వ్యసనాలంటే ఏమిటి?

ప్రశ్న: వ్యసనాలనేవి మానసికమా, భౌతికమా, లేక వీటికి మరో కోణమేదైనా ఉందా? అవేమైనా కర్మకు సంబంధించిన విషయాలా?

సద్గురు: మీరు మద్యం తాగడానికి ఈ విశ్వంలో వేరే ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా అనే కదా మీ ప్రశ్న. మీ వ్యసనాలు మిమ్మల్ని ఏలుతున్నప్పుడు, అతీతమైన శక్తులేవో మీలో పని చేస్తున్నాయన్న అభిప్రాయం మీకు కలుగుతుంది. వ్యసనానకి బానిసైన వాడికీ, ఏదో శక్తి ఆవహించిన వాడికీ తేడా ఏమీ లేదు. అది కూడా ఆదే స్థాయిలోని బానిసత్వమే. మరి వ్యసనానికి మరేదైనా కోణముందా? దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వ్యసనమంటే ఒక రకంగా చేసిందే మళ్లీ మళ్లీ చేయడమన్న మాట. చేసిందే మళ్లీ మళ్లీ చేయడం అనే ప్రక్రియలో చిక్కుకుపోవడం అంటే మీరు మీ జీవితం పట్ల దారుణమైన నేరం చేసినట్టవుతుంది. అసలు ఓ వ్యక్తి పరిమిత వ్యక్తిగా ఉండడమే ఓ పెద్ద నేరం. అందులోనూ ఏదో ఒక వ్యసనానికి బానిసయి, చేసిందే చేయడమంటే మరీ ఘోరమైన నేరం.

ఈ విశ్వంలో పునరావృతమయ్యేదంతా భౌతిక, మానసిక స్థితులే. ప్రకృతిలో భౌతిక రూపాలు, మానసిక స్థితులు అనే రెండు అంశాలు మాత్రమే పునరావృతం అవుతుంటాయి. శరీరంలో జన్యు ప్రక్రియ కూడా ఒక పునరావృత ప్రక్రియే. అందుకే ఎవరైనా దృడంగా ఆధ్యాత్మిక పథంలో నడవాలనుకున్న మరుక్షణం, మొదటగా వాళ్లకు చెప్పేది తల్లితండ్రుల్ని వదిలిపెట్టమని. అంటే మనం వాళ్లను పట్టించుకోనవసరం లేదని కాదు. వాళ్లేదో నేరం చేశారనీ కాదు. మీకు మీ జన్యు సంబంధమైన మూలాలు గుర్తుకు వస్తే, మీరు పునరావృతమయ్యే చట్రంలో పడిపోతారు. మీకు కొత్త జీవితమనేది సాధ్యం కాదు. మీ తల్లితండ్రులేం చేశారో మీరూ అదే చేస్తారు. కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు. వేషభాషలు మారవచ్చు. కొద్దిగా బట్టలు, వాటి రంగులు మారవచ్చు. కానీ, అసలు విషయం మాత్రం అదే విధంగా, పనికిరానిదిగానే ఉంటుంది.
ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి! మీకూ, మీ ముందు తరం వారికీ తేడా కనిపించవచ్చు. కానీ, జీవన విధానంలో మీకూ, మీ వారికీ ఏమీ తేడా లేదు. సామాజికంగా కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు. కానీ, తరతరాల వారిని చూస్తూ పోతే, ఒక తరం గడిచిన తరువాత వెనక్కు తిరిగి చూస్తే, వారంతా అవే పనులు చేస్తూ ఉండి ఉంటారు. కొత్తగా చేసిందేమీ ఉండదు. అందువల్ల శరీరం చేసిందే మళ్లీ మళ్లీ చేయగలదు. అందుకనే మీరు మీ జన్యు మూలాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మనసు కూడా ఓ పునరావృత ప్రక్రియే. ఇది మన పాత అనుభవాల పుట్ట నుంచే పని చేస్తుంటుంది. ఈ పాతది అంతా తీసేస్తే, ఈ మనసు ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. మీకు జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఒక స్వచ్ఛమైన అద్దంలా పనిచేస్తుంది. ప్రస్తుతానికి మాత్రం మనసు పనిచేసే తీరు సహజంగానే పునరావృతంగా ఉంటుంది. ఎందుకంటే, అది ఎప్పుడూ పాత భాండాగారం మీదే ఆధారపడి ఉంటుంది. అందువల్ల వ్యసనాలనేవి తప్పనిసరిగా శారీరక, మానసిక సంబంధమైనవే. ఇక్కడో ప్రశ్న అడిగారు. “మరో కోణం ఏదైనా ఉందా? ఇది కర్మ సంబంధమైనదా? ” అని. కర్మలన్నీ శరీరానికి, మనసుకు చెందినవే. మీరు మీ కర్మను సృష్టించేది, నిక్షిప్తం చేసుకునేది మీ శరీరంలోనో, మనసులోనో తప్ప మరెక్కడా కాదు. ఇవి జీవితంలో మరో కోణానికి సంబంధించినవేమీ కాదు.మానవాళిలో అధిక భాగం ఏదో ఒక వ్యసనంలో లోతుగా ముణిగిపోయి ఉంటుంది. వ్యసనాలను ఓ పరిమిత పరిధిలోంచి చూడకూడదు.

వ్యసనం అనేది మత్తు పానీయాలు, సిగరెట్లు, కాఫీ లేదా మరో దానికో పరిమితం కాదు. ఇది మరింత లోతుగా ఉంటుంది. వ్యసనాలనేవి కేవలం ఆనందాన్నిచ్చే వాటికి మాత్రమే పరిమితం కాదు. జనం బాధాకరమైన విషయాలకు కూడా బానిసలవుతారు. ఎరుక లేకపోవడం వల్ల, వ్యసనం ఎటువంటిది అనేదానితో సంబంధం లేకుండా, మనసు ఏదో ఒకదానిని అంటిపెట్టుకుని ఉండాలనుకుంటుంది. చాలాసార్లు అనుకోకుండానూ, కొన్నిసార్లు ప్రయత్నపూర్వకంగానూ మీరు ఏదో ఒకదానికి, ఎవరికో ఒకరికి అంటిపెట్టుకుని ఉండిపోతారు. అది జీవితంలో ఒక వ్యసనంగా మారిపోతుంది. మీరే ఓ వ్యసనం. జీవన్మరణాలకు, ఈ రెండింటికీ మధ్య చోటు చేసుకునే వాటన్నిటికీ బానిసలయిపోతారు. మీరు జీవన్మరణ ప్రక్రియ నుంచి విముక్తులైనప్పుడు మాత్రమే మీరు మీ లక్ష్యానికి సరాసరి చేరిపోతారు.
– సద్గురు

Advertisements