జరా సంధుడు

ఒకప్పుడు బృహద్రథుడనే రాజు మగధ దేశాన్ని పరిపాలిస్తూ వుండేవాడు. అతను గొప్ప పరాక్రమశాలి. మూడు అక్షౌహిణుల బలంతో శత్రువులందర్నీ జయించాడు. కాశీరాజు కుమార్తెలైన కవలలిద్దర్నీ పెళ్ళి చేసుకున్నాడు. ఎంతకాలం గడిచినా అతనికి సంతానం కలుగలేదు. దేవతలను పూజించాడు. బ్రాహ్మణులను ఆదరించాడు. మునిముఖ్యులను అర్చించాడు. ఎవరే పుణ్యకార్యం చెబితే అదల్లా చేశాడు. అయినా ఫలితం లేకపోయింది.

పిల్లలు లేక సిరి, రాజ్యవైభవాలన్నీ వ్యర్థమనుకుని బృహద్రథుడు భార్యలిద్దర్నీ వెంట పెట్టుకుని తపోవనానికి బయలు దేరాడు. అలా వెడుతూ ఉండగా, ఒక గున్నమామిడి చెట్టు నీడలో నిష్ఠతో తపస్సు చేస్తూ దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న చండకౌశిక మహాముని వారికి కనిపించాడు.

ఆ మునిని నిరంతర నియమనిష్టలతో మహారాజు సేవించాడు. చండకౌశికుడు ప్రసన్నుడై కావలసినదేదో అడగమన్నాడు.

“మహాత్మా! నాకు సర్వసంపదలూ ఉన్నాయి కాని సంతానం లేదు. పుత్రులు లేనివాళ్ళకు ఉత్తమగతులు అభించవని మీ బోటి పెద్దలు చెబుతారు. తపస్సు చేద్దామని వస్తుంటే మహానుభావులయిన తమరి దర్శనభాగ్యం కలిగింది. భగవంతుడే తమ రూపంలో నన్ను కరుణింఛాడనుకుంటున్నాను. నాకు పుత్రులు కలిగేలా వరం ప్రసాదించండి” అని వేడుకున్నాడు బృహద్రథుడు.

ఆ ముని అతణ్ణి కరుణించి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కొంతసేపటికి ఒక చక్కని మామిడి పండు చెట్టునుంచి రాలి కిందపడింది. ముని కళ్ళుతెరిచి ఆ పండును మంత్రించి మహారాజుకి ఇచ్చాడు. ఆ ఫలం వల్ల పండంటి కొడుకు పుడతాడని చెప్పాడు. బృహద్రథుడు మహదానందంతో ఆ ఫలాన్ని తీసుకుని కళ్ళకు అద్దుకున్నాడు.

రాజధానికి తిరిగి వచ్చి, ఆ పండును రెండుగా చీల్చి ఇద్దరు భార్యలకూ ఇచ్చాడు. వాటిని తిని రాణులిద్దరూ గర్భవతులయ్యారు. వాళ్ళకు ఒక అర్థరాత్రివేళ ఒక కన్ను , ఒక చెయ్యి, ఒక చెవి, ఒక కాలు ఉన్న శరీర ఖండాలు పుట్టాయి. అవి చూసి రాణులిద్దరూ భయపడిపోయారు. ఈ మనుష్య ఖండాలను మహారాజుకు ఎలా చూపించడమా అని సిగ్గుపడి, దాదులను పిలిచి ఆ రెంటినీ అవతల పారెయ్యమని చెప్పారు. దాదులు వాటిని తీసుకువెళ్ళి దూరంగా పారేశారు.

ఆ ప్రదేశంలో ‘జర’ అనే రాక్షసి రాత్రివేళలో సంచరిస్తూ ఉండేది. అది ఆ శరీర ఖండాలను చూసి తనకెవరో ఆహారం వేశారు కాబోలనుకుని ఆ రెండింటినీ దగ్గరకు చేర్చి పట్టుకుంది. వెంటనే ఆ రెండు శరీరఖండాలూ అతుక్కుని ఒక చక్కని బాలుడయ్యడు. వాడు వజ్రకఠిన శరీరంతో ఆ రాక్షసి కూడా ఎత్తలేనంత బరువై గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విని అంతఃపురంలోని పరిచారికలంతా పరిగెత్తుకొచ్చారు. ఆ పసివాణ్ణి జర చేతుల్లోంచి లాక్కుని, ఆ రాక్షసిని బధించి రాజభవనానికి తీసుకువెళ్ళారు.

అప్పుడు ‘జర’ స్త్రీరూపం ధరించి, “మహారాజా! నేను రాక్షసకాంతను. నా పేరు ‘జర’. మీ పట్టణంలో రాజభవనానికి కొంచెం దూరంగా నాలుగుదారులూ కలిసేచోట నివసిస్తున్నాను. ఈ వేళ ఎవరో ఈ మనుష్య శకలాలను నేను తిరిగే ప్రాంతంలో పారేశారు. విధివశం వల్ల ఆ రెండు ఖండాలూ నా చేతుల్లో కలుసుకుని ప్రాణం పోసుకున్నాయి. ఈ బాలుడు తయారయ్యాడు. వీణ్ని తీసుకో. చాలా రోజులనుంచీ మీకేమి మేలుచేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇన్నాళ్ళకిది సమకూడింది” అని పరిచారిక చేతుల్లో ఉన్న బాలుణ్ని తీసుకుని రాజుగారికి అందించింది.

“అమ్మా! నేను చేసిన సపర్యలకు సంతోషించి ఒక మునీశ్వరుడు నాకీ బాలుణ్ణి ప్రసాదించాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి ప్రసాదించావు. మా వంశం ఉద్ధరించడానికి వచ్చిన దేవతవు కాని నీవు రాక్షసస్త్రీవి కావు. నీచేత సంధించబడ్డాడు కనుక వీడికి జరాసంధుడని పేరు పెడతాను” అంటూ బృహద్రథుడు ఆ రాక్షసిని సత్కరించాడు.

జరాసంధుడు అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. ఒకనాడు ఆ పిల్లవాణ్ణి చూడటానికి చండకౌశికుడు వచ్చాడు. మహారాజు ఆయనను భక్తితో పూజించి కొడుకును చూపించాడు. ఆ మహర్షి పసివాణ్ణి ఎత్తుకుని, “వీడు కుమారస్వామి వెలే శక్తిసంపన్నుడవుతాడు. సాక్షాత్తూ పరమేశ్వరుడికే సన్నిహితుడు అవుతాడు. ఎంతటి బలవంతులైనా వీణ్ని ఎదిరించి జయించలేరు.

” గ్రహాలలో సూర్యుడిలా , రాజేంద్రులలో వీడు తేజస్వియై ప్రకాశిస్తాడు. దివ్యాస్త్రాలేవీ వీడి శరీరాన్ని చెదించలేవు. సకలమహీపతుల సంపదలూ వీడి హస్తగతమవుతాయి” అని ఆశీర్వదించాడు.

తరువాత కుమారుడు పెద్దయ్యాకా అతణ్ణి రాజ్యభిషిక్తుణ్ణి చేసి బృహద్రథుడు తపోవనానికి వెళ్ళిపోయాడు.

“ధర్మరాజా! విన్నావా? జరాసంధుడు అలా ఆ మునీంద్రుడి ప్రభావం వల్ల అనంత శక్తిసంపన్నుడై బలగర్వితుడయ్యాడు. అతన్ని ఆయుధవిద్యలో ఎవరూ జయించలేరు. అందుకని భీమసేనుడే మల్లయుద్ద్హంలో వాణ్ణి మెళకువగా చంపాలి” అని కృష్ణుడు జరాసంధుని జన్మవృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పాడు.

Advertisements

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s