కార్తీక స్నానం ఎలా చేయాలి?

కార్తీక మాసంలో నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నప్పుడు ఒక మాట గుర్తు పెట్టుకోవాలిట్టుకోవాలి. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యడమంటే పక్కన ఉన్న నదిని వదిలిపెట్టి ఒక్కడో ఉన్న మరో నదిలో స్నానానికి వెళ్ళకూడదు. ఉదాహరణకు, కార్తీక మాసంలో గంగా స్నానం చేయాలనుకుంటే, ముందు దగ్గరగా ఉన్న నదీ స్నానం చేయాలి. ఆ తర్వాతే గంగా స్నానం చేయాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది పక్కన ఉండే నదే! ఎప్పుడైనా ప్రవహించే నదిని గమనిస్తే- అది రకరకాల శబ్దాలు చేస్తూ, సూక్ష్మంగా తిరుగుతూ రాళ్ళకి గుద్దుకుంటూ, పైనుంచి పడుతూ, పైకి ఎక్కుతూ వెడుతుంది. ఆ సమయంలో అది చేసే ధ్వనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలా వెళ్లిపోయే నది నీరు చంద్రుడి శక్తిని పుచ్చుకుంటుంది.

శాస్త్రాల ప్రకారం ఈ లోకాన్ని అమ్మవారే ఉద్ధరిస్తూ ఉంటుంది. ప్రమాదాలు ఎక్కడున్నాయో ముందే హెచ్చరిస్తుంది. ఆవిడ కార్తీక మాసంలో చంద్రకిరణ రూపంలోనూ, ఉసిరి చెట్టు రూపంలోనూ ఈ ప్రపంచాన్ని ఆదుకుంటూ ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తినడం, వనభోజనానికి వెళ్ళి ఉసిరి చెట్టు కింద కూర్చోవటం మంచిదంటారు. కార్తీక మాసంలో చంద్ర కిరణాల రూపంలో ఉన్న అమ్మవారు నీటిని అమృతధారగా మారుస్తుంది. అందువల్ల అభిముఖంగా నదిలో నిలబడి పరమేశ్వరునికి నమస్కారం చేసి మజ్జనం చేయాలి. మజ్జనం అంటే మూడుమార్లు తల ముంచి పైకి లేవాలి. అలా స్నానం చేస్తే శరీరానికంతా చంద్ర కిరణాల వల్ల అమృత స్పర్శ కలుగుతుంది. చంద్ర కిరణాల వల్ల ఓషధీశక్తి శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరానికి అనారోగ్యాలు కలగకుండా కాపాడుతుందన్న మాట.

అంతేకాక, చంద్రస్పర్శ కలిగిన తరువాత మనసు సాత్వికమై, పరమేశ్వరారాధనలో సాత్వికమైన బుద్ధితో తేజోవంతమై నిలబడుతుంది. మనసంటే చంద్రుడే. మనసు మీద చంద్ర ప్రభావమే ఉంటుంది. ఈ రెండు సాధనాలను ఏకకాలంలో పొందడానికి కార్త్తీక మాసంలో నదీ స్నానం ఉపయోగపడుతుంది. ఈ నదీ స్నానం చేయటానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నదీ స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టతో స్నానం చెయ్యాలి. నదీ స్నానం చేసేటప్పుడు సంకల్పం లేని స్నానం చెయ్యకూడదు. “నేను ఫలానా చోట ఉండి పూజ చేస్తున్నాను, ఆ విషయం ఈశ్వరుడికి తెలియదా? నేను ఎక్కడ ఉండి స్నానం చేస్తున్నానో తెలుసుకోలేనివాడికి నేను పూజ చేయడమేంటి? వాడు సర్వజ్ఞుడేంటి? ” అని కొందరు అనుకోవచ్చు. అందుకే సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరెత్తితే పాపనాశనం అవుతుందో పరమేశ్వరుడు దానినే పలికిస్తాడు. అందుకే -“గంగా కావేరీ యోః మధ్య దేశస్థే, గంగా గోదావరీ యోః మధ్య దేశస్థే ” అని సంకల్పం చెప్పిస్తారు. ఎందుకంటే ఆ నదుల పేరెత్తితే చాలు పాపాలు నశిస్తాయి. అంత గొప్పదైన నదికి అభిముఖంగా నిలబడి సంకల్పంతో నదీ స్నానం చేస్తే, అది తప్పకుండా రక్షిస్తుంది. అయితే స్నానం చేసి వెళ్లిపోతే సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత పుణ్య కర్మాచరణ చెయ్యాలి. అంటే దానమో, ధర్మమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యాలి.

అమ్మవారి రూపాలు
ఈ జగత్తును రక్షించే అమ్మవారు ప్రకృతిలో ఒకోసారి ఒకో రూపంలో కనిపిస్తూ ఉంటుంది. చైత్రమాసం వచ్చేటప్పటికి వేప పువ్వు రూపంలో, కార్తీక మాసం వచ్చేటప్పటికి ఉసిరికాయ రూపంలో, ఆషాడ మాసంలో గడ్డిపరక రూపంలో అందరినీ రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఆషాఢ మాసంలో కుక్కలు లేత పచ్చిగడ్డిని కొరుక్కుతింటాయి. దీని వల్ల వాటి కడుపులో అనారోగ్యాన్ని కలిగించే పదార్థాలు బయటకు వచ్చేస్తాయి.

నదీ స్నానం ఎవరు చేయకూడదు?
శ్రావణ మాసంలో నదులు విశేషమైన వేగంతో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహంలో చాలా సార్లు పాములు కొట్టుకొస్తూ ఉంటాయి. అందువల్ల శ్రావణమాసం నదీ స్నానం చేయవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. శాస్త్ర ప్రకారం పురుషుడు నదీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. స్త్రీలు వాలుకి చేయాలి. అభిముఖంగా స్నానం చేస్తే పాములు కొట్టుకు వచ్చి కాటు వేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పురుషులను శ్రావణ మాసంలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోను నదీ స్నానం చేయవద్దని చెబుతారు.

Advertisements