బ్రహ్మచర్యం ఒక ఆధ్యాత్మిక ఆయుధం

‘బ్రహ్మము’ అంటే ‘దివ్యం’ లేదా ‘పరమం’. ‘చర్యం’ అంటే ‘మార్గం’. మీరు దివ్యపథంలో సాగుతుంటే, మీరు బ్రహ్మచారి. ఆ దివ్యమార్గంలో ఉన్నారంటే మీకంటూ ప్రత్యేకంగా ఎటువంటి వ్యక్తిగత ఆకాంక్షలూ లేవనే అర్థం. ఆ స్థితిలో మీరు ఏది అవసర మో దాన్ని మాత్రమే ఆచరిస్తారు. ఈ జీవితంలో ఎటు పోవాలి, ఏమి చేయాలి, వ్యక్తిగత ఇష్టాలు, అయిష్టాలు ఇలాంటి వాటి విషయంలో స్వంతంగా మీరు తీసుకునే నిర్ణయాలంటూ అప్పుడిక ఏమీ ఉండవు. ఇటువంటివ న్నీ మీ నుంచి తీసివేయబడ్డాయి. అయితే, ఇష్టం లేకుండా మీరు ఈ పథంలో ఉంటే మాత్రం మీకు జీవితం నరకమే. అలా కాకుండా చాలా ఇష్టంగా కనుక మీరు ఆచరించినట్లయితే, అది మీ జీవితాన్ని అత్యద్భుతంగా, పరమ సుందరంగా తీర్చిదిద్దుతుం ది. ఎందుకంటే అక్కడ మిమ్మల్ని వేధించేవేవీ ఉండవు. ఏది అవసరమో అదే మీరు చేస్తారు. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ఈ విధమైన పంథాలో మీరు పడినట్లయితే, ఆధ్యాత్మిక మార్గం గురించి గానీ, మీ ఆ«ధ్యాత్మికత గురించి గానీ, పట్టించుకోవలసిన పనే ఉండదు. దానంతట అదే సర్దుబాటు అవుతుంది. దాని గురించి మీరు చేయవలసినది ఏదీ ఉండనే ఉండదు. ఇలా దివ్యమార్గాన ఉండే బ్రహ్మచారి చాలా త్యాగం చేస్తున్నాడని, అతనికి జీవితమంటూ ఏదీ లేకుండా పోతోందని జనం అనుకోవచ్చు. కాని, అది వాస్తవం కాదు. కేవలం వేషధారణ వకకే ఎవరైనా బ్రహ్మచర్యం అవలంభిస్తుంటే, నిజంగా అది అతనికి నరకప్రాయ మే. అలా కాకుండా, నిజంగానే దివ్యపథంలో చరించే వ్యక్తికి ఈ పాంచభౌతిక ప్రపంచం ఎరచూపే చిన్నపాటి సుఖాలు వ్యర్థమైనవిగా తోస్తాయి. ఒక్కమారు మీలోని దివ్యానందాన్ని అనుభూతం చేసుకొన్నారంటే మీకు బాహ్యంలోని సుఖాలన్నీ అర్థరహితమైపోతాయి.

సహజ పారవశ్యమది

బ్రహ్మచర్యం అంటే కేవలం వివాహం చేసుకోకుండా ఉండడం కాదు. అసలైన బ్రహ్మచర్య స్థితిని సాధించడానికి నిర్ధేషించిన మార్గాల్లో , పెళ్లి చేసుకోకుండా ఉండడమనేది ఒక మార్గం మాత్రమే. బ్రహ్మచారిగా మారడమంటే, సహజంగానే మీరు పరవశులై ఉండడమే. అందువల్ల మీరు వివాహితులైన ప్పటికీ బ్రహ్మచారి కావచ్చు. మీ భర్తనుంచో లేదా భార్యనుంచో ఆనందాన్ని గుంజుకునే అవసరం లేకుండానే మీ సహజ ప్రవృత్తిలోనే మీరు ఆనంద మగ్నులై ఉండగలగడమే దీనికి కారణం. అందువల్ల ఈ మొత్తం ప్రపంచమంతా బ్రహ్మచారి కావాలి. ప్రతివారూ వారంతట వారే వారి సహజ స్వభావంతోనే ఆనంద మగ్నులు కావాలి.

భవిష్యత్తు కోసం పెట్టుబడి

ఈ ప్రత్యేక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయబడింది? తన జీవిత చరమాంకంలో ఆత్మానుభవం పొందాలని ఎవరైనా వాంఛి స్తున్నట్లయితే, ఎన్నో విధాల దాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. అటువంటి రోజు కోసం నేను మీకు ఒక తేదీని కూడా నిర్ధారిం చనూవచ్చు. ఈ అవకాశాన్ని అందిపుచ్చు కోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే బాగానే ఉంటుంది. అయితే, ఆ వ్యక్తి కేవలం తనకోసమే కాకుండా, ఈ అపురూప దివ్యసంపదను మరెంతో మందికి అందించ డంలో తనూ భాగస్వామి కావాలని అందుకోసం అంకితమైపోవాలని, మన స్పూర్తిగా కోరుకుంటున్నట్లయితే, అప్పుడిక బ్రహ్మచర్యానికి ఎంతో ప్రాధాన్యత లభిస్తుంది. బ్రహ్మచారులు భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి వంటి వారు. ఆ«ధ్యాత్మిక స్వచ్ఛతను సంరక్షిస్తూ తరతరాలకు దాన్ని అందించే నిస్వార్థపరులు వారు. ఇందుకోసం స్వార్థ చింతన లేని క్రియాశీలురైన కొంతమంది అవసరం. అటువంటి వారి శక్తులన్నీ ఓ ప్రత్యేక మార్గాన కేంద్రీకరించుకునేలా వారందరికీ ప్రత్యేక ఉపదేశం ఇవ్వబడుతుంది. అంత మాత్రాన ప్రతి ఒక్కరూ ఇందుకు పూనుకోనవస రం లేదు. అలాగే మేము కూడా ప్రతి వారినీ ఈ కార్యరం గంలోలకి దించాల్సిన అవసరమూ లేదు. అవసరమైన సాధనలో వారందరినీ నియుక్తుల్ని చేయడం కానీ, వారి నుంచి ఆ సాధనను కోరడం గానీ, ఉండవు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అవసరం లేదు..

ఏకోన్ముఖ శక్తి…

మానవ దేహం ఒక విశిష్టమైన శక్తి వ్యవస్థ. దీన్ని పలు విధాలుగా వినియోగించి, ఈ లోకంతో వ్యవహారాలు నిర్వర్తించవచ్చు. లేదా ఒక సమగ్రమైన వ్యవస్థగా దీన్ని పరివర్తన చెందించే విధంగా ఒక నిర్ధిష్ట విధానంలో పెట్టవచ్చు. కేవలం ఒక పక్కనే మండడం కారణంగా రాకెట్ పైకి దూసుకుపోతుంది. అలా కాకుండా అది ఇరువైపులా మండడం మొదలెడితే, అది ఎటువైపూ పోలేదు. పైగి పేలిపోయి విచ్ఛిన్నమైపోతుంది. ఒక్కోసారి ఒక దశ, దిశ లేకుండా ఎక్కుడికో పోయి కూలిపోతుంది కూడా . ఇదే రీతిలో కేవలం ఒక వైపు మాత్రమే మండే విధంగా, శక్తి ఏకోన్ముఖం అయ్యేలా బ్రహ్మచారిని సిద్ధం చేయడానికే మా ప్రయత్నమంతా. కేవలం ఒక వైపు మండేవి మాత్రమే సరాసరి పైకి దూసుకుపోతాయి. అటువంటి వ్యవస్థను రూపొందించడంలో ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా ఈ ప్రపంచాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన ఒక మహా ఆయుదమే బ్రహ్మచర్యం.
– సద్గురు

Advertisements