వధువుకు ‘మంగళ స్నానం’ చేయించి ‘గౌరీ పూజ’ చేయిస్తారు ఎందుకు………………….

వివాహమనగానే అటు వరుడి ఇంట్లోను … ఇటు వధువు ఇంట్లోను అందుకు సంబంధించిన ఏర్పాట్లు సందడిగా జరుగుతుంటాయి. ఇక వివాహ వేదిక చేరుకునేలోగా వధూ వరులకు వారి వారి ఇళ్లలోనే కొన్ని పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వధువుకు ‘మంగళ స్నానం’ చేయించి పూలతోను … ఆభరణాలతోను అందంగా ముస్తాబు చేసి ‘గౌరీ పూజ’ చేయిస్తారు.

అలాగే అక్కడ అబ్బాయికి కూడా మంగళస్నానం చేయించి … స్నాతకం పూర్తి చేస్తారు. వరుడు తనకి సంసార వ్యామోహం లేదని చెప్పి కాశీ యాత్రకు బయలుదేరుతుంటే, వధువు సోదరుడు బతిమాలి వెనక్కి తీసుకు వస్తాడు. అనాదిగా వస్తోన్న ఈ ఆచారం వెనుక ఆరోగ్యపరమైన … ఆధ్యాత్మిక పరమైన అర్థం లేకపోలేదు.

నిత్య సుమంగళి … జగజ్జనని అయిన అమ్మవారిని తనకి సంతాన సౌభాగ్యాలను ఇవ్వమని కోరుతూ పెళ్లి కూతురుతో గౌరీపూజ చేయిస్తారు. సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడి జీవితమే, పార్వతీ దేవిని వివాహమాడిన కారణంగా పరిపూర్ణతను సంతరించుకుంది. కాబట్టి అర్థాంగి సహాయ సహకారాలతోనే జీవన సాఫల్యం కలుగుతుందనే సందేశాన్ని ఈ ఘట్టం చెప్పకనే చెబుతోంది.