త్రిశంకు స్వర్గం

విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు. చాలా సేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్టుని ఆశ్రమం చేరుకున్నాడు. మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేసాడు.

విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాకా “మహారాజా! మీరు , మీ పరివారమూ బాగా డస్సినట్టున్నారు. త్వరగా స్నానాదికాలు కానివ్వండి. భోజనం చేద్దురుగాని” అన్నాడు వశిష్టుడు.

మహారాజు, ఆయన సేవకులు స్నానాలు పూర్తిచేసి వచ్చేసరికి రకరకాల పిండివంటలతో విందు సిద్ధంగా ఉంది. స్వల్ప వ్యవధిలో యిన్ని వంటకాలు యీ మహర్షి ఎలా తయారు చేయించాడా అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు. రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది. తరువాత వశిష్టుడు దగ్గరకు వెళ్ళి ” స్వామీ! షడ్రసోపేతమైన ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు?” అని అడిగాడు.

తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని “నందిని” అనే కామధేనువు తను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు.

విశ్వామిత్రుడికి పేరాస కలిగింది.

ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు. ” విరాగీ! నీ కామధేనువును నాకివ్వు. బదులుగా నీకు శ్రేష్ఠమైన కోటి పాడి ఆవుల్ని ఇస్తాను” అన్నాడు విశ్వామిత్రుడు. వశిష్టుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి ” రాజ్యంలోని సమస్త వస్తువులూ సకల సంపదలూ మహారాజుకే చెందుతాయి. రాజే అన్నిటికీ అధిపతి” అన్నాడు. వశిష్టుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు. దానితో విశ్వామిత్రుడు మండిపడి కళ్ళేర్రజేసి బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళబోయాడు. వశిష్టుణ్ణి వదలి వెళ్ళటం ఇష్టంలేని నందిని తోక ఝళిపిస్తూ , కొమ్ములు విసురుతూ, ముంగాళ్ళపై భయంకరంగా నిలబడింది. దాని శరీరం నుండి అనేల వందల మంది యోధులు బయటకు ఉరికి ఘోరయుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది. ఓడిపోయారు. ఇక లాభం లేదనుకుని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్టుడితో యుద్ధానికి తలపడ్డాడు. విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్టుణ్ణి చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి. మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం , అధికారం, అంగబలం, ఆయుధబలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై , ఖిన్నుడై రాజనగరుకు తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అప్పటినుంచీ ఆయనలో వశిష్టుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కాని లేశమైనా తగ్గలేదు. ప్రతీకారం కోసం చేయని ఆలోచన , అన్వేషించని మార్గాలూ లేవు.

రాజుకన్నా, రాజ్యాధికారంకన్నా తపశ్శక్తి గొప్పదని , తాపసులు దైవసమానులనీ, మహర్షులు తలచుకుంటే యీ పృద్వ్హీ మీద సాధ్యం కానిదేదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు. రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. నిశ్చలధ్యానంతో మహాజ్ఞానాన్నీ , అద్భుతశక్తుల్నీ సంపాదించాడు. తపశ్శక్తి పెరుగుతున్నకొద్దీ వశిష్టుడి మీద పగ, ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇద్దరి మధ్య అగాధం ఎక్కువైంది.

సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్టుణ్ణి ఆశ్రయించాడు. అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు. ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు. దానికోసం ఆయన ఒక బ్రహ్మండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు. అయితే వశిష్టుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవరూ ఆ యాగంలో పాల్గొనలేదు. విశ్వామిత్రుడొక్కడే యాగాన్ని పూర్తిచేసి తన శక్తిని నిరూపించుకున్నాడు. అదే తపశ్శక్తితో త్రిశంకుణ్ణి మెల్లగా శరీరంతో పైకి తీసుకువెళ్ళాడు.

తీరా త్రిశంకుడు స్వర్గం చేరుబోతుండగా మానుషమాత్రుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్ళారు. ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని , కోపగించి, త్రిశంకుణ్ణి కిందకు ఒక్కతోపు తోయగానే అతడు తలక్రిందులుగా నేలమీదకు వచ్చిపడుతూ “విశ్వామిత్రా రక్షించు” అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలక్రిందులుగా వస్తున్న త్రిశంకుణ్ణి మంత్రశక్తితో అలాగే నిలిపివుంచి , అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు. కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణీ, దేవతలనూ సృష్టించ బోయాడు. దేవతలు భయపడిపోయి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు. ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంద్రుడు తక్షణమే బంగరు విమానాన్ని తీసుకు వచ్చి త్రిశంకుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s