కార్తీకమాసం

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి
వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను
ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం
ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా
నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు
వచ్చింది.

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తిక మాసము. శివ కేశవులకిద్దరికీ ప్రీతికరమైనది .ఏంతో మహత్యము కలది. కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో నుండగా ఆచరించె స్నాన , దాన , జప,పూజాదులు విశేష పలితాలనిస్తాయి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవ రూపము ధరించి సమస్త నదీ జలాలలోనికి చేరుతుంది. కాబట్టి ఈ నెలలంతా నదీ స్నానము చేస్తే శరీరము , మనసు రెండూ పవిత్రమవుతాయి . నదులు దగ్గరలేక పోతే చెరువులో , వాగులో , ఏవీ దగ్గర లేకపోతే కనీసము ఇంటిలోనైనా సూర్యోదయానికి ముందే

గంగేచ యమునే చైన గోదావరి సరస్వతి !

నర్మదే సింధు , కావేరీ జలెస్మిన్ సన్నిధిన్ కురు

” అనే శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానము చేసి నిర్మల హృదయము తో భగవదారాధన చేయాలి.
కార్తీకమాసము ముప్పై రోజులు పర్వదినాలుగా భావించి నదీ స్నానాలు , వుపవాసాలు , సాయంత్రము కాగానే ఇంటి ముందు దీపాలు వెలిగించటము , స్త్రీలు దీపాలను నదిలో వదలటము ,వనభోజనము చేయటము , వివిధ దానాలను , ముఖ్యముగా దీప దానము , సాలంకృత కన్యాదానము చేయటము మొదలైనవి నిర్వహిస్తారు. ఈ మాసము లో ఉపనయన దానము ,కన్యాదానము చాలా పలితమిస్తుంది .భక్తి తో సాలంకృత కన్యా దానమిచ్చినట్లు ఐతే అన్ని పాపాలు తొలిగిపోయి పితృదేవతల యొక్క స్తానాన్ని ,బ్రహ్మ పదాన్ని పొందుతారంటారు. దశమి ,ఏకాదశి ,ద్వాదశి తిధులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోనూ , కమలపూల తోనూ పూజిస్తే జీవించినన్నాళ్ళూ ధనానికి లోటులేకుండా వుండి , సమస్త సౌఖ్యాలు కలగటముతో పాటు అంత్యమున జన్మరాహిత్యము కలుగుతుందట. అదేవిధముగ ఆరుద్ర నక్షత్రము రోజున , మాస శివరాత్రినాడు , సోమవారమునాడు , కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి , బిల్వదళాలతోనూ , రుద్రాక్షల తోనూ పూజించినవారికి అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యము పొందుతారని కార్తీకపురాణం చెబుతోంది …

“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు.
శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో
సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో
ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక
స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును
కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం,
దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు
ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో
శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని
సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు
హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం
ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే!

1394363_218245715017174_1618050324_n

కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో
శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో
దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ,కొబ్బరినూనెతోగానీ,
నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా
దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని
శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి,
చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా
కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా
రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.

కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి
ప్రారంభించవలెను.

నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ
ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.

శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.

ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.

ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.

ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.

కార్తీక మాసంలో పండుగలు

శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ

దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో
భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట
భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే
కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.

శుక్లపక్ష చవితి ” నాగుల చవితి

కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి
పర్వదినం జరుపుకుంటారు.

శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి

ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన
శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి ‘ఉత్థాన
ఏకాదశీ లేదా ‘ప్రబోధన ఏకాదశి ‘ అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి
శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన
చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.

శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి

పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే.
అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు.
శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే . ఈ రోజు
ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని
పూజించవలెను.

శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి

Advertisements