కనకదుర్గ గాథలు….

ఓంకార పంజర శికీ ముననిష దుద్యాన కేళికల కంఠీమ్ !
ఆగమ విపిన మయూరీ మర్యామంతర్విభావ యే గౌరమ్ !!
భక్త్యాస్నాత్యాత్ర మల్లీశం దుర్గం దుర్గారి నాశినీం 
దృష్ట్యా పాపాత్ ప్రముచ్యేత్ దేవలోకే వసేత్సాదా!!

కృష్ణానదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి వున్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ ఆలయంలో శ్రీచక్రం వుంది. ఈ చక్రానికి అగస్త్యల వారు తమ తపః ఫలాన్ని ధారపోశారని చెబుతారు. దుర్గామాత మొదట్లో రౌద్రరూపంలో వుండేదని, ఆదిశంకరులు విచ్చేసి శ్రీ చక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి ఆయి తనను దర్శించే భక్తులు కోరికలు నేరవేరుస్తునదని చెబుతారు. కనకదుర్గా క్షేత్రమహత్యాన్ని తెలిపే పురాణ గాథలు పరిశీలిద్దాం.

ఇంద్రకీలాద్రి కథ :- 
ఈ కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై స్థిరనివాసం ఏర్పరచుకొని భక్తులను ఈడేరుస్తోంది. కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి వుండడానికి ఒక కథ వుంది. దుర్గామాత ఆలయం వున్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు.

అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీపరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగాఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గ ఎనిమిది బాహువుల్లో ఎనిమిది ఆయుధాలు కలుగి, సింహాన్ని అధిష్టించి మహిషాసురోత్తమాంగాని శూలంతో పొడుస్తూ కనిపిస్తుంది.

ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి బాహువుల్లోను ధరించే ఎనిమిది ఆయుధాలు, ఈ దేవీమూర్తికి ఎడమభాగంలో శ్రీ చక్రం స్థాపించబడి వుంది. ఆ శ్రీ చక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి వుంది, ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల మకరతోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి వున్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, మష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి నవదుర్గల పేర్లు.

మహిషాసుర సంహారం :-
పూర్వకాలంలో దనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గూర్చి ఘోరతపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సమకట్టాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ‘పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావలి’ అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు.

రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలన్మి గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షిశిష్యుని బాధిస్తూ వుండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్దిస్తుందని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీ సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ‘ఉగ్రచండి’ అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది.

మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రునిగా పుట్టి తన దానవ నైజంతో దేవతలనీ పీడిస్తూవుంటే, ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి ‘భద్రకాళి’ రోపంలో అవతరించి మహిషుని ముట్టుపెట్టింది.మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోరతపస్సు చేసి బ్రహ్మ వసువరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కలవచ్చింది. అందుకు కంపితుడై మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోరతపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలగజేయవలసిందని మహిషుడు కోరాడు.

‘మహిషా! నువ్వు రుద్రాంశసంభవు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా వుండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచివుంటాను’ అని దేవి పలికింది.ఆ తర్వాతా మహిషుడికి మళ్ళి జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలని, మునులని పీడిస్తూ వుండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గామాత రూపం ధరించి సపరివారుడైన మహిషాసురుని సంహరించింది.

శంభు నిశంభుల కథ :-
మహిషాసురుని వలె అతి క్రౌర్యంగా వ్యవహరించిన శంభు నిశంభులనే రాక్షసులను దుర్గామాత వధించిన గాథ పురాణాల్లో చెప్పబడి వుంది. పూర్వం శంభునిశంభులనే రాక్షసులు ఇంద్రాది దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. అప్పుడు దేవతలంతా దేవిని ప్రార్థించారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుంచి దివ్యతేజోరూప లావణ్యాలతో ఒక కన్య ఉద్భవించింది. శంభునిశంభుల సేవకులైన ఛండాముండలు ఈ అపురూప లావణ్యవతి వృత్తాంతాన్ని తమ ప్రభువులకు తెలిపారు. తమలో ఒకరిని వరించమని ఆమె వద్దకు రాయబారం పంపారు. శంభునిశంభులు. తనతో యుద్ధంచేసి తనను జయించిన వానినిగాని, తనతో సమాన బలపరాక్రమశాలిని గాని తాను పెళ్ళి చేసుకుంటానని ఆ కన్య బదులు చెప్పింది.

ఆ మాటలు విన్న శంభునిశంభులు కోపోద్రిక్తులై ఆ కన్యను పట్టిదెమ్మని తమ సేనాధిపతి ధూమ్రలోచనుడిని పంపారు. తనపై దండెత్తిన ధూమ్రలోచనుడిని, అతని సైన్యాన్ని దేవి సంహరించింది. ఆ రుధిరమంతా దేవి వాహనమైన సింహం త్రాగింది. ఈ వార్తవిన్న శంభునిశంభులు చతురంగ బలాలని సమకూర్చుకొని దేవిపై యుద్ధం ప్రారంభించారు. వారిని చూడగానే దేవి తన నుంచి మహాశక్తిని ప్రసరింపచేసి భ్రూమధ్య నుంచి ఖడ్గం, పాశం మొదలయిన ఆయుధాలు సృష్టించి వాటితో రాక్షస గణాన్ని శంభునిశంభులని నిమేషకాలంలో హతమార్చింది.

దుర్గాసుర సంహారం :-
ఇలాగే దుర్గాసురుణ్ణి దేవి సంహరించిన కథ కూడా పురాణాల్లో పేర్కొనబడివుంది. పూర్వం దుర్గాసురడనే రాక్షసుడు బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వర గర్వతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలుగొందడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు.

దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం, వరుణినిచేత శంఖం, అగ్నిచేత బల్లెం, వాయువుచేత బాణాలు అంబులపొది, ఇంద్రునిచేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యునిచేత కిరణాలు, శివుని చేత సింహ వాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి వున్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లలితాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి.

Advertisements