కార్తీక మాసం విశేషాలు……

మన సాంప్రదాయంలో కార్తీకమాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసం శివ కేశవులకు ఇద్దరికీ ఎంతో ప్రీతి అయిన మాసం. భాగవత్పూజలు, వ్రతాలు, నదీస్నానాలు, దీపారాధనలు, దానాలు- ఈ మాసాన గొప్ప ఫలాన్ని ఇస్తాయి. ఈ నెలలో విష్ణువు ” దామోదర ” నామంతో పూజిపబడతాడు. అందువల్ల ఈ మాసాన ఎ సత్కార్యం చేసినా, ” కార్తీక దామోదర ప్రీత్యర్థం ” అని సంకల్పించి చేయాలి.

కార్తీక మాసాన సూర్యోదయానికి పూర్వమే లేచి లభ్యమైనంతవరకు నదీస్నానం లేదా కూప(బావి ) స్నానం , లేదా – ఇంట్లో జలంతో తప్పక స్నానం చేయాలి.
శ్లో!! న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగామాత్పరం!
నా రోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః !!

కార్తీక మాసంతో సమానమైన మాసము కేశవునితో సమానమైన దైవం లేదంటాడు అత్రి మహర్షి.
ఈ మాసం స్నానానికి అత్యంత విశేషం ఇవ్వడం జరిగింది.

జలే విష్ణుః స్థలె విష్ణుః సర్వం విష్ణు మయం జగత్ ” అని స్మ్రుతి.అలాగే..

శ్లో!!యస్మిన్నాస్తే హృషీకేశః తులాయాం గోశ్పాదోదకే “
తటాక కూప కుల్యాసు నిత్యం సన్నిహితో హరి !!

అంటే ఈ సమయంలో విష్ణువు గోవు పాదం పట్టేంత నీటిలో కూడా ఉంటాడు.

మొదటి రోజు స్నానానికి ముందు సంకల్పం …

శ్లో!! కార్తీకం సకలం మాసం నిత్య స్నాయీ జితేన్ద్రియః
జపన్ హవిష్య భుక్తాంత సర్వ పాపైహ్ ప్రముచ్యతే !
స్మృత్వా భాగీరథీమ్ విష్ణుం శివం సూర్యం జలం విశెత్
నాభిమాత్ర జలే తిశ్థన్ వ్రతెస్స్నాయాద్యధావిధి !!

అనగా ..ఈ కార్తీక మాసమంతా ప్రాతస్స్నాన నియమంతో, హవిశ్యం భుజిస్తూ, జితెన్ద్రియుడై, వ్రతం ఆచరించిన వారి సర్వ పాపములు నశించును. నదిలో నాభివరకు దిగి యధావిధిగా స్నానాన్ని ఆచరిన్తునని అర్ధం.

ఈ క్రింది మంత్రంతో స్నానం చేయాలి.

శ్లో!! కారికేహం కరిష్యామి ప్రాతస్స్నానం జనార్దనా !
ప్రీత్యర్ధం తవ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యతః !!
తవ ప్రసాదాత్పాపం మే దామోదర వినశ్యతు !!!

దోసిటినిండా జలం తీసుకుని, ఈ క్రింది మంత్రములు చెప్పి అర్ఘ్యం వదలాలి.

శ్లో!! నిత్యే నైమిత్తికే కృష్ణ కార్తీకే పాపనాశానే !
గృహాణార్ఘ్యం మయాదత్తం రాధాయా సహితొ హరే !!

శ్లో!! నమః కమలనాభాయ నమస్తే జలశాయినే !
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే !!

ప్రతి రోజు దేవతామందిరంలో, గుమ్మం రెండువైపులా, తులసికోట వద్ద దేవాలయంలో,రావి చెట్టు క్రింద దీపాలు వెలిగించాలి.
ఈ నెల రోజులూ రోజుకొక అధ్యాయం చొప్పున కార్తీక పురాణం చదవడం లేదా వినడం చేయాలి. ప్రతి రోజు ఆకాశ దీపం వెలిగించడం చాలా ఉత్తమం.

ఉదయం నుండి ఉపవాసం చేసి నక్షత్రాలు వచ్చాక భోజనం చేయడంను ‘నక్తం’ అంటారు. కార్తీక సోమవారం శివవ్రతానికి సర్వవిధాలా శ్రేష్టం. శివుడికి అభిషేకాలు ఈ రోజుల్లో అశ్వమేధ యాగంతో సమాన ఫలితం లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఆలయంలో భగవద్ కీర్తనలు గానం చేస్తే వేయి గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. శక్తి ఉన్నవారు ధాన్యం, వస్త్రం, దీపం దానం చేయాలి.
శుభమస్తు.

Advertisements