అక్షయపాత్ర

అనుద్యూతంలో కూడా ఓడిపోయాకా అన్నమాట ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలూ, కృష్ణజినమూ ధరించారు. కందమూల ఫలాలు తింటూ పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి సంసిద్ధులయ్యారు.

అలా వెళ్తున్న వాళ్ళను చూసి –

“ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాది, మృత్యుపుల్లగా కర్ణుడు, సైంధవుడు , శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం” అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు.

“నాయనలారా! మేము సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలే తింటూ అరణ్యవాసం చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా కష్టపడటమెందుకు? మామీద అనుగ్రహముంచి వెనెక్కి వెళ్ళిపోండి” అని పాండవులు బ్రతిమాలారు.

“ధర్మరాజా! నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించినవాళ్ళు శత్రువులైనా విడిచిపెట్టకూడదంటారు. అలాంటప్పుడు మీ మీద భక్తి కలిగి నిన్నాశ్రయించిన మమల్ని విడిచిపెట్టటం మీకు భావ్యమా?” అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏం చేయాలో పాలుపోక ధర్మరాజు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడే శౌనక మహాముని అక్కడకు వచ్చాడు.

“మహాత్మా! అతిథులను, అభ్యాగతులనూ అర్చించడం గృహస్థులకు ధర్మమని మీకు తెలుసుకదా! అలాంటిది ఆశ్రయించి వచ్చిన వీరిని ఎలా ఉపేక్షించను?” అని ధర్మరాజు సంశయం వెల్లడించాడు.

“నాయనా! తపస్సు వల్ల సాధించరానిది ఏదీ లేదు. అందుచేత నువ్వు నియమవంతుడై తపస్సు చేసి నీ మనోరథం సఫలం చేసుకో” అని శౌనకుడు ధర్మరాజుకు తగిన సందేశ మిచ్చి ప్రయాణమయ్యాడు.

‘శౌనక మహాముని చెప్పినట్టు తపస్సు చేయాలి! కాని ఎవరి నుద్దేశించి తపస్సు చేయాలి?’ ఇంకో ధర్మసందేహం వచ్చింది ధర్మరాజుకు. వెంటనే ధౌమ్యులవారికీ సంగతి చెప్పాడు.

ధౌమ్యుడు చాలా సేపు ఆలోచించి ” ధర్మరాజా! పూర్వం భూతజాలమంతా ఆహారం కోసం పరితపించింది. ఆ ఆర్తనాదాలు విని కమలబాంధవుడు కరుణతో కరిగిపోయాడు. ఉత్తరాయణంలో ప్రవేశించి ఉర్వీరసాన్ని గ్రహించాడు. దక్షణాయనంలో ప్రవేశించి పర్జన్యుడై ఓషధులు సంగ్రహించాడు. రాత్రి వేళల్లో చంద్రకిరణాల్లో ఉన్న అమృతంతో ఆ ఓషధులను తడుపుతూ అభివృద్ధిపరిఛాడు. వాటిల్లోంచి అన్నం పుట్టి ప్రజా సంరక్షణం జరిగింది. అందుకే అన్నం ఆదిత్యమయమంటారు. పూర్వం రాజర్షులందరూ సూర్యభగవానుణ్ణి ప్రార్థించి అన్నం సంపాదించి ప్రజలందర్నీ ఆపదలపాలు కాకుండా కాపాడారు. పాండవాగ్రజా! ఆదిత్యుడు లోకానికి ఆదారమైనవాడు. త్రిమూర్తుల స్వరూపాలు అతనిలో ఉన్నాయి. ముల్లోకాలూ అతని కనుసన్నల్లో సుఖంగా జీవిస్తున్నాయి. అతడు అంధకారాన్ని మింగి లోకానికి వెలుగును అందించే ప్రత్యక్షదైవం! కనుక నువ్వు కూడా ఆ కరుణామయుణ్ణి పూజించి అతని అనుగ్రహం సంపాదించు” అని ధౌమ్యుడు కర్తవ్యం బోధించాడు. ధర్మరాజు ధౌమ్యుడు ఉపదేశించిన మంత్రాలను భక్తితో గ్రహించి తపస్సు చేశాడు. అతని జపానికి మెచ్చి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు.

” పాండునందనా! ఇదిగో ఈ తామ్రపాత్ర గ్రహించు. ఈ పన్నెండు సంవత్సరాలూ నీ వంటింట్లో ద్రుపదకుమారి వండిన కందమూలాలన్నీ అక్షయములైన నాలుగు రకాల ఆహార పదార్థాలవుతాయి” అని సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయపాత్రను ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ధర్మరాజు అపరిమితానందంతో ఆ పాత్రను తీసుకుని పర్ణశాలకు తిరిగి వచ్చాడు. అప్పటినుంచి అక్షయపాత్ర వల్ల ద్రౌపతీదేవి అడిగినవారికి లేదనకుండా భోజనాలతో సంతృప్తులను చేస్తూ వుండేది.

Make any Suggitions

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s