలుకుంది. అప్పుడు కృష్ణుడు మేనత్త మీద ఉన్న అభిమానం కొద్దీ ఆమె మాట మన్నించి, ‘ అత్తా! నూరు తప్పులవరకూ వీణ్ణి క్షమిస్తానని నీకు మాట యిస్తున్నాను. ఆ తరువాత – విధి లిఖితం. నా చేతులలోనే వీడు చావవలసి ఉంటే నేను చేయగలిగిందేమీ లేదు ‘ అన్నాడు. అందుకని శిశుపాలుడు ఎంతగా తూలనాడినా కృష్ణుడు సహించి వూరుకుంటున్నాడు.

“అదిగో అలా చూడు! వాడికి కాలం చేరువైంది!! మంటను చేరే మిడతలాగా కృష్ణుడి పైకి వెడుతున్నాడు” అంటూ శిశుపాలుణ్ణి భీష్ముడు భీమసేనునికి చూపించాడు.

“సభాసదులారా! ఈ శిశుపాలుడి వాచాలత్వం మీ అందరికీ తెలిసిందికదా! ఒకప్పుడు నేను ప్రాగ్జోతిష పురానికి భగదత్తుడి మీదకు దండయాత్రకు వెడితే, ఆ సమయం చూసి వీడు అన్యాయంగా ద్వారకనగరానికి నిప్పంటించాడు. వీరులయిన భోజరాజన్యులు రైవతకాద్రి మీద భార్యలతో విహరిస్తుంటే వారిని వధించాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించి యజ్ఞానికి విఘ్నం కలగజేసాడు. అన్నిటికీ మించి ఈ పాపాత్ముడు బభ్రుని భార్యను చెరపట్టి తనకు భార్యగా చేసుకున్నాడు. మా మేనత్త బ్రతిమాలినందువల్ల వీడి అపరాధశతాన్ని సహించాను. ఇంకొక్క తప్పు చేసినా వీణ్ణి క్షమించను” అన్నాడు కృష్ణుడు.

“నీ దయ ఎవడికి కావాలి? నీ వంటి తుచ్చుడి అనుగ్రహంతో బతికేటంత దయనీయ స్థితిలో నేను లేను. మా అమ్మకు మాట ఇచ్చాట్ట మాట! బీరాలు పలుకుతున్నాడు…” అంటూ ఉండగానే కృష్ణుడి చేతినుంచి సుదర్శనం మెరుపులు చిమ్ముతూ వెళ్ళి శిశుపాలుడి శిరస్సును చేధించింది. వజ్రాయుధం వల్ల కూలిన పర్వతంలా శిశుపాలుడి దేహం కింద పడటంతోనే అతని శరీరాన్నుండి ఒక దివ్యతేజస్సు వెలువడి నారాయణునిలో లీనమైంది. వెంటనే రాజసమూహంతో పాటూ దేవతలంతా జయజయధ్వానాలు చేశారు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s